హిరాగుహలో.. దైవధ్యానంలో... ప్రవక్త జీవితం | pravaktha life in heera Cave | Sakshi
Sakshi News home page

హిరాగుహలో.. దైవధ్యానంలో... ప్రవక్త జీవితం

Published Sun, May 22 2016 12:36 AM | Last Updated on Mon, Sep 4 2017 12:37 AM

హిరాగుహలో.. దైవధ్యానంలో... ప్రవక్త జీవితం

హిరాగుహలో.. దైవధ్యానంలో... ప్రవక్త జీవితం

అందరూ ఎంతగానో సంతోషించారు ఓ పెద్ద అంతర్ యుధ్ధానికి తెరపడి, రక్తపాతం తప్పినందుకు తమతమ ఇష్టదైవాలకు కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ’హజ్రెఅస్వద్’ ప్రతిష్టాపనలో అందరికీ భాగస్వామ్యం లభించడం పట్ల అన్ని తెగలూ పరమానంద భరితమయ్యాయి. క్షణాల్లో జరగబోయే రక్తపాతాన్ని ఎంతో సమయస్పూర్తి, సంయమనం, వివేకంతో తప్పించి శాంతిని కాపాడినందుకు ప్రజలంతా ముహమ్మద్ గారిని అభినందనలలో ముంచెత్తారు. సర్రున లేచిన కరవాలాలు వినమ్రంగా ఒరల్లోకి ఒదిగిపొయ్యాయి. అప్పటిదాకా కత్తులు దూసుకున్న వాళ్ళు మరలా పాలూ పంచదారలా కలసిపోయారు.

 రోజులు గడిచిపోతున్నాయి. ఖతీజా, ముహమ్మద్ గార్ల అన్యోన్య దాంపత్య జీవితం హాయిగా, సాఫీగా, సంతోషంగా సాగిపోతోంది. కాని ముహమ్మద్ మనసులో ఒకటే ఆలోచన. అన్నివిధాలా భ్రష్టు పట్టి పోయిన ఈ జాతిని సంస్కరించడం ఎలా? కుటుంబ బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తూనే ఆయన ఎక్కువగా ఏకాంతంలో గడిపేవారు. చుట్టూ ఆవరించి ఉన్న నైతిక పతనాన్ని, ధర్మరాహిత్యాన్ని, విగ్రహారాధన లాంటి ఘోరపాపాల గురించి చాలా కలత చెందేవారు.

ఈ కీడుల్ని, ఈ నైతిక పతనాన్ని సమాజం నుండి దూరం చేయడంఎలా? అని తీవ్రంగా యోచించేవారు. విశ్వసృష్టికర్తను ఆరాధించే సరైన విధానం ఏది? దాన్ని తెలుకోవడం ఎలా? ఈ జనాలకు తెలియజెప్పడం ఎలా? ఈ విధమైన సవాలక్ష ఆలోచనలు ఆయన అంతరంగాన్ని అతలాకుతలం చేసేవి.

 ఈ క్రమంలోనే ఆయన మక్కాకు కొద్దిదూరంలో ఉన్న ఓ ఏకాంత ప్రదేశానికి తరచూ వెళ్ళేవారు. అక్కడ ఒక కొండగుహ ఉంది. ఎలాంటి జనరద్దీగాని, శబ్దకాలుష్యం గాని ఉండేదికాదు. చాలా ప్రశాంతమైన, నిర్మానుష్య వాతావరణమది. ఆ గుహ పేరు ‘హిరా’. ఆయన తరచు అక్కడికి వెళ్ళి దైవచింతనలో నిమగ్నమైపొయ్యేవారు. తినడానికి వెంట ఏమైనా తీసుకువెళ్ళేవారు. ఒక్కొక్కసారి శ్రీమతి ఖతీజా గారే ఆహారం తెచ్చి ఇస్తుండేవారు. ఇలానే రోజులు గడుస్తున్నాయి. ఆయన అన్వేషణ మాత్రం ఆగలేదు. అధిక శాతం దైవచింతనలోనే ఆయన సమయం గడిచిపోయేది. అప్పుడ ప్పుడూ ఇంటికి వెళ్లేవారు. భార్యాబిడ్డలతో కాలక్షేపం చేసేవారు.

 ‘‘నాన్నా! ఎక్కడికెళ్లావు, మమ్మల్ని తీసుకెళ్లలేదే’’ అని గోముగా అడిగేవారు పిల్లలు.

 ఆయన వారిని ప్రేమగా దగ్గరకు తీసుకొని ఒళ్లో కూర్చోబెట్టుకునేవారు. వారి తలని నిమిరేవారు. వారితో ముద్దుగా మాట్లాడేవారు. ‘ఎప్పుడైనా మిమ్మల్ని కూడా తీసుకు వెళ్తా’ అని అనునయించేవారు. తరువాత యథాప్రకారం హిరాగుహకు వెళ్లిపోయేవారు. అయితే, ఈ శుభ ఘడియలు, ఈ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. ఆయన కొడుకులంతా ఒకరి తరువాత ఒకరుగా ఇహలోకం వీడిపోయారు. ఖాసిమ్, తయ్యిద్, తాహిర్ ముగ్గురూ దైవాన్ని చేరుకున్నారు. ముహమ్మద్‌కి దెబ్బమీద దెబ్బ, గాయం మీద గాయం అవుతోంది. అయినా సహనం వహించారు. పసితనంలో తను అనాథగా బాధను అనుభవించారు. ఇప్పుడు పుత్రశోకంతో బాధను అనుభవించాల్సి వస్తోంది. కొడుకులు పోగా ఇప్పుడిక నలుగురు అమ్మాయిలు ఉన్నారు. జైనద్, రుఖియ్య, ఉమ్మెకుల్ సూం. ఫాతిమా.
- ముహమ్మద్ ఉస్మాన్‌ఖాన్ (మిగతా వచ్చేవారం)

Advertisement
Advertisement