పొగడ్త...ప్రోత్సహించేలా ఉండాలి
ఆత్మీయం
ఈ ప్రపంచంలో పొగడ్తలకు లొంగని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే, ఎవరైనా సరే, తాము చేసిన పనిని ఇతరులు మెచ్చుకుంటే ఆనందించాలని కోరుకుంటారు. అందులో తప్పేమీ లేదు. చేసిన మంచి పని లేదా మంచి రాత లేదా సృజనాత్మకతను మెచ్చుకోవడం వల్ల వారిలో మరల ఆ పనిని చేసి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలనిపిస్తుంది. అందుకే మంచిమాటను మందిలో చెప్పు, చెడ్డమాటను చెవిలో చెప్పు అన్నారు పెద్దలు. అయితే పొగడ్త అనేది సత్యంగా ఉండాలి. అందులో ఎటువంటి మొహమాటమూ ఉండకూడదు. ప్రతి మనిషిలోనూ మంచీ, చెడూ రెండూ ఉంటాయి.
మంచిని మెచ్చుకోవడం మాని, చెడునే ఎత్తి చూపడం సరి కాదు. దానివల్ల వారిలో చెడే ఎక్కువ అవుతుంది. అలా కాకుండా మంచినే చూడటం వల్ల తమకు తెలియకుండానే మంచి పనులు చేయడానికి అలవాటు పడతారు. మన పొగడ్త అవతలి వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా ఉండాలి. భుజం తట్టి ప్రోత్సహించేలా, మరిన్ని విజయాలను సాధించే లా ఉండాలి.
హనుమంతుడు తాను అంతటి మహాసముద్రాన్ని ఎలా దాటగలనా? అన్న నిరాశలో కూరుకుపోయినప్పుడు జాంబవంతుడు, సుగ్రీవుడు, ఇతర వానర వీరులు ఆయనతో ‘‘నువ్వు అందరిలా సాధారణమైన వానరానివి కాదు. మహాబలశాలివి, బుద్ధిశాలివి కాబట్టే కదా, సూర్యుడు ఎటు తిరిగితే అటు తిరుగుతూ ఆయన నుంచి విద్యలన్నీ నేర్చుకోగలిగావు. ఇప్పుడు ఈ సముద్రాన్ని దాటటం నీకో లెక్క కాదు... ప్రయత్నం చేయి’’ అంటూ పొగుడుతూనే ఆయన శక్తిసామర్థ్యాలను గుర్తు చేశారు. ఆ తర్వాత హనుమ సాధించిన విజయం అందరికీ తెలిసిందే!