అతివృష్టితో వి‘పత్తి’ | cotton crops damaged with pests attack | Sakshi
Sakshi News home page

అతివృష్టితో వి‘పత్తి’

Published Mon, Sep 26 2016 8:49 PM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM

గజ్వేల్‌లోని పత్తి చేనులో భారీగా నిలిచిన వరద

గజ్వేల్‌లోని పత్తి చేనులో భారీగా నిలిచిన వరద

తెరిపిలేని వర్షాలతో తెగుళ్ల దాడి
రైతుల అప్రమత్తతో నష్టాల నివారణ

గజ్వేల్‌: అన్ని పంటలు ఆగమైన వేళ.. తెల్ల ‘బంగారం’ కష్టాలు తీరుస్తుందనుకున్న రైతుకు అతివృష్టి నిరాశ మిగిల్చింది. కొన్ని రోజులుగా జిల్లాలో తెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు పత్తిపై తెగుళ్ల దాడికి ఊతమిస్తున్నాయి. ఈ పరిణామం దిగుబడులపై ప్రతికూల ప్రభావం పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈనేపథ్యంలో రైతులు అప్రమత్తమై నివారణ చర్యలు చేపడితే నష్టాల నుంచి బయటపడే అవకాశముందని వ్యవసాయశాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై కథనం...

జిల్లాలో ఈసారి పత్తిసాగును తగ్గించడానికి సర్కారు తీవ్రస్థాయిలో ప్రయత్నించింది. గ్రామస్థాయి నుంచి ప్రచారాన్ని హోరెత్తించింది. ఫలితంగా పత్తిసాగు కొంతవరకు మాత్రమే తగ్గింది. గతేడాది 1.25లక్షల హెక్టార్లలో సాగైన ఈ పంట ప్రస్తుతం 84175హెక్టార్లకు తగ్గింది. గతంలో ఏటా మొదటి స్థానాన్ని ఆక్రమించే ఈ పంట ఈసారి మాత్రం రెండోస్థానానికి పరిమితమైంది. మొక్కజొన్న 1.22లక్షల హెక్టార్ల సాగుతో అగ్రభాగాన నిలిచింది.

అయితే జూలై చివరి వారం, ఆగస్టు నెలల్లో తీవ్ర వర్షాభావం తలెత్తిన కారణంగా మొక్కజొన్న పంటకు భారీ నష్టం వాటిల్లింది. అదనుసమయంలో వర్షాలు లేక మక్క ఎదుగుదల లోపించడం, కంకులు పెట్టక రైతులు ఎంతోమంది చేలల్లోనే పంటను వదిలేశారు. చెల్కా భూముల్లో అపారనష్టం జరిగింది. నల్లరేగడి భూముల్లో కొంత రికవరీ అయినా మొక్కజొన్న మాత్రం ఈసారి రైతుల ఆశలను అడియాసలు చేసిందనే చెప్పాలి.

ఇలాంటి తరుణంలో రైతు పత్తిపై ఆశలు పెంచుకున్నాడు. బెట్ట పరిస్థితులను తట్టుకునే పత్తి పంటకు వర్షాభావం వల్ల కలిగిన నష్టం మొక్కజొన్నతో పోలిస్తే తక్కువే. పత్తి తమను గట్టెక్కిస్తుందనే భావనలో ఉన్న రైతులకు అతివృష్టి నిరాశపర్చింది. కొన్ని రోజులుగా జిల్లాను ముంచెత్తుతున్న వానలు పత్తి ఎదుగుదలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. మరోవైపు నీరు నిలిచి తెగుళ్లదాడికి ఊతమిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో రైతు అప్రమత్తం కావాలని జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్‌ శ్రీనివాస్‌ సూచిస్తున్నారు.

ఇలా చేస్తే నష్టాల నివారణ

  1. ముసురు వర్షాలతో నేలలో తేమశాతం పెరుగుతుంది. పొలంలో వర్షపు నీటిని కాలువల ద్వారా బయటకు పంపే ఏర్పాట్లు చేసుకోవాలి.
  2. పత్తి మొక్కలు తేమ అధికంగా ఉండడం వల్ల వేర్లతో ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాష్‌, సూక్ష్మపోషకాలు జింక్‌, మెగ్నీషియం, బోరాన్‌లను తీసుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో పత్తిపంటపై లీటరు నీటికి 20గ్రాముల యూరియా, 20గ్రాముల పొటాష్‌ ఎరువు కలిపి పిచికారి చేయాలి. ఫలితంగా ఆకుల ద్వారా పోషకాలు గ్రహించి పంట పెరిగే అవకాశముంది.
  3. పోషకాల లోపం కారణంగా పూత, గూడ, పిందె రాలిపోయే అవకాశముంది. దీని నివారణకు నత్రజని, పొటాష్‌ ఎరువులతో పాటు సూక్ష్మ పోషకాలను పిచికారి చేయాలి.
  4. పత్తికి తుప్పు తెగులు ఆశించే అవకాశముంది. దీని నివారణకు లీటరు నీటికి ఒక మిల్లీలీటరు ప్రోఫాకొనిజాల్‌ మందును పిచికారి చేయాలి.
  5. రసం పీల్చే పెరుగుల ఉధృతి పెరిగే అవకాశముంది. వీటి నివారణకు లీటరు నీటికి ఒక గ్రాము ఎసిఫేట్‌ పొడిమందు పిచికారి చేయాలి.
  6. అధిక తేమ కారణంగా వేరుకుళ్లు వచ్చే అవకాశముంది. దీని నివారణకు లీటరు నీటికి 3గ్రాముల కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ మందును పిచికారి చేయాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement