కుమారీ...జాగ్రత్త కుమారా | relationship in emoticons | Sakshi
Sakshi News home page

కుమారీ...జాగ్రత్త కుమారా

Published Fri, Dec 11 2015 11:29 PM | Last Updated on Sun, Sep 3 2017 1:50 PM

కుమారీ...జాగ్రత్త కుమారా

కుమారీ...జాగ్రత్త కుమారా

పెళ్లిలో ఏడు అడుగులు వేయాలి. రిలేషన్‌షిప్‌లో ఏడు అడుగులు దాటాలి.
 
 రిలేషన్ ఎంత చక్కగా ఉన్నా... కొన్నిసార్లు ఆ రిలేషన్‌లో ‘రెడ్ ఫ్లాగ్స్’ ఎగురుతూ కనిపిస్తాయి. అంటే ప్రమాద సూచికలు కనబడతాయన్నమాట. అవి కనిపించినప్పుడు కుమారి, కుమార తమ రిలేషన్‌షిప్‌ను ఎంతవరకు ముందుకు తీసుకెళ్లాలో   అంచనా వేసుకోవాలి. 
 
 అలా చేయకుండా ఎమోషన్స్ మీదే ఆధారపడి గుడ్డిగా రిలేషన్‌షిప్‌ని నమ్మి, ముందడుగు వేస్తే కష్టాలు తప్పవు. నూరేళ్లు ఉండాల్సిన సంబంధానికి జాగ్రత్తలు అవసరం. కీడెంచి మేళం ఎంచుకోవాలి. అదేనండీ పెళ్లిమేళం... ఆ తర్వాతే ఎంచుకోవాలి.
 
 భావోద్వేగాలు
 రిలేషన్‌ని ఎమోషన్స్ నడిపిస్తాయి. కానీ ఎమోషన్స్ మన ఎనర్జీని తినేస్తూ, మానసికంగా బలహీనపరుస్తుంటే.. హృదయాన్ని పక్కన పెట్టి, మైండ్‌తో ఆలోచించాలి. అవతలి వ్యక్తి మనకు సరిపోతారా లేదా అన్న సంగతి.. ఏదో ఒక సందర్భంలో బయటపడిపోతుంది.. సరిపడరు అనుకున్నప్పుడు దూరంగా వచ్చేయడం బెటర్. కానీ అలా వచ్చేయకుండా... వ్యామోహం వెంటబడి వెళ్లిపోతే ప్రేమ వెనకబడిపోతుంది. వ్యామోహం తీరాక ఆ సంబంధమూ తెగిపోతుంది. ఎమోషన్స్ ప్రేమ వల్ల కదా వచ్చేది అనుకుంటుంటాం. వ్యామోహం కూడా ఎమోషన్స్ కలిగిస్తుంది. అందుకే అది వ్యామోహంతో కూడిన ఎమోషనా, ప్రేమ కారణంగా కలుగుతున్న ఎమోషనా గ్రహించాలి. ఎమోషన్స్‌తో కట్టడి చెయ్యాలని చూడడం... రిలేషన్‌షిప్‌లోని మొదటి రెడ్ ఫ్లాగ్. 
 
 ఒంటరితనం
 ఒంటరిగా ఉండలేమేమోనన్న భయంతో చాలా ప్రేమ జంటలు కలిసి ఉంటాయి! కానీ ఏదో ఒక రోజు ఒంటరితనమే నయం అనిపించే స్థితి వస్తుంది. అప్పుడు తప్పించుకోలేరు కదా. మొదట్లో ఒంటరితనం బాధిస్తుంది. ఆల్ ది డే వేధిస్తుంది. ఒకనాటి బంధమా మరి. అందుకే అంత పెయిన్. ఏదైనా నేర్చుకోవడంలో పడిపోతే ఒంటరితనమే ఉండదు. అలా కూడా సంతృప్తిగా లేదు, ఏదైనా రిలేషన్ కావాలనుకుంటే మాత్రం ముందు... మీతో మీకు గట్టి రిలేషన్‌ని డెవలప్ చేసుకోవాలి. ఓడిపోతున్నా, విడిపోవాలనిపించ కపోవడం... రిలేషన్‌షిప్‌లోని రెండో రెడ్ ఫ్లాగ్. 
 
 డిపెండెన్సీ
 ఆధారపడడం బంధాన్ని గట్టిపడేలా చేస్తుంది కానీ, ప్రతి దానికీ ఆధారపడడం రిలేషన్‌ని బలహీనపరుస్తుంది. మనకు మనంగా నిర్ణయాలను తీసుకోగల నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో ఆత్మగౌరవానికి ప్రాధాన్యం ఇస్తాం. మీ ఆత్మగౌరవం అవతలి వాళ్లకు మీపై ఆకర్షణను పెంచుతుంది. చేతనై కూడా చేయూత కోసం చూడడం... రిలేషన్‌షిప్‌లోని మూడో రెడ్ ఫ్లాగ్.  
 
 సంకేతాలు 
 మనకు మనం ఏర్పరచుకున్న పరిమితులు అవతలి వ్యక్తినీ మన పరిమితులకు లోబడి ప్రవర్తించేలా చేస్తాయి. మన పర్సనల్ స్పేస్‌కు విలువ ఇచ్చి, మన అభిప్రాయాలను గౌరవించే వారితో మన ప్రేమ బంధం కంఫర్ట్ గా ఉంటుంది. సో... లిమిట్స్‌ని ఎక్స్‌ప్రెస్ చెయ్యాలి. పరిమితులను వెల్లడించకపోవడం... రిలేషన్‌షిప్ లోని నాలుగో రెడ్ ఫ్లాగ్. 
 
 బీ పాజిటివ్
 పార్ట్‌నర్‌ని ఎంచుకునేటప్పుడు వారిలో పాజిటివ్ యాంగిల్ ఉన్నదీ లేనిదీ చూసుకోవాలి. అడుగడుగునా నెగటివ్ లక్షణాలే కనిపిస్తుంటే మీ బంధం చిరకాలం నిలిచేందుకు అవకాశాలు తక్కువ. మీ చుట్టూ ఉండేవారు ఎప్పుడూ ఏదో ఒక పనిలో పూర్తి ఎనర్జీతో తమ అభివృద్ధి కోసం తాము పనిచేస్తున్న వారై ఉండాలి. అప్పుడు వారితో సమానంగా మీరు ఎదుగుతారు. ఎప్పుడూ సంతోషంగా ఉండేవారు, ఎప్పుడూ సక్సెస్ సాధిస్తుండేవారు సహజంగానే మీకో మార్గాన్ని నిర్దేశించే శక్తి గల వారై ఉంటారు. ఇలాంటి వారితో రిలేషన్ పదికాలాలు నిలబడుతుంది. నీరసం, నిరుత్సాహం.. రిలేషన్‌షిప్‌లోని ఐదో రెడ్ ఫ్లాగ్. 
 
 గాసిప్
 ఆరోగ్యకరమైన సంబంధాలు కావాలనుకున్నప్పుడు మీరూ అవతలి వాళ్లకు అదేవిధమైన రిలేషన్‌ని ఇవ్వగలగాలి. మీ మాటల్లో, చేతల్లో నిజాయితీ ఉండాలి. మీ గురించి మీరు గాసిప్ విన్నప్పుడు మిమ్మల్ని మీరు ఎలాగైతే సమర్థించుకుంటారో, ఇతరులను కూడా మీరు అలాగే సమర్థించగలగాలి. మీరు ప్రేమించే వాళ్లపై  గాసిప్‌లను పడనివ్వకండి. మాట పడనివ్వడం... రిలేషన్‌షిప్‌లోని ఆరో రెడ్ ఫ్లాగ్. 
 
 సిక్త్స్‌సెన్స్
 అవతలి వ్యక్తుల ఉద్దేశాలను, శక్తియుక్తులను అర్థం చేసుకోగల సిక్త్స్‌సెన్స్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఆ సెన్స్‌ని అనుసరించి వారివైపు నుంచి వచ్చే ప్రమాద సంకేతాలను మీరు గుర్తించాలి. మీ వైపు నుంచే అన్నీ వెళుతూ, అటువైపు నుంచీ ఏదీ రావడం లేదంటే మీది వన్ సైడ్ లవ్ అని. ఇచ్చి పుచ్చుకోవడం ఉన్నప్పుడే ఆ బంధం నిలుస్తుంది. అలాగే ఒక వ్యక్తి సమక్షంలో పదే పదే మీరు అపరాధ భావనకు గురి అవుతున్నారంటే... వారు మిమ్మల్ని అలాంటి భావనకు గురిచేస్తున్నారని అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తిపై నిరంతరం కోపాన్ని వ్యక్తం చేయవలసి వస్తోందీ అంటే ఆ వ్యక్తి మిమ్మల్ని నిర్లక్ష్యంగా తీసుకుంటూ మీకు కోపం తెప్పిస్తున్నారని. అలాగే ఒక వ్యక్తి వెళ్లిపోయాక మిమ్మల్ని మాత్రమే నిస్సత్తువ ఆవహిస్తోందీ అంటే మీది అనువైన సంబంధం కాదని. ఒకరు మాత్రమే వ్యథ చెందడం... రిలేషన్‌షిప్‌లోని ఏడో రెడ్ ఫ్లాగ్. 
 
 ఇవన్నీ రిలేషన్‌షిప్స్‌లో కనిపించే రెడ్ ఫ్లాగ్స్. అవి మీ ఆత్మగౌరవానికీ, ఆరోగ్యానికి పరీక్ష పెడతాయి. ఆరోగ్యకరమైన రిలేషన్‌షిప్‌లో ఉన్న జంటలకు ఏదో ఒక దశలో విభేదాలు, వివాదాలు తలెత్తుతాయి. వివాదం ఎక్కువైతే అది ప్రమాదస్థాయికి చేరుకుంటోందని అర్థం చేసుకోవాలి. అందుకే ఒక రిలేషన్‌లో ఉండిపోవాలని స్థిర నిశ్చయానికి వచ్చే ముందు అవతలి వ్యక్తి స్వభావాలను తెలుసుకునేందుకు తగినంత సమయం తీసుకోవాలి. మీకేం ఇష్ట ఉండవో, మీరేం సహిం చలేరో ముందే చెప్పేయాలి. అంటే ముందే రెడ్‌ఫ్లాగ్‌ని ఎగరేయాలి. విడిపోవలసిన సమయం ఆసన్నమైనప్పుడు కూడా, ఇంకా పట్టుకు వేళ్లాడడమంటే మీ రిలేషన్‌కు మీరు ద్రోహం చేసుకోవడమే. మీ ఆత్మను మీరు కించపరచుకోవడమే!
 
 నిజాయితీ ఆకట్టుకుంటుంది
 రిలేషన్‌లో ప్రమాద సంకేతాలు కనిపించినప్పుడు ఆనందంగా ఉండలేరు. సాధారణంగా అమ్మాయీ, అబ్బాయి మధ్య విపరీతమైన ఆకర్షణ వల్ల రిలేషన్ ఏర్పడి ఉంటుంది. ఆకర్షణ ఒక్కటే సరిపోదు. ఒకరిపట్ల ఒకరికి అనురాగం, ఆసక్తి లేకుండా ఈ రెడ్ ఫ్లాగ్స్‌ని ఎదుర్కోవడం కష్టం. మన నిజాయితీ అవతలివారిని బాధించినా సరే అదే ఆకట్టుకుంటుంది. నిజాయితీగా చెప్పుకోవడం వల్ల సమస్య ఎక్కువ రోజులు ఉండదు. జరిగిన గాయం తాలూకు బాధలోనుంచి త్వరగా బయటపడవచ్చు. ఇద్దరికీ సంబంధించిన అంశం కాబట్టి ఇద్దరూ కలిసి మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి. కుదరలేదంటే రిలేషన్ నుంచి బయటకు వచ్చే హక్కు ఇద్దరికీ ఉంటుంది. 
 - డా.సి.వీరేందర్, సైకాలజిస్ట్
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement