బాష్పాలు, ప్రేమికులు, రచయితలు | Review Of Lily King Writers And Novels | Sakshi
Sakshi News home page

బాష్పాలు, ప్రేమికులు, రచయితలు

Jun 8 2020 1:27 AM | Updated on Jun 8 2020 1:28 AM

Review Of Lily King Writers And Novels - Sakshi

నవల: రైటర్స్‌ అండ్‌ లవర్స్‌;   రచన: లిలీ కింగ్‌;  ప్రచురణ: 2020 

కట్టాల్సిన అద్దెని కొంతమేరకైనా తగ్గించుకోవాలని, ఇంటి ఓనర్‌ కుక్కని రోజూ వాకింగ్‌కి తీసుకువెళ్లడానికి ఒప్పుకుంటుంది కథకురాలు కేసీ. ‘‘ఎలా సాగుతోంది రాస్తున్న నవల?’’ అని అడుగుతాడు ఓనర్‌– ఆ పదాన్నేదో కేసీయే కనిపెట్టినంత వ్యంగ్యంగా. ‘‘అన్నిటికీ మించి నాకు ఆశ్చర్యంగా అనిపించేదేమిటంటే, రచనగా చెప్పటానికి అసలు నీ దగ్గర విషయమేదో ఉందని నువ్వనుకోవడం’’ అని కూడా అంటాడు. ‘‘పొద్దున్నే రాసుకోగలగాలంటే, నేను ఇలాంటి చాలా విషయాల గురించి ఆలోచించకుండా ఉండాలి. ఏదో చెప్పాలని కాదు రాయడం. రాయకపోతే అన్నీ ఇంతకంటే అధ్వానంగా ఉంటాయి కాబట్టి రాయడం,’’ అని అనుకోగలిగినంత స్థితప్రజ్ఞత ఉంది కథకురాలికి. ఆరేళ్లుగా నవలని రాయడం పూర్తి చేయడానికి అవస్థలు పడుతున్న కేసీకి తల్లి ఇటీవలే మరణించడం, ప్రేమించానన్నవాడు మొహం చాటుచెయ్యడం ఆమె కుంచించుకుపోవడానికి కారణాలయ్యాయి. జీవిక కోసం వెయిట్రెస్‌గా పనిచేస్తున్నా, ఆరోగ్య సమస్యలని సైతం పరిష్కరించుకోలేని డబ్బులేమి మరో సంక్షోభం. ముప్పై ఒక్క ఏళ్ల వయసులో ఈ అస్థిరతలని అంగీకరించి, ఆకళింపు చేసుకుని, ఒంటరి పోరాటాన్ని చేయవలసిన పరిస్థితిలో కేసీ ఉంది.  

అనంతర పరిణామాల్లో కేసీకి ఇద్దరు రచయితలతో పరిచయం అవుతుంది. ఆస్కార్‌ అప్పటికే పేరున్న రచయిత. భార్య చనిపోగా ఇద్దరు పిల్లలతో ఉంటున్నాడు. మరో పరిచయం ఇంకా బాలారిష్టాలలోనే ఉన్న రచయిత సిలాస్‌. ఇద్దరి పట్లా ఏకకాలంలో ఆకర్షితురాలైన కేసీ, ఎవరిని ఎంచుకోవాలన్న సందిగ్ధంలో పడుతుంది. ఎటువైపైనా మొగ్గడానికి, ఇంకా మొగ్గతొడగని తన రచనా వ్యాసంగం అడ్డుగా ఉంది. బ్రతికివున్నప్పుడు తను అమితంగా ప్రేమించిన తన తల్లి, తండ్రిని వదిలేసి ఉద్యమాల బాటల వెంట మరొకరితో వెళ్లిపోయింది. ప్రజల జీవితాలకి కొత్త వూపిరిని ఇవ్వాలన్న తల్లి స్ఫూర్తికి భిన్నంగా, తను కేవలం కల్పనా సాహిత్యాన్ని బతుకుదెరువుగా ఎంచుకోవడం కథకురాలిని ఒక దశలో కొంత అపరాధ భావనలోకి నెట్టేస్తుంది. తల్లి మరణించిందన్న దుఃఖానికి తోడుగా– ఈ అపరాధ భావన మరో సంక్లిష్టత అవుతుంది. వీటన్నిటి మధ్యా ఆ ఇద్దరు రచయితలతో తన పరిచయాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది. అననుకూలమైన ఈ పరిస్థితుల మధ్య తన నవలనీ కొనసాగిస్తూ ఉంటుంది.


నవలలో చాలా భాగాలని మళ్లీ మళ్లీ చదవకుండా దాటుకుని ముందుకి వెళ్లడం కష్టం. దుఃఖాన్ని గురించి రాయడం తేలికేగానీ, దాన్ని పాఠకుడిచేత అనుభూతింపజేయడం కష్టం. ఇన్ని ప్రేమకథల మధ్య ఇంకో సందిగ్ధ ప్రేమనీ, జీవిత పోరాటాలని చిత్రించిన అనేక రచనల మధ్యన మరో పోరాటాన్నీ హృద్యంగా ఆవిష్కరించడమూ కష్టమే. రచయిత్రి వచనం ఈ అభేద్యతని సులభంగా ఛేదించింది. సన్నివేశాలలోని ఉద్వేగాన్ని గాఢంగా వ్యక్తీకరించే వాక్యాలు సరళంగానూ, ఆర్ద్రంగానూ, జీవిత సత్యాలుగానూ, అక్కడక్కడా హాస్యంతోనూ మెరుస్తూ ఆయా సన్నివేశాలని దృశ్యమానం చేస్తూ, లోతైన అవగాహనని కలిగిస్తాయి. నవల ముగింపులోని కీలక సన్నివేశాన్ని నిర్వహించిన తీరు కథన ప్రతిభకి పరాకాష్ట. తన రచనా జీవితానికి ఒక అర్థం, జీవితానికి అర్థవంతమైన నిర్వచనాల ఎరుక, నిర్వచనాలకి అతీతమైన ఆత్మవిశ్వాసం, విశ్వాసంతో జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోగల నమ్మకం– కథకురాలి ఈ ఉద్విగ్న క్షణాలు అన్నింటినీ చెదిరిపోకుండా అలానే అపురూపంగా పాఠకులకు అందించారు రచయిత్రి. 

కథంతా రచయితల చుట్టూ తిరుగుతుంటుంది కాబట్టి సహజంగానే పలు రచయితల, రచనల ప్రస్తావనలు తరచుగా నవలలో వస్తూంటాయి. అలానే, కొన్ని రచనల మీద విమర్శలు కూడా కథాపరంగా చోటుచేసుకుంటాయి. రచయితల, రచనల ప్రస్తావన వల్ల నవల సరికొత్త జీవశక్తిని సంతరించుకుంటుంది. 'A novel is a long story with something wrong with it' అన్నది ప్రాచుర్యంలో ఉన్న భావన అని ఒక పాత్ర అంటుంది. ఆ అభిప్రాయాన్ని ఈ నవల ఏవిధంగానూ సమర్థించడం లేదని ఈ నవలని ఇష్టంతో ఆస్వాదిస్తూ చదివే పాఠకులు కచ్చితంగా అనుకుంటారు! కొసమెరుపేమిటంటే, తన పాత నవల (యూఫోరియా) తర్వాత ఈ ‘రైటర్స్‌ –లవర్స్‌’ వెలువరించడానికి రచయిత్రి లిలీ కింగ్‌కి కూడా సరిగ్గా ఆరేళ్ల కాలం పట్టింది!
-ఎ.వి. రమణమూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement