ఆయనంటే నాకు ఆరాధన! | special chit chat with singer l.r.eshwari | Sakshi
Sakshi News home page

ఆయనంటే నాకు ఆరాధన!

Published Tue, Dec 9 2014 4:08 PM | Last Updated on Sat, Sep 2 2017 5:44 PM

ఆయనంటే  నాకు ఆరాధన!

ఆయనంటే నాకు ఆరాధన!

ఆమె పాట ఒక సెలయేరు. ఆమె గానమంటే - ఇవాళ్టికీ ఉరకలెత్తించే హుషారు. అయిదున్నర దశాబ్దాల పైగా అలుపెరగని ఆ గాత్రంలో ఒక మత్తు ఉంది... ఏదో తెలియని గమ్మత్తు ఉంది. ఎల్.ఆర్. ఈశ్వరి... ఆమె ‘మసక మసక చీకటిలో మల్లెతోట వెనకాల
 మాపటేల కలుసుకో’ అంటే... ఆ గొంతులో మనసైనదేదో దొరుకుతుంది. ‘మాయదారి సిన్నోడు... నా మనసే లాగేసిండు’ అంటే... ఆ తీపి బాధతో ఆగేదెట్టా, వేగేదెట్టా అనుకోక తప్పదు. ‘లే లే లే లేలేలే నా రాజా...’ అన్నా, ‘ఏస్కో కోకోకోలా... తీస్కో రమ్ము సారా...’ అన్నా, ‘బలే బలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్...’ అన్నా...
ఆ గొంతులో శ్రోతలకు గుబాళించేవి అచ్చంగా ‘సన్నజాజులోయ్... కన్నెమోజులోయ్...’ !
 తెలుగే కాదు... తమిళం, మలయాళం, కన్నడం, హిందీ - ఇలా దాదాపు 14 భాషల్లో మాటకు తనదైన
 భావప్రకటనను జోడించి, పాటను పదికాలాల పాటు జనం నోట నిలిచేలా చేసిన అరుదైన గాయని
 ఎల్.ఆర్. ఈశ్వరి. ఇవాళ్టికీ వేదికెక్కితే పాటతో మంత్రముగ్ధుల్ని చేసే ఆ స్వర భాస్వరం పుట్టినరోజు రేపు.
 75 ఏళ్ళు నిండుతున్న ఆమె స్వర ప్రస్థానం, పెళ్ళి చేసుకోకుండానే గడిచిపోయిన
 ఆమె జీవిత ప్రయాణాల ముచ్చట్లు ...
  ‘సాక్షి ఫ్యామిలీ’కి ప్రత్యేకం.

నమస్కారమండీ! ఎలా ఉన్నారు?
 
బాగున్నానండీ! ఇప్పటికీ బయట సినిమా పాటల కచ్చేరీలకు వెళుతున్నా. పాడుతున్నా. భక్తి గీతాల ఆల్బమ్స్ చేస్తున్నా. అమెరికాకు చెందిన ‘అకాడెమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్’ వారు ఇటీవలే గౌరవ డాక్టరేటిచ్చారు.
     
తమిళులు అయ్యుండి మీరు చక్కగా తెలుగు ఎలా మాట్లాడగలుగుతున్నారు?

 
(నవ్వేస్తూ...) అందరితో మాట్లాడి బాగా తెలుగు వచ్చింది. ఎవరైనా మాట్లాడుతుంటే జాగ్రత్తగా గమనించి ఆ భాష, యాస పట్టుకుంటా. ఆ రోజుల్లో ఎక్కువ తెలుగు పాటలు పాడే అవకాశం రావడమూ కారణమైంది.
     
ఇంతకీ మీ స్వస్థలం ఎక్కడ?

 
మాది తమిళనాడులోని పరమకుడి. చెన్నైలో పుట్టి పెరిగా. మా నాన్న ఆంటొనీ దేవరాజ్. అమ్మ రెజీనా మేరీ నిర్మల. మేము రోమన్ క్యాథలిక్‌లం.
     
మరి మీ పేరులో ఈశ్వరి ఏమిటి?
 
