
ధర వినగానే గుండె గుభిల్లుమనే ఉంటుంది. కళ్లు పెద్దవి చేసుకొని ఎందుకు ఇంత ధర అని వెతికే క్రమంలో పడే ఉంటారు. అంతర్జాతీయ మార్కెట్‌లో మన దేశఖ్యాతిని పెంచిన జాబితాలో తాజాగా ఈ కెంపుల సెట్ కూడా చేరింది. ఈ కెంపుల వెనుక కథేంటి, ఆ ఖరీదు విశేషమేంటో తెలుసుకుందామనే ఆసక్తీ మొదలైందంటే ఈ న్యూస్ మీ కోసమే! అంతర్జాతీయ వజ్రాభరణాల డిజైనర్‌గా పేరొందిన నీరవ్‌మోడి ఓ కెంపుల నెక్లెస్, చెవి పోగులు, బ్రేస్‌లెట్ రూపొందించాడు. వీటి ధర అక్షరాలా 105 కోట్ల రూపాయలు. ఈ సెట్‌లో మొత్తం 27 కెంపులు పొదిగారు. ఈ విలువైన కెంపులను మయన్మార్‌లోని మొగక్ మైన్స్ నుంచి సేకరించారట.
కెంపుల చుట్టూ ఖరీదైన ఫైన్ కట్ వజ్రాలను పొదిగారు. ఈ సెట్‌లో వాడిన కెంపులను ఈ దశకు తీసుకు రావడానికి ఐదేళ్లు పట్టిందట. తర్వాత డిజైన్ గీసుకొని, ఆభరణంగా తయారు చేయడానికి ముంబైలోని మోడీ, అతని బృందానికి మరో రెండేళ్లు పట్టిందట. అన్ని కోట్ల విలువైన ఆభరణాన్ని చేజిక్కించుకునే అదృష్టం ఎవరికి దక్కనుందో! మూడేళ్ల క్రితం న్యూ ఢిల్లీలో సొంతంగా ఆభరణాల షాప్‌ను ప్రారంభించిన నీరవ్‌మోడీకి దేశవ్యాప్తంగా ఇప్పుడు 15 స్టోర్స్ ఉన్నాయి. మోడీ చేతిలో రూపుదిద్దుకున్న ప్రతీ ఒక్క ఆభరణం ఒక మోడల్ పీస్‌లా ఉంటుంది. ప్రారంభ ధర రెండు లక్షల రూపాయల నుంచి 105 కోట్లు పెట్టి కొనుగోలు చేసే ఆభరణాలూ ఇతని స్టోర్‌లో ఉన్నాయన్నమాట.
Comments
Please login to add a commentAdd a comment