‘దిల్‌’ మిస్సింగ్‌ | Special story about Dil raju | Sakshi
Sakshi News home page

‘దిల్‌’ మిస్సింగ్‌

Published Sun, Apr 16 2017 1:26 AM | Last Updated on Tue, Sep 5 2017 8:51 AM

Special story about Dil raju



‘దిల్‌’ సినిమా తీసినందుకు వెంకటరమణకి ‘దిల్‌’ రాజు అని పేరొచ్చింది. సినిమాల్లో రాణించాడు.. కారణం ఇంట్లో ఉన్న మహరాణి వల్లే. అందరూ పిలుచుకునే ‘దిల్‌’ రాజుకు ఇప్పుడు ఎంతగానో... ఎంతెంతగానో ‘దిల్‌’ మిస్సింగ్‌.


♦  ముందుగా ‘శతమానం భవతి’కి జాతీయ అవార్డు దక్కినందుకు కంగ్రాట్స్‌ రాజుగారు..
‘దిల్‌’ రాజు: థ్యాంక్స్‌ అండి. మా సంస్థ నుంచి వచ్చిన మరో మంచి ఫ్యామిలీ మూవీ ఇది. ప్రేక్షకాదరణతో పాటు జాతీయ అవార్డు దక్కడం హ్యాపీగా ఉంది.
♦  ఇంత పెద్ద విజయం ఓ వైపు... మీ భార్య (అనిత) మరణంతో ఏర్పడిన పెద్ద వెలితి మరోవైపు...
రాజు: చాలా పెద్ద వెలితి. ‘షీ ఈజ్‌ బెస్ట్‌’. ఏ భర్తకైనా ఇంట్లో ప్రశాంతత ఉన్నప్పుడే బయట సక్సెస్‌ కాగలడు. డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్‌ వ్యవహారాలతో బయట నేను ఫుల్‌ బిజీ. ఆమె ఇంటిని బాగా చూసుకునేది. ఇంటికి రాగానే ఒత్తిడి మొత్తం పోయేది.

♦  అనితగారికి ఆరోగ్య సమస్యలేమైనా?
రాజు: పోయిన సంవత్సరం నుంచి మోకాళ్ల నొప్పితో బాధపడుతోంది. ఇప్పుడే ఇలా ఉందంటే ఫ్యూచర్‌లో ఎలా ఉంటుందో అని నేనూ, మా పాప బాధపడేవాళ్లం. వేరే ఆరోగ్య సమస్యలేవీ లేవు. డైట్‌ స్టార్ట్‌ చేసి, ఓ 15 కిలోలు తగ్గాలని చెబుతుండేవాణ్ణి. లైపో చేయించుకుంటానని సరదాగా అనేది. మా అమ్మాయికి మాటలు వచ్చి నన్ను ‘డాడీ’ అని పిలవడం మొదలు పెట్టినప్పటి నుంచీ అనిత నన్ను ‘డాడీ’ అనడం మొదలుపెట్టింది. మనవడి తోనూ ‘డాడీ’ అని పిలిపిస్తాననేది. మా 27 ఏళ్ల వైవాహిక జీవితంలో నన్ను పేరు పెట్టి పిలిచింది లేదు.

27 ఏళ్లు మీతో లైఫ్‌ పంచుకున్న అనితగారి హఠాన్మరణం...
రాజు: నిజంగా పెద్ద షాక్‌. డైనింగ్‌ టేబుల్‌ దగ్గర కూర్చుని, భోజనం చేస్తుంటే ఏదో వెలితి. ఆమె కూర్చునే కుర్చీ ఖాళీగా కనిపిస్తుంటే ఏదో బాధ. ప్రతిరోజూ ఆ చైర్‌ చూస్తున్నా. వద్దంటున్నా కొసరి కొసరి వడ్డించేది. ఆ మూమెంట్స్‌ వెంటాడుతున్నాయి. ఇప్పట్లో తేరుకోవడం అంటే... (కాసేపు మౌనం). డెఫినెట్‌గా ఓవర్‌కమ్‌ అవ్వాలి. అది అంత సులభం కాదని తెలుసు. వాస్తవానికి మా కుటుంబంలో నేను చూసిన రెండో మరణం ఇది. 32 ఏళ్ల క్రితం మా నాన్నగారి మేనత్తగారు చనిపోయారు. నాకు తెలిసిన డెత్‌ అదే. ఆ తర్వాత మా ఇంట్లో మళ్లీ చూడలేదు. ఇదిగో.. ఈ ఏడాది చూడాల్సి వచ్చింది.

హన్షితా (‘దిల్‌’ రాజు కుమార్తె).. మీకు బాబు పుట్టి నాలుగు నెలలే అయింది. ఇలాంటి టైమ్‌లో అమ్మమ్మ అవసరం బేబీకి చాలా ఉంటుంది కదా?
హన్షిత: అవునండి. నాకు బాబు పుట్టాలని అమ్మ కోరుకునేది. అది నిజమైనందుకు చాలా ఆనందపడింది. మనవణ్ణి చూసి అమ్మ చాలా మురిసిపోయేది. బాబు ఆలనా, పాలనా చూసుకునేది. ఆవిడ ధ్యాస అంతా వాడి మీదే. ఇప్పుడు అమ్మ లేదనే ఆలోచన భరించలేనంత బాధగా ఉంది. డెఫినెట్‌గా వియ్‌ మిస్‌ హర్‌.

  మీ సినిమాల కథలను అనితగారు వినేవారా?
రాజు: నేను, మా పాప సినిమాల గురించి ఎక్కువ డిస్కస్‌ చేసుకుంటాం. దాంతో ‘ఎప్పుడూ సినిమాల గురించేనా? వేరే టాపిక్‌ లేదా’ అనేది. ఇలాంటి కథతో సినిమా చేస్తున్నానని మా పాపకు చెబుతుండేవాణ్ణి. నా భార్యకు కథలు చెప్పింది లేదు. సినిమా రెడీ అయ్యాక చూపించేవాణ్ణి. సాంగ్స్‌ కావాలంటే వినిపించేవాణ్ణి.

  మీకు నేషనల్‌ అవార్డు తెచ్చిన ‘శతమానం భవతి’ చూసినప్పుడు అనితగారు ఏమన్నారు?
రాజు: తనకు చాలా నచ్చిన సినిమా. మేం కలసి చూసిన చివరి సినిమా అదే. కలసి ఎటెండ్‌ అయిన చివరి ఫంక్షన్‌ కూడా ఈ సినిమాదే. ‘శతమానం భవతి’ సినిమా ఆడియో ఫంక్షన్‌కు ఫ్యామిలీ మెంబర్స్‌ అంతా హాజరయ్యాం. ఆ రోజు నాన్నగారి పుట్టినరోజుని ఆ స్టేజిపైనే సెలబ్రేట్‌ చేశాం. ఆ తర్వాత ‘శతమానం భవతి’ సక్సెస్‌మీట్‌కు అందరం కలసి వెళ్లాం. అదే లాస్ట్‌.

♦  మీ నాన్నగారు తీసిన సినిమాల్లో మీకు నచ్చినవి?
హన్షిత: నాకు బాగా నచ్చిన సినిమా ‘బొమ్మరిల్లు’, ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’. ‘శతమానం భవతి’ కూడా నచ్చింది.

  మీ నాన్నగారు ‘బొమ్మరిల్లు’ టైప్‌ ఫాదర్‌ కాదని అర్థమవుతోంది...
హన్షిత: ఆ ఫాదర్‌లా మా నాన్నగారు స్ట్రిక్ట్‌ కాదు. ఈయన ఫ్రెండ్లీ ఫాదర్‌. ఎగ్జామ్స్‌ టైమ్‌లో నేను ఉదయం ఐదు గంటలకు అలారం పెట్టుకుని పడుకునేదాన్ని. ఐదు గంటలకు మోగినా లేచేదాన్ని కాదు. అమ్మానాన్న కూడా నిద్ర లేపేవాళ్లు కాదు. సరిగ్గా నిద్ర పోకపోతే ఎగ్జామ్స్‌ రాయడం కష్టం అనేవాళ్లు. అలా చదివితేనే నాకు 60 పర్సెంట్, 70 పర్సెంట్‌ వచ్చేది. నువ్వింకా ఎక్కువసేపు చదివితే ఇంకా మంచి పర్సంటేజ్‌ వచ్చేదని ప్రోత్సహించేవారు.

అనితగారు చనిపోయినప్పుడు మీరు అమెరికాలో ఉన్నారు. అక్కణ్ణుంచి ఇక్కడివరకూ రావడానికి పట్టిన టైమ్‌లో మీరెలా ఫీలయ్యారు?
రాజు: నా లైఫ్‌లో ఆ రోజు వరస్ట్‌ డే. నాకు 46 ఏళ్లు కంప్లీట్‌ కావస్తున్నాయి. జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూశాను. మంచి, చెడు రోజులు చాలానే ఉన్నాయి. కానీ, ఈ వార్తను మాత్రం జీర్ణించుకోలేకపోయాను. నిజానికి కొన్ని సంఘటనలు విచిత్రంగా జరిగాయి. నేను నైట్‌ జర్నీస్‌ చేసినప్పుడు ఆమెను నిద్ర లేవద్దని చెప్పేవాణ్ణి. తను కూడా లేచేది కాదు.

కానీ, లాస్ట్‌ మంథ్‌ సిక్త్స్‌ నేను రాత్రి రెండు గంటలకు ఎయిర్‌పోర్ట్‌కి బయల్దేరినప్పుడు తను నిద్రలేచి సాగనంపింది. ఆ రోజు ఉదయం పావ్‌ బాజీ చేసి, తినేవరకూ ఊరుకోలేదు. ఆమె చేతుల మీదగా తిన్న చివరి ఫుడ్‌ అదే. అంతకు ముందు రోజు మనవడు బోర్లా పడుతున్నాడని వాళ్ల అమ్మానాన్నలను ఇంటికి పిలిపించింది. నేనిక్కడ లేనప్పుడు జరగరానిది జరుగుతుంది కాబట్టి, మా పాపకు తోడుగా ఉండటం కోసం అనిత తన అమ్మానాన్నలను మా ఇంటికి పిలిచేలా గాడ్‌ డిజైన్‌ చేశాడేమో.

జీవితం ఊహించలేని ఓ ప్రయాణం అనేది ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అనిపిస్తుంటుంది కదా?
రాజు: అవును. నిజానికి మా ఇంట్లో ఈ చెడు సంఘటన జరగక ముందు నాకెందుకో తెలియని కలవరం. చెడు జరగబోతోందని అనిపిస్తుండేది. నేనొకటి ప్లాన్‌ చేస్తే వేరే ఒకటి జరిగేది. ఫర్‌ ఎగ్జాంపుల్‌.. ‘డీజె’ షూటింగ్‌ కోసం నేను కర్ణాటకలోని బేలూరు వెళ్లాలి. యూనిట్‌ మొత్తం వెళ్లారు. నాకు జ్వరం రావడంతో ఆగిపోయాను. తర్వాత రోజు మార్నింగ్‌ ఫ్లైట్‌ బుక్‌ చేసుకుని బెంగళూరు వెళ్లి, అక్కడి నుంచి బేలూరు వెళ్లా. అప్పటికే మధ్యాహ్నం దాటిపోయింది.

టెంపుల్‌లో షూట్‌ ప్లాన్‌ చేశాం. కానీ, పర్మిషన్‌ దొరకలేదు. అందరి డేట్స్‌ వేస్ట్‌ అవుతాయి. ఏం చేయాలా? అని ఆలోచిస్తున్నప్పుడు హరీష్‌ శంకర్‌ నిజమాబాద్‌లోనూ, సంఘీ టెంపుల్లోనూ రెండేసి రోజులు షూట్‌ చేద్దామన్నాడు. ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదు. ఏదో చెడు జరగబోతుందని నా సిక్త్స్‌ సెన్స్‌ చెబుతోంది. నా మనసుకి అనిపించినట్లుగానే చెడు జరిగింది. మార్చి 19న బ్రహ్మోత్సవాలకి వెళ్లాలనుకున్నాం. 11న ఊహించని సంఘటన జరిగింది.

♦  అనితగారి మరణం తర్వాత ‘ఇదే ఇదే జీవితం..’ అనే పాటను పదే పదే విన్నానని ఇటీవల చెప్పారు. ఫిలసాఫికల్‌గా మీలో ఏమైనా మార్పు వచ్చిందా?
రాజు: మార్పు తప్పకుండా ఉంది. అయితే దాని ప్రభావం ఏ రేంజ్‌లో ఉంటుందనేది లాంగ్‌ రన్‌లో తెలుస్తుంది. ఎంత బాధలో ఉన్నా దాన్నుంచి డీవియేట్‌ అయ్యి, ప్రాజెక్ట్స్‌ కంప్లీట్‌ చేయాలి. నన్ను మావాళ్లందరూ ఒంటరిగా వదలడంలేదు. హర్షిత్‌ (‘దిల్‌’ రాజు అన్నయ్య నరసింహారెడ్డి కొడుకు) అయితే నాతోనే ఉంటూ, నా రూమ్‌లోనే  పడుకుంటున్నాడు.

నేను పదమూడు రోజు లు ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేదు. ఆ సమయంలో ‘ఇదే ఇదే జీవితం.. సుఖః దుఃఖాల సంగమం’ పాట విన్నా. అప్పుడనిపించింది.. రచయితలు ఊరికే రాయరు. జీవితానుభవాలనే రాస్తారని. ఆ థాట్‌ ప్రాసెస్‌లో ఒక స్టోరీ లైన్‌ తట్టింది. ఆ స్టోరీతో సినిమా తీయాలనుకుంటున్నా. జీవితం చాలా విచిత్రం. గడచిన 5 నెలల్లో ‘శతమానం భవతి’ ఒక హ్యాపీనెస్, గ్రాండ్‌సన్‌ ఓ హ్యాపీనెస్, ‘నేను లోకల్‌’ ఒక హ్యాపీనెస్‌. అద్భుతంగా లైఫ్‌ ముందుకు వెళుతోంది అనుకున్నప్పుడు దేవుడు అనుకోని జర్క్‌ ఇచ్చాడు. ఆ జర్క్‌లో ఉండగానే నేషనల్‌ అవార్డు, చక్రపాణి, నాగిరెడ్డిగారి అవార్డు దక్కాయి. 5 నెలల్లో అటూ.. ఇటూ చూపించాడు. ఆ పాట సరిగ్గా నా పరిస్థితికి తగ్గట్టుగా ఉంది. అందుకే విన్నాను.

మీది లవ్‌ మ్యారేజ్‌ కదా...
రాజు: 1989లో మా కజిన్‌ పెళ్లిలో తనని చూశా. పెళ్లికూతురితో పాటు వస్తారు కదా.. వాళ్లతో పాటు వచ్చింది. ఆ పెళ్లి సమయంలోనే మా పెద్దమ్మగారి ఇంట్లో ఓ నాలుగు రోజులు అందరం ఉన్నాం. అప్పుడు ఏర్పడిన పరిచయం ఇష్టంగా మారింది. ఇంట్లో కొంచెం కష్టపడే పెళ్లికి ఒప్పించాం. అప్పుడు నాకు 20 ఏళ్లే.

డిస్ట్రిబ్యూటర్‌గా, నిర్మాతగా మీ విజయాలకు అనితగారు గర్వపడేవారా?
రాజు: గర్వం అంటే తెలియదు. సింపుల్‌ పర్సన్‌. ఫ్యామిలీ మెంబర్స్‌ని బాగా చూసుకునేది. కథలు చెప్పడానికి మా ఇంటికి వచ్చినవారిని ఎంతో మర్యాదగా చూసేది.

♦  ఇప్పుడు మీ మనసుకి స్వాంతన మీ మనవడే కదా...
రాజు: అవును. ఆర్షాన్‌ టైమింగ్స్‌ను బట్టి నా టైమింగ్స్‌ను ఛేంజ్‌ చేసుకున్నాను. మార్నింగ్‌ 7గంటలకి లేస్తాడు. ఆ ౖటైమ్‌కి ఇంట్లో ఉంటున్నా. సాయంత్రం 5 నుంచి 7 గంటలు కూడా వాడితోనే. ఆర్షాన్‌తో టైం స్పెండ్‌ చేయడానికి షూటింగ్‌ స్పాట్‌ నుంచి కొంచెం త్వరగానే ఇంటికి వెళుతున్నాను. ఇప్పుడు వాడే నాకు ఊరట.



అమ్మ మా మధ్యే ఉందనిపిస్తోంది
మా అమ్మ మా మాధ్య లేదన్న నిజాన్ని నమ్మలేకపోతున్నా. పిల్లాడితో ఆడుకుంటున్నప్పుడు ఆమె పక్కనే ఉన్న ఫీలింగ్‌ కలుగుతుంటుంది. లేకపోతే కిచెన్‌లో ఉందనో, మేడ మీదకు వెళ్లిందనో, బయటకు వెళ్లింది.. వచ్చేస్తుందనో అనిపిస్తుంటుంది. నాకు తెలియకుండానే ఒక్కొక్కసారి ‘అమ్మా’ అని పిలుస్తున్నాను. వెంటనే గుర్తొచ్చి కన్నీళ్ళు వస్తాయి. సడన్‌గా కదా... నమ్మలేకపోతున్నాను. అమ్మను హాస్పిటల్‌కి తీసుకెళ్లింది నేనే. డాక్టర్స్‌ హార్ట్‌ బీట్‌ లేదంటే, ఏం కాలేదు. ముందు సెలైన్‌ ఎక్కించండి అంటూ వాదించాను. అమ్మ లేదనే విషయాన్ని నమ్మడానికి ఇంకా టైమ్‌ పడుతుంది. – హన్షిత

మా పాప స్ట్రాంగ్‌ అయి నన్ను సముదాయించింది
అనిత మరణం గురించి ముందు మా అల్లుడు అర్చిత్‌ చెప్పాడు. అప్పుడు అమెరికాలో ఎర్లీ మార్నింగ్‌ ఫైవ్‌ థర్టీ. ఆ న్యూస్‌ వినగానే 10 నిమిషాల పాటు బ్లాంక్‌ అయ్యాను. నా ఆలోచన అంతా మా పాప గురించే. కాసేపటికి హరీష్‌ శంకర్‌ (డైరెక్టర్‌) ఫోన్‌ చేశాడు. ‘అన్నా తొందరగా రా అన్నా. పాపను చూడలేకపోతున్నాం’ అన్నాడు. అక్కడే నాతోపాటు ఉన్న నా కజిన్‌ శిరీష్‌ చాలా బాధపడ్డాడు.

అనితకు వాడు బాగా ఎటాచ్డ్‌. శిరీష్‌ కంట్రోల్‌ కావడం లేదు. హర్షిత్‌ ఏమో నన్ను, శిరీష్‌ను కంట్రోల్‌ చేయడానికి ప్రయత్నించాడు. ఫ్లైట్‌ ఎక్కాక మాకు ఫోన్‌ కాల్స్‌ లేవు. వాట్సాప్‌లో టచ్‌లో ఉన్నారు. నేను ఇంటికి వచ్చిన తర్వాత కుప్ప కూలిపోతానని మా పాపకు తెలుసు. అందుకే తనను తాను సంభాళించుకుంది. తను స్ట్రాంగ్‌ అయి, నన్ను సముదాయించింది. నేను ఇంటి దగ్గర కారు దిగగానే, తనే బయటకు వచ్చి నన్ను లోపలికి తీసుకెళ్లింది. –  ‘దిల్‌’ రాజు

27తో ఏదో ఉంది!     
మా అమ్మానాన్నల జీవితంలో ‘27’కి కీ రోల్‌ ఉందనిపిస్తోంది. వాళ్లిద్దరూ కలిసి చూసిన మొదటి సినిమా ‘గీతాంజలి’ (1990). 27 ఏళ్ల క్రితం వచ్చిన ఆ సినిమాకి నేషనల్‌ అవార్డు వచ్చింది. ఆ సినిమా వచ్చిన 27 ఏళ్లకు ‘శతమానం భవతి’ వచ్చింది. దీనికీ నేషనల్‌ అవార్డు దక్కింది. అమ్మ చనిపోయాక అమెరికా నుంచి నాన్నగారు ఇక్కడికి రావడానికి 27 గంటలు పట్టింది. పెళ్లయిన 27 ఏళ్లకు అమ్మ చనిపోయింది. – హన్షిత