మేము వేలాంగణి మాతను నమ్ముతాం. ఆమెను రాజేశ్వరి అంటారు. మా నాయనమ్మ నన్ను ‘రాజేశ్వరి’ అని పిలిచేది. ఇక, మా అమ్మ తరఫువాళ్ళేమో ‘లూర్ద్ మేరీ’ అనేవారు. మాకు ఇంటిపేరుండదు. తండ్రి పేరే ఇంటిపేరవుతుంది. అలా నా పూర్తి పేరు - దేవరాజ్ లూర్ద్ మేరీ రాజేశ్వరి. - డి.ఎల్. రాజేశ్వరి. దర్శకుడు ఏ.పి. నాగరాజన్ నా పేరులోని ‘డి’ తీసేసి, ఎల్.ఆర్. ఈశ్వరి అని కుదించారు. నా దృష్టిలో అన్ని మతాలూ ఒకటే. దేవుడొక్కడే. దేవుడెక్కడో లేడు. (హృదయాన్ని చూపిస్తూ..) ఇక్కడే ఉన్నాడు.
     
సినిమా పాటల వైపు ఎలా వచ్చారు?
 
మా నాన్న గారు నా చిన్నప్పుడే పోయారు. దాంతో, ఇల్లు గడవడం కోసం పాటను ఎంచుకున్నా. పాడితేనే డబ్బొస్తుంది. అందుకనే, చదువు వదిలి, పాట మీదే ప్రేమ పెంచుకున్నా. అప్పట్లో మా అమ్మ రేడియో గాయని. సినిమాల్లో కూడా గ్రూప్ సాంగ్స్‌లో పాడేవారు. చిన్నప్పటి నుంచి అమ్మ కొంగు పట్టుకొని రికార్డింగులకు వెళ్ళడంతో పాడడం అలవాటైంది.
     
ఇంతకీ మీరు సంగీతం ఎక్కడ నేర్చుకున్నారో చెప్పనేలేదు!
 
నేను అసలు ఎక్కడా సంగీతం నేర్చుకోలేదు. నేర్చుకోవాలని అనుకున్నప్పుడు నా దగ్గర సొమ్ము లేదు. తీరా కష్టపడి సొమ్ము సంపాదించడం మొదలుపెట్టాక తీరిక లేదు. ఎంతసేపటికీ, వచ్చిన ప్రతి పాటా పాడాలి. మా కుటుంబాన్ని పైకి తీసుకురావాలనే దృష్టే నాకుండేది.
     
సినీ నేపథ్య గాయనిగా మీ ప్రస్థానం ఎలా మొదలైందో చెబుతారా?
 
రికార్డింగులకు మా అమ్మ వెంట తోడుగా వెళుతున్నప్పుడు, సంగీత దర్శకుడు కె.వి. మహదేవన్ నా గొంతు విని బాగుందన్నారు. తమిళ సినిమాలో గ్రూప్ సింగర్స్ మధ్య హమ్మింగ్‌తో మొదలుపెట్టా. ఆ తరువాత దర్శకుడు ఏ.పి. నాగరాజన్ రూపొందించిన ‘నల్ల ఇడత్తు సంబందం’లో, మహదేవన్ సంగీతంలో తొలి పాట పాడించారు. అవన్నీ వినే తెలుగులో చాన్సిచ్చారు.
     
గాయనిగా మీ పాటల తొలి కబుర్లు చెబుతారా?
 
తెలుగులో తొలి సినిమా ఏదో గుర్తు లేదు కానీ ‘దొంగలున్నారు జాగ్రత్త’ (’58), ‘జగన్నాటకం’ (’60) లాంటి వాటిల్లో పాడా. ఆ రోజుల్లోనే ‘నా పేరు సెలయేరు నన్నెవ్వరాపలేరు!’ పాట పాడా. నా కెరీర్ ఆ పాట లాగే సాగింది.
 
ఇంతకీ మొత్తం ఎన్ని భాషల్లో, ఎన్ని పాటలు పాడారు?

