మానవ నాగరికత పరిణామక్రమాన్ని శాస్త్రీయంగా తెలుగులో చెప్పడానికి చేసిన గొప్ప ప్రయత్నం డాక్టర్ ఎం.వి.రమణారెడ్డి ‘టూకీగా ప్రపంచ చరిత్ర’. ఇది ఇప్పటికి రెండు భాగాలుగా వచ్చింది. జీవశాస్త్రంలో వచ్చిన పరిశోధనలు, చరిత్ర రచనకు జరిగిన వాదోపవాదాలను పరిశీలించి భారతీయ దృక్పథం నుంచి ఈ రచన చేశారు. సంఘటనలన్నిటినీ గుదిగుచ్చినట్టు చెప్పడం కాకుండా, వాటికి చోదకశక్తులైన ఆర్థిక, సామాజిక, ఉత్పత్తి సంబంధాలను విశ్లేషించారు.
వందలాది సంవత్సరాలుగా మత విశ్వాసాలకూ, విజ్ఞానానికీ మధ్య జరిగిన పోరాటంలో విజ్ఞానమే ఎలా విజయం సాధించిందో వివరించారు. మొదటి భాగంలో సృష్టి రహస్యాన్ని ఛేదించడం నుంచి, పనిముట్ల తయారీలో వచ్చిన మార్పులు, ధనుర్బాణాల నుంచి తుపాకుల దాకా జరిగిన పరిణామం, జంతువులను మచ్చిక చేసుకోవడం, పశుపోషణ, వ్యవసాయం, భాష పుట్టుక, లిపి గురించి వివరించారు. ఒక వైపు మారణాయుధాలతోపాటు బౌద్ధిక ప్రపంచంలో చోటు చేసుకుంటున్న మార్పులను రెండో భాగంలో విశ్లేషించారు.
క్రీ.పూ. 8వ శతాబ్దం నాటికే మానవుడు నక్షత్రాల గమనాన్ని పసిగట్టడం, ‘వేగుచుక్క’ ద్వారా కాలాన్ని లెక్కించడం నేర్చుకున్నాడు. నక్షత్రాలను బట్టి నౌకాయానం సాగించాడు. జవాబు దొరకని ప్రశ్నలకు పరలోకం ఉందనే భావనతో సమాధానపరచుకున్నాడు. ‘థాలిస్’ చరిత్రకందిన తొలి తాత్వికుడు. ‘సంకెళ్లు లేని ఆలోచన’ను అందించిన సోక్రటీస్‌తో సామాజిక అంశాలు పట్టించుకోవడం మొదలైంది. ‘గ్లాడియేటర్ స్కూలు’ విద్యార్థి స్పార్టకస్ తిరుగుబాటు చెప్పుకోదగ్గది. గ్రీకు, రోమన్ సామ్రాజ్యాల మధ్య ఏర్పడిన అగాథం, నరమేధం క్రైస్తవ మతానికి ప్రాబల్యం ఏర్పడేదాకా సాగాయి.
చైనాలో రైతు కుటుంబం నుంచి వచ్చిన లియుబ్యాంగ్ మూలపురుషుడిగా హన్ వంశీయుల ఏలుబడి (క్రీ.పూ.206 – క్రీ.శ.220) స్వర్ణయుగంగా గుర్తింపుపొందింది. ఈ కాలంలోనే చైనా వ్యవసాయంలో ‘విత్తనం గొర్రు’ ప్రవేశించడంతో సాగు విస్తీర్ణం పెరిగి, ప్రభుత్వ ఖజానా నిండింది. చంద్రగుప్తుని విజయపథాన నడిపిన చాణక్యుడు, అర్థశాస్త్రం రాసిన కౌటిల్యుడు ఒకరు కాదు. చాణక్యుడి తర్వాత 300 ఏళ్ల అనంతరం అర్థశాస్త్రం వచ్చిందనేది పరిశోధకుల వాదన. వింధ్య పర్వతాలు దాటుకుని ఆర్యులు దక్షిణాదికి గుంపులు గుంపులుగా రాలేదు. ఆర్యీకరణ కోసం వచ్చిన తొలి ఆర్యుడు అగస్త్యుడు. ఆర్యీకరణ తర్వాత కూడా ద్రవిడ సంప్రదాయాలు కొనసాగాయి. ఇలాంటి ఆసక్తికర అంశాలతో ఈ రెండో భాగం సాగుతుంది.
చరిత్ర చదివేముందు చరిత్రకారుడి గురించి తెలుసుకోవాలి. మార్క్స్ ప్రభావం ఈ రచనపై బలంగా పడింది. చరిత్రను భౌతికవాద దృష్టితో చూడటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
రాఘవశర్మ
9493226180
టూకీగా ప్రపంచ చరిత్ర– రెండవ భాగం; రచన: ఎం.వి.రమణారెడ్డి; పేజీలు: 288(హార్డ్ బౌండ్); వెల: 300; ప్రతులకు: కవిత పబ్లికేషన్స్, 3/75, ఖాదరాబాద్ (పి.ఒ.), ప్రొద్దుటూరు –516362. ఫోన్: 9063077367
సంక్షిప్తంగా సమస్త మానవాళి చరిత్ర
Published Mon, Aug 21 2017 12:14 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM
Advertisement
Advertisement