జనపదం బరువు మోస్తున్న బాటసారి | special interview to denchanala srinivas | Sakshi
Sakshi News home page

జనపదం బరువు మోస్తున్న బాటసారి

Published Tue, Aug 22 2017 12:04 AM | Last Updated on Sun, Sep 17 2017 5:48 PM

జనపదం  బరువు మోస్తున్న బాటసారి

జనపదం బరువు మోస్తున్న బాటసారి

రంగస్థలం
కవి, రచయిత, రంగస్థల దర్శకుడు, నటుడు శ్రీనివాస్‌ దెంచనాల తో ‘సాక్షి’ ఇంటర్వ్యూ


ఇరవై ఏళ్ల క్రితం శ్రీనివాస్‌ దెంచనాల వయసు అటూ ఇటుగా ఇరవై ఐదేళ్లు. అది మరీ చిన్న వయసేం కాదు కానీ, అప్పటికే అతడు ఓ తట్టెడు నాటకాల ప్రేక్షకుడు! ఒక్కటీ నచ్చడం లేదు! పక్కన థియేటర్‌లో సూపర్‌స్టార్‌ల సినిమా అడుతుంటే, ఈ పక్కన స్టేజి ఆర్టిస్టులు ఎవరికైనా ఎలా ఎక్కుతారు?! అది కాదు రీజన్‌. దెంచనాల యునీక్‌. అతడికి రంగస్థల నటులే అప్పటికీ.. ఇప్పటికీ.. ఎప్పటికీ ‘మెగా’లు, ‘సూపర్‌’లు, ‘రైజింగ్‌’లు. అంతిష్టం నాటకం అంటే!

కానీ తెలుగు నాటకమేంటీ ఇలా చివికి పోతోంది? మంచి బట్టలేవు. మంచి తిండి లేదు. మంచి ‘లుక్‌’ లేదు! నాటకం మధ్యలో బయటికొచ్చి సమోసా తిని, చాయ్‌ తాగి మళ్లీ లోపలకి వెళ్లేవాడే కానీ నీరసంగా వెళ్లేవాడు. ‘ఇలా కాదు’ అనుకున్నాడొక రోజు. అనుకుని.. ‘జనపదం’ థియేటర్‌ రిపర్టరీని స్టార్ట్‌ చేశాడు. టూరింగ్‌ టాకీస్‌లా.. జనం మధ్యలోకి వెళ్లి, జనం చేతే ప్రదర్శింపజేసే కళాసంస్థ అది! జనపదం రిపర్టరీ ఆవిర్భావానికి.. ముందు.. తర్వాత.. ప్రస్తుతం.. రంగస్థలం ఏమిటన్నది ఆయన మాటల్లోనే...


కంగ్రాట్స్‌! రంగస్థలానికి రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపును తెచ్చిపెట్టారు.
ఆవిర్భావ వేడుకల్లో మా థియేటర్‌ రిపర్టరీ అందుకున్న అవార్డు గురించేనా?

అవును.
అది ప్రజా కళాకారుల ఘనత.

కానీ ఆ ఘనత వెనుక ఉన్నది మీరే కదా! మీ దర్శకత్వం, స్టేజ్‌ ప్లే, రైటింగ్‌.. ఔట్‌స్టాండింగ్‌.
మీరు అంటున్న ఔట్‌స్టాండింగ్‌ ఒక్కరి వల్ల వచ్చే ఫలితం కాదు.

బాధితులనే నటులుగా చేయాలని ఎందుకనిపించింది?
అనిపించడం కాదు. అది నాలో ఇన్‌బిల్ట్‌గా ఉన్నట్లుంది. హబీబ్‌ తన్వీర్‌ నాటకాలు చూశాక, నేను కోరుకుంటున్నది ఏదో తెలిసింది. ఆయన నాటకాలు ఆగ్రా బజార్, చరణ్‌దాస్‌ చోర్‌.. నన్ను ఇన్‌స్పైర్‌ చేశాయి.

ఏమిటి ఆయన ప్రత్యేకత? బాధితులను నటులుగా చేసి చూపించడమేనా?
అదొక్కటే కాదు. ఆయన నాటకాలు ఇంగ్లిషు నాటకాల్లా ఉండవు. మామూలు జానపద నాటకాల్లా ఉండవు. మోడర్న్‌గా ఉంటాయి. సంప్రదాయాన్ని వదలకుండానే నాటకాన్ని ఆధునీకరిస్తారు.

హబీబ్‌ తన్వీర్‌.. ఉర్దూ నాటక రంగ ప్రముఖులు. తెలుగులో మిమ్మల్ని ఆయనతో పోల్చవచ్చా?
రెండేళ్లు ఆయన దగ్గర పని చేశాను. ఆయన నాటక బృందంతో కలిసి దేశమంతా కలియదిరిగాను. బృందంతో చేరి వారికి కాస్ట్యూమ్స్, సెట్టింగ్స్‌ మోయడం, నాటకాలను అబ్జర్వ్‌ చేయడం మొదలుపెట్టాను. హబీబ్‌ తన్వీర్‌తో పాటు బాదల్‌ సర్కార్, ధవళం నారాయణ ఫణిక్కర్, బీవీ కారత్‌ వంటివారు ఆధునిక నాటకాన్ని తమదైన శైలిలో అప్పటికే ప్రదర్శిస్తున్నారు. కానీ నన్ను గట్టిగా పట్టుకుంది మాత్రం హబీబ్‌ తన్వీర్‌.

తెలుగులో ఆధునిక నాటకం లేదనేనా అంతదూరం వెళ్లారు?
అంత దూరం అంటే..?

ఖమ్మంలోని మీరు పుట్టిన పెద్దకిష్టాపురం తండా నుంచి.. ఛత్తీస్‌గఢ్‌లో హబీబ్‌ పుట్టి పెరిగిన గిరులలోకి!
అది దూరం వెళ్లడం కాదు. ఆధునిక నాటకానికి దగ్గరగా వెళ్లడం.

తెలుగు నాటకం ఇంతకాలానికీ ఆధునికతను చేరుకోలేకపోయిందని మీరు అంటున్నారు!
అనడం కాదు. అసలు తెలుగులో ఆధునిక నాటకం లేనే లేదు. ఇది చాలా మంది అంగీకరించరు.

అధునికం అంటే?
భారతదేశంలోకి బ్రిటిషర్స్‌ ద్వారా వచ్చిన ఇంగ్లీషు నాటకానికీ, జానపద నాటకాలకూ భిన్నమైన శాస్త్రీయ సంప్రదాయక ప్రభావంగల నాటకం. అది 1950–55 మధ్యలో మన దేశంలో ప్రారంభమైంది. దానికి ఆద్యులు హబీబ్‌ తన్వీర్‌.

కానీ ఆయన విదేశాలలో కదా శిక్షణ పొంది వచ్చారు?!
అవును. లండన్‌లోని రాయల్‌ ఎకాడమీ ఆఫ్‌ డ్రమెటిక్‌ ఆర్ట్‌ (రాడా)లో శిక్షణ పొందారు. అయితే ఆ ధోరణి మన దేశానికి సరిపోదని ఆయనకు అనిపించి, తన సొంత రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లో నిరక్షరాస్యులైన ఆదివాసీ ప్రజల స్థానిక సంప్రదాయాన్ని తన నాటకాల్లోకి తీసుకున్నారు. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలాన్ని, షేక్‌స్పియర్‌ నాటకాలను వేశారు.

మీరు ఆదివాసీ కళాకారులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లున్నారు..?
వాళ్ల సమస్యల్ని వాళ్లైతేనే చక్కగా ప్రజెంట్‌ చెయ్యగలరని నా నమ్మకం. ఆదివాసీల అతి ముఖ్యమైన సమస్య మైగ్రేషన్‌. అటవీశాఖ అధికారుల దౌర్జన్యాలూ, అటవీ సంపద, తమదైన సంస్కృతి నుంచి వారు దూరం కావడం, ఆదివాసీ ఉపాధ్యాయులే వారిని మోసం చేయడం.. ఇవన్నీ నా జీవితంలోని చిన్ననాటి చేదు జ్ఞాపకాలే. ఆ అనుభవాలతో ‘మావా నాటే మావా రాజ్‌’ (మా వూళ్ళో మా రాజ్యం) ఉట్నూర్‌లో ప్రదర్శించాం. మూడు వేల  మంది ఆదివాసీలు ఆ నాటకాన్ని చూసారు. 1994లో ఈ నాటకం చూసిన ప్రభుత్వాధికారులు ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని విమర్శించామన్న నెపంతో తదుపరి ప్రదర్శనలను నిషేధించారు. అయినా మా ప్రయత్నం ఆగలేదు. సెప్టెంబర్‌లో ‘కుమ్రుం భీము కల’ నాటకాన్ని ప్రదర్శిస్తున్నాం.

మీ ‘జనపదం’ రిపర్టరీకి సపోర్ట్‌ లభిస్తోందా?
కేంద్రప్రభుత్వం, మిత్రులు, ప్రేక్షకులు అందించే ఆర్థిక సాయంతో నడుపుతున్నాం. అప్పుడప్పుడూ సాయం చేసే రాష్ట్రప్రభుత్వాల మద్దతు కూడా ఉంది.

అంటే.. నెట్టుకొస్తున్నాం అంటున్నారా?
ఒకవిధంగా నెట్టుకు రావడం. ఇంకోవిధంగా ఎదురీదడం. ‘తెలుగు ప్రజల సంస్కృతీ సాంప్రదాయాలనూ నాటకం ద్వారా దశదిశలా వ్యాపింపజేయడం మా లక్ష్యం. అయితే అందుకు ప్రభుత్వం కూడా తన సహకారం అందించవలసి ఉంటుంది. కేవలం వ్యక్తుల వల్ల జరిగే పని కాదు ఇది.

ఒక రిపర్టరీ వ్యవస్థాపకులుగా రంగస్థల అభివృద్ధికి ఇంకా జరగలవలసింది ఏమైనా ఉందా?
రెండు తెలుగు రాష్ట్రాలు తక్కిన రాష్ట్రాల్లో ఆధునిక నాటక పరిస్థతిపై అధ్యయనం చేసి, ప్రతి జిల్లాలో రాష్ట్ర నాటక పాఠశాలలు స్థాపించి రంగస్థల నాటకానికి ప్రభుత్వం ప్రాణంపోయాలి. అలాగే నైపుణ్యంగల దర్శకులైన తెలుగు వారు, తెలుగేతరులను కూడా పిలిచి నాటకాసక్తి కలిగిన యువతకు శిక్షణా శిబిరాలు నిర్వహించాలి. యూనివర్సిటీల్లో ఉన్న నాటక శాఖలను శిక్షణా శిబిరాల ద్వారా పునరుద్ధరించాలి. థియేటర్‌ను అభ్యసించిన విద్యార్థులకు కర్ణాటకలో మాదిరిగా బిఇడి, ర్యాంక్‌ ఇచ్చి, ప్రభుత్వ పాఠశాలల్లో నాటక విద్యాబోధనను ప్రోత్సహించాలి.

బాధితులే నటులు
ప్రపంచంలో బ్రెజిలియన్‌ నాటక కర్త, దర్శకుడు అగస్టోబోల్‌ తొలిసారిగా విక్టిమ్‌ థియేటర్‌ (బాధితుల నాటకం) అనే కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టి బాధితులతోనే నాటకం వేయించాడు. ఈ నాటక ప్రక్రియ ద్వారా చాలా మంది స్ఫూర్తి పొందినప్పటికీ.. తెలుగులో తొలిసారి పసుపులేటి పూర్ణచందర్‌రావు అనే దర్శకుడు రెండు దశాబ్దాల పాటు ఇదే పద్ధతిలో నాటకాలు ప్రదర్శించారు. తర్వాత శ్రీనివాస్‌ దెంచనాల కూడా ఇదే పద్ధతిలో గోండులతో, లంబాడీలతో ఇంకా కొందరు బహుజనులతోటి కలిసి ఈ నాటక ప్రక్రియను అనుసరించారు. అయితే కళాత్మకత లేమివల్ల కొన్ని ప్రదర్శనలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చిందని దెంచనాల అన్నారు.

క్షత్రియుడైన నపుంసక రాజుకూ, హిందూ బలి సంప్రదాయానికీ మధ్య నలిగిపోయి రాజును చంపి, తను చనిపోయిన జైన ధర్మచారిణి అమృతలత. పద్మభూషణ్‌ గిరీష్‌ కర్నాడ్‌ నాటకం ‘బలి’లోని దృశ్యం ఇది. అనుసృజన, పరికల్పన, దర్శకత్వం : శ్రీనివాస్‌ దెంచనాల
ప్రదర్శన : జనపదం ఆధునిక సంచార నాటక రిపర్టరీ.
అత్తలూరి అరుణ, ప్రిన్సిపల్‌ కరస్పాండెంట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement