కష్టంలోనూ కారుణ్యం!
• ప్రవక్త జీవితం
అందులో గొప్పధీశాలి అయిన సురాఖ బిన్ మాలిక్ జూషమ్ అనే యువకుడు కూడా ఉన్నాడు. ఆ ఖ్యాతి తనకే దక్కాలని, వంద ఒంటెల భారీబహుమానాన్ని తానే కొట్టేయాలని తన శక్తిసామర్ధ్యాలన్నిటినీ ఉపయోగించాడు. మెరుపుతీగలాంటి అశ్వాన్ని అధిరోహించి తీరప్రాంతం వైపు దౌడుతీయించాడు. గుర్రపుస్వారీలో ఆరితేరిన సురాఖ ఆరోజెందుకో ఎదురుదెబ్బలు తిన్నాడు. మనసు కీడుశంకించింది. కాని తనకు తానే ధైర్యం చెప్పుకొని పట్టుదలతో ముందుకుసాగాడు.
ప్రవక్తవారి ప్రయాణం ఒకరాత్రి, రెండుపగళ్ళు అవిశ్రాంతంగా, నిరాటంకంగా, నిశ్చింతగా సాగింది. తరువాతి రోజు మధ్యాహ్నం వేళ ఎండతీవ్రంగా ఉండడంతో వారు ఓచోట నీడలో ఆగి భోజనాలు ముగించుకొని విశ్రాంతికి ఉపక్రమించారు.
అంతలో దక్షిణం వైపునుండి మెరుపువేగంతో ఓ అశ్వధారి రావడాన్ని గమనించిన హ.అబూబక్ర్. ’దైవప్రవక్తా! ఇక మనం దొరికిపోయినట్లే’ అన్నారు కంగారుగా.. కాని ముహమ్మద్ ప్రవక్తముఖంలో ఎలాంటి ఆందోళనా లేదు. ’అబూబక్ర్! కంగారుపడకు. మనకు తోడుగా దేవుడున్నాడు’. అన్నారు ప్రశాంత వదనంతో!
శతృవు దగ్గరవుతున్నకొద్దీ డెక్కల చప్పుడు స్పష్టంగా వినిపిస్తోంది. దుమ్ము ధూళి రేణువులు ఎగిరిపడుతున్నాయి. అశ్వం మరికాస్త దగ్గరయిందో లేదో అకస్మాత్తుగా ఒక్క పల్టీకొట్టింది. అశ్వం ముందరి కాళ్ళు మోకాళ్ళవరకు కూరుకుపొయ్యాయి. ఆ ఊపుకు అశ్వధారి కూడా బోర్లా పడిపోయాడు. ఊబిలో దిగబడినట్లు దిగబడిన గుర్రపుకాళ్ళు ఎంతగింజుకున్నా బయటికి రావడం లేదు. పైకి లేవడానికి ప్రయత్నిస్తున్న సురాఖ కూడా శక్తినంతా కూడదీసుకున్నా పైకి లేవలేక పోతున్నాడు. ఈ దెబ్బతో అతని ధైర్యం జావగారిపోయింది. ఉదయం నుండి తగిలిన ఎదురు దెబ్బలను గురించి ఆలోచిస్తే, అన్నీ అపశకునాలే గోచరించాయి. ఏనాడూ ఓటమి ఎరుగని వాడికి ఈ పరిణామంతో జ్ఞానోదయమైంది. బహుశా తను చేస్తున్నపని దేవునికి ఇష్టంలేదేమో అన్నఆలోచన వచ్చింది. ఓటమిని అంగీకరిస్తూ రెండుచేతులు పైకెత్తి ప్రవక్తను, ఆయన అనుచరులతో ‘అయ్యా.. నేను సురాఖాను. మాలిక్ బిన్ జూషమ్ కొడుకును. నేను మీకు ఎలాంటి హానీ తలపెట్టను. నన్నునమ్మండి. నేను మీతో మాట్లాడాలి’. అని వేడుకున్నాడు.
ఆసమయంలో ఎవరైనా ఏంచేస్తారు?
తనను చంపడానికి కరవాలం చేతపట్టుకొని బుసలు కొడుతూవచ్చిన శత్రువు కత్తివేటుదూరంలో, దాడిచేయలేని నిస్సహాయ స్థితిలో చతికిల పడి ఉంటే అలాగే వదిలేస్తారా? కత్తికో కండగా చీల్చి కాకులకూ గద్దలకూ వేయరూ..? కాని కారుణ్యమూరి ్తముహమ్మద్ ప్రవక్త(స) శత్రువును కరుణించారు. అతని కోసం ప్రార్థించారు. అప్పుడు ఊబిలో కూరుకుపోయిన గుర్రం పైకి లేచింది.
– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ (మిగతాది వచ్చేవారం)