ఆ 27 గంటలూ ఏవో ఆలోచనలు   
 
అనిత చనిపోయిందనే కబురు వచ్చాక అమెరికా నుంచి నాకు ఇక్కడికి రావడానికి 27 గంటలు పట్టింది. అన్ని గంటల్లో నాకు కంటి మీద కునుకు రాలేదు. ఏవో జ్ఞాపకాలు కళ్లు మూత పడనివ్వలేదు. ఏదేమైనా ఆ భగవంతుని డిజైన్‌ విచిత్రంగా ఉంటుంది.  –  ‘దిల్‌’ రాజు

ప్రస్తుతం చేస్తున్న సినిమాలు?
‘డీజే’, ‘ఫిదా’ కంప్లీట్‌ స్టేజ్‌కి వచ్చేశాయి. జూలై లోపు రెండు ప్రాజెక్ట్స్‌ రిలీజ్‌ అవుతాయి. రవితేజతో ‘రాజా ది గ్రేట్‌’ స్టార్ట్‌ చేశాం. నాని హీరోగా ‘ఎమ్‌.సి.ఎ’ స్టార్ట్‌ చేయాలి. ఇప్పటికే ఈ ఏడాది మా బేనర్‌ నుంచి ‘శతమానం భవతి’, ‘నేను లోకల్‌’ వచ్చాయి. రెండూ హిట్‌. ఈ ఇయర్‌ ఆగస్ట్‌లోపు నాలుగు సినిమాలు రిలీజ్‌ అవుతాయి. బహుశా ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఒకే బ్యానర్‌లో ఒకే ఏడాది ఆరు సినిమాలు రావడం ఇదే మొదటిసారేమో. చెక్‌ చేయాలి.

♦  డైరెక్టర్‌గా మారే ఆలోచన ఉందా?
రాజు: లేదు. డైరెక్షన్‌ తెలియదని కాదు. కానీ చేయను. స్క్రిప్ట్, సీన్స్‌ గురించి మాత్రం డైరెక్టర్స్‌తో డిస్కస్‌ చేస్తాను. సినిమా రిజల్ట్‌ను చాలావరకూ జడ్జ్‌ చేయగలుగుతాను. ‘శతమానం భవతి’ క్లాసిక్‌ అవుతుందనుకున్నా. నంది అవార్డు కూడా వస్తుందనుకున్నా. ఏకంగా నేషనల్‌ అవార్డు వచ్చింది. 2017లో ‘బాహుబలి–2’ రిలీజ్‌ అవుతుంది.

అవార్డులు ఆ సినిమాకే వచ్చే ఛాన్స్‌ ఎక్కువ. అందుకే నంది అవార్డు కోసం ‘శతమానం భవతి’ సినిమాని 2016లోనే సెన్సార్‌ చేయించాం. నా బ్రదర్‌ నర్సింహారెడ్డి ఎడిటింగ్‌ రూమ్‌లో ‘శతమానం భవతి’ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. డెఫినెట్‌గా నేషనల్‌ అవార్డు వస్తుందని ఆయన అన్నారు. అది నిజమైంది.

  మీ ప్రతి సినిమా రిలీజ్‌కు ముందు తిరుమల వెళ్లి తలనీలాలు ఇస్తారు.. ఫస్ట్‌ టైమ్‌ ఎప్పుడు మొదలుపెట్టారు?
రాజు: డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నప్పుడే. ‘పెళ్లి పందిరి’ నుంచి తలనీలాలు ఇవ్వడం స్టార్ట్‌ చేశాను. దేవుడు ఈ ఏడాది నాకా అదృష్టం ఇవ్వలేదు. ఈ ఇయర్‌ నాలుగు సినిమాలు రిలీజ్‌ అవుతాయి. మరో వన్‌ ఇయర్‌ వరకు నేను గుడికి వెళ్లకూడదు కదా. 2016 ప్రొఫెషనల్‌గా ఇప్పటివరకూ రెండు సక్సెస్‌లు ఇచ్చింది. పర్సనల్‌గా ఓ చేదు అనుభవాన్ని మిగిల్చింది. జీవితం ఇంతే. ఒక మంచి... ఒక చెడు... ఒక చెడు... ఒక మంచి. దేవుడు అలా డిజైన్‌ చేస్తాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement