అమ్మాయి కాదు... బొమ్మాయి!
‘‘అందాల చిన్నది... ఆహ్వానించుచున్నది’’అంటూ సరదాపడిపోయారు ఆ డిపార్ట్‌మెంట్ స్టోర్స్‌కు వచ్చిన కస్టమర్లు. అయితే ఆ ఆహ్వానంలో ‘ప్రాణం’ లేదని తెలిసి ‘హా’శ్చర్యపోయారు. జపాన్ రాజధాని నగరం టోక్యోలో మిట్సుకుషి నిహోంబషి డిపార్ట్‌మెంట్ స్టోర్స్‌కు ఇటీవల కొత్త రిసెప్షనిస్ట్ వచ్చింది. కస్టమర్లను అందంగా విష్ చేస్తూ వయ్యారంగా వెల్‌కమ్ చెబుతూ అవసరమైన సమాచారాన్ని కూడా చకచకా అందిస్తోంది.
ఆ చిన్నదాని హుషారు చూసి ‘‘ఎవరీ ముద్దుగుమ్మ? అలసటెరుగని చక్కనమ్మ?’’అని సతమతమైన కస్టమర్ల సందేహాలు కాసేపటిలోనే నివృత్తి అయిపోయాయి. తమకు ఇష్టురాలైపోయిన ఆ రిసెప్షనిస్ట్ నిజంగా అందాల ‘బొమ్మే’నని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ‘‘అయికో చిహిరా’అనే పేరుతో రిసెప్షనిస్ట్‌గా ఆండ్రాయిడ్ మీద పనిచేసే ఒక రోబోను ప్రవేశపెట్టి అందర్నీ ఆకట్టుకుందీ డిపార్ట్‌మెంట్ స్టోర్స్. ఆ రోబోను ఒసాకా యూనివర్సిటీ ఇంటెలిజెంట్ రోబోటిక్స్ లేబరేటరీలో అభివృద్ధి చేశారట.