పశ్చిమ యూరప్‌లో పేదదేశం పోర్చుగల్
నైసర్గిక స్వరూపం
వైశాల్యం:
92082 చదరపు
కిలోమీటర్లు.
జనాభా: 1,05,84,037
(తాజా అంచనాల ప్రకారం)
రాజధాని: లిస్బన్
ప్రభుత్వం: యునిటరీ సెమీ
ప్రెసిడెన్షియల్ కాన్‌స్టిట్యూషనల్ రిపబ్లిక్
కరెన్సీ: ఎస్కూడో
అధికార భాష: పోర్చుగీస్
మతం: 96% క్రైస్తవులు
వాతావరణం: జనవరిలో 8-14 డిగ్రీలు, ఆగస్టులో 17-28 డిగ్రీలు.
పంటలు: చిరు ధాన్యాలు, ఆలివ్, వరి, ద్రాక్ష, నిమ్మ, కూరగాయలు.
పరిశ్రమలు: వ్యవసాయ ఆధార పరిశ్రమలు, దుస్తులు, యంత్ర పరికరాలు,
ఫుడ్ ప్రాసెసింగ్, కలప, రసాయనాలు, సారాయి, చే పలు, గనులు, పర్యాటక ం.
స్వాతంత్య్రం: 1910 అక్టోబర్ 5న గణతంత్ర దేశంగా ఆవిర్భవించింది.
సరిహద్దులు: ఓ వైపు అట్లాంటిక్ మహా సముద్రం, మరోవైపు స్పెయిన్ దేశం.
పశ్చిమ యూరోపు ఖండంలో పోర్చుగల్ ఒక బీదదేశం. 15వ శతాబ్దంలో ఈ దేశాన్ని మొట్టమొదటగా ప్రపంచానికి పరిచయం చేసింది ప్రిన్స్‌హెన్రీ. వాస్కోడిగామా తన సముద్ర ప్రయాణం ఈ దేశం నుండే ప్రారంభించాడు. ఆ తరువాత ఆయన భారతదేశం వచ్చారు. దేశంలోని డ్యూరో లోయలో ద్రాక్ష పంట విస్తారంగా పండుతుంది. ఇక్కడ తయారు చేసిన ద్రాక్ష సారాయి నాలుగు వందల ఏళ్ల క్రితం నాటిదని ప్రసిద్ధి. 1999 వరకు ఈ దేశాన్ని పోర్చుగీసు రాజు కుటుంబం దాదాపు 600 సంవత్సరాలు పరిపాలించింది. క్రీ.శ.1139లోనే ఈ దేశంలో రాజరిక వ్యవ స్థ ప్రారంభమైంది. అయితే 1910 అక్టోబర్ 5న దేశాన్ని ఒక గణతంత్ర దేశంగా ప్రకటించారు. క్రీ.శ.868 లో ఈ దేశం మొదట ఏర్పడిందని చరిత్ర చెబుతోంది. క్రీస్తు పూర్వం 219 లో రోమన్లు పాలించారు. క్రీస్తు శకం 5వ శతాబ్దంలో రోచిల్లా రాజులు ఈ దేశాన్ని ఆక్రమించుకున్నారు. 6వ శతాబ్దంలో రోచిల్లా రాజులు ఈ దేశాన్ని పాలించారు. 10వ శతాబ్దంలో దేశం అంతా బదాజోజ్ తైఫ్రా అనే ముస్లిం రాజుల వశమైంది. అయితే 11వ శతాబ్దం ప్రారంభంలో అల్మోరా విన్‌లు దేశాన్ని తమ వశం చేసుకున్నారు. కాలక్రమంలో ముస్లింలను ఈ దేశం నుండి పారదోలారు.
ప్రజలు - సంస్కృతి - ఆహారం
పోర్చుగల్ దేశంలో జనాభాలో అధిక భాగం క్రైస్తవులే అయినా వీరిలో అనేక తెగల వారు ఉన్నారు. దేశంలో దాదాపు 27 తెగల ప్రజలు ఉన్నారు. వీరి భాషలు కూడా విచిత్రంగానే ఉంటాయి. దేశంలోని ప్రజలు వివిధ దేశాలలో కోట్లాది మంది ఉన్నారు. వీరు బ్రెజిల్ దేశంలో అధికంగా ఉన్నారు. వీరి ఆహారం ప్రదేశాన్ని బట్టి మారుతూ ఉంటుంది. దేశం ఉత్తర భాగంలో ఉండేవారు తినే ఆహారాన్ని ‘కాల్డోవైర్డ్’ అంటారు. మొక్కజొన్న పిండితో, గోధుమ పిండితో చేసిన బ్రెడ్డు సాధారణంగా తింటారు. బంగాళ దుంపలతో సూప్ తయారు చేస్తారు. వీళ్లు పంది మాంసం ఎక్కువగా తింటారు. దక్షిణభాగ ప్రజలు వరి అన్నం, రొట్టెలు, పందిమాంసం, బంగాళ దుంపలు ద్రాక్ష సారాయి ఇలా అనేక వంటకాలను తయారు చేస్తాయి. ఇక్కడి ప్రజలు అతిథులకు ఎక్కువ ఆదరిస్తారు. గ్రామీణ ప్రాంతాలలో మహిళలు ఎక్కువగా నల్లని దుస్తులు ధరిస్తారు. మగవాళ్లు కూడా నల్లని షర్టులు ధరిస్తారు.
పరిపాలనా రీతులు
పరిపాలనా సౌలభ్యం కోసం దేశాన్ని 308 మున్సిపాలిటీలుగా విభజించారు. దేశంలో 18 జిల్లాలు, ఏడు రీజియన్లు ఉన్నాయి. దేశంలో బాగా జనాభా కలిగిన నగరాలు ఏడు ఉన్నాయి. అవి లిస్బన్, పోర్టో విలానోవాడి గాయియా, అమడోరా, బ్రాగా, పుంచల్, కోయింబ్రా, సేటుబల్, అల్మాడాలు వీటిలో లిస్బన్, పోర్టో నగరాలు మెట్రో నగరాలుగా చలామణి అవుతున్నాయి. అన్ని నగరాలలో ఆధునిక వసతులు ఉన్నాయి. రాజధాని లిస్బన్ నగరం అత్యధిక జనాభాతో కిక్కిరిసి ఉంటుంది. దేశంలోని జనాభాలో 52% మహిళలు 48% పురుషులు ఉన్నారు. దేశానికి ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఇద్దరూ ఉంటారు. ఇద్దరికీ దేశ పరిపాలన మీద సమాన హక్కులు ఉంటాయి. అయితే రాష్ట్రపతికి కొన్ని ప్రత్యేక అధికారాలు ఉంటాయి.
లిస్బన్: దేశ రాజధాని లిస్బన్, యూరోపు ఖండంలో ఏధెన్స్ నగరం తరువాత రెండో పురాతన నగరం. వాస్కోడిగామా, మెగాలన్, ప్రిన్స్‌హెన్రీ లాంటి గొప్పవ్యక్తులకు మాతృనగరం. ఈ దేశ రాజులు ఈ భూమి మీద ఉన్న అన్ని ఖండాలలో తమ రాజ్యాలను స్థాపించారు. సముద్ర తీరంలో బ్యాక్ వాటర్‌ను ఆనుకొని నగరం నిర్మితమైంది. ఈ నగరం రెండు భాగాలుగా ఉంటుంది. ఒకటి పాత నగరం, రెండవది కొత్త నగరం. పాత నగరంలో రాజమహలులు, పురాతన కట్టడాలు అనేకం ఉన్నాయి. కొత్త నగరంలో ఆధునిక భవనాలు, పరిపాలనా భవనాలు అనేకం ఉన్నాయి. ఈ నగరంలో చూడవలసినవి ఎన్నో ఉన్నాయి. వాటిల్లో ప్రపంచ వారసత్వ కట్టడం బెలెమ్ టవర్ ఒకటి. ఇది పారిస్‌లోని ఈఫెల్ టవర్‌తో సమాన ఆకర్షణ కలిగి ఉంది. బెరోని మోస్ మోనాస్టరీ, సెయింట్ జార్జి కాజల్, కలోస్టె గుల్ బెన్‌కియన్ మ్యూజియం, పార్క్ డాస్ నకోస్, బెరాడ్గో మ్యూజియం, మడ్రె డిడూస్ కాన్వెంట్, సావో రోచ్ చర్చి, సాంటా కాటరినా చర్చి, కోచెస్ మ్యూజియం, పురాతన ఆర్ట్ మ్యూజియం ఫాషన్ మ్యూజియం... ఇలా ఎన్నో అద్భుతమైన కట్టడాలు నగరంలో ఉన్నాయి.
చూడదగిన ప్రదేశాలు
పోర్చ్‌గల్ దేశంలో పోర్టో రెండో పెద్ద నగరం.యూరోపు ఖండంలో అందమైన నగరాలలో ఇది ఒకటి. దీనిని ఓపోర్టో నగరంగా పిలుస్తారు. పోర్ట్‌వైన్ నుండి పోర్టో అనే పదాన్ని ఈ నగరానికి పేరుగా పెట్టారు. ఈ నగరం మధ్య గుండా వెళ్లే నది. నదికి ఇరు వైపులా అద్భుత పురాతన కట్టడాలు పక్కనే సముద్రం. ఇలా ఈ నగరం ఎంతో సహజ సుందరంగా కనిపిస్తుంది. నగరంలో చూడవలసిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. గొప్ప శిల్పకళా నైపుణ్యం కలిగిన భవనాలు పురాతన కాల మానవ మేధస్సును ప్రజలకు ప్రస్ఫుటం చేస్తాయి. హారీ పోటర్ పుస్తక రచయిత జె.కె. రోలింగ్ యొక్క స్వంత ఊరు ఈ నగరమే. గుస్తావ్ ఈఫిల్స్ డోనా మారియా బ్రిడ్జి, నికొలాల్ నసోనిస్ క్లెరిగోస్ టవర్, రెమ్ కూల్వాస్ కాసాడి మ్యూజియం, సీజా వియెరా సెర్రాల్వెస్ మ్యూజియం నగరంలో గొప్ప ఆకర్షణలు. సావోప్రాన్సిస్కో చ ర్చి, కెయిస్ డా రిబీరా, ప్రిన్స్ హెన్రీ కాథడ్రల్, పక్కనే డ్యూరో వాలీ ఎంతో అందంగా దర్శనమిస్తుంది. నగరంలోని ఏ భవనాన్ని చూసినా అద్భుతంగా కనబడుతుంది. అట్లాంటిక్ మహా సముద్రతీరంలో పోర్టోనది సముద్రంలో కలిసే ముఖ ద్వారంలో ఉన్న ఈ నగరంలో ఉన్న 90% ఇళ్ల పైకప్పులు ఎర్రగా కనిపిస్తాయి. నగరంలో మొత్తం అయిదు మ్యూజియంలు పదికి పైగా చర్చిలు ఉన్నాయి. నగరంలోని ఏ వీధిని చూసినా గొప్ప అనుభూతి కలుగుతుంది.
తోమర్ నగరం
నబారో నది ఒడ్డున నిర్మితమైన శతాబ్దాల క్రితం నాటి నగరం తోమార్. 12వ శతాబ్దంలో నిర్మించిన ఈ నగరంలో క్రీస్తు కాన్వెంట్ భవనాన్ని యునెస్కో సంస్థ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. సావో జోవా బాప్టిస్ట్ట్ చ ర్చి, భవనం, ఒక గొప్ప ఆకర్షణ. శతాబ్దాల క్రితం నాటి అద్భుత శిల్పకళా నైపుణ్యం కలిగిన భవనాలను చూస్తుంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. నగరం మధ్యలో ఉన్న సినగాగ్‌ను 1430లో నిర్మించారు. సావో ఫ్రాన్సిస్కో మ్యూజియంలో 104 దేశాల నుండి సేకరించిన 43 వేల అగ్గిపెట్టెల రకాలు ఉన్నాయి. 1530లో నిర్మించిన నోసా సెన్వోరాడా కాన్సీకో చర్చి, సాంటా ఇరియా చర్చి, 1418లో ప్రిన్స్ హెన్రీ నిర్మించిన చారోలా చర్చి భవనం... ఇలా నగరమంతా గొప్ప గొప్ప కట్టడాలు, శతాబ్దాల క్రితానివి... ఇంకా చెక్కు చెదరకుండా నిలిచి ఉండి, చూపరులకు ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. దేశంలో సముద్రతీర ప్రాంతంలో అనేక అందమైన బీచ్‌లు ఉన్నాయి. సుందరమైన ద్వీపాలు అట్లాంటిక్ సముద్రంలో ఉన్నాయి.
బతాల్హా అద్భుత శిల్ప నగరం
13వ శతాబ్దంలో నిర్మితమైన అద్భుత కళా ఖండాల సముదాయం ఈ నగరం. దీన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. 1388లో మొదటి జావోరాజు నిర్మించిన ఈ రాజప్రాసాదం ఈ నాటికీ గొప్ప కట్టడంగా నిలిచి ఉంది. పర్యాటకులను ఆశ్చర్యానందాలకు గురిచేసే ఈ భవన నిర్మాణ శైలి అత్యద్భుతం. ఎంతసేపు చూసినా తనివి తీరదు. ఈ భవన ముఖద్వారమే 15 మీటర్ల ఎత్తు ఉందంటే ఇక ఆ భవనం ఎంత ఎత్తు, ఎంత అద్భుతంగా ఉంటుందో ఊహించండి. ఈ భవనం సమీపంలో అద్భుతమైన గుహలు నిర్మించారు. దీనిని పోర్టో డి మోస్ అంటారు. 13వ శతాబ్దంలో నిర్మించిన గుహలు, పై నుండి కిందికి జారుతున్నట్లు అనిపించే రాళ్లు, జారి పడుతున్న నీటి బిందువులు, కింద కోనేరులో రకరకాల చేపలు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఈ కోనేరు 110 మీటర్ల లోతులో ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం.