గుండె తెలుసు... తడి తెలుసు! | problems of patients know | Sakshi
Sakshi News home page

గుండె తెలుసు... తడి తెలుసు!

Published Wed, Sep 2 2015 4:09 AM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM

గుండె తెలుసు... తడి తెలుసు! - Sakshi

గుండె తెలుసు... తడి తెలుసు!

రోగుల వెతలు తెలుసు..!
 

 - డాక్టర్ బొల్లినేని భాస్కర్‌రావు కార్డియోథొరాసిక్ సర్జన్, సీఈఓ - ఎం.డి,  కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్
 
 వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి ఒక డాక్టర్. ఆయనకు రోగుల వెతలూ తెలుసు, ఆసుపత్రుల కష్టాలూ తెలుసు. అందుకే అందరికీ మేలు జరిగేలా, అన్ని వైపుల వారికీ మేలు కలిగేలా ఆరోగ్యశ్రీని రూపొందించగలిగారు. ఈ యజ్ఞంలో నేనూ ఒక భాగస్వామిని. ఆరోగ్యశ్రీ పథకాన్ని మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ప్రకటించే సమయానికి ఆయనతో పాటు నేనూ వేదికపై ఉన్నాను. ప్రకటించిన వెంటనే...20 మంది రోగులను నా వెంటే తీసుకొని ఒక బస్సుతో బయల్దేరాను. వాళ్లకు మా ఆసుపత్రిలో చేర్చుకొని చికిత్స ప్రారంభించాం. రెండ్రోజుల తర్వాత నేను వెంట తెచ్చుకున్న రోగులను గుర్తుంచుకొని వారిని చూసేందుకు డాక్టర్ వై.ఎస్. స్వయంగా మా ఆసుపత్రిని సందర్శించారు. రోగుల ముఖంలో వెలుగుతున్న సంతోషాన్ని చూసి పులకించిపోయారు. ఆయన కేవలం డాక్టర్ మాత్రమే కాదు... ఒక మహనీయ మానవతామూర్తి.
 
ఆరోగ్యశ్రీని సాధ్యం చేసి చూపించారు

 
- డాక్టర్ మోహనవంశీ, సర్జికల్ ఆంకాలజిస్ట్ - ఎండీ,  ఒమెగా హాస్పిటల్స్, హైదరాబాద్
డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న రోజుల్లో నేను ‘ఇండో అమెరికన్ హాస్పిటల్’కు డెరైక్టర్‌గా ఉన్నాను. ఒకరోజు ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మా ఇన్‌స్టిట్యూట్‌కు వచ్చి పేదల క్యాన్సర్ చికిత్స గురించి, అందుకు వై.ఎస్. ఆలోచిస్తున్న ఆరోగ్యశ్రీ పథకం గురించి చెప్తే నేను ఆశ్చర్యపోయాను. ‘సర్... కొన్ని సాధారణ క్యాన్సర్లకు ప్రభుత్వ బీమా అమలు చేయవచ్చేమో, కానీ ఎంత ఖర్చవుతుందో కూడా అంచనా తెలియని క్యాన్సర్లకూ బీమా అంటే కుదరదేమో’ అని సందేహాన్ని వ్యక్తం చేశారట ఆ సెక్రటరీ. అప్పుడు వై.ఎస్. తనతో... ‘చూడండి.. అగర్వాల్‌జీ! సామాన్యుల నుంచి నాకు వచ్చే విజ్ఞప్తుల్లో వైద్యసహాయం కోసం అడిగేవారే ఎక్కువ. ఒక డాక్టర్‌గా నాకు తెలిసిన విషయం ఏమిటంటే... గుండెజబ్బులూ, క్యాన్సర్, కిడ్నీ సమస్య... ఈ మూడింటిలో ఏది వచ్చినా ఒక పేదవాడి జీవితమే కునారిల్లుతుంది. అందుకే సామాన్యులకు సాయం చేయడానికి... పేదలకు, తెల్లరేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వమే వైద్యబీమా అందించే పథకం కావాల్సిందే’ అన్నారట. రోగుల బాధలకు అంతగా చలించిపోయారాయన. అత్యంత సంపన్నమైన అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోనూ ఇలా ఆరోగ్యబీమాను ప్రభుత్వమే చేపట్టడం అన్నది లేదు. కేవలం ఒక రాష్ట్రప్రభుత్వం ప్రజల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వారికి వైద్యచికిత్సను అందించడం బహుశా ప్రపంచంలోనే ఇదే మొదటిసారి కావచ్చు.
 