 
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ పాటలు, హిందీలో కొన్ని పాటలు పాడాను. ఇప్పటికీ పాడుతూనే ఉన్నాను. సినిమా పాటలు కొంత తగ్గినా, ప్రైవేటు గీతాలు, భక్తి గీతాలు తగ్గలేదు. పాటల సంఖ్య అంటారా? లెక్కపెట్టి ఏం చేస్తామని ఎప్పుడూ లెక్క వేయలేదు. ‘కథానాయిక మొల్ల’ (’70)లో తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ, హిందీ భాషల్లో సాగే ఒక పాటను పాడాను. దాంతో, కవి దాశరథి గారు నన్ను ‘పంచభాషా ప్రవీణ’ అన్నారు. ‘నన్న గండ ఎల్లి’ అనే కన్నడ చిత్రంలో ఏకంగా పది భాషల్లో పాట పాడా.
     
ఇంత ప్రతిభ ఉన్న మీతో ఎక్కువ శృంగార గీతాలే పాడించారేం?

 
(నవ్వేస్తూ...) అప్పట్లో హుషారైన పాటలంటే నాతోనే పాడించాలనేవారు. దానికి కారణం లేకపోలేదు. ఇచ్చిన సాహిత్యాన్నీ, సంగీతాన్నీ అనుసరిస్తూనే ఆ పాట సందర్భానికీ, ఆ అంశానికీ తగ్గట్లుగా భావవ్యక్తీకరణ అంతా సొంతంగా చేస్తుంటా. ఒక్క మాటలో, పాటకు తగ్గ మసాలా అంతా నేను వేస్తా. దర్శక, నిర్మాతలు, సంగీత దర్శకులు కూడా అందుకు ఒప్పుకుంటారు.
    
శృంగారభరిత గీతాలు పాడడం ఇబ్బందిగా అనిపించలేదా?
 
అది కేవలం పాట. సాహిత్యంలో ఏముందో ఆ భావాల్ని నా గొంతులో పలికించాలి. అలా చేసినప్పుడే పాట పండుతుంది. మైక్ దగ్గరకు వెళ్ళినప్పుడు నన్ను నేను మర్చిపోతుంటా. మైక్ దగ్గరకు వెళ్ళినప్పుడు మైక్‌నే హీరోగా భావిస్తూ, నన్ను నేను హీరోయిన్‌లా అనుకుంటూ పాడేస్తుంటా. రికార్డింగ్ అయిపోయాక ఆ ట్రాన్స్‌లో నుంచి బయటకొస్తా. అయినా, ఇచ్చిన పాటకు న్యాయం చేసి, పైకి రావాలంటే సిగ్గు లాంటివన్నీ వదిలేయాలి. మన గొంతుతో జీవం పోస్తేనేగా, పాట హిట్టయ్యేది!

     
కానీ ఈ రకమైన పాటలు పాడడంతో ఎదురైన చేదు అనుభవాలు..?

 
(సీరియస్‌గా...) గాయనిగా పైకి వస్తూ, ఇలాంటివి పాడినప్పుడు చాలా మాటలన్నారు. ఎవరైనా ఏదైనా అన్నా డోంట్ కేర్‌గా ఉండేదాన్ని.  
 
అప్పట్లోని సెక్సీ తారల నృత్యానికి మీ గొంతే ఎస్సెట్. ఏమంటారు?
 
(నవ్వేస్తూ...) జ్యోతిలక్ష్మికీ, విజయలలితకూ తెరపై మొదటి పాట నేనే పాడా. ప్రసిద్ధ నటి వాణిశ్రీకి తెలుగులో తొలి పాట నాదే. అలాగే, బి. సరోజాదేవికి తమిళంలో (‘అణ్ణా - తంగి’ చిత్రం)! వాళ్ళు తలుచుకుంటారో లేదో నేను తలుచుకుంటా. అయితే, నా పాట వల్లే వాళ్ళకు పేరొచ్చిందనుకోను. వాళ్ళకు కలిసొచ్చే టైమొచ్చింది. నా గొంతు ఎస్సెటయింది.
     
ఈ మధ్య మళ్ళీ తమిళ గీతాలతో వార్తల్లోకొచ్చారు!
 
సంగీత దర్శకుడు తమన్ ఆ మధ్య తమిళ చిత్రం ‘ఒస్తి’లో నాతో ‘కలా సలా కలసల...’ అనే పాట పాడించారు. ప్రత్యేక నృత్య గీతమైన ఆ పాటతో నాకు 11 అవార్డులు వచ్చాయి. అలా ఇప్పుడు నాకు రెండో ఇన్నింగ్స్ వచ్చింది. తెలుగులో ఈ మధ్యే ‘పాండవులు పాండవులు తుమ్మెదా’లో పాడాను.
     
గాయనిగా పేరు వచ్చింది. కానీ, రావాల్సినంత ప్రభుత్వ గుర్తింపు మాట?
 
1984లోనే ‘కలైమామణి’ వచ్చింది. తమిళనాడు ప్రభుత్వం నుంచి అణ్ణా, ఎం.జి.ఆర్. అవార్డులూ అందుకున్నా. ఇంకా రావాల్సినవి వస్తాయి.  
     
ఇవాళ్టి సింగర్స్‌పై అభిప్రాయం?

 కొత్త తరం వాళ్ళు కూడా బాగానే పాడుతున్నారు. కానీ, మా తరంలో అందరిదీ ఒక్కొక్క స్టైల్, టోన్ ఉంది. ఇవాళ అలా లేదు. పైగా, ఇవాళ పాటల్లో బీట్ ఎక్కువ. చాన్‌‌సలు ఈజీ. రోజుకు 20 మంది వస్తున్నారు కానీ, మా లాగా దీర్ఘకాలం నిలబడట్లేదు.
     
మీ తోబుట్టువుల గురించి...?

 
మేము ముగ్గురం. నేను, నా చెల్లెలు అంజలి, తమ్ముడు అమల్‌రాజ్. నా చెల్లెలూ కొన్ని సినిమా పాటలు పాడింది. అయితే, పెద్దల మాటలు వినలేదు. పొగరుగా ప్రవర్తించేది. పదహారేళ్ళ క్రితం చనిపోయింది. నేను పెళ్ళి చేసుకోలేదు. మొదటి నుంచి నేను, నా తమ్ముడు కలిసే ఉంటు న్నాం. తమ్ముడి పిల్లలే కాక,  మనుమరాళ్ళూ నన్ను ‘అత్తా’ అంటారు.
     
ఇంతకీ ఎందుకు పెళ్ళిచేసుకోలేదు?

 
పెళ్ళి వయసులో కుటుంబాన్ని సాకే బాధ్యత మీద పడింది. తీరా అందరినీ సెటిల్ చేసేసరికి పుణ్యకాలమైపోయింది. ఒక్కో పాట పాడి వచ్చాక, రాత్రి నిద్ర రాదు. అయినా, పాటలోనే నాకు జీవితం, జోష్ ఉన్నాయి.
     
కానీ, మీకూ, సంగీత దర్శకుడు ఎమ్మెస్ విశ్వనాథన్‌కూ మధ్య...?
 
(అందుకుంటూ...) అది నిజమే! ఆయనంటే నాకు ఆరాధన. చిన్నప్పటి నుంచీ నాకు ఆయనొక్కరే. నా 25వ ఏట నుంచి ఈ రోజుల దాకా ఆయనతోనే జీవితం పంచుకున్నా. ఆయనంటే నాకు ఇష్టం. నేనంటే ఆయనకు ఇష్టం. ఇప్పటికీ ఆయన మా ఇంటికి వస్తుంటారు. వెళుతుంటారు. కానీ, రాత్రి 8.30 గంటల కల్లా ఇంటికి వెళ్ళిపోవాలి. అదీ ఒప్పందం. ఇక, పెళ్ళి, భర్త అంటారా... సంగీతమే నాకు భర్త.
     
మీరు చాలా ధైర్యవంతురాలేనే?
 
