పూలకు పండగొచ్చింది | Special Story On Batukamma Celebrations | Sakshi
Sakshi News home page

పూలకు పండగొచ్చింది

Published Sun, Sep 29 2019 4:53 AM | Last Updated on Sun, Sep 29 2019 4:53 AM

Special Story On Batukamma Celebrations - Sakshi

రకరకాల పరిమళ భరిత పువ్వులతో దేవతలను పూజించడం హైందవ సంప్రదాయం. అయితే పువ్వుల రాశినే దేవతా మూర్తిగా భావించి పూజ చేయడం ఈ పండుగ ప్రత్యేకత. అదే బతుకమ్మ పండుగ. ఆంధ్రప్రదేశ్‌లో అంగరంగవైభవంగా జరిగే దసరా నవరాత్రులకు ఒకరోజు ముందే బతుకమ్మ పండుగ సంబరాలు ప్రారంభమవుతాయి. పూలతో పండగ చేసుకోవడం కాదు... పూలకే పండగ వేడుకలు చేయడం బతుకమ్మ ప్రత్యేకత. ఈ పండుగ విశేషాలు...

ఆశ్వయుజ మాసం వచ్చేస్తుందంటే.. బతుకమ్మ పండుగ కూడా వచ్చేసినట్లే. భాద్రపద అమావాస్య నుంచి తొమ్మిదిరోజుల పాటు జరిగే ఈ పండగ తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కూడా కొన్ని ప్రాంతాలలో జరుపుకుంటారు. అయితే ఆంధ్రప్రదేశ్‌ కంటే తెలంగాణలో ఈ పండుగకి ఎంతో ప్రాముఖ్యత వుంది. ఎంత ప్రాముఖ్యత అంటే, రాష్ట్ర పండుగగా అధికారికంగా జరిపేంత.  ఈ పండుగను బతుకమ్మ పండుగ, గౌరి పండుగ, సద్దుల పండుగ అనే పేర్లతో పిలుస్తారు. బతుకమ్మ అంటే సంబురమే సంబురం. పండుగకు వారం ముందు నుంచే ఇళ్ళలో హడావిడి మొదలవుతుంది. ఈ వేడుక కోసం ఎదురు చూస్తున్న ఆడపడుచులు ముందే పుట్టింటికి చేరుకుని ఆనందోత్సాహాలతో పండగ ఏర్పాట్లు చేసుకుంటారు. ప్రధాన పండుగకి వారం రోజుల ముందు నుంచే తెలంగాణ ఆడపడుచులు రంగు రంగుల పూలతో త్రికోణాకారంలో పేర్చి అలంకరించిన చిన్న చిన్న బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ పాడే బతుకమ్మ పాటలు పాడతారు.

ఆ పాటల వెనుక మర్మం ఇదే..!
నవాబులు, భూస్వాముల పెత్తందారీ తనంలో నలిగిపోయిన తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి. వారి అకృత్యాలకు నలిగిపోయిన వారిని, తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వారిని తలచుకొని తోటి మహిళలు విచారించేవారు.. వారికి ప్రతీకగా పూలను పేర్చి బతుకవమ్మా లేదా బతుకు అమ్మా అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు..ఈ పండుగ వర్షాకాలపు చివరిలో, శీతాకాలపు తొలి రోజులలో వస్తుంది. అప్పటికే వర్షాలతో చెరువులన్నీ మంచి నీటితో నిండి ఉంటాయి. రకరకాల పువ్వులు రంగు రంగులలో ఆరుబయలులో పూసి ఉంటాయి. వీటిలో గునుగు పూలు, తంగేడు పూలు ఎక్కువగా పూస్తాయి. బంతి, చేమంతి, నంది వర్ధనం లాంటి పూలకు కూడా ఇదే సమయం. వీటన్నింటి నేపథ్యంలో తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి  సౌందర్యాన్ని అద్భుతమయిన రంగురంగుల పువ్వులతో కీర్తిస్తూ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. గునుగు, తంగేడు పూలతోపాటు అనేకరకాల పూలు ఒక రాగి పళ్ళెంలో పేర్చుతారు. ఒక రంగు పువ్వు తర్వాత మరో రంగు పువ్వును పేరుస్తూ ఆకర్షణీయంగా వుండే విధంగా బతుకమ్మని తయారు చేస్తారు. ఈ పూల అమరిక ఎంత పెద్దగా వుంటే బతుకమ్మ అంత అందంగా కనిపిస్తుంది.

పూలను చక్కగా పేర్చడం పూర్తయిన తర్వాత బతుకమ్మ మీద పసుపుతో చేసిన గౌరీమాతను పెట్టి చుట్టూ దీపాలతో అలంకరిస్తారు. ఇలా తయారు చేసిన బతుకమ్మను పూజగదిలో అమర్చి పూజిస్తారు. పూజ పూర్తయ్యాక బతుకమ్మని బయటకి తీసుకువచ్చి ఆడపడుచులు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతారు. ఆటలు పూర్తయ్యాక వాటిని చెరువులో నిమజ్జనం చేస్తారు. ఆపై ఆ పళ్లెంలో తెచ్చిన నీటితో వాయనాలు ఇచ్చి పుచ్చుకుంటా రు. వాయనాలు పూర్తయ్యాక.. సత్తుపిండి ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుని ప్రసాదంలా స్వీకరిస్తారు. ఈ పండుగరోజుల్లో పుట్టమన్నుతో ఒక బొమ్మను చేసి, బహుళ పంచమి నాడు దానిని ప్రతిష్ఠించి దాని పైన, ఒక కలశాన్ని వుంచి, కలశంపైన పసుపు ముద్దతో గౌరమ్మను నిలిపి పూలతోనూ, పసుపుతోనూ అలంక రిస్తారు. బొడ్డెమ్మను నిలిపిన తరువాత ఆ వాడలో వున్న ఆడపిల్లలందరూ అక్కడ గుమికూడుతారు. ఈ వినోదాన్ని చూడడానికి పెద్దలందరూ వస్తారు. ఇలా ఎనిమిది రోజులూ కన్నెపడచులు ఆడుకుంటారు.

తరువాత నవమి రోజున కోడి కూసే సమయాన స్త్రీలు లేచి, పరిసరాలన్నీ తిరిగి రకరకాల పూలు సేకరించి గోరువెచ్చని జీడిగింజల నూనెతో తలంటి పోసుకుని నూతన వస్త్రాలు ధరించి అలికి ముగ్గులు వేసిన ఇంట్లో బతకమ్మలను పేర్చి గుమ్మడి పూవు అండాశయాన్ని తుంచి పసిడి గౌరమ్మగా పెడతారు. పసుపుతో ముద్ద గౌరమ్మను చేసి పెట్టి అగరవత్తులు వెలిగించి పసుపు కుంకాలతో అలంకరించి పగలంతా అలాగే వుంచుతారు.సాయంత్రం పిన్నలు, పెద్దలు, నూతన వస్త్రాలు ధరించి స్త్రీలు, వివిధ అలంకారాలను అలంకరించుకుని బతకమ్మలను చేత బట్టుకుని చెరువు కట్టకో, కాలువ గట్టుకో దేవాలయానికో వెళ్ళి బతకమ్మలను మధ్య వుంచి, బాలికలు, కన్నె పడుచులు, స్త్రీలు వాటి చుట్టూ తిరుగుతూ చప్పట్లు చరుస్తూ, గొంతెత్తి ఒకరు పాడగా వలయాకారంగా తిరుగుతున్న వారు ఆ పాటను అనుసరిస్తూ పాడుతారు.

మగపిల్లలు కొయ్యగొట్టాలలో, కాగితపు అంచులను కన్నెపిల్లల పైనా స్త్రీల పైనా ప్రయోగిస్తారు. బతకమ్మ పాటలు, ఒకో ప్రాంతంలో ఆయా మాండలిక పదాలతో ప్రతి చరణాంతం లోనూ, ఉయ్యాలో అని, కోల్‌ కోల్‌ అనీ, చందమామా అనీ, గౌరమ్మ అనీ పదాలు పాడతారు. పాటల్లో లక్ష్మీ సరస్వతుల స్తోత్రాలేగాక, అనేక పౌరాణిక గాథలైన, శశిరేఖ, సతీ అనసూయ, కృష్ణలీల, సీతాదేవి వనవాసం మొదలైనవే గాక, సారంగధర, బాలనాగమ్మకు సంబంధించిన వినసొంపైన ఎన్నో పాటలు పాడుతూ వుంటారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయా లకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది. స్త్రీలకు సంబం« దించిన ఈ పండుగలో అందరూ చల్లగా ఉండాలని గౌరమ్మను ప్రార్థిస్తారు. ప్రతి మనిషికి ప్రకృతితో విడదీయరాని సంబంధం ఉంటుంది. బతుకమ్మ పండుగకి తొమ్మిదిరోజులపాటు మనిషి ప్రకృతితో మమైకమైపోతాడు. అదే బతుకమ్మ పండుగ గొప్పతనం.

►తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో మొదటిరోజు బతుకమ్మను ఎంగిలిపువ్వు బతుకమ్మ అని, చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని అంటారు.  ఈ రోజుల్లో ఆడపడుచులు అందరూ అత్తవారింటి నుంచి కన్నవారింటికి చేరుకుని ఈ పూల పండుగ జరుపుకోవటానికి తయారవుతారు. ఈ తొమ్మిది రోజులలో వీరు రోజూ బతుకమ్మలు చేసి, ప్రతీ సాయంత్రం వాటి చుట్టూ తిరుగుతూ ఆడుతారు. ఆ తరువాత దగ్గరలో  ఉన్న జలాలలో నిమజ్జనం చేస్తారు.
– పూర్ణిమాస్వాతి గోపరాజు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement