అనాథలకు ఆధార్‌ సాగర్‌ | Sagar Anathashrama Ekta Niradhar Sangh | Sakshi
Sakshi News home page

అనాథలకు ఆధార్‌ సాగర్‌

Published Sat, Jun 17 2017 11:45 PM | Last Updated on Tue, Sep 5 2017 1:52 PM

అనాథలకు ఆధార్‌ సాగర్‌

అనాథలకు ఆధార్‌ సాగర్‌

సాగర్‌ తనకు ఊహ తెలిసేటప్పటికే మహారాష్ట్ర, లోనావాలాలోని అంతర్‌ భారతి బాలాశ్రమంలో ఉన్నాడు. తాత అప్పుడప్పుడూ వచ్చి చూసి వెళ్లేవాడు. ఆ తర్వాత తాత కాలం చేశాడు. సాగర్‌కు 18 ఏళ్లు వచ్చాయి. అనాథాశ్రమం నుంచి బయటికి అడుగుపెట్టక తప్పలేదు. బయట ప్రపంచంలో ఇమడలేక ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అలాంటి వ్యక్తి నేడు నవీ ముంబయిలోని వాషిలో ‘ఏక్‌తా నిరాధార్‌ సంఘ్‌’ను స్థాపించి వందల మందికి ఆశ్రయమివ్వడంతోపాటు అనాథల హక్కుల కోసం పోరాడుతున్నారు.

హైదరాబాద్‌కు చెందిన వెంకటేష్‌ రెడ్డి, ఉద్యోగం కోసం మహారాష్ట్రకు వలస వెళ్లాడు. అక్కడ చెందిన పౌర్ణిమ కాలే అనే క్రిస్టియన్‌ యువతిని ప్రేమించాడు. పెద్దలు అంగీకరించకపోవడంతో ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నాడు. పెద్దలకు భయపడ్డ వెంకటేష్‌ రాయిగడ్‌ జిల్లాలో భార్యతో గుట్టుగా నివసించసాగాడు. వారికి 1986 మార్చి 20న సాగర్‌ రెడ్డి పుట్టాడు. రెండేళ్లకు వీళ్ల ఆచూకీ తెలుసుకున్న వెంకటేశ్‌ తరఫు వాళ్లు ఆ దంపతులను దారుణంగా చంపేశారు. అప్పటికి సాగర్‌ ఏడాది పిల్లాడు. ఆ పసివాడి ప్రాణాలు కూడా తీస్తారేమోనన్న భయంతో అతడి తాత (తల్లి తండ్రి) డేవిడ్‌ కాలే, సాగర్‌ని అనాథాశ్రమంలో చేర్పించారు. సాగర్‌ అక్కడే టెన్త్‌ పూర్తి చేశాడు. ఆ తర్వాత అతడిని 2001లో ముంబై చెంబూరులోని ఆదిత్య బిర్లా సెంటర్‌ అనా«థాశ్రమానికి మార్చారు. 2003లో సాగర్‌కి 18 ఏళ్లు నిండడంతో ప్రభుత్వ నియమాల ప్రకారం అనాథాశ్రమం నుంచి బయటపడ్డాడు.

ఎటు వెళ్లాలో తెలీక...
గమ్యం తెలియని ప్రయాణాన్ని ఎలా మొదలుపెట్టాలో కూడా తెలియని అయోమయంలో ఏ దారీ కన్పించక మూడు సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. నిస్సహాయ స్థితిలో ఉన్న అతనికి ఓ వ్యక్తి ఇంజినీరింగ్‌ చదవడానికి సహాయం చేశారు. ఇంజినీరింగ్‌ అయ్యాక ‘ఎల్‌ అండ్‌ టి’లో ఉద్యోగం లభించింది. ఎవరైనా అక్కడితో రిలాక్స్‌ అవుతారు. సాగర్‌ అక్కడి నుంచే తన అసలు జీవితాన్ని ప్రారంభించాడు.

అనాథల హక్కుల కోసం...
అనాథలకు ప్రభుత్వం, దాతలు ఎవరో ఒకరు అన్నం పెడుతున్నారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్లకు ఒక ఉనికి ఉండడం లేదు. ఆ ఉనికికి ఒక వేదిక ఏర్పాటు చేయాలనుకున్నాడు. 2010లో ‘ఏక్‌తా నిరాధార్‌ సంఘ్‌’ను స్థాపించాడు. అనాథలను చేరదీయడంతోపాటు వారికి ఆధార్‌ వంటి గుర్తింపు కార్డులు ఇప్పించే పనులు చేస్తున్నాడు. ఈ ఆరేళ్లలో ఏక్‌తా నిరాధార్‌ సంఘ్‌ 250 మంది పిల్లలకు ఆశ్రయం ఇచ్చింది. అతను చేస్తున్న పోరాటాన్ని చూసి అనేకమంది సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. 18 ఏళ్లు నిండి ఆశ్రమం వదిలి బయటకు వెళ్లాల్సిన వాళ్ల కోసం జాబ్‌ మేళాలు పెట్టిస్తున్నారు. సామూహిక వివాహాలు చేస్తున్నారు. తన ఆశ్రమంలో ఉన్న అనాథ పిల్లలను... మంచినీరు లేని గ్రామాలకు నీటి సరఫరా చేయడం వంటి సామాజిక కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తున్నారు.

సేవకు సత్కారం...
సాగర్‌ రెడ్డికి అనేక అవార్డులు లభించాయి. ముఖ్యంగా మరాఠీ న్యూస్‌ చానెళ్లు ఏబీపి మాజా ‘బెస్ట్‌ సింగిల్‌ ఫాదర్‌’ అవార్డుతో సత్కరించాయి. ఇప్పటివరకు ఈ అవార్డు అందుకున్న వారందరిలోనూ వయసులో చిన్నవాడు సాగర్‌. అతడిని ఐబీఎన్‌ ఇండియన్‌ పాజిటివ్‌ యంగ్‌గా గుర్తింపు నిచ్చింది. కర్ణాటక ప్రభుత్వం పౌర సన్మానం చేసింది. – గుండారపు శ్రీనివాస్‌ సాక్షి, ముంబయి

గుర్తింపు కార్డు కోసమే...   
సొసైటీలో అనా«థలకు ఎలాంటి గుర్తింపూ ఉండడం లేదు. చివరికి తీవ్రవాదులకు కూడా ఏదో ఓ దేశ పౌరసత్వం ఉంటుంది. కాని అనాథలమైన మాకు ఈ దేశపౌరులమని చెప్పేందుకు ఎలాంటి అధికారిక ఆధారాలులేవు. బ్యాంకు ఖాతా తెరవాలంటే ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు తదితరాలు దొరకడం చాలా కష్టం. ఓటరుగా గుర్తింపు లేదు. ఎవరో చేసిన తప్పుకు వీరు జీవితాంతం శిక్షను అనుభవిస్తూనే ఉండాలి. నిరాశ్రయులు, అనా«థలకు నీడనిచ్చేందుకు దేశంలో వేలాది స్వచ్ఛంద సంస్థలున్నాయి. కానీ 18 ఏళ్ల తర్వాత ఎక్కడికి వెళ్తారు..? చాలామంది అబ్బాయిలు దొంగతనాలు, సంఘవిద్రోహ కార్యక్రమాలవైపు మళ్లుతున్నారు. అమ్మాయిలను బలవంతంగా వ్యభిచారంలోకి దించుతున్నారు. అందుకే నేను... నాలాంటి వారి కోసమే ఈ సంస్థను ఏర్పాటు చేశాను. ప్రభుత్వ ప్రైవేట్‌ సంస్థల ఉద్యోగాల్లో, పై చదువుల కోసం ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించడంతోపాటు ఆధార్, రేషన్, ఓటరు కార్డులను అనాథలకు కూడా జారీ చేయాలి.
– సాగర్‌ రెడ్డి బెస్ట్‌ సింగిల్‌ ఫాదర్‌ అవార్డు గ్రహీత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement