
కిషన్ సార్... అక్షరదీపాలను వెలిగిస్తున్న లక్ష్యసాధకుడు
హోరున వర్షం కురుస్తుంటే... కామేపల్లి మండలంలోని ప్రభుత్వపాఠశాలలన్నీ మూసేస్తారు. కాని ఒక ఉపాధ్యాయుడు మాత్రం స్కూల్‌కు వెళతారు. వెళుతూ వెళుతూ దారిలో కనపడిన పిల్లల్లో కొందరిని బుజ్జగించో, మరికొందరిని మందలించో... స్కూలుకు తీసుకుపోతారు. వానలోనే స్కూలు తెరిచి పాఠాలు మొదలుపెడతారు. ఆయన పాఠాలు చెప్పడం ప్రారంభించగానే వర్షం (విన)పడడం ఆగిపోతుంది. పిల్లలకు ఆయన పాఠం తప్ప మరేదీ వినపడదు. ఆయన కేవలం పాఠాలు చెప్పే మాస్టారు మాత్రమేనా... నడిచే... కాదు కాదు... ‘నడవలేని’ నిజజీవిత పాఠం కూడా.
ఖమ్మం నుంచి దాదాపు 25 కి.మీ దూరంలో కామేపల్లి మండలంలో ఉంది ఆ ఊరు. పేరు టేకుల తండా. పూర్తిగా గిరిజన గ్రామం అది. వేళ్ల మీద లెక్కపెట్టగలిగినంత మంది చదువుకున్నవారు లేని ఆ ఊరిలో ప్రస్తుతం రెండు పాఠశాలలు ఉన్నాయి. అందులో ఒకటి ప్రైమరీ పాఠశాల. ఆ స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్పే మాస్టారి పేరు సపావట్ కిషన్ (40). ఆ ఊర్లోనే తొలి డిగ్రీ విద్యార్థిగా... బి.ఏ. బి.ఇడి పూర్తి చేసి వీల్‌చైర్ మీద కూర్చునే... పిల్లలకు పాఠాలు బోధిస్తారు. నడవలేని ఆ మాస్టారు ఎందరో గిరిజన విద్యార్థుల భవితను ముందుకు నడిపిస్తున్నారు.
వైద్యుడు కాబోయి... రోగిగా...
‘‘మా అమ్మ పేరు జాంకిలి. నాన్న గోప్యా. నలుగురం అన్నదమ్ములం. మిగిలినవారిని వ్యవసాయానికి పరిమితం చేసినా కాస్త చదువుతున్నానని నన్ను మాత్రం నాన్న స్కూలుకు పంపాడు’’ అంటూ బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు కిషన్. తమ ఊరికి దాదాపు 5 కి.మీ దూరంలో ఉన్న పింజరమడుగు తండాకు చిన్నప్పుడు నడుచుకుంటూనే వెళ్లొచ్చేవాడు. దాదాపు 30కి.మీ దూరంలో ఉన్న మూల పోచారం, కిన్నెరసానిలలో హాస్టల్స్‌లో పాఠశాల విద్యాభ్యాసం పూర్తిచేశాడు.
ఆ తర్వాత కృష్ణసాగర్‌లోని ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్‌లో ఇంటర్‌లో... ఆడుతూ ఆడుతూ పడిపోయినప్పుడు తెలిసింది తనకు కండరాల క్షీణత (మస్క్యులర్ డిస్ట్రొఫీ) జబ్బుందని. అది అప్పటికే తన కాళ్లను చాలా బలహీనంగా మార్చిందని, స్వల్పకాలంలోనే తను పూర్తి అవిటివాడిని కానున్నానని కూడా తెలిసింది. ‘‘పెద్ద పెద్ద చదువులు చదవాలనే ఆశ, ఆధునిక వైద్యం అంటే తెలియని మా ఊరి వాళ్లకు డాక్టర్‌గా సేవలు అందించాలనే ఆశయం సిద్ధించే అవకాశం లేదని తెలిసినప్పుడు ఎంతగా కుమిలిపోయానో’’ అంటూ పాత జ్ఞాపకాలను నెమరేసుకున్నారు కిషన్.
కాళ్లు కదలకున్నా... నడుస్తూనే ఉన్నా...
కదలనని మొరాయిస్తున్న కాళ్లను కదిలించాలని చేసిన వైద్యపరమైన ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో కిషన్... డాక్టర్ కావాలనే ఆశల్ని వదిలేసుకున్నాడు. ఇంటి నుంచే డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ కట్టాడు. మరోవైపు తనలా చదువుకోవాలనే తపన ఉన్నవారికి కాస్తయినా సాయపడదామనే ఆలోచనతో ఇంటినే స్కూలుగా మార్చాడు. అలా 1994లో కేవలం నలుగురి తో ప్రారంభమైన ‘అక్షర నిలయం’ 140 మంది విద్యార్థులను అక్కున చేర్చుకునే స్థాయికి చేరింది. సోదరులు, తండ్రి, తెలిసినవారి సహకారంతో ఎటువంటి ఫీజులు లేకుండానే దాన్ని నిర్వహిస్తుంటే... 2000 సంవత్సరంలో ఆ గ్రామానికి వచ్చిన కలెక్టర్ ఎలాంటి ప్రభుత్వ సాయం లేకుండానే గ్రామంలో ఉచిత పాఠశాల నడుస్తున్న వైనం చూసి ఆశ్చర్యపోయారు.
అనంతరం కిషన్‌ను అభినందన పూర్వకంగా కలిసి, ఏవైనా సాయం కావాలా అని అడిగినప్పుడు... ‘‘వ్యక్తిగతంగా నాకేమీ వద్దు సార్... అవసరమైతే నాకున్న స్థలంలో 1000 గజాలను ఊరి కోసమే ఇచ్చేస్తాను. ఇక్కడో పాఠశాల మంజూరు చేయండి సార్’’ అంటూ కిషన్ ప్రాధేయపడ్డాడు. ఆ వినతికి కలెక్టర్ స్పందించారు. అలా కిషన్ చలవ వల్ల ఆ ఊరికి కేవలం విద్యాబుద్ధులే కాదు శాశ్వత ప్రభుత్వ పాఠశాల కూడా వచ్చింది. ఆ తర్వాత అదే స్కూల్‌కి కిషన్‌కి టీచర్ పోస్ట్ కూడా వచ్చింది. ఆ తర్వాత ఈ ఉపాధ్యాయుడు ఇక వెనుకడుగు వేయలేదు. ఊరివాళ్లని చదువూసంధ్యా లేకుండా ఊరికే ఉండనివ్వలేదు.
వీల్‌చైర్ అయితేనేం... విల్ ఉంటే...
అడుగు తీసి అడుగు వేయలేకపోయినా... ఆశించిన గమ్యం వైపు నడుస్తూనే ఉన్నారు కిషన్. పేరుకే ఆయన ప్రభుత్వ ఉపాధ్యాయుడు. కాని... ఆ ఊరిలో విద్యాదీప్తికి, ఊరిబాగుకు అవసరమైనవన్నీ చేస్తారు. దాదాపు ఏడేళ్లపాటు అనియత విద్యాకేంద్రం, నిరంతర విద్యాకేంద్ర వాలంటీర్‌గా సూపర్‌వైజర్‌గా పనిచేశారు. టేకులతండా, సూర్యాతండా, తాళ్ళగూడెం, గోపాలపురం గ్రామాలకు వెళ్లి సుమారు 800 మంది వయోజనులను అక్షర దీపం, అక్షర సంక్రాంతి కార్యక్రమాల ద్వారా నూటికి నూరు శాతం అక్షరాస్యత సాధన కోసం కృషి చేశారు. గ్రామ యువకులతో కలిసి సారా నిర్మూలన కార్యక్రమం, పరిశుభ్రత, ఆరోగ్యంపై ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వ్యవసాయ పనుల్లో పాలేర్లుగా ఉన్న 17 మంది బాలకార్మికులను బలవంతంగా జిల్లా కలెక్టర్ దగ్గరకు తీసుకెళ్లి హాస్టల్లో చేర్పించారు. వీరిలో పలువురు ప్రస్తుతం హాయిగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు.
2008 లో నిర్మల్ పురస్కార్ గ్రామం కింద ప్రభుత్వం ఇచ్చిన నిధులతో పాటు, స్వంతంగా కొన్ని నిధులు జమ చేసి గ్రామంలో 54 మరుగుదొడ్లు నిర్మించారు. క్రైస్తవ మిషన్ సహకారంతో గ్రామంలో చేతి బోరు ఏర్పాటు చేయించారు. గ్రంథాలయ నిర్మాణం కోసం తన ఒక నెల వేతనాన్ని అందజేశారు. సాక్షర భారత్‌లో 14 మంది మహిళలకు అక్షరజ్ఞానం కలిగిస్తున్నారు. ఇక నిరుపేద విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ చేస్తారు. ఇలా చేతనైనంతలో ఊరికోసం చేయగలిగినంతా చేస్తూ... కన్న ఊరుకు కాంతికిరణమయ్యారు.
‘‘నాకొచ్చే జీతంలో నుంచి ఏడాదికి రూ.25వేలు పూర్తిగా ఊరి మేలు కోసం చేసే సేవాకార్యక్రమాలకే వెచ్చిస్తాను. అంతమాత్రాన ఇదంతా నా గొప్పతనం మాత్రమే కాదు... ఎందరిదో సహాయం తోడ్పడుతోంది’’ అనే కిషన్... ‘‘కొత్తలో స్కూలు, చదువులు అంటూ బలవంతపెడుతున్నానని, బాలకార్మికులను పని మాన్పిస్తున్నానని మా ఇంటి మీదకి గొడవలకు కూడా వచ్చేవారు. అయితే అలాంటివారంతా ఇప్పుడు నాతో పాటు నేను చేసే కార్యక్రమాల్లో భాగం పంచుకుంటున్నారు’’ అని సంతోషం వ్యక్తం చేస్తారు. మనం ఒక మంచిపనిని మనస్ఫూర్తిగా తలపెడితే... ప్రపంచం తప్పనిసరిగా మనకు తోడవుతుంది. తలవంచుతుంది. మారుమూల ప్రాంతాలకు సనాపట్ కిషన్ లాంటి టీచర్లు... కేవలం చదువు చెప్పే గురువులు మాత్రమే కాదు చేయూతగా మారే స్ఫూర్తిప్రదాతలు కూడా.
- ఎస్.సత్యబాబు
పురస్కారాలెన్నో...
2000 సంవత్సరంలో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అక్షర దీపం ఉత్తమ వాలంటీర్‌గా కిషన్ అవార్డు తీసుకున్నారు. 1995లో వికలాంగుల సంక్షేమ శాఖ నుంచి ఉత్తమ వికలాంగ సేవా అవార్డు పొందాడు. మండల ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు (2004), జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును వరుసగా (2010 -13) మూడేళ్ల పాటు.. అందుకున్నారు. ఐటిడిఎ బెస్ట్ టీచర్ అవార్డునూ సొంతం చేసుకున్నారు.
చదువు కేవలం విద్య, ఉద్యోగాలకు మాత్రమే కాదు లోకజ్ఞానానికి కూడా. చదువులేక, పోషకాహారం మీద అవగాహన లేక... నేను కడుపులో ఉన్నప్పుడు మా అమ్మ సరైన ఆహారం తీసుకోలేదు. దాని ఫలితంగానే నా జీవితం ఇలా చక్రాల కుర్చీకి పరిమితమైంది. ఇలాంటి పరిస్థితి మరెవ్వరికీ రాకూడదు. సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే అన్ని సమస్యలకూ పరిష్కారం అనే నమ్మకంతో నేను ముందడుగు వేస్తున్నాను. మా ఊరిని నడిపిస్తున్నాను.
- సనాపట్ కిషన్, ఉపాధ్యాయుడు