ఆరోగ్యవంతమైన భయం..ఆదర్శవంతమైన జీవితం..!
పిల్లలకు ఏదైనా మంచి మాట చెప్పాలనిపించినప్పుడు, నా బుద్ధికి తోచినవి మంచివే అయినా చెప్పకూడదు. నాకు మంచిదనిపించింది నిజంగా మంచిది కావచ్చు, కాకపోవచ్చు కూడా. ఇప్పుడు మంచి విషయమనుకుని నేను చెప్పినది మరుసటి ఏడాదికి మారిపోవచ్చు. అప్పుడు నేను ఇలా చెప్పకుండా ఉండాల్సిందని చెప్పే అధికారం నాకుండదు. స్వబుద్ధికి తోచిన విషయాన్ని పదిమంది ఆచరించవలసిన విషయంగా ఎప్పుడూ చెప్పకూడదు.
పదిమంది ఆచరించడం కోసం నిర్భయంగా చెప్పగలిగిన మాట ఒక్కటే ఉంటుంది. దానినే ఆర్యోక్తి అంటారు లేదా ఋషి వాక్కు. ఋషి దార్శనికుడు. భగవంతుని ఆగ్రహం చేత సర్వం తెలుసుకున్నవాడు. కాబట్టి అటువంటివాడు పదిమందిని మంచిమార్గంలో నడవండని ఒకమాట చెబితే... భగవంతుడు కూడా మాట్లాడడు. ఆ స్థాయిని పొందినవాడు ఋషి. ఆర్య అంటే పెద్దరికం. అందువల్ల ఏదైనా చెప్పేటప్పుడు ఆర్యోక్తినే స్వీకరించి చెప్పవలసి ఉంటుంది.
వాల్మీకి మహర్షి శ్రీరామాయణంలో ఒక మాటంటాడు. ధృతి, దృష్టి, మతి, దాష్ట్యం సకర్మ నశీయతి’ అంటాడు. ఇది ఆర్యోక్తి. ఒక్క విద్యార్థులకే కాదు, మనుష్యుడిగా పుట్టిన ప్రతివాడికీ ఇది అన్వయమవుతుంది. ధృతి అంటే పట్టుదల, నిర్ణయం. దృష్టి’ అంటే మీరు ఒక పనిని చేయడం మొదలుపెట్టిన తర్వాత ఆది పూర్తిగాక ముందే మీ వైభవాన్ని, కీర్తిని పొందడం. దానివల్ల వచ్చే పొగడ్తకోసం పోకుండా నిలదొక్కుకోగలగడం. మతి’ అంటే చెయ్యవలసిన పనిని చెయ్యవలసినదానిగా చేయకుండా పోవడం, దాష్ట్యం’ అంటే చెయ్యకుండా ఉండవలసిన పనిని చెయ్యకుండా ఉండడానికి కావలసిన ధైర్యాన్ని పొంది ఉండడం. ఈ నాలుగూ ఎవరు పొంది ఉంటారో వాడు తలపెట్టిన పనిలో విఫలంకాడు. వాడు దేనిని సాధించాలనుకున్నాడో దానిని సాధించితీరతాడు.
‘ధృతి’ అంటే పట్టుదల, నిర్ణయం అని చెప్పుకున్నాం గదా! ఏవిధమైన ముందు నిర్ణయం లేకుండా చేసే ప్రయాణం గమ్యాన్ని చేర్చదు. బాటసారిలాగా నడుస్తుంటాడు. అంతే. గమ్యానికి చేరడానికి నడవాలి తప్ప నడవడం కోసం నడవకూడదు. నీవు జీవితంలో ఏం చేద్దామకుంటున్నావ్ ! ఏమవ్వాలకుంటున్నావ్ ! అది గమ్యం. ఆ గమ్యాన్ని చేరడానికి, ఆ నిర్ణయాన్ని సాధించుకోవడానికి పట్టుదలతో నడవాలి. అలా పట్టుదలతో నడిచే ప్రయాణాన్ని ధైర్యం అని పిలుస్తాం.
నిర్భయత్వం, ధైర్యం అని రెండుమాటలున్నాయి. వీటిని జాగత్తగా పరిశీలించండి. నిర్భయత్వం ధైర్యం కాదా? ఆయనకు భయంలేదు’ అన్నాననుకోండి. అంటే ధైర్యం ఉన్నట్లా? ధైర్యంగా ఉన్నాడు’ అన్నాననుకోండి. భయం లేకుండా ఉన్నాడనేనా? ఈ రెండూ ఒకటే అయితే, మరి శాస్త్రంలో రెండింటినీ విడివిడిగా ఎందుకు చెప్పినట్లు?
ఆయన ధైర్యంగా ఉన్నాడు’ అంటే దాని అర్థం... ఆరోగ్యవంతమైన భయం కలిగి ఉన్నాడని. దానిలో మళ్ళీ రెండుంటాయి. హృదయవ్యవస్థలోని రక్తంలో మంచి కొలెస్టరాల్, చెడు కొలెస్టరాల్లాగా ఒకటి పాడు చేస్తుంది, మరొకటి బాగు చేస్తుంది. ఏది మనిషిని బాగు చేస్తుందో ఆ భయం ఉండాలి. ఏది పాడు చేస్తుందో దానిని బయటికి వ్యక్తం చేయకూడదు.ధైర్యం అంటే - ఏది బాగుచేస్తుందో అది దగ్గర ఉన్నవాడు, ఏది పాడు చేస్తుందో అది దగ్గర లేనివాడు-అని.
నేను చాలా ధైర్యంగా ఉంటానండీ, ఏ పనైనా చేస్తా’’ అంటే దానర్థం - చెయ్యవద్దన్న పనిచేస్తాడని కాదు. ఉదాహరణకు ఒక విద్యార్థిగా కళాశాలలో ప్రవేశించి ఒక పిల్ల చెయ్యకూడని పనిచేసింది, దొంగతనం చేసింది. ఆ దోషానికి తిట్టవలసిన అవసరం ఉన్నా, ఆ పిల్ల జీవితంలో ఎందుకూ పనికిరాదని నిర్ధారించడం కుదరదు. దోషాన్ని సంస్కరించవలసి ఉంటుంది. దోషం లేకుండా ఎవరుంటారు? అసలు దోషం లేకుండా ఈ ప్రపంచాన్ని సిద్ధం చేశారనుకోండి. అప్పుడు ఈ ప్రపంచానికి నీవు అక్కరలేదు, శాస్త్రమూ అక్కరలేదు. అందరికీ ఇన్ని మంచి మాటలు చెప్పే నేను నా చిన్నతనంలో తెలియక దోషభూయిష్టంగా ప్రవర్తించాను. అంతమాత్రంచేత నేను సమాజంలో పనికిమాలిన వాడినికాదు.
దోషాన్ని గుప్తంగా సంస్కరించాలి. గుణాన్ని సభాముఖంగా స్వీకరించాలి. ఎందుచేత? అది ఆదర్శం. వైద్యం గుప్తం, జ్యోతిష్యం గుప్తం. అవి ఒక్కరికే తెలియాలి. మరొకరికి తెలియాల్సిన అవసరం లేదు. అందుకే డాక్టర్ వైద్యాన్ని సభాముఖంగా చేయడు. ఒక్కొక్కరిని పిలిచి చేస్తాడు. దోషాన్ని గుప్తంగా సంస్కరిస్తాడు. ఉపన్యాసం చెప్పేటప్పుడో... అది ఒక్కొక్కరిని కూర్చో పెట్టుకుని చెప్పకూడదు. అందరికీ కలిపి చెప్పాలి.
ఉపన్యాసం వర్షం లాంటిది.
నిర్భయత్వం, ధైర్యం... ఈ రెండింటికీ మధ్యన ఉన్నది ఆరోగ్యవంతమైన భయం. మీరు చదువుకుంటున్నారు. వృద్ధిలోకి వ స్తున్న విద్యార్థులు. రేపు మీరు పెద్దపెద్ద పదవుల్లోకి వెడతారు. కానీ అప్పుడు కూడా మీకు మీ నాన్నగారంటే భయం. అంటే మీనాన్నగారు మిమ్మల్ని ఏదో చేసేస్తారని కాదు కదా! మా నాన్నగారలా చేయొద్దన్నారు. అందుకని నేనది చేయను. చేస్తే ఆయన బాధపడతారు. ఆయన అంగీకరించరు. ఆయనకు ఇష్టం ఉండదు. ఎందుకంటే అది నా అభ్యున్నతికి కారణం కాదని మా నాన్నగారు తిడతా. అందుకే నేనటువంటి పని చేయను’’ అంటారు. ఇప్పుడు చెప్పండి మీది పిరికితనమనాల్సి ఉంటుందా లేక ఆరోగ్యవంతమైన భయం అనాల్సి ఉంటుందా!
జీవించి ఉన్నంతకాలం ఈ ఆరోగ్యవంతమైన భయం కలిగి ఉండాలి. అందుకే చావుపట్ల భయం, తండ్రిపట్ల భయం. తల్లిపట్ల భయం. మీ లెక్చరర్ అంటే మీకు భయం, గౌరవం. ఆయన వద్దన్న పని చేయరు. దానిలో ఉన్న విశేషణ మేమిటంటే... వారెప్పుడూ మీ అభ్యున్నతినే కోరుకుంటుంటారు. ఏ కారణం చేతకూడా మీరు ఓడిపోవడాన్ని వారు అంగీకరించరు. మీరు వృద్ధిలోకి రావాలని సదా ఆకాంక్షిస్తుంటారు. మీ శక్తికి తగిన మాటలే చెబుతారు. శక్తికి మించినవి మీకు చెప్పి వాటి ఆచరణలో మీరు చతికిలపడితే వైఫల్యం చెందుతారనీ, వైఫల్యం చెందితే మీరింక లేవలేరని వారి ఆందోళన. అలా ఎందుకు? వారు మీ అభ్యున్నతిని కోరుకుంటున్నారు కాబట్టి. తల్లిదండ్రులు బిడ్డలకోసం ఏత్యాగమైనా చేస్తారు. వారు ఒక వయసు వరకు కీర్తిగా బతకాలనుకుని తాపత్రయపడతారు. అది దాటిన తరువాత నా కొడుకు కీర్తివంతుడై బతకాలని ఆశిస్తారు.
ఈ ఆరోగ్యవంతమైన భయాన్ని విస్మరించడం అత్యంత ప్రమాదకరమైన లక్షణం. దీన్ని విడిచిపెట్టకుండా ఉండడంలోనే సంస్కారం అన్నమాటకు అర్థం ఉంది. మా నాన్నగారు నాకు చెప్పేదేమిటండీ, ఇంత వయసు వచ్చింది నాకు ఆమాత్రం తెలియదా’’ అని స్వతంత్రించడం ప్రమాదహేతువే. దాని ఫలితం తెలిసిన తర్వాత దాన్ని దిద్దుకోలేరు. ‘‘అదే మా నాన్నగారు నన్ను కన్నారు, పెంచి పెద్దచే శారు, చదువుచెప్పించారు, ఏ కాలేజయితే బాగుంటుందని పదిమందిని అడిగి నిర్ణయించారు, వారు సుఖంగా, సంతోషంగా బతకడం మాని డబ్బు దాచి నా ఫీజు కట్టారు.. అనారోగ్యంగా ఉన్నా పెద్ద ఆస్పత్రులకు వెళ్ళకుండా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటున్నారు, అటువంటి వారేది చెప్పినా నా అభ్యున్నతి కోసమే చెప్తారు’’ అని అన్నారకోండి. అదీ ఆరోగ్యకరమైన భయం అంటే.
జీవితంలో మీ ఒక వ్యక్తిని ఆదర్శంగా స్వీకరించండి. అలా స్వీకరించ లేదనుకోండి, మీకు మార్గదర్శనం లభించదు. అస్తమానం మీకు ఇది మంచి, ఇది చెడు, ఇదిలా చెయ్యి ఇదిలా వద్దు అని చెప్పేవాళ్ళు ఎవరూ ఉండరు. కానీ ఒక వ్యక్తిని ఆదర్శంగా తీసుకున్ననాడు మీ మనసు ఆయనకు వినబడాలి. మీరు ఆయన జీవితాన్ని బాగా అధ్యయనం చేసి వాళ్ళ జీవితాలు కూడా చాలా కష్టపడితే తప్ప మహాత్ములు కాలేదన్న విషయాన్ని గుర్తించాలి. వాళ్ళేమీ తెల్లవారేటప్పటికి మహాత్ములు కాలేదు. వాళ్ళ జీవితాలేమీ పూల పాన్పులు కావు.
ఎంతో కష్టపడి వృద్ధిలోకి వచ్చినవాడు మాత్రమే లోకానికి దార్శనికంగా నిలబడతాడు. జీవితంలో ఎన్నో కష్టాలు పడి వచ్చి వాటిని దాచకుండా చెబుతూ మీరు ఇలా బతకవలసి ఉంటుందని చెప్పగలిగినవాడు మాత్రమే మీకు ఉపకారం చేయగలడు. అందుకే మీకొక రోల్ మోడల్ ఉండాలని, మీరు ఒకరిని ఆదర్శంగా తీసుకోండని అంటుంటారు. మీరలా ఒక కట్టుబాటుకు వశపడడం అనేది మీకు రాలేదనుకోండి. అది రాకపోతే మీ అభ్యున్నతి అక్కడితో ఆగిపోతుంది.
ఆయన ైధైర్యంగా ఉన్నాడు’ అంటే దాని అర్థం... ఆరోగ్యవంతమైన భయం కలిగి ఉన్నాడని. దానిలో మళ్ళీ రెండుంటాయి. హృదయవ్యవస్థలోని రక్తంలో మంచి కొలెస్టరాల్, చెడు కొలెస్టరాల్లాగా ఒకటి పాడు చేస్తుంది, మరొకటి బాగు చేస్తుంది. ఏది మనిషిని బాగు చేస్తుందో ఆ భయం ఉండాలి. ఏది పాడు చేస్తుందో దానిని బయటికి వ్యక్తం చేయకూడదు.ధైర్యం అంటే - ఏది బాగుచేస్తుందో అది దగ్గర ఉన్నవాడు, ఏది పాడు చేస్తుందో అది దగ్గర లేనివాడు-అని. నేను చాలా ధైర్యంగా ఉంటానండీ,ఏ పనైనా చేస్తా’’ అంటే దానర్థం - చెయ్యవద్దన్న పనిచేస్తాడని కాదు.