కానుకల కాలం
క్రిస్మస్ వచ్చిందంటే కానుకల కాలం వచ్చినట్టే. శాంటాక్లాస్ అనే గ్రీకు బిషప్ 4వ శతాబ్దంలో ఏ ముహూర్తాన ఈ కానుకల పర్వం మొదలెట్టాడోగాని అప్పటి నుంచి ఇప్పటి వరకు అది అప్రతిహతంగా సాగిపోతూనే ఉంది. ‘అల్లరి చేయకుండా బుద్ధిగా ఉండే పిల్లలకు మాత్రమే’ వాస్తవానికి ఈ బహుమతులు అందాలని క్రిస్మస్ తాత మొదట అనుకున్నాడు. అలా చెప్పడం వల్ల పిల్లలు అల్లరి చేయకుండా బుద్ధిగా ఉండి, ఆ కానుకల కోసం ఎదురు చూడటంలో ఒక ఉత్సుకత ఉండేది. కాని అల్లరి చేయని పిల్లలు ఎవరు? బుద్ధి ఉండని పిల్లలు ఎవరు? అసలు పిల్లలంటే మంచి పిల్లలు అని కదా అర్థం. అందుకే శాంటా క్లాస్ అందరికీ బహుమతులు ఇచ్చేవాడు.
ఆయన పేరు చెప్పి పిల్లలున్న తల్లితండ్రులు తమ పిల్లల దిండ్ల కింద డిసెంబర్ 24 రాత్రి, లేదంటే 25 తెల్లవారుజామున కానుకలు ఉంచేవారు. రానురాను ఈ పద్ధతి విస్తృతి పెంచుకుంది. అనాధ పిల్లలకూ, అన్నార్తులకూ క్రిస్మస్ రోజున దాతలు కానుకలు పంపిణీ చేయడం మొదలెట్టారు. పై ఫొటోలో ఉన్నది అలాంటి క్రిస్మస్ తాతలే. సౌత్ కొరియాలో సియోల్ నగరంలో దాదాపు యాభై మంది భిన్న రంగాల మిత్రులు క్రిస్మస్ తాతయ్యలుగా మారాలనుకున్నారు. మరి కానుకలు ఎవరికి ఇవ్వాలనుకున్నారో తెలుసా? నెలలు నిండక ముందే పుట్టిన పిల్లలకు ఇవ్వాలనుకున్నారు.
అలాంటి పట్టిక సేకరించి నగరంలోని నలుమూలల్లో ఉన్న నెలలు నిండక ముందే పుట్టిన పిల్లలకు క్రిస్మస్ కానుకలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఆరోగ్యంగా సమయానికి పుట్టిన పిల్లలు ఎలాగూ మంచి పిల్లలే. కాని ప్రిమెచ్యూర్ బేబీలకు ఏవో ఆరోగ్య సమస్యలు ఉండనే ఉంటాయి. వారిని కానుకలతో సంతోషపెట్టాలనుకోవడం ఎంత మంచి విషయం. ఎంత ఆనందాన్నిచ్చే సంగతి. అటు పంచినవారికీ. ఇటు పుచ్చుకున్నవారికీ