బంగారు సింగారాలు... రోజ్ గోల్డ్ నగలు
నగలనగానే అందరికీ పచ్చగా మెరిసే బంగారు ఆభరణాలే గుర్తొస్తాయి. అసలు బంగారాన్ని పోల్చేది పసిమి ఛాయతోటే. అయితే ఇప్పుడలా ఊహించలేం ఎందుకంటే రోజ్ గోల్డ్ అని కొత్త బంగారం వచ్చేసింది. రోజ్‌కలర్‌లో మెరిసిపోయే బంగారు ఆభరణాలే ఇప్పుడు మార్కెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. మేలిమి బంగారం అంటే 24 క్యారెట్ల స్వచ్ఛత గల బంగారం. చాలా మృదువుగా ఉండటం వల్ల అందులో కొద్దిపాళ్లలో రాగి కలపనిదే నగలు చేయడానికి పనికి రాదు. ఆ కొద్దిపాళ్లూ కలిపితే 22 క్యారెట్ల బంగారమంటారు. అలా కాకుండా మరికాస్త రాగి, దాంతోబాటే మరికొన్ని ఇతర లోహాలను కూడా కలిపి, బంగారానికి రోజ్ కలర్ వచ్చేలా చేస్తారు. నిజానికి రోజ్‌గోల్డ్ అనేది ఇప్పటి ముచ్చట కాదు... కొన్ని దశాబ్దాలుగా ఉన్నదే. కాకపోతే ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.
మామూలు బంగారు నగలను సంప్రదాయ సిద్ధంగా వాడతారు కానీ, రోజ్ గోల్డ్ నగలను మాత్రం చాలా ఫ్యాషనబుల్‌గా వాడతారు. ముఖ్యంగా డైమండ్స్‌తో కలిపి చేసే నగలకు రోజ్‌గోల్డ్ బాగా నప్పుతుంది. మామూలు బంగారంతో పోలిస్తే రోజ్‌గోల్డ్ కొంచెం దృఢంగా ఉంటుంది కాబట్టి, దానితో మరింత వైవిధ్యభరితమైన ఆభరణాలను తయారు చేయవచ్చు. యాక్సెసరీస్ అయితే మరీనూ. వాచీలు, బ్రేస్‌లెట్లు, బ్యాంగిల్స్, నెక్‌లెస్‌లు, చెవి రింగులు, వంకీలు... ఇలా ఏవిధంగా కావాలంటే ఆ విధంగా రూపొందించవచ్చు రోజ్‌గోల్డ్‌ను.
పాశ్చాత్యదేశాల్లో అయితే రోజ్‌గోల్డ్‌తో డిజైన్ చేసిన రకరకాల ఆభరణాలను పురుషులే ఎక్కువగా వాడటం విశేషం. సాధారణంగా ఆధునికంగా కనిపించాలనుకునేవారు బంగారు ఆభరణాలను వాడటం చాలా అరుదు. రోజ్‌గోల్డ్‌తో ఆ చిక్కేమీ లేదు. మామూలు గృహిణులు, వైద్యులు, కాలేజీ స్టూడెంట్లు, నవనాగరిక వస్త్రధారణలో కనిపించాలని కోరుకునేవారికి కూడా రోజ్‌గోల్డ్ నగలు, డిజైన్లు బాగా నప్పుతాయి. పచ్చగా మెరిసిపోయే బంగారు నగలతో పోల్చితే రోజ్‌గోల్డ్ నగలు, యాక్సెసరీస్‌ను ధరించడం వల్ల ప్రయాణాల్లో దొంగల భయం కూడా తక్కువే. ఇంకేంటి... రోజ్‌గోల్డ్ నగల్లోకి మారిపోవాలనుందా మరి.. అయితే అందుకోసం మనం మరికొద్దికాలం వేచిచూడక తప్పదు.