Ashoka tree
-
సకల శోకాలనూ దూరం చేసే అశోక వృక్షం
అశోక వృక్షం... పేరును బట్టే అర్థం అవుతుంది కదా, దీని ప్రత్యేకత. ఈ చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ శోకం ఉండదు అంటారు. ఇది ఎక్కువగా శ్రీలంకలో, భారతదేశంలో పెరుగుతుంది. ఎత్తుగా, గుబురుగా పెరుగుతూ చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. దీని మొగ్గలు, పువ్వులు, కాయలు కూడా ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా ఉంటాయి. అసలు అశోక వృక్షం పేరు చెబితే సీతాదేవి గుర్తుకు రాకమానదు. కారణం సీతమ్మవారిని రావణుడు బంధించింది అశోకవనంలోనే.అందుకే ఆ తర్వాత కాలంలో అశోకకు సీతాశోక అనే పేరు వచ్చింది. గౌతమ బుద్ధుడు లుంబినీ వనంలో అశోకవృక్షం కిందే జన్మించాడు. మహావీరుడు వైశాలీ నగరంలో అశోకవృక్షం కిందే సన్యాసాన్ని స్వీకరించాడు. హనుమంతుడు సీతాదేవిని అశోకవృక్షం కిందనే కనుగొన్నాడు. ప్రేమదేవుడు మన్మథుడి పూలబాణాలలో అశోకపుష్పాలు కూడా ఒకటి. వరలక్ష్మీ వ్రత కలశంలో ఉంచే పంచ పల్లవాలలో అశోక వృక్ష చివుళ్లు కూడా ఒకటి. అశోకవృక్షం కింద కూర్చుని రామాయణ పారాయణ చేస్తే శోక నివారణ జరుగుతుందంటారు. ఉగాది పచ్చడిలో పూర్వం అశోక పుష్ప లేలేత మొగ్గలను, చివుళ్లను కూడా వాడేవారని ప్రాచీన గ్రంథాలను బట్టి తెలుస్తుంది. సంతానం కోరేవారు ఒక మంచి రోజు చూసుకుని అశోకవృక్షం కింద సీతారాముల పటాన్ని ఉంచి పూజిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని శాస్త్రవచనం. -
అశోక వృక్షంలో క్యాన్సర్ ఔషధం
బెంగళూరు: క్యాన్సర్ నిరోధానికి సాగుతున్న పరిశోధనలు ఊహకు అందని విషయాలను వెలుగులోకి తెస్తున్నాయి. గతంలో పసిఫిక్ యూ చెట్లలో ఉండే టాక్సాల్ అనే రసాయన సమ్మేళనం అశోకా చెట్లలో(సరాకా అశోకా) కూడా లభ్యమవుతోందని తాజా అధ్యయనాలు తేల్చాయి. ఈ టాక్సన్ ‘ట్యూమర్ల’ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ చెట్టు లభ్యత కష్టంగా మారడంతో ప్రత్యామ్నాయాలపై పరిశోధన జరిగింది. బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ జీవశాస్త్ర విభాగం వివిధ రకాల ఔషధ మొక్కలపై గత దశాబ్ద కాలంగా జరిపిన అధ్యయనాల్లో ఈ ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. దీంతో భారత్ శ్రీలంక దేశాలలో విస్తృతంగా పెరిగే బహుళ ఆయుర్వేద ప్రయోజనాలున్న పుష్పించే చెట్టు, అశోక వృక్షంపై క్యాన్సర్ నివారణలో మరిన్ని ఆశలు నెలకోనున్నాయి. ప్రసిద్ధ ఔషధ మొక్కల్లోని ఎండోఫిటిక్ ఫంగస్ పెరుగుదల, వాటి ఔషధ విలువల గుర్తింపు , సహజ పద్ధతిలో ఆయా కాంపౌండ్స్ వెలికితీత పై తమ సుదీర్ఘ పరిశోధనలో అశోక చెట్టు శిలీంధ్రంలో కొలెస్ట్రాల్ గ్లూకోజ్ అనే యాంటి క్యాన్సర్ కాంపౌండ్ ను గుర్తించామని డిపార్ట్ మెంట్ ఆఫ్ బయో కెమిస్ట్రీ ప్రొఫెసర్ జయభాస్కరన్ తెలిపారు. గతంలో పసిఫిక్ యూ చెట్టు బెరడు లో లభ్యమైన ఒక రసాయన సమ్మేళనం ప్రఖ్యాత టాక్సాన్ అశోక ఫంగస్ లో ఉండడం చాలా ఆశ్చర్యం కలిగించిందన్నారు. మొక్క నుంచి వేరుచేసిన ఫంగస్ ను పులియబెట్టడానికి ముందే యాంటీ క్యాన్సర్ ఔషధ లక్షణాలను కలిగి ఉండడమని విశేషమని తెలిపారు. ఈ సమ్మేళాన్ని శుభ్రంచేసి, క్లినికల్, ప్రీ క్లినికల్ పరీక్షలకు వెళ్లాల్సి వుంటుందని తెలిపారు. దీంతోపాటుగా వివిధ రకాల క్యాన్సర్ చికిత్సకు ఉపయోగపడే అనేక మొక్కలు, చెట్లలో అందుబాటులో ఉన్న ఈ ఫంగస్ పై ఎఫ్డీఏ అనుమతి పొందాల్సి ఉందన్నారు. పరిశ్రమ స్థాయిలో ఈ శిలీంధ్రాన్ని ఔషధంగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నామని జయచంద్రన్ పేర్కొన్నారు.