మొక్కజొన్న తదితర పంటల్లో కత్తెర పురుగు, పత్తి పొలాల్లో గులాబీ పురుగు సృష్టిస్తున్న విధ్వంసానికి భారతీయ రసాయనిక సాంకేతిక సంస్థ (ఐ.ఐ.సి.టి.) దీటైన, సులువైన, చవకైన పరిష్కారాన్ని చూపుతోంది. రసాయనిక పురుగుమందులకు, జన్యుమార్పిడి పంటలకు దీటైన రసాయనికేతర, పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయంగా లింగాకర్షక బుట్టలను అత్యంత సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చని ఐ.ఐ.సి.టి. శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయి ప్రయోగాల్లో రుజువు చేశారు. ఐ.ఐ.సి.టి.లోని సెంటర్ ఫర్ సెమియోకెమికల్స్ విభాగంలో గత 25 ఏళ్లుగా వ్యవసాయ రంగంలో వాడే రసాయనాలు, లింగాకర్షక ఎరల ఉత్పత్తిపై పరిశోధనలు జరుగుతున్నాయి. నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా గుర్తింపు పొందిన ఈ విభాగానికి ముఖ్య శాస్త్రవేత్త డా. బి. వి. సుబ్బారెడ్డి అధిపతిగా ఉన్నారు. దేశంలోని అనేక వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ఇక్రిశాట్ వంటి అంతర్జాతీయ సంస్థలతో కలిసి ఈ విభాగం పరిశోధనలు చేపడుతోంది.
20 రకాల పురుగులకు ఎరలు
రైతులను, ప్రభుత్వాలను అల్లాడిస్తున్న గులాబీ పురుగు, కత్తెర పురుగులతోపాటు వివిధ పంటలను ఆశిస్తున్న మరో 18 రకాల పురుగులను తాము రూపొందించిన నాణ్యమైన లింగాకర్షక ఎరలతో సమర్థవంతంగా అరికట్టవచ్చని డా. సుబ్బారెడ్డి వెల్లడించారు. గత సంవత్సరం తెలంగాణలో 25 వేల ఎకరాల్లో ఈ ఎరలతో పత్తిలో గులాబీ పురుగు తీవ్రతను విజయవంతంగా అరికట్టామని, ఫలితంగా పురుగుమందుల వాడకం సగానికి సగం తగ్గిందని, నాణ్యమైన పత్తి దిగుబడి రావడంతో రైతులు లాభపడ్డారని డా. సుబ్బారెడ్డి తెలిపారు. చెరకులో ఎర్లీ షూట్ బోరర్,ఇంటర్ నోడ్ బోరర్, వరిలో ఎల్లో స్టెమ్ బోరర్, టేకులో మొవి తొలిచే పురుగులను అరికట్టడానికి, వంగలో కాయతొలిచే పురుగు, కూరగాయలు/పండ్ల తోటలకు నష్టం చేసే పండు ఈగను అరికట్టే లింగాకర్షక ఎరలను ఐ.ఐ.సి.టి. రూపొందించి, రైతులకు అందుబాటులోకి తెస్తున్నది.
లింగాకర్షక ఎర పనిచేసేదిలా..
పంట పొలాల్లో అమర్చడం ద్వారా ఎంపిక చేసిన జాతికి చెందిన మగ పురుగులను ఆకర్సించి నశింపజేయడం ద్వారా ఆ పురుగుల సంతతి వృద్ధిని అరికట్టేందుకు లింగాకర్షక ఎరలతో కూడిన బుట్టలను పంట పొలాల్లో అక్కడక్కడా ఏర్పాటు చేయడం అనే పద్ధతి ఉంది. ఆడ పురుగు విడుదల చేసే హార్మోన్ల వాసనకు ఆకర్షితులై మగ పురుగులు దరి చేరినప్పుడు సంతానోత్పత్తి జరుగుతుంటుంది. ఆడ పురుగులు విడుదల చేసే మాదిరి హార్మోన్లను కృత్రిమంగా ప్రయోగశాలలో తయారు చేసి, అంగుళం పొడవున గొట్టం మారిదిగా ఉండే ఎరకు ఆ హార్మోన్లను అద్దుతారు. ఆ ఎరను లింగాకర్షక బుట్టలో అమర్చి, దాన్ని పొలంలో ఏర్పాటు చేస్తే ఆ వాసనకు ఆకర్షితులయ్యే మగ పురుగులు బుట్టలోకి చేరి, బయటకు వెళ్లలేక చనిపోతాయి. ఆ విధంగా పొలంలో ఎంపిక చేసిన ఆయా జాతుల పురుగుల సంతతి వృద్ధిని అరికట్టవచ్చు. ఫలితంగా ఆయా పురుగులను చంపడానికి పర్యావరణానికి, ప్రజారోగ్యానికి హానికరంగా పరిణమిస్తున్న రసాయనిక పురుగుమందులు చల్లే అవసరం అంతగా ఉండదు. ఒక ఎర ఒకే రకం పురుగును ఆకర్షించడానికి మాత్రమే రూపొదించబడి ఉంటుంది. ఇందువల్ల పర్యావరణ సమతుల్యతకు భంగం కలగదు. వరుసగా మూడేళ్లు లింగాకర్షక బుట్టలను ఎకరానికి 8 నుంచి 10 వరకు ఏర్పాటు చేసుకుంటే ఆ పురుగు ఉధృతి తగ్గిపోయి, దాన్ని అరికట్టడానికి పురుగుమందులు చల్లే అవసరం ఇక ఉండదని డా. సుబ్బారెడ్డి ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు.
లింగాకర్షక ఎరల గురించి గత కొన్ని ఏళ్లుగా సమగ్ర సస్యరక్షణ చర్యల్లో భాగంగా శాస్త్రవేత్తలు రైతులకు సూచిస్తూనే ఉన్నారు. అయితే, ఇన్నాళ్లూ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఎరల తయారీ రసాయనాలను ఇప్పుడు ఐ.ఐ.సి.టి.లోనే తయారు చేసి.. అత్యంత నాణ్యమైన ఎరలను ఉత్పత్తి చేస్తున్నారు. కొన్ని ప్రైవేటు కంపెనీల లింగాకర్షక ఎరలు సమర్థవంతంగా పనిచేయకపోవడం వల్ల ఈ టెక్నాలజీపైనే అపోహలు నెలకొంటున్న నేపథ్యంలో.. ఐ.ఐ.సి.టి. దేశీయంగా ఉత్పత్తి చేసిన రసాయనాలతో అత్యంత నాణ్యమైన ఎరలను ఉత్పత్తి చేసి, క్షేత్రస్థాయిలో అద్భుత ఫలితాలను సాధిస్తుండడం విశేషం.
ఉచితంగా లింగాకర్షక ఎరల పంపిణీ
ఐ.ఐ.సి.టి.లో రోజుకు 25 వేల లింగాకర్షక ఎరలను తయారు చేస్తున్నారు. అంగుళం పొడవుండే ఒక్కో ఎర (ల్యూర్)కు రకాన్ని రూ. 6 నుంచి రూ. 10 వరకు ఖర్చవుతుంది. వీటిని రైతులకు ఉచితంగా పంపిణీ చేస్తారు. లింగాకర్షక ఎరలను ఉచితంగా పొందదలచిన రైతులు ఎవరైనా సికింద్రాబాద్ తార్నాకలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ కార్యాలయంలో చీఫ్ సైంటిస్ట్ డా. బి.వి. సుబ్బారెడ్డిని 94409 06803 నంబరులో నేరుగా సంప్రదించవచ్చు (రైతులు తమ ఆధార్ కార్డు జిరాక్స్‌ను విధిగా తెచ్చి ఇవ్వవలసి ఉంటుంది).subbareddyiict@gmail.com– పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్
పత్తిలో గులాబీ రంగు పురుగును అరికట్టడానికిపంట 60వ రోజు నుంచి 120 రోజుల వరకు ఎర వేయాలి!
పత్తి పంటకు తీవ్ర నష్టాన్ని కలుగజేస్తున్న గులాబీ రంగు పురుగు(పింక్ బోల్ వార్మ్)ను సికింద్రాబాద్ తార్నాకలోని ఐ.ఐ.సి.టి. తయారు చేసిన లింగాకర్షక ఎరను అనేక ఏళ్లుగా మహారాష్ట్రతోపాటు తెలంగాణలోని అనేక కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా వేలాది ఎకరాల్లో ప్రయోగాత్మకంగా వాడి చక్కని ఫలితాలు సాధించినట్లు ఐ.ఐ.సి.టి. చీఫ్ సైంటిస్ట్ డా. బి. వి. సుబ్బారెడ్డి ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. గత ఏడాది తెలంగాణలోని 9 జిల్లాల్లోని 31 మండలాల్లో 25 వేల ఎకరాల్లో (ఎకరానికి 8 చొప్పున) 4.5 లక్షల లింగాకర్షక బుట్టలను అరవై రోజుల పంట దగ్గర నుంచి పెట్టారు. పత్తి రైతులకు గులాబీ పురుగుకు సంబంధించి పురుగుమందుల ఖర్చు సగానికి సగం తగ్గిందని, గుడ్డి పత్తి తగ్గిపోయి పత్తి నాణ్యత పెరిగిందని, రూ. 3 వేల నుంచి 5 వేల వరకు అధికాదాయం లభించిందని ఆయన వివరించారు.
పత్తి పంటలో గులాబీ రంగు పురుగు జీవిత కాలం 29 రోజులు. ఇది పుట్టిన తర్వాత 25 రోజులు పాకే పురుగు దశలో ఉండి, తర్వాత రెక్కల పురుగు దశలోకి మారుతుంది. మగ రెక్కల పురుగును లింగాకర్ష బుట్ట ద్వారా ఆకర్షించి నశింపజేస్తే మరో తరం పురుగులు పుట్టకుండా ఉంటాయి. పత్తి పంట కాలం 180 రోజుల్లో గులాబీ పురుగు 3 తరాలను వృద్ధి చేస్తుంది. పెద్దయిన పురుగు 200 గుడ్లు పెడుతుంది. ఆ రెండొందల పురుగులు తలా ఒక 200 గుడ్లు పెడతాయి. ఆ విధంగా 3 తరాల్లో వేలాదిగా సంతతిని పెంచుకుంటాయి. తొలి తరంలో ఎదిగిన మగ రెక్కల పురుగును ఆకర్షించి మట్టుబెడితే ఆడ పురుగులు సంతానోత్పత్తి చేయలేవు కాబట్టి వాటి సంఖ్య పురుగుల మందులు చల్లకుండానే తగ్గిపోతుంది.
పత్తి విత్తిన 60రోజులకు పూతకు వస్తుంది. పూత దశలోనే గులాబీ పురుగు ఆశిస్తుంది. కాబట్టి పత్తి విత్తిన 60 రోజులకు గులాబీ పురుగును అరికట్టేందుకు లింగాకర్షక బుట్టలు పొలంలో పంట మొక్కలకు అడుగు ఎత్తున ఉండేలా పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల 25–30 రోజుల తర్వాత ఆ బుట్టలోని ఎర వాసనలు వెదజల్లటం తగ్గిపోతుంది. అందుకని 5 రోజులు ముందుగానే పాత ఎర తీసేసి. కొత్త ఎరను పెట్టుకోవాలి. గులాబీ పురుగు నష్టాన్ని తప్పించుకోవడానికి మొత్తంగా రెండు ఎరలు పెట్టుకుంటే చాలు. ఈ ఎర వల్ల మిత్రపురుగులకూ హాని కలగదు. పత్తిని 8 రకాల పురుగులు ఆశిస్తాయి. రైతులు నెలకు 3–4 సార్లు పురుగుమందులు చల్లుతారు. గులాబీ పురుగు కోసం ఈ ఎరలు పెట్టుకుంటే నెలకు రెండు సార్లు పిచికారీ సరిపోతుంది. ఖర్చు తగ్గుతుంది. పత్తి నాణ్యత, ఆరోగ్యమూ బాగుంటుంది.
పత్తి విత్తిన 1–30 రోజుల్లో పొగాకు లద్దె పురుగు, 35–65 రోజుల దశలో శనగపచ్చపురుగు, 90–180 రోజుల వయసులో స్పైనీ బోల్‌వార్మ్ ఆశిస్తాయి. ఇవన్నీ కలిపి పత్తికి 10–15% నష్టం చేస్తాయి. 85–90% పత్తి పంట నష్టం గులాబీ పురుగు వల్లే జరుగుతుంది. ఈ నష్టాన్ని ఎరల ద్వారా తగ్గించుకోవచ్చు. రసాయనిక పురుగుమందుల వాడకం తగ్గితే నీటి, వాయు, భూమి కాలుష్యం తగ్గిపోతుంది. రైతులు, రైతుకూలీల ఆరోగ్యం బాగుపడుతుంది. ఆర్థికంగానూ లబ్ధి కలుగుతుందని డా. సుబ్బారెడ్డి తెలిపారు. ఈ ఏడాది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రైతులకు పెద్ద సంఖ్యలో లింగాకర్షక ఎరలను ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. సికింద్రాబాద్ తార్నాకలోని ఐ.ఐ.సి.టి.లో తనను నేరుగా సంప్రదించాలని డా.సుబ్బారెడ్డి(94409 06803) కోరారు.
కత్తెర పురుగు(ఫాల్ ఆర్మీ వార్మ్)ను అరికట్టడానికివిత్తనం వేసిన రోజుæనుంచే ఎరవేయాలి!
గత రెండేళ్లుగా మొక్కజొన్న, చిరుధాన్యాలు, వరి, చెరకు తదితర పంటలను ఆశిస్తూ విధ్వంసం సృష్టిస్తున్న కత్తెర పురుగు (ఫాల్ ఆర్మీ వార్మ్)ను సమర్థవంతంగా అరికట్టే లింగాకర్షక ఎరను సికింద్రాబాద్ తార్నాకలోని భారతీయ రసాయన సాంకేతిక సంస్థ (ఐ.ఐ.సి.టి.) విజయవంతంగా రూపొందించడంతోపాటు రైతులకు ఉచితంగా పంపిణీ చేస్తోంది. ఐరోపా, బ్రెజిల్, ఆఫ్రికా దేశాల్లో మొక్కజొన్న సహా 80 రకాల పంటలను కత్తెర పురుగు ఆశిస్తున్నది. ఆడ కత్తెర పురుగు మగ పురుగును ఆకర్షించడం కోసం ఒక్కో దేశంలో ఒక్కో రకమైన అనేక రసాయనాల సమ్మేళనాలతో కూడిన సెక్సువల్ హార్మోన్లను విడుదల చేస్తున్నట్లు గుర్తించామని, విదేశాల్లో తయారైన ఎర(ల్యూర్)లు మన దేశంలో కత్తెర పురుగును అరికట్టడానికి గానీ, మరో పురుగును అరికట్టడానికి తయారు చేసిన ఎర ఇంకో పురుగుకు గానీ పనికిరావని ముఖ్య శాస్త్రవేత్త డా. బి. వి. సుబ్బారెడ్డి తెలిపారు. ఐ.ఐ.సి.టి.లోని అత్యాధునిక లాబ్‌లో తాము తయారు చేసిన ఎరను ఇటీవల ఇక్రాశాట్ క్షేత్రాల్లో ప్రయోగాత్మకంగా పరీక్షించి చూడగా కత్తెర పురుగును సమర్థవంతంగా అరికట్టవచ్చన్న విషయం నిర్థారణ అయ్యిందని ఆయన వెల్లడించారు. తాము అందించే ఎరను అమర్చిన లింగాకర్షక బుట్టలను కత్తెర పురుగు ఆశించే అవకాశం ఉన్న మొక్కజొన్న, చిరుధాన్యాలు, చెరకు తదితర పంట పొలాల్లో విత్తనాలు వేసిన రోజు నుంచే వేలాడగట్టాలని డా. సుబ్బారెడ్డి సూచించారు. ఎకరానికి 8 నుంచి 12 లింగాకర్షక బుట్టలను పంట ఎత్తుకన్నా అడుగు ఎత్తులో ఉండేలా పెట్టుకుంటే కత్తెర పురుగు సంతతి వృద్ధిని అరికట్టవచ్చన్నారు. లింగాకర్షక బుట్టలో అమర్చే ఎర 25–30 రోజుల వరకు పనిచేస్తుందని, ఆ తర్వాత దాన్ని తీసేసి మరో ఎరను పెట్టుకోవాల్సి ఉంటుందన్నారు. మొక్కజొన్న, చిరుధాన్య పంటలకు తొలి 60 రోజుల పాటు ఎరను పెట్టుకుంటే చాలని, ఎకరానికి పంటకు 2 ఎరలు సరిపోతాయన్నారు. కత్తెర పురుగు పాకే పురుగు దశ దాటి ఎగిరే రెక్కల పురుగు దశకు చేరినప్పుడు.. ఆ రెక్కల పురుగులు లింగాకర్షక బుట్టలో చిక్కుకొని మరణిస్తాయని, తద్వారా వాటి సంతతి వృద్ధి చెందడం ఆగుతుందన్నారు. కత్తెర పురుగును చూసి భయపడాల్సిన అవసరం లేదన్నారు. లింగాకర్షక బుట్టలను ఒక ప్రాంతంలో చాలా మంది రైతులు వరుసగా మూడేళ్లు సామూహికంగా ఉపయోగిస్తే ఏ పురుగునైనా అదుపులోకి తేవచ్చని డా. సుబ్బారెడ్డి చెప్పారు. తమ సంస్థ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలో ముడత తొలిచే పురుగు (జి.ఎల్.ఎం.)ను వరుసగా నాలుగేళ్లు లింగాకర్షక బుట్టలు పెట్టించి పూర్తిగా అదుపులోకి వచ్చిందని, ఇప్పుడు ఈ పురుగు కోసం పురుగుమందులు చల్లాల్సిన అవసరం లేకుండా పోయిందని డా. సుబ్బారెడ్డి(94409 06803) తెలిపారు. కత్తెర పురుగును అరికట్టే ఎరలను రైతులకు వ్యక్తిగతంగా, నేరుగా ఉచితంగానే అందించడానికి ఐ.ఐ.సి.టి. సిద్ధంగా ఉందన్నారు. తయారీ సాంకేతిక పరిజ్ఞానాన్ని కంపెనీలకు అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రతి రైతుకు ఎకరం నుంచి పది ఎకరాలకు సరిపోయే లింగాకర్షక ఎరలను ఉచితంగా అందిస్తామన్నారు. ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ తెచ్చి ఇవ్వాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment