ఘన చరితకు ఆనవాలు... | Solid history that dates back to the landmark | Sakshi
Sakshi News home page

ఘన చరితకు ఆనవాలు...

Published Thu, Dec 4 2014 11:38 PM | Last Updated on Sat, Sep 2 2017 5:37 PM

ఘన చరితకు ఆనవాలు...

ఘన చరితకు ఆనవాలు...

‘గొల్లకొండ’ గోల్కొండ కోటగా రూపాంతరం చెందిన ఈ ప్రాకారం వెనుక ఆసక్తికరమైన కథనం ఉంది. 1143లో మంగళవరం అనే రాళ్ల గుట్టపైన ఒక గొడ్లకాపరికి ఒక దేవతా విగ్రహం కనిపించింది. ఈ వార్త అప్పటి ఆ ప్రాంతాన్ని పాలించే కాకతీయులకు చేరవేశారు. వెంటనే ఆ పవిత్ర స్థలంలో వారు ఒక మట్టి కట్టడాన్ని నిర్మించారు. ఆ విధంగా 120 మీటర్ల ఎత్తులో నిర్మించిన కోట ఇది. కాకతీయులు, వారి వారసులు ముసునూరి నాయకులకు గోల్కొండ ఓరుగంటి సామ్రాజ్యంలో ముఖ్యమైన కోటగా ఉంది. కాలానుగుణంగా గోల్కొండ కోట మొదట 1323లో తుగ్లక్ కుమారుడు ఉలుఘ్‌ఖాన్ వశమయ్యింది. ఆ తర్వాత ముసునూరి నాయకుల విప్లవంతో ఓరుగల్లుతో పాటు గోల్కొండ కూడా విముక్తి పొందింది. ఆ తర్వాత అనేక పరిణామాలు చోటుచేసుకొని హిందువుల నుండి ఈ కోట చేజారిపోయి, మొఘలులు, ఆ తర్వాత నవాబుల సొంతమయ్యింది. 

మొఘల్ చక్రవర్తుల నుండి స్వాతంత్య్రం పొందిన నిజాములు తర్వాత హైదరాబాద్‌ను 1724 నుండి 1948లో భారత్‌లో విలీనమయ్యేంతవరకు పరిపాలించారు. 1507 నుంచి 62 సంవత్సరాల పాటు గోల్కొండ కోటను కుతుబ్‌షాహీ వంశస్థులు నల్లరాతి కోటగా తయారుచేశారు. వీరి నుంచి ఔరంగజేబు సైన్యం ఈ కోటను వశం చేసుకొని, చాలా వరకు నాశనం చేసింది. అయినప్పటికీ తన ప్రాభవం కోల్పోలేదు ఈ కోట.
 
 
ఇలా చేరుకోవాలి

గోల్కొండ కోట హైదరాబాద్ నగరానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. బస్సు, స్థానిక ఆటోలు, ట్యాక్సీ సౌక ర్యాలూ అందుబాటులో ఉన్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు బస్సు, రైలు, వాయుమార్గాల ద్వారా చేరుకోవచ్చు.
 
 ఘన చరితకు ఆనవాలుగా

 నాటి వైభవాన్ని కళ్లముందు నిలుపుతూ ఠీవిగా దర్శనమిస్తుంది గోల్కొండ కోట. శత్రు దుర్భేద్యంగా కనిపించే ఈ కోట నిర్మాణ కౌశలం చూపరులను విస్మయపరుస్తుంది. వెయ్యేళ్ల స్మృతులను తనలో ఇముడ్చుకున్న ఈ కోట ప్రతి తరానికీ పాఠ్యాంశమే!  హైదరాబాద్ చారిత్రక వారసత్వ కట్టడాలలో ప్రధానంగా ఆకట్టుకునే పర్యాటక ప్రదేశం గోల్కొండ. ఈ కోటలో కాకతీయుల కాలంలో నిర్మించిన ప్రాచీన దేవాలయాలెన్నో ఉన్నాయి. అటు తర్వాత ముసల్మానులు, నవాబుల కాలంలో మరెన్నో మార్పులతో ప్రస్తుత కట్టడం కనిపిస్తుంది. ఈ కోటలో నాలుగు వేర్వేరు కోటలు ఉన్నాయి. కోట చుట్టూ 87 అర్ధచంద్రాకారపు బురుజులతో కూడిన 10 కిలోమీటర్ల పొడవునా గోడ ఉంది. బురుజులలో ఇంకా ఫిరంగులను నిలిపి ఉంచారు. 8 సింహద్వారాలు, 4 వంతెనలు, బోలెడన్ని రాచమందిరాలు, మసీదులు, దేవాలయాలు, అశ్వశాలలు.. మొదలైనవెన్నో ఈ కోటలో నాటి వైభవాన్ని నేటికీ తెలుపుతున్నాయి.

ఫతే దర్వాజా...

సింహద్వారాలలో అన్నిటికంటే కింద ఉంటుంది ఫతే దర్వాజ.  విజయ ద్వారంగా కూడా పిలుస్తారు. దీని నుండే మనం గోల్కొండ కోటను చూడటానికి వెళ్తాం. శత్రువులు దాడి చేసే సమయంలో వారి ఏనుగుల రాకను అడ్డుకోవటానికి ఆగ్నేయం వైపున పెద్ద పెద్ద ఇనుప చువ్వలు ఏర్పాటు చేశారు. ఫతే దర్వాజా నిర్మించడానికి నాడు నిపుణులు ధ్వని శాస్త్రాన్ని ఔపోసన పట్టినట్టున్నారు. అందుకే గుమ్మటం కింద ఒక నిర్ణీత ప్రదేశంలో నిల్చొని చప్పట్లు కొడితే కిలోమీటరు దూరంలో గోల్కొండలో అతి ఎత్తయిన ప్రదేశంలో ఉన్న ‘బాలాహిస్పారు’ వద్ద చాలా స్పష్టంగా వినిపిస్తుంది.

బాలా హిస్సారు దర్వాజా!

అన్ని ముఖద్వారాలలో బాలా హిస్సారు దర్వాజా చాలా మనోహరమైనది. ఆర్చిల మూల ఖాళీలలో ఉన్న సన్నటి రాతి పలకల మీద కాల్పనిక మృగాలు, సింహపు బొమ్మలు, ప్రత్యేక అలంకారాలు ఉన్నాయి. ఈ తర్వాత నుండి కొండపైకి వెళ్లటానికి 380 ఎగుడు దిగుడు రాతిమెట్లు ఉంటాయి. ఈ మెట్లన్నీ ఎక్కిన తర్వాత బాలా హిస్పారు బారాదరీ అని పిలవబడే ఒక మంటపం కనిపిస్తుంది. దర్బారు హాలుగా ఉపయోగించే ఈ కట్టడంలో 12 ఆర్చిలు, 3 అంతస్తులు ఉన్నాయి. ఎత్తులో ఉన్న ఒక గదికి ఆనుకుని ఉన్న మూడు ఆర్చిల ద్వారా వెనక ద్వారం తెరుచుకుంటుంది.

నాడు కోటపైకి నీటి సరఫరా...

హిందూ ఉద్యోగులలో ముఖ్యులైన అక్కన్న మాదన్నలు కార్యాలయాలు ఉన్న కుతుబ్ షాహీ దర్బారులో ఉన్నాయి. అక్కడ మనకు గండశిలతో నిర్మించిన కాకతీయుల కాలం నాటి హిందూ దేవాలయం కనిపిస్తుంది. దీనిని మాదన్న దేవాలయంగా సంబోధిస్తారు. అందులో రంగులలో చిత్రించిన కాళీదేవి మనకు దర్శనమిస్తుంది. గండశిలల గుండా నడుస్తున్నప్పుడు మనకు బంకమట్టితో తయారు చేసిన గొట్టాలు కనిపిస్తాయి. కొండపైకి నీటి సరఫరా కోసం వాటిని ఏర్పాటు చేశారని అర్థమవుతుంది.
 
భక్తాగ్రేసరుడి కారాగారం..


ఈ కోటలోనే భక్తరామదాసుగా పిలువబడే కంచర్ల గోపన్నను భద్రాచలంలో రామాలయం నిర్మించినందుకు తానీషా కారాగారంలో బంధించాడు. ఈ కారాగారంలో రామదాసుచే గోడలపై చెక్కబడిన సీతారామ, లక్ష్మణుల విగ్రహాలను చూడవచ్చు. కాకతీయుల నాటి హిందూ దేవాలయాలతో పాటు ముసల్మానుల కాలం నాటి అనేక మసీదులు ఇక్కడ ఉన్నాయి. ఈ కోట నుండి నగరంలో ఉన్న చార్మినార్‌కు గుర్రం పోయేటంత సొరంగ మార్గం ఉందని ప్రచారం ఉంది. భావితరాల కోసం ఈ కోటను పరిరక్షించడానికి దీనిని పురావస్తుశాఖవారు తమ అధీనంలోకి తీసుకున్నారు. సందర్శకుల కోసం నాటి విశేషాలను తెలియజెప్పే సౌండ్-లైట్ షో ఏర్పాటు చేయబడింది. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో ఈ షోలను ప్రదర్శిస్తున్నారు. ఇంగ్లిషులో - బుధ, ఆది.. హిందీలో - గురు, శుక్ర, శని.. తెలుగులో - మంగళవారం ఈ షోలను ప్రదర్శిస్తారు. సోమవారం - ఈ ప్రదర్శనకు సెలవు.
 - సాక్షి ఫ్యామిలీ
 
వజ్ర వ్యాపారుల ప్రవేశ ద్వారం.. మోతీ దర్వాజా

 గోల్కొండ కోటకు ఫతే, మోతీ, కొత్త కోట, జమాలీ, బంజారీ, బహిమని, బొదిలి, మక్కా దర్వాజాలు ఉన్నాయి. ప్రపంచంలోని వివిధ రాజ్యాలు, దేశాల నుంచి వచ్చే వజ్రాల వ్యాపారులు రాకపోకలు సాగించేందుకు 25 అడుగుల ఎత్తు కలిగిన మోతీ దర్వాజాను 450 ఏళ్ల క్రితం నిర్మించారు. ఈ మార్గం ద్వారానే వర్తకులు, కొనుగోలు దారులు మోతీమహల్‌లోని షాపింగ్ కేంద్రానికి వచ్చేవారట. మోతీ దర్వాజా వద్ద వజ్రాలు, వైఢూర్యాలు రాశులుగా పోసి అమ్మేవారట.  ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా ఉన్న మోతీ దర్వాజా ఈ బుధవారం విరిగిపోయింది. కూలిన తలుపును మరమ్మతు చేయించి, మళ్లీ ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement