
నౌకల మెటీరియల్‌తో సైకిల్
టెక్ టాక్
సైకిల్‌లా కనిపిస్తోంది గానీ.. చక్రాల్లో స్పోక్స్, హబ్ ఏవీ లేవు? అయినప్పటికీ ఇది సైకిలే! ప్రపంచంలోనే తొలి స్పోక్‌లెస్, హబ్‌లెస్ సైకిల్ ఇది. పేరు సైక్లోట్రాన్. చక్రాలను ముందుకు నడిపేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ సైకిల్ ఫ్రేమ్‌లోనే ఉన్నాయి. ఇదొక్కటే దీని ప్రత్యేకత కాదు. ముందుగా చెప్పుకోవాల్సింది దీని డిజైన్ గురించి. అంతరిక్ష నౌకల నిర్మాణానికి వాడే ప్రత్యేకమైన కార్బన్‌ఫైబర్‌తో తయారైన ఈ సైకిల్ బరువు కేవలం 11 కిలోలు మాత్రమే. అంతేకాకుండా మీరు ప్రయాణించిన దూరం, ఎత్తుపల్లాలు, జీపీఎస్ వంటి వివరాలు మీకు తెలిపేందుకు దీంట్లో పది సెన్సర్లను ఏర్పాటు చేశారు.
మొత్తం 18 గేర్లు ఉన్న సైక్రోట్రాన్‌లో విద్యుత్తుతో నడిచే మోడల్ కూడా ఉంది. సైకిల్ బాడీలోనే 36 వోల్టుల లిథియం అయాన్ బ్యాటరీలు, 500 వాట్ల బ్రష్‌లెస్ డీసీ విద్యుత్ మోటర్‌ను ఏర్పాటు చేస్తారు. అవసరమైతే దీన్ని మినీ రిక్షాగానూ మార్చుకోవచ్చు. సైక్రోట్రాన్‌ను వాణిజ్యస్థాయిలో ఉత్పత్తి చేసేందుకు ఓ అమెరికన్ సంస్థ కిక్‌స్టార్టర్‌లో ప్రచారం మొదలుపెట్టగా దాదాపు 132 మంది 1.4 లక్షల పౌండ్లు అందించి ఈ ఐడియాకు ఓకే చెప్పారు. అన్నీ సవ్యంగా సాగితే త్వరలోనే ఈ హైటెక్ సైకిల్ అందరికీ అందుబాటులోకి రానుంది.