అవును. అయామ్ వెరీ బోల్డ్ అండ్ బ్రేవ్. కానీ, మానసికంగా మాత్రం అంతకు అంత చంటిపిల్లను. నన్నెరిగినవాళ్ళందరికీ అది తెలుసు. ఏ చిన్నది ఉన్నా నాకు చటుక్కున ఏడుపొస్తుంది. కానీ, ఇతరుల ఎదుట ఏడవను. పైకి మేడ మీదకు వెళ్ళి, నా గది తలుపులు వేసుకొని బాధపడతా.
     
భౌతికంగా దూరమయ్యాక మిమ్మల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటారు?
 
నేను చనిపోతే ఎవరూ ఏడవకూడదు. నేనేమీ కళ్ళు తెరిచి చూడను కదా! నా పాటలన్నీ వేస్తూ, హాయిగా మాట్లాడుకోండి. అంతే!
 - రెంటాల జయదేవ
 
బరిలోకి దిగితే సింహాన్ని..!
 
దాదాపు 15 - 20 ఏళ్ళుగా అమ్మవారి పాటలు పాడుతున్నాను. అమ్మవారి మీద ఎందరో పాడారు కానీ, నేను పాడినవి చాలా పేరు తెచ్చాయి. శృంగార గీతాలకూ, వీటికీ మధ్య ఎలా ఆ తేడా చూపించానో నాకు తెలియదు. ఏ పాట ఇచ్చినా సరే, బరిలోకి దిగితే నేను సింహమే! ‘చెల్లాత్తా మారియాత్తా...’, ‘మారియమ్మా ఎంగళ్ మారియమ్మా...’ లాంటి పాటలు ఇవాళ తమిళనాట ఊరూరా, అమ్మ వారి గుళ్ళల్లో రోజూ వినిపిస్తున్నాయి. అంతా ఆ దేవుడి ఆశీస్సులు.
 
పోటాపోటీ ఉండేది..! ఈర్ష్య లేదు..!!

నా కన్నా ముందు నుంచే సినీ రంగంలో జిక్కీ, జమునారాణి, పి. లీల లాంటి ఎందరో గొప్ప గాయనులున్నారు. అందరూ మంచివాళ్ళే. నేనూ అందరితో మంచిగా ఉండేదాన్ని. అప్పట్లో నాకూ, గాయని పి. సుశీల గారికీ మధ్య పోటాపోటీ ఉండేది. అయితే, ఈర్ష్య, అసూయ ఉండేవి కావు. ఆమెకు నేనంటే ఎంతో ప్రేమ. అయితే, నాకంటూ ఏదైనా పాట వచ్చింది, ఇచ్చారూ అంటే చాలు... పాడడంలో దుమ్ము దులిపేసేదాన్ని. వాయిస్ కల్చర్ కోసం వేణ్ణీళ్ళు తాగేదాన్ని. రికార్డింగ్‌కు ఫ్లాస్కులో వేణ్ణీళ్ళు తీసుకొని వెళ్ళేదాన్ని. ఇప్పటికీ నాకు అదే అలవాటు. వేదికపై పాట కచ్చేరీల్లో కూడా నాకు మైక్ ఇచ్చారంటే, చాలు! సర్వం మరిచిపోయి, పాటలో నా బెస్ట్ ఇస్తాను. తమిళంలో దర్శకుడు శ్రీధర్ తీసిన ‘సివంద మణ్’ చిత్రంలో పాడిన ‘పట్టత్తు రాణి పార్కుం పార్వై...’ పాట సూపర్‌హిట్టై, నాకెంతో పేరు తెచ్చింది. తెలుగులో ‘విప్లవం వర్ధిల్లాలి’గా వస్తే, అప్పుడూ ఆ పాట నేనే పాడాను. తీరా హిందీలో ‘ధర్తీ’గా తీస్తున్నప్పుడు లతా మంగేష్కర్‌తో ఆ పాట పాడించబోయారు. కానీ, లతాజీ నా ఒరిజినల్ పాట విని, ’అంత అద్భుతంగా పాడిన ఎల్.ఆర్. ఈశ్వరితోనే పాడించండి’ అన్నారు. అంతకన్నా ఏం కావాలి!
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement