చాలామంది భయపెట్టారు!
‘ఐ.డీ’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన గీతాంజలీ థాపా... తొలి సినిమాతోనే రెండు అంతర్జాతీయ అవార్డ్‌లు అందుకున్నారు. సిక్కింలో పుట్టి పెరిగిన గీతాంజలి కోల్‌కొతాలో గ్రాడ్యుయేషన్ చేశారు. 2007లో ‘మిస్ నార్త్ ఈస్ట్’ కిరీటాన్ని అందుకున్నారు. ఇటీవలే మన దేశం నుంచి ఆస్కార్ అవార్డ్ నామినేషన్‌కు ఎంట్రీగా ఎంపికైన ‘లయర్స్ డైస్’ చిత్రంలో నటనకు జాతీయ అవార్డు అందుకొని అందరి దృష్టినీ ఆకర్షించారు.
ఆమె చెప్పిన మాటల్లో కొన్ని...
* కోల్‌కతాలో చదువు పూర్తయిన తరువాత మోడలింగ్ చేశాను. నటనలో ఎలాంటి శిక్షణా తీసుకోలేదు. నటించాలనే కోరిక మాత్రం ఉండేది. దాంతో ముంబయిలో వాలిపోయాను. అదృష్టవశాత్తూ... కొందరు మంచి వ్యక్తులతో నాకు పరిచయం అయింది. వారే నన్ను కాస్టింగ్ డెరైక్టర్లకు పరిచయం చేశారు. అలా సినిమాల్లోకి వచ్చాను.
* బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాలనుకున్నప్పుడు, ప్రోత్సాహం మాట అలా ఉంచి ‘‘సిక్కింలాంటి ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లను చిన్న చూపు చూస్తారు’’ లాంటి మాటలతో చాలామంది భయపెట్టారు. నిరాశపరిచారు. మొదట్లో వాటి గురించి ఆలోచించినా, తరువాత మాత్రం పట్టించుకోలేదు.
* అదృష్టవశాత్తూ నేను ఎలాంటి వివక్షను ఇప్పటి వరకు ఎదుర్కోలేదు.
‘‘నువ్వు ఇండియన్‌లాగా కనిపించడం లేదు’’లాంటి విమర్శలు వినిపించినా నేను వాటిని సీరియస్‌గా తీసుకోలేదు.
* మంచి సినిమాలు చేయాలనుకుంటున్నాను. అది మెయిన్‌స్ట్రీమ్ కావచ్చు. ఇండిపెండెంట్ ఫిలిమ్స్ కావచ్చు. రెండిట్లో దేని ప్రాధాన్యం దానికి ఉంది. మొదటి తరహా సినిమాల్లో నటించినప్పుడు తక్కువ కాలంలో ఎక్కువ గుర్తింపు వస్తుంది. రెండో తరహాలో...కాస్త ఆలస్యమైనా గట్టి గుర్తింపే వస్తుంది. పైగా ఎంతోమంది ప్రతిభావంతులతో పని చేయడం వల్ల కొత్త విషయాలు తెలుస్తాయి.
- గీతాంజలీ థాపా, హీరోయిన్