ఫ్లెక్సి ఖాతాలతో మరింత ఆదాయం..
ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్‌డ్రా చేసుకునేందుకు.. కాస్తంత వడ్డీ ఆదాయం సంపాదించుకునేందుకు బ్యాంకుల్లో సేవింగ్స్ ఖాతాలు ఉపయోగపడతాయి. కానీ, ఒకట్రెండు మినహా చాలా బ్యాంకులు 4% మించి వడ్డీ ఇవ్వటం లేదు. అయితే, సేవింగ్స్ ఖాతా ప్రయోజనాలన్నీ కల్పిస్తూనే మరింత రాబడి అందించే పథకాలే ఫ్లెక్సిబుల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీములు.
ఇవెలా పనిచేస్తాయంటే.. మన సేవింగ్స్ ఖాతాలో బ్యాలెన్స్ నిర్దిష్ట మొత్తాన్ని మించినప్పుడు.. ఆ అదనపు డబ్బు ఆటోమేటిక్‌గా ఫిక్సిడ్ డిపాజిట్ కింద మారుతుంది. దాన్ని ఎన్నాళ్ల పాటు అలాగే ఉంచితే అన్నాళ్ల కాలవ్యవధికి సంబంధించిన ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేటు లభిస్తుంది. అంటే నాలుగైదు శాతం కన్నా మరింత ఎక్కువగా పొందడానికి అవకాశం ఉంటుంది.
ఉదాహరణకు.. మన సేవింగ్స్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ రూ. 10,000 అనుకుందాం. ఏదో ఒక దశలో మన అకౌంట్లో సొమ్ము రూ. 15,000కి పెరిగిందనుకుందాం. అప్పుడు, అదనంగా ఉన్న రూ. 5,000ను బ్యాంకు ఆటోమేటిక్‌గా ఎఫ్‌డీ కింద మార్చేస్తుంది. అలాగని, ఇక ఈ మొత్తాన్ని వాడుకోవడానికి వీలు ఉండదనేమీ లేదు.
ఒకవేళ, రూ.12,000కు చెక్కు ఇచ్చారనుకోండి.. సరిపడేంత బ్యాలెన్స్ లేదంటూ బ్యాంకు తిప్పి పంపదు. ఎఫ్‌డీని బ్రేక్ చేసి ఆ మొత్తాన్ని చెల్లిస్తుంది. ఒకవేళ ఎఫ్‌డీ కాలవ్యవధి పూర్తయ్యే దాకా అలాగే ఉంచితే.. అధిక వడ్డీని ఖాతాదారుకు అందిస్తుంది. ఈ ఫెక్సీ ఫిక్సిడ్ డిపాజిట్ అకౌంట్లపై 90% దాకా ఓవర్‌డ్రాఫ్ట్ తీసుకునేందుకు కూడా బ్యాంకులు వెసులుబాటు కల్పిస్తున్నాయి.