వారసదాసు
- లక్కింశెట్టి శ్రీనివాసరావు, ‘సాక్షి’, కాకినాడ
భారతదేశం సంస్కృతీ సంప్రదాయాలకు నిలయం. ఎన్నో కళలు కాలగర్భంలో కలిసిపోతున్న నేటి తరుణంలో సంక్రాంతి వేళ చాలా ఊళ్లలో హరిదాసులే కానరావటం లేదు. అయితే ప్రస్తుత ఆధునిక పోకడల నడుమ ఒక యువకుడు తన కుటుంబ సంప్రదాయాన్ని గౌరవిస్తూ హరిదాసుగా గ్రామాల్లో హరినామ సంకీర్తన చేస్తున్నాడు. తాత, తండ్రుల నుంచి వచ్చిన సంప్రదాయాన్ని కొనసాగించాలని తపిస్తున్నాడు. పదవ తరగతి పూర్తయిన వెంటనే ఇంటర్‌లో చేరి, తర్వాత ఇంజనీరో, డాక్టరో కావాలనుకుంటున్న నేటి తరంలో ఇలా అంతరించిపోతున్న కళ కు ప్రాణం పోసి ఆ కళనే వృత్తిగా స్వీకరించిన ఆ యువకుడి పేరు దుర్గాప్రసాద్.
రాయవరం మండలం పసలపూడికి చెందిన కంబం దుర్గాప్రసాద్ కుటుంబీకులు వంశపారంపర్యంగా హరిదాసు వృత్తిలో ఉన్నారు. తండ్రి నూకరాజు తూర్పుగోదావరి జిల్లాలోని మండపేట ప్రాంతంలో హరిదాసుగా వెళుతుండగా, తాత గనిరాజు గత నలభై ఏళ్లుగా అదే జిల్లాలోని మండల కేంద్రమైన కె. గంగవరం, దంగేరు ప్రాంతంలో సంక్రాంతి నెలలో హరిదాసుగా పాటలు పాడుతూ వచ్చారు. సంక్రాంతి నెలరోజుల పాటు హరిదాసులుగా వచ్చే ఈ కుటుంబ సభ్యులు మిగిలిన రోజుల్లో వ్యవసాయపనులు చేసుకుంటుంటారు. గనిరాజుకు వృద్ధాప్యం రావటంతో కూతురు కొడుకైన దుర్గాప్రసాద్ ఈ వృత్తిని చేపట్టి సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాడు. సంక్రాంతి నెల అంతా కె.గంగవరంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడే ఉంటున్నాడు. ఉదయం ఐదు గంటల ప్రాంతంలో బయలు దేరి కె.గంగవరం, దంగేరు చుట్టు పక్కల పదహారు గ్రామాల్లో హరి కీర్తనలు పాడుతూ తిరుగుతుంటాడు.
గ్రామస్తులు తమకు తోచిన కానుకలు, బియ్యం సమర్పిస్తుంటారు. ఇలా నెలలో ముప్పై రోజులు తిరిగిన అనంతరం సంక్రాంతి నాడు ఆయా గ్రామాల్లో ప్రతి ఇంటికీ వెళ్లి వారిచ్చే కానుకలను స్వీకరిస్తాడు. పదవ తరగతి పూర్తి చేసిన దుర్గాప్రసాద్ మూడేళ్లపాటు తన తండ్రి కూడా తిరుగుతూ హరినామ సంకీర్తనలు నేర్చుకున్నాడు. ఈ ఏడాది కె.గంగవరం, దంగేరు పరిసర గ్రామాల్లో హరిదాసుగా తన సంకీర్తనలు వినిపిస్తున్నాడు. 21 ఏళ్ల దుర్గాప్రసాద్‌కు భార్య సీత, ఆరు నెలల కుమారుడు ఉన్నారు. తాతల నాటి నుంచి వస్తున్న ఈ వృత్తిని కొనసాగించాలనే ధ్యేయంతోనే హరినామ సంకీర్తనలు నేర్చుకుని హరిదాసుగా మారానని దుర్గాప్రసాద్ చెప్పాడు.