నా వయసు 32. నేనొక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను. ఆఫీసులో పనిభారం వల్ల మానసిక ఒత్తిడి ఏర్పడింది. దాంతో నేను ఇంటర్‌నెట్‌ను ఆశ్రయించాను. అయితే నాకు మరింత గందరగోళం ఏర్పడింది. సైకియాట్రిస్ట్‌ను పెద్ద పెద్ద మానసిక సమస్యలకు మాత్రమే సంప్రదించాలని, మందులు ఏళ్ల తరబడి మింగాల్సి ఉంటుందనీ, చిన్న చిన్న సమస్యలకు సైకాలజిస్టు సరిపోతారనీ ఉంది. నిజమేనా? ఇంతకీ నేను సైకాలజిస్టును కలవాలా? సైకియాట్రిస్ట్‌ను కలవాలా? అసలు తేడా ఏమిటి?
- కె.సునీల్ కుమార్, హైదరాబాద్
ఇంటర్‌నెట్ అనేది సమాచారాన్ని తెలుసుకోవడానికే తప్పవ్యక్తిగత సమస్యల పరిష్కారానికి పనికిరాదు. అసలే మీరు మానసిక ఒత్తిడిలో ఉన్నారు. దానికితోడు ఇంటర్‌నెట్‌లో లభించిన సమాచారాన్ని చదివేసరికి మరింత అయోమయానికి గురయినట్లున్నారు. ముందుగా మీరు ఒక సైకియాట్రిస్ట్‌ను సంప్రదించి, మీకున్న సమస్యలను వివరించి, వారి సలహా మేరకు మందులు వాడండి.
ఈ సందర్భంగా మీతో బాటు చాలా మందిని కన్‌ఫ్యూజన్‌కు గురిచేసే సైకాలజిస్టు, సైకియాట్రిస్టు అనే పదాలకు మధ్య గల తేడాను వివరిస్తాను.
సైకియాట్రిస్ట్ అంటే... ఎంబీబీఎస్ చేసి, మెదడు గురించి, దాని పనితీరు గురించి అధ్యయనం చేసిన మెడికల్ స్పెషలిస్ట్. మెదడు కూడా అన్నింటిలా శరీరంలోని భాగమే. దానికీ జబ్బులు వస్తాయి. నయం చేయకుంటే దాని ప్రభావం శరీరంలోని అన్ని భాగాల మీద పడుతుంది. సైకియాట్రిస్ట్ తనకుండే పరిజ్ఞానంతో రోగికి మందులతోబాటు అవసరమైతే కౌన్సెలింగ్ కూడా ఇస్తారు. మీరు తెలుసుకోవలసిందేమిటంటే... ఒకేలా ఉండే ఏ ఇద్దరి జబ్బుకూ చికిత్స ఒకేలా ఉండదు. వారి శారీరక, మానసిక స్థితులని బట్టి, తీవ్రతను బట్టి ఎంతకాలం పాటు మందులు వాడాలో వైద్యులు నిర్ణయిస్తారు.
ఇక సైకాలజిస్ట్ అంటే నాన్ మెడికల్ స్పెషలిస్ట్. ఆర్ట్స్ లేదా సైన్స్ చదివి సైకాలజీలో పట్టా పుచ్చుకుని ఉంటారు. మీరు సైకాలజిస్ట్‌ను సంప్రదించవలసిన అవసరం వస్తే క్లినికల్ సైకాలజిస్‌న్టు సంప్రదించడం మంచిది. వీరు పేషెంట్ నుంచి, వారి కుటుంబ సభ్యుల నుంచి సమస్యను సమగ్రంగా తెలుసుకుని కేస్‌షీట్ తయారు చేస్తారు. అంతేకానీ మందులు మాత్రం ఇవ్వరు. రోగికి ఉపశమనం కలిగించే మాటల ద్వారానే వ్యాధిని నయం చేస్తారు. మెడిసిన్ చదివి, సైకియాట్రీలో నిపుణులైన వారి సహకారం తీసుకోవడమే అన్ని విధాలా శ్రేయస్కరం. మీరు నిపుణులైన సైకియాట్రిస్ట్‌ను సంప్రదించడం మంచిది. ఆల్ ది బెస్ట్.
సైకాలజిస్ట్‌నా? సైకియాట్రిస్ట్‌నా... ఎవరిని సంప్రదించాలి?
Published Sat, Dec 14 2013 12:17 AM | Last Updated on Sat, Sep 2 2017 1:34 AM
Advertisement
Advertisement