 చిన్నారిని కాళ్ల మీద నిలబెట్టింది ఆరోగ్యశ్రీ

 
- డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి, చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్, ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్
 ఒక రోజు నాలుగేళ్ల వయసున్న ఒక కోయ చిన్నారిని నా దగ్గరికి తీసుకొచ్చారు అతడి  తల్లిదండ్రులు. ఆ అమాయకపు అడవిబిడ్డను రోడ్డుపై ఏదో వాహనం ఢీకొట్టింది. చాలా ఆసుపత్రులు తిరిగి, కాలు తీసేయాల్సిందేనని చెప్పడంతో నా దగ్గరికి వచ్చారు. ఆ పిల్లాడిని చూసి చలించిపోయా. మల్టిపుల్ సర్జరీలకు చాలా ఖర్చవుతుంది. పైగా ఈ సర్జరీ ‘ఆరోగ్యశ్రీ’ కిందికి రాదు. ఆ చిన్నారి కాలును తొలగించడానికి నాకు మనసు రాలేదు. ‘మీరు ఒక్క పైసా కూడా చెల్లించని విధంగా మేమే సీఎం వైఎస్ గారి నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుంటాం’ అంటూ ఆ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి సర్జరీలకు ఉపక్రమించాను. వైఎస్ స్వయానా డాక్టర్ కావడంతో రోగుల అవసరాలు గుర్తెరిగి, ఈ సర్జరీ ‘ఆరోగ్యశ్రీ’ కింద కవర్ కాకపోయినా ప్రత్యేక అనుమతి ఇచ్చారు. సరిగ్గా ఏడాది తర్వాత ఆ చిన్నారిని ఫాలో అప్ కోసం తల్లిదండ్రులు మళ్లీ నా దగ్గరికి తీసుకొచ్చారు. చెంగుచెంగున ఎగురుతూ గెంతుతూ... పెరిగిన జుత్తును తమ కోయశైలిలో కట్టుతో... చిరునవ్వుతో నా ముందుకు వచ్చాడు. నేనెన్నో సర్జరీలు చేశాను. ఎన్నో సంక్లిష్టమైన ప్రక్రియలూ నిర్వహించాను. సొంతబిడ్డ మునికాళ్ల మీద లేస్తూ పడుతూ, మళ్లీ లేచి తొలి అడుగు వేసిన నాడు కన్నతండ్రి ఆనందించినంతగా సంతోషపడ్డాను. ఇలాంటి సహాయాలు అందించబట్టే డాక్టర్ వై.ఎస్. ప్రజల హృదయాల్లో అంతగా గుర్తుండిపోయారు.
 
ఆరోగ్యశ్రీ వైద్యసేవారంగంలో  విప్లవం...

- డాక్టర్ హరిప్రసాద్, సీఈఓ, అపోలో హాస్పిటల్స్, సెంట్రల్ రీజియన్
 ఆరోగ్యసేవా రంగంలోని విప్లవాత్మకమైన మార్పులు తెచ్చింది ‘ఆరోగ్య శ్రీ’. ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం ద్వారా డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి... వైద్యచికిత్సకు నోచుకోని ఎంతోమంది రోగులు, వారి కుటుంబాల ముంగ్లిట్లోకే వైద్యసేవలు  వెళ్లి అందేలా చేశారు. ఎందరో పేద ప్రజల పెద్ద పెద్ద రుగ్మతలు నయం చేశారాయన. అలా ఎందరి జీవితాల్లోనో వెలుగులు నింపారాయన.
 
 ప్రజల ‘గుండె’కు చేరువైన పథకం...

 - డాక్టర్ అనూజ్ కపాడియా, సీనియర్ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్
ఆరోగ్యశ్రీ వల్ల గుండె ఆపరేషన్లు చేయించుకొని, గుండెకు స్టెంట్స్ వేయించుకొని  బాగుపడ్డ రోగుల సంఖ్య చాలా ఎక్కువ. ఈ పథకాన్ని అమలు చేశాక లబ్ధిపొందిన రోగులు గుండెజబ్బుల నుంచి దూరమై మామూలు జీవితం గడుపుతున్నారంటే అది ఆరోగ్య శ్రీ వంటి మంచి పథకం వల్లనే. ప్రజానాయకుడు కావడంతో పాటు డాక్టర్ కూడా కావడం వల్ల ఆయనకు పేషెంట్స్ అవసరాలు బాగా తెలిసి ఉండటం వల్లనేమో... ఇలాంటి పథకం ప్రవేశపెట్టారు. అందుకే ఎన్నో ప్రభుత్వ పథకాల కంటే ఇది ప్రజల ‘గుండె’లకు బాగా చేరువైంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement