Life Prophet
-
కష్టంలోనూ కారుణ్యం!
• ప్రవక్త జీవితం అందులో గొప్పధీశాలి అయిన సురాఖ బిన్ మాలిక్ జూషమ్ అనే యువకుడు కూడా ఉన్నాడు. ఆ ఖ్యాతి తనకే దక్కాలని, వంద ఒంటెల భారీబహుమానాన్ని తానే కొట్టేయాలని తన శక్తిసామర్ధ్యాలన్నిటినీ ఉపయోగించాడు. మెరుపుతీగలాంటి అశ్వాన్ని అధిరోహించి తీరప్రాంతం వైపు దౌడుతీయించాడు. గుర్రపుస్వారీలో ఆరితేరిన సురాఖ ఆరోజెందుకో ఎదురుదెబ్బలు తిన్నాడు. మనసు కీడుశంకించింది. కాని తనకు తానే ధైర్యం చెప్పుకొని పట్టుదలతో ముందుకుసాగాడు. ప్రవక్తవారి ప్రయాణం ఒకరాత్రి, రెండుపగళ్ళు అవిశ్రాంతంగా, నిరాటంకంగా, నిశ్చింతగా సాగింది. తరువాతి రోజు మధ్యాహ్నం వేళ ఎండతీవ్రంగా ఉండడంతో వారు ఓచోట నీడలో ఆగి భోజనాలు ముగించుకొని విశ్రాంతికి ఉపక్రమించారు. అంతలో దక్షిణం వైపునుండి మెరుపువేగంతో ఓ అశ్వధారి రావడాన్ని గమనించిన హ.అబూబక్ర్. ’దైవప్రవక్తా! ఇక మనం దొరికిపోయినట్లే’ అన్నారు కంగారుగా.. కాని ముహమ్మద్ ప్రవక్తముఖంలో ఎలాంటి ఆందోళనా లేదు. ’అబూబక్ర్! కంగారుపడకు. మనకు తోడుగా దేవుడున్నాడు’. అన్నారు ప్రశాంత వదనంతో! శతృవు దగ్గరవుతున్నకొద్దీ డెక్కల చప్పుడు స్పష్టంగా వినిపిస్తోంది. దుమ్ము ధూళి రేణువులు ఎగిరిపడుతున్నాయి. అశ్వం మరికాస్త దగ్గరయిందో లేదో అకస్మాత్తుగా ఒక్క పల్టీకొట్టింది. అశ్వం ముందరి కాళ్ళు మోకాళ్ళవరకు కూరుకుపొయ్యాయి. ఆ ఊపుకు అశ్వధారి కూడా బోర్లా పడిపోయాడు. ఊబిలో దిగబడినట్లు దిగబడిన గుర్రపుకాళ్ళు ఎంతగింజుకున్నా బయటికి రావడం లేదు. పైకి లేవడానికి ప్రయత్నిస్తున్న సురాఖ కూడా శక్తినంతా కూడదీసుకున్నా పైకి లేవలేక పోతున్నాడు. ఈ దెబ్బతో అతని ధైర్యం జావగారిపోయింది. ఉదయం నుండి తగిలిన ఎదురు దెబ్బలను గురించి ఆలోచిస్తే, అన్నీ అపశకునాలే గోచరించాయి. ఏనాడూ ఓటమి ఎరుగని వాడికి ఈ పరిణామంతో జ్ఞానోదయమైంది. బహుశా తను చేస్తున్నపని దేవునికి ఇష్టంలేదేమో అన్నఆలోచన వచ్చింది. ఓటమిని అంగీకరిస్తూ రెండుచేతులు పైకెత్తి ప్రవక్తను, ఆయన అనుచరులతో ‘అయ్యా.. నేను సురాఖాను. మాలిక్ బిన్ జూషమ్ కొడుకును. నేను మీకు ఎలాంటి హానీ తలపెట్టను. నన్నునమ్మండి. నేను మీతో మాట్లాడాలి’. అని వేడుకున్నాడు. ఆసమయంలో ఎవరైనా ఏంచేస్తారు? తనను చంపడానికి కరవాలం చేతపట్టుకొని బుసలు కొడుతూవచ్చిన శత్రువు కత్తివేటుదూరంలో, దాడిచేయలేని నిస్సహాయ స్థితిలో చతికిల పడి ఉంటే అలాగే వదిలేస్తారా? కత్తికో కండగా చీల్చి కాకులకూ గద్దలకూ వేయరూ..? కాని కారుణ్యమూరి ్తముహమ్మద్ ప్రవక్త(స) శత్రువును కరుణించారు. అతని కోసం ప్రార్థించారు. అప్పుడు ఊబిలో కూరుకుపోయిన గుర్రం పైకి లేచింది. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ (మిగతాది వచ్చేవారం) -
దైవారాధన విధానం తెలిపినదేవదూత జిబ్రీల్
ప్రవక్త జీవితం తిరస్కారుల వ్యంగ్యవ్యాఖ్యలకు సమాధానమా అన్నట్లు, దైవదూత జిబ్రీల్ (అ) దైవవాణి తీసుకొని రానే వచ్చారు. వెలుగులు విరజిమ్మే పగలు సాక్షిగా ! ప్రశాంతంగా అవతరించే రాత్రి సాక్షిగా! (ఓ ప్రవక్తా ! ) నీ ప్రభువు నిన్ను ఏమాత్రం విడిచి పెట్టలేదు. నీపట్ల ఆయన అసంతృప్తి కూడా చెందలేదు. నిశ్చయంగా రాబోయేకాలం నీ కొరకు గత కాలం కన్నా మేలైనదిగా ఉంటుంది. త్వరలోనే నీకు నీ ప్రభువు నువ్వుసంతోష పడే అంత అధికంగా ప్రసాదిస్తాడు. నువ్వు అనాథగా ఉండడం చూసి ఆయన నీకు ఆశ్రయం కల్పించలేదా? నువ్వుమార్గమేదో తెలియని వాడిగా ఉన్నప్పుడు ఆయన నీకు సన్మార్గం చూపించాడు. నువ్వు నిరుపేదగా ఉన్నప్పుడు ఆయన నిన్ను ధనవంతుణ్ణి చేశాడు. కనుక నువ్వు అనాథల పట్ల కఠినంగా వ్యవహరించకు. యాచకుణ్ణి కసురుకోకు. నీప్రభువు వరాలను బహిర్గతం చెయ్యి. (అజ్ జుహా .1-11) అవును, దైవం ఆయన్ని విడిచి పెట్టలేదు. ఆయనపట్ల అసంతృప్తీ చెందలేదు. పైగా ఆయన్ని అమితంగా ప్రేమించాడు. తన కారుణ్య ఛాయతో ఆయన్ని కప్పేశాడు. తన అనుగ్రహాలను ఆయనపై కురిపించాడు. దైవవాణి క్రమం తప్పకుండా అవతరిస్తూనే ఉంది. దైవాదేశాలను తీసుకొని జిబ్రీల్ (అ)ఆయన వద్దకు వస్తున్నారు. ఏం చేయాలి? ఏం చేయకూడదు? అన్నవిషయాలను బోధపరుస్తున్నారు. దైవప్రార్ధనకు ముందు వజూ (ముఖం, కాళ్ళూచేతులు నియమబద్ధంగా కడగడం) ఎలా చేయాలి, నమాజ్ ఎలా ఆచరించాలి? అన్నవిషయాలనూ ఆయనే నేర్పారు. ఒకరోజు ముహమ్మద్ (స) మక్కా శివార్లలో దైవదూతకోసం నిరీక్షిస్తూ పచార్లు చేస్తున్నారు. భవిష్యత్ కార్యక్రమాలను గురించి ఆయన మనసులో రకరకాల ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. ముఖ్యంగా దైవ ప్రార్ధన విషయంలో మార్గదర్శకం కోసం ఆయన మనసు తహతహలాడుతోంది. సరిగ్గా అప్పుడు జిబ్రీల్ ఆయన వద్దకు వచ్చారు. నమాజ్ ఆచరించడానికి ముందు ఇలా వజూ చేయాలి, అంటే పరిశుభ్రతను ఇలా పొందాలి. అని ఆయనకు చెప్పారు. చెప్పడం మాత్రమేకాదు, స్వయంగా జిబ్రీల్ (అ) వజూ చేసి చూపించారు. ముహమ్మద్ (స)కూడా ఆయన చేసినట్లుగానే వజూ చేశారు. తరువాత జిబ్రీల్ (అ) నిలబడి నమాజు చేసి చూపించారు. ముహమ్మద్ (స) కూడా అలాగే నమాజ్ ఆచరించారు. తరువాత జిబ్రీల్ వెళ్ళిపోయారు. ముహమ్మద్ (స) ఇంటికి వచ్చి, శ్రీమతికి అంతా వివరించారు. జిబ్రీల్ దూత నేర్పినవిధంగా నమాజ్ చేయడానికి, పరిశుభ్రతను పొందే విధానం ఇదీ అని శ్రీమతికి చెబుతూ, ఆమె ముందు వజూచేశారు. వెంటనే బీబీ ఖదీజా కూడా ఆయన చేసినట్లుగానే వజూ చేశారు. తరువాత ఆయన నమాజు కోసం ఉపక్రమించారు. బీబీ ఖదీజ కూడా ఆయన అనుసరణలో నమాజ్ ఆచరించారు. ముహమ్మద్ (స) సంరక్షణలో, వారిఇంట్లోనే ఉన్న పదేళ్ళ అలీకి ఈ నమాజ్ ఆచరణ కొత్తగా, వింతగా అనిపించింది. సంభ్రమాశ్చర్యాలకు లోైనెు తిలకించసాగాడా బాలుడు. మునుపెన్నడూ ఎక్కడా చూడని ప్రార్ధనా విధానం, శ్రవణానందమైన పారాయణ మధురిమ ఆతన్ని మంత్రముగ్ధుణ్ణి చేసింది. ఏమిటో తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది. - ముహమ్మద్ ఉస్మాన్‌ఖాన్ (మిగతా వచ్చేవారం) -
హిరాగుహలో.. దైవధ్యానంలో... ప్రవక్త జీవితం
అందరూ ఎంతగానో సంతోషించారు ఓ పెద్ద అంతర్ యుధ్ధానికి తెరపడి, రక్తపాతం తప్పినందుకు తమతమ ఇష్టదైవాలకు కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ’హజ్రెఅస్వద్’ ప్రతిష్టాపనలో అందరికీ భాగస్వామ్యం లభించడం పట్ల అన్ని తెగలూ పరమానంద భరితమయ్యాయి. క్షణాల్లో జరగబోయే రక్తపాతాన్ని ఎంతో సమయస్పూర్తి, సంయమనం, వివేకంతో తప్పించి శాంతిని కాపాడినందుకు ప్రజలంతా ముహమ్మద్ గారిని అభినందనలలో ముంచెత్తారు. సర్రున లేచిన కరవాలాలు వినమ్రంగా ఒరల్లోకి ఒదిగిపొయ్యాయి. అప్పటిదాకా కత్తులు దూసుకున్న వాళ్ళు మరలా పాలూ పంచదారలా కలసిపోయారు. రోజులు గడిచిపోతున్నాయి. ఖతీజా, ముహమ్మద్ గార్ల అన్యోన్య దాంపత్య జీవితం హాయిగా, సాఫీగా, సంతోషంగా సాగిపోతోంది. కాని ముహమ్మద్ మనసులో ఒకటే ఆలోచన. అన్నివిధాలా భ్రష్టు పట్టి పోయిన ఈ జాతిని సంస్కరించడం ఎలా? కుటుంబ బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తూనే ఆయన ఎక్కువగా ఏకాంతంలో గడిపేవారు. చుట్టూ ఆవరించి ఉన్న నైతిక పతనాన్ని, ధర్మరాహిత్యాన్ని, విగ్రహారాధన లాంటి ఘోరపాపాల గురించి చాలా కలత చెందేవారు. ఈ కీడుల్ని, ఈ నైతిక పతనాన్ని సమాజం నుండి దూరం చేయడంఎలా? అని తీవ్రంగా యోచించేవారు. విశ్వసృష్టికర్తను ఆరాధించే సరైన విధానం ఏది? దాన్ని తెలుకోవడం ఎలా? ఈ జనాలకు తెలియజెప్పడం ఎలా? ఈ విధమైన సవాలక్ష ఆలోచనలు ఆయన అంతరంగాన్ని అతలాకుతలం చేసేవి. ఈ క్రమంలోనే ఆయన మక్కాకు కొద్దిదూరంలో ఉన్న ఓ ఏకాంత ప్రదేశానికి తరచూ వెళ్ళేవారు. అక్కడ ఒక కొండగుహ ఉంది. ఎలాంటి జనరద్దీగాని, శబ్దకాలుష్యం గాని ఉండేదికాదు. చాలా ప్రశాంతమైన, నిర్మానుష్య వాతావరణమది. ఆ గుహ పేరు ‘హిరా’. ఆయన తరచు అక్కడికి వెళ్ళి దైవచింతనలో నిమగ్నమైపొయ్యేవారు. తినడానికి వెంట ఏమైనా తీసుకువెళ్ళేవారు. ఒక్కొక్కసారి శ్రీమతి ఖతీజా గారే ఆహారం తెచ్చి ఇస్తుండేవారు. ఇలానే రోజులు గడుస్తున్నాయి. ఆయన అన్వేషణ మాత్రం ఆగలేదు. అధిక శాతం దైవచింతనలోనే ఆయన సమయం గడిచిపోయేది. అప్పుడ ప్పుడూ ఇంటికి వెళ్లేవారు. భార్యాబిడ్డలతో కాలక్షేపం చేసేవారు. ‘‘నాన్నా! ఎక్కడికెళ్లావు, మమ్మల్ని తీసుకెళ్లలేదే’’ అని గోముగా అడిగేవారు పిల్లలు. ఆయన వారిని ప్రేమగా దగ్గరకు తీసుకొని ఒళ్లో కూర్చోబెట్టుకునేవారు. వారి తలని నిమిరేవారు. వారితో ముద్దుగా మాట్లాడేవారు. ‘ఎప్పుడైనా మిమ్మల్ని కూడా తీసుకు వెళ్తా’ అని అనునయించేవారు. తరువాత యథాప్రకారం హిరాగుహకు వెళ్లిపోయేవారు. అయితే, ఈ శుభ ఘడియలు, ఈ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. ఆయన కొడుకులంతా ఒకరి తరువాత ఒకరుగా ఇహలోకం వీడిపోయారు. ఖాసిమ్, తయ్యిద్, తాహిర్ ముగ్గురూ దైవాన్ని చేరుకున్నారు. ముహమ్మద్కి దెబ్బమీద దెబ్బ, గాయం మీద గాయం అవుతోంది. అయినా సహనం వహించారు. పసితనంలో తను అనాథగా బాధను అనుభవించారు. ఇప్పుడు పుత్రశోకంతో బాధను అనుభవించాల్సి వస్తోంది. కొడుకులు పోగా ఇప్పుడిక నలుగురు అమ్మాయిలు ఉన్నారు. జైనద్, రుఖియ్య, ఉమ్మెకుల్ సూం. ఫాతిమా. - ముహమ్మద్ ఉస్మాన్‌ఖాన్ (మిగతా వచ్చేవారం)