గులాబీ గోల్డ్
అలంకరణపరంగా కావొచ్చు.. ఇన్వెస్ట్‌మెంట్‌పరంగా కావొచ్చు బంగారానికి ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. పసిడి అనగానే పచ్చని పసుపు వర్ణం కళ్లముందు కదలాడుతుంది. పత్తిని తెల్లబంగారం, బొగ్గును నల్లబంగారం అంటూ వ్యవహరిస్తున్నా..సిసలైన బంగారం విషయానికొస్తే పసుపు రంగేనని ఫిక్సయి ఉంటాం.
శతాబ్దాలుగా ఈ ఎల్లో గోల్డ్‌కే డిమాండ్ ఎక్కువగా ఉన్నా.. బంగారంలోనూ రకరకాల వర్ణాలు అందుబాటులోకి వస్తున్నాయి. తెలుపు, ఊదా, గులాబీ తదితర రంగుల్లోనూ పుత్తడి లభిస్తోంది. వివిధ రకాల లోహాలను బంగారానికి జోడించడం ద్వారా ఈ రంగులు వస్తాయి. పసిడికి పల్లాడియం లేదా వెండిని కలపడం వల్ల వైట్ గోల్డ్ వస్తుంది.
దీనికి రోడియం పూత పూయడం వల్ల మరింత మెరుపు వస్తుంది. అమెరికాలో వివాహాది శుభకార్యాల్లో వైట్‌గోల్డ్‌కి బాగానే డిమాండ్ ఉంటోంది. ఇక, పసిడిపై పూతగా వివిధ రకాల ఆక్సైడ్‌లు కలపడం ద్వారా గులాబీ, ఊదా, పర్పుల్ వంటి అసాధారణ రంగుల్లో బంగారం ఆభరణాలను తయారు చేస్తున్నారు.