అశోక వృక్షం... పేరును బట్టే అర్థం అవుతుంది కదా, దీని ప్రత్యేకత. ఈ చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ శోకం ఉండదు అంటారు. ఇది ఎక్కువగా శ్రీలంకలో, భారతదేశంలో పెరుగుతుంది. ఎత్తుగా, గుబురుగా పెరుగుతూ చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. దీని మొగ్గలు, పువ్వులు, కాయలు కూడా ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా ఉంటాయి. అసలు అశోక వృక్షం పేరు చెబితే సీతాదేవి గుర్తుకు రాకమానదు. కారణం సీతమ్మవారిని రావణుడు బంధించింది అశోకవనంలోనే.అందుకే ఆ తర్వాత కాలంలో అశోకకు సీతాశోక అనే పేరు వచ్చింది.
గౌతమ బుద్ధుడు లుంబినీ వనంలో అశోకవృక్షం కిందే జన్మించాడు. మహావీరుడు వైశాలీ నగరంలో అశోకవృక్షం కిందే సన్యాసాన్ని స్వీకరించాడు. హనుమంతుడు సీతాదేవిని అశోకవృక్షం కిందనే కనుగొన్నాడు. ప్రేమదేవుడు మన్మథుడి పూలబాణాలలో అశోకపుష్పాలు కూడా ఒకటి. వరలక్ష్మీ వ్రత కలశంలో ఉంచే పంచ పల్లవాలలో అశోక వృక్ష చివుళ్లు కూడా ఒకటి.
అశోకవృక్షం కింద కూర్చుని రామాయణ పారాయణ చేస్తే శోక నివారణ జరుగుతుందంటారు. ఉగాది పచ్చడిలో పూర్వం అశోక పుష్ప లేలేత మొగ్గలను, చివుళ్లను కూడా వాడేవారని ప్రాచీన గ్రంథాలను బట్టి తెలుస్తుంది. సంతానం కోరేవారు ఒక మంచి రోజు చూసుకుని అశోకవృక్షం కింద సీతారాముల పటాన్ని ఉంచి పూజిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని శాస్త్రవచనం.
Comments
Please login to add a commentAdd a comment