
నిజంగా అవసరమా?
లోచూపు మనిషి... మనసుకి బందీ.
అతను తనపై తానే బలవంతంగా కొన్నింటిని రుద్దుకుంటాడు. అది ఆత్మహత్యా సదృశం. వద్దనుకుంటూనే తనను ఇబ్బందిపెట్టే వాటినే చేస్తూ ఉంటాడు. నలిగిపోతుంటాడు. అతను గొప్ప రచయిత. పేరు - లియో టాల్‌స్టాయి (1828 -1910). నవలా రచయితగా సుప్రసిద్ధుడు. రష్యాలోని ధనికుల్లో ఒకడు. ఈ రష్యన్ రచయిత ఆరోజు షాపింగ్ కి వెళ్ళాడు. మార్గమధ్యంలో ఆయన అంతరంగంలోకి తొంగిచూశాడు. అప్పుడు ఆయనకు ఓ విషయం తెలిసింది. తనకు ఏ మాత్రం అవసరం లేని ఓ వస్తువు కొనడానికి పోతున్నట్టు అవగతమైంది. మరి అతనెందుకు కొనాలనుకుంటున్నాడు. పొరుగింట్లో ఉంది కాబట్టి, తానూ కొనాలని అనుకున్నాడు. అంతే తప్ప, అది తనకెంత మాత్రమూ అవసరం లేదు. ఈ విషయం అర్థమయ్యాక, ఆయన దాన్ని కొనుక్కోవాలన్న ఆలోచనను మానుకుని ఇంటికి తిరిగొచ్చేశాడు. ఇంటికి వచ్చాక పెద్దగా నవ్వుకున్నాడు.
ఆయన భార్య ఆ నవ్వు చూసింది. ‘ఎందుకు నవ్వుతున్నారు?’ అని అడిగింది. అప్పుడు ఆయన ఇలా అన్నాడు - ‘ఏమీ లేదే! ఒకటి కొనడం కోసం బయలుదేరాను కదా! ఇంతలో నాలోకి నేను చూసుకొనేసరికి నాకో విషయం తెలిసింది. నాకు అనవసరమైనది కొనడం దేనికీ అనిపించింది. అయితే నేను కొనడానికి వెళ్ళింది- ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో చాలాసార్లు అలా వెళ్లి కొన్నాను. చివరకు ఈరోజు జ్ఞానోదయమైంది. నేనేమిటీ... ఇలా మిగిలినవారిని అనుకరిస్తున్నాను?’ అని అనుకునేసరికి ఒక ముందు ఇలా చేయకూడదని నవ్వొచ్చింది.’
ఈ విషయం ఆయనలో పెనుమార్పే తీసుకొచ్చింది. అది చిన్న విషయమే కావచ్చు. కానీ ఆ క్షణం నుంచీ ఆయన ప్రతి విషయాన్నీ, చేసే ప్రతి పనినీ నిశితంగా చూశాడు. ప్రతిదీ తానెందుకు చేస్తున్నానో ఆలోచించాడు. అందుకే ఆయన ఎప్పుడూ అనేది ఒకటే - మనం చేసే పనిలో దాదాపు తొంభై శాతం అవసరం లేనివే! - యామిజాల జగదీశ్