తీవ్రమైన మతిమరపు పక్షవాతానికి సూచన కావచ్చు!
కొత్త పరిశోధన
అత్యధిక విద్యావంతులూ, ఎప్పుడూ ఏ విషయాన్నైనా అనర్గళంగా గుర్తు తెచ్చుకొని చెప్పేవారిలో... అకస్మాత్తుగా వారు తమ పరిజ్ఞానాన్ని మరచిపోతుండటం, అవసరమైనప్పుడు బాగా గుర్తున్నట్లుగా ఫీలయ్యే అంశాలే జ్ఞప్తికి రాకపోతుండటం జరుగుతుంటే వారికి పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా పరిగణించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఒక డచ్ అధ్యయనం పేర్కొంటోంది. ఈ అధ్యయనాన్ని 55 ఏళ్లు పైబడ్డ 9,152 మందిపై నిర్వహించారు. దాదాపు 20 ఏళ్లపాటు ఈ అధ్యయనం సాగింది.
వీళ్లలో 1,134 మంది పక్షవాతానికి గురయ్యారు. ఇక మతిమరపు తీవ్రంగా ఉన్నట్లు గుర్తించిన మరో 20 శాతం మందిలో స్ట్రోక్ (పక్షవాతం) వచ్చే లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపించాయి. యూనివర్సిటీలలో నిత్యం బోధించే సబ్జెక్టులను సైతం మరచిన వారిలో స్ట్రోక్ అవకాశాలు 39 శాతం ఎక్కువగా ఉన్నట్లు కూడా ఈ అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయన ఫలితాలను ‘స్ట్రోక్’ అనే మెడికల్ జర్నల్‌లో పొందుపరిచారు. కాబట్టి బాగా గుర్తున్న విషయాలను మరచిపోయేవారు ఒకసారి న్యూరాలజిస్ట్‌ను సంప్రదించడం మేలు అని నిపుణులు సూచిస్తున్నారు.