క్యాన్సరే విలన్‌ | Special story to bollywood celebrities cancer problmes | Sakshi
Sakshi News home page

క్యాన్సరే విలన్‌

Published Sat, Jul 7 2018 1:06 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

 Special story to bollywood celebrities cancer problmes - Sakshi

విలన్‌ ఎంత పెద్దవాడైతే వాడి తాట తీసిన హీరోఅంత గొప్పవాడు అవుతాడు. సినిమా కథలు రాసుకునేవాళ్లుసినిమాలు తీసినవాళ్లు.. నమ్మిన విషయం ఇది.సినిమాలోనే కాదు, జీవితంలో కూడావిలన్‌ని తుదముట్టించినవాళ్లు..విలన్‌తో పోరాడినవాళ్లు. పోరాడుతూ ప్రాణ త్యాగం చేసినవారు.. అసలైన సినిమా హీరోలు!

‘‘కొన్నిసార్లు మనం ఊహించని పరిణామాలను జీవితం మనకు ప్రసాదిస్తుంది. బాగా నొప్పి కారణంగా సాధారణ వైద్య పరీక్షలు చేయించుకుంటే.. అది సర్వశక్తులతో పోరాడాల్సిన వ్యాధిని నాకు పరిచయం చేసింది.’’..  నిన్నటి తరం బాలీవుడ్‌ అందాల నటి సోనాలీ బింద్రె తనకు కేన్సర్‌ ఉన్నట్టు నిర్ధారణ అయిన తర్వాత చేసిన ట్వీట్‌ సారాంశం ఇది. తనకు హై గ్రేడ్‌ క్యాన్సర్‌ ఉన్నట్టు తేలిందని, దీనిని తాను కనీసం ఊహించను కూడా లేదని, అయినప్పటికీ నా కుటుంబం,  స్నేహితులే దన్నుగా ఆశావాహ దృక్పథంతో తాను యుద్ధానికి సిద్ధమయ్యానని ఆమె ప్రశంసనీయమైన ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించారు. ప్రస్తుతం న్యూయార్క్‌లో చికిత్స తీసుకుంటున్న సోనాలీ.. తనను మింగేయడానికి వచ్చిన రాకాసితో పోరాడి గెలిచేందుకు మానసికంగా సిద్ధమయ్యారు.

ఒకప్పుడు గొప్పగొప్పవాళ్లకే వస్తుందనుకుని క్యాన్సర్‌ను ‘రాచపుండు’ అనేవారు. ఇప్పుడు అందరికీ చుట్టమైపోయిన క్యాన్సర్‌.. తొలి నుంచీ తెరవేల్పులను గట్టిగానే పీడిస్తోంది. అందాల తారల్ని, గ్లామర్‌ రంగాన్ని చూసి తనకూ అసూయ పుట్టిందేమో అన్నట్టుగా శరీరంలోని కళాకాంతుల్ని పూర్తిగా నాశనం చేసేద్దామన్నంత కాంక్షగా వారిని ఆక్రమించుకుంటోంది. ఇటీవలి కాలంలో పలువురు సినీ తారలు ఈ వ్యాధి బారిన పడిన ఉదంతాలు, దానిని దీటుగా ఎదుర్కొని జయించిన విజయగా«థలు మనం వింటూ వచ్చాం. 

నర్గీస్‌దత్‌: క్యాన్సర్‌ కాటుకు గురైన అత్యంత ప్రముఖుల్లో  చాలా మందికి తెలిసిన పేరు నర్గీస్‌. ఈ అందాల నటి,  మాజీ ఎంపీ సునీల్‌దత్‌ భార్య. అప్పట్లో.. అంటే 1950ల కాలంలో స్టార్‌గా వెలిగిన నర్గీస్‌ దత్‌ పాంక్రియాట్రిక్‌ క్యాన్సర్‌ వ్యాధికి గురై న్యూయార్క్‌లో చికిత్స అనంతరం ఇండియాకి తిరిగివచ్చినా.. మళ్లీ ఆసుపత్రి పాలయ్యారు. కోమాలోకి వెళ్లి, ఒక్కరోజులోనే మృతి చెందారు. తెరమీద  తన కొడుకు సంజయ్‌దత్‌ని హీరోగా చూడాలన్న కోరిక తీరకుండానే, సంజయ్‌ తొలి సినిమా విడుదలకు వారం రోజుల ముందే ఆమెను క్యాన్సర్‌ నిర్ధాక్షిణ్యంగా కబళించేసింది. 

రాజేశ్‌ఖన్నా: ఇదే వ్యాధికి గురై జీవితాన్ని కోల్పోయిన మరో అగ్రతార రాజేశ్‌ఖన్నా. ఒకనాటి ఈ అమ్మాయిల కలల రాకుమారుడు కూడా క్యాన్సర్‌ ఆకలికి ఆహారం కాక తప్పలేదు. సినీ, రాజకీయ రంగాల్లో రాణించిన రాజేశ్‌ఖన్నా 2011లో ఈ వ్యాధి బారిన పడి ఏడాది కూడా తిరగకుండానే, తనకు 60 ఏళ్ల వయసులోనే మరణించాడు. ఒకానొక టైమ్‌లో అమితాబ్‌ వంటి టాప్‌ స్టార్స్‌ సరసన చోటు సంపాదించుకున్న వినోద్‌ఖన్నా కూడా  అడ్వాన్స్‌డ్‌ బ్లాడర్‌ క్యాన్సర్‌ బాధితుడిగా మారి.. 70 ఏళ్ల వయసులో దానితో పోరాడలేక మననుంచి దూరమైపోయాడు. 

ముంతాజ్‌ : అయితే అలనాటి తారల్లో కూడా క్యాన్సర్‌పై మొక్కవోని దీక్షతో పోరాడుతున్నవారు ఇంకా ఉన్నారు. అలాంటి వారిలో చెప్పుకోవాల్సింది అందాల నటి ముంతాజ్‌ పేరు. 54 ఏళ్ల వయసులో 2002లో బ్రెస్ట్‌ క్యాన్సర్‌కి గురైన ముంతాజ్‌... అరడజను కీమోథెరపీలు, 35 రేడియేషన్ల తర్వాత కూడా ఇంకా దానితో పోరాడుతూనే ఉన్నారు. ‘‘నేనంత తేలికగా దేనినీ వదలను. ఆఖరికి ప్రాణాన్ని కూడా. గుమ్మం దాకా వచ్చిన చావుతో కూడా యుద్ధం చేస్తా’’ అని ఎంతో పట్టుదలగా చెబుతారామె. 

మనీషా కొయిరాలా: నవతరం తారల్లో కూడా అనేకమంది ఈ ప్రాణాంతక వ్యాధిని ఎదుర్కోవడంలో పై చేయి సాధిస్తుండటం కనిపిస్తోంది. అలాంటివారిలో మనీషా ఒకరు. 1942 ఎ లవ్‌స్టోరీ, బొంబాయి, భారతీయుడు, ఒకే ఒక్కడు వంటి  90ల నాటి చిత్రాలతో ఉత్తరాది, దక్షిణాది ప్రేక్షకుల కలల రాణిలా మారి ఎందరికో నిదురను దూరం చేసిన  మనీషా కొయిరాలా.. కొంత కాలం తర్వాత నున్నని గుండుతో, పీక్కుపోయిన చెంపలతో వాడిపోయిన వదనంతో ఉన్న ఫొటోలను పోస్ట్‌ చేయగా చూసిన ఆమె అభిమానుల గుండెలు బద్దలైపోయాయి. అవును మరి... మనీషా...  ఓవెరీన్‌ క్యాన్సర్‌ బారినపడ్డారు. మృత్యుముఖం దాకా వెళ్లి , మూడేళ్ల పోరాటం తర్వాత కోలుకున్నారు. అమెరికాలో చికిత్స చేయించుకున్న ఈ 47 ఏళ్ల నటి ప్రస్తుతం క్యాన్సర్‌ రహిత జీవితం గడుపుతూ... క్యాన్సర్‌పై పోరాటానికి ప్రేరణగా వెలుగుతున్నారు. 

లీసా రే: శరీరంలో ఎక్కడైనా వ్యాప్తి చెందగలిగిన ఈ ప్రాణాంతక సర్వాంతర్యామి... అందమైన తారల్ని మరింత మోహిస్తుందేమో అనిపిస్తుంది. బోంబే డైయింగ్‌ మోడల్‌గా, మహేష్‌బాబు సరసన టక్కరిదొంగ హీరోయిన్‌గా ప్రేక్షకుల్ని చూపు తిప్పుకోనివ్వని గ్లామర్‌ పంచిన లీసా రేపై కూడా ఈ వ్యాధి దాడి చేసింది. టొరంటోలో జన్మించడం, బెంగాలీ తండ్రి, పోలిష్‌ తల్లికి పుట్టడం లాంటి విశేషవంతమైన జీవితం ఉన్న లిసారేకు సోకిన క్యాన్సర్‌ కూడా విశేషమైనదే. ఆమె ఎటోబైకోక్‌ అనే అత్యంత అరుదైన తరహా క్యాన్సర్‌కి గురయ్యారు. యాంటీబాడీస్‌ని ఉత్పత్తి చేసే ప్లాస్మా సెల్స్‌కు సోకే క్యాన్సర్‌కి ఆమె బాధితురాలయ్యారు. ఒక స్టెమ్‌ సెల్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ చికిత్స తర్వాత 2010లో తాను క్యాన్సర్‌ నుంచి కోలుకున్నానని ఆమె ప్రకటించారు. అయితే ఇది పూర్తిగా నయమయ్యే వ్యాధి కానప్పటికీ.. దానికి తలవంచకుండా ఆత్మవిశ్వాసంతో లిసా రే జీవితాన్ని కొనసాగిస్తున్నారు. 

గౌతమి: దక్షిణాది కథానాయికగా మనకు చిరపరిచితమైన గౌతమి తాడిమల్ల కూడా ఇదే వ్యాధితో పోరాడి విజయం సాధించారు. తనను కబళించడానికి వచ్చిన  బ్రెస్ట్‌ క్యాన్సర్‌ను తరిమి కొట్టిన ఆమె తనలా పోరాడే వారికి అవసరమైన మద్దతును అందిస్తున్నారు.  దేశ విదేశాల్లో ఈ వ్యాధిపై నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ‘‘ఈ వ్యాధిపై పోరాడి జయించడంలో మనోబలం చాలా కీలకమైంది. దీనికి కావాల్సింది చుట్టుపక్కలవారి మద్దతు’’ అంటారామె. 

మమతా మోహన్‌దాస్‌: కెరీర్‌ పీక్‌లో ఉన్నప్పుడు.. మరిన్ని ఆశలతో ముందుకు దూసుకుపోతున్నప్పుడు, ప్రాణాలకు ప్రమాదం ఏర్పడిందని తేలితే... ఇంకెవరైనా అయితే కుప్పకూలిపోయేవారేమో కాని మన నటి మమతా మోహన్‌దాస్‌ మాత్రం కాదు. ప్రేక్షకుల రివార్డ్స్‌తో పాటు ఫిల్మ్‌ఫేర్‌ వంటి ప్రతిష్టాత్మక అవార్డులు కూడా దక్కించుకున్న ఆనందంతో ఉన్న ఆమెను అదే సమయంలో కేన్సర్‌ పలకరించింది. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం ఆమెకు హడ్గికిన్‌ లింఫోమా కేన్సర్‌ సోకింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా చికిత్స కొనసాగిస్తున్న ఆమె చాలా త్వరగానే ఆ వ్యాధి తాలూకు తీవ్ర ప్రభావం నుంచి బయటపడ్డారు. తన కెరీర్‌ను అలాగే కొనసాగిస్తున్నారు. ఇంతే కాదు... కైట్స్‌ సినిమాలో హృతిక్‌రోషన్‌ సరసన మెరిసిన బార్బరామోరి సైతం క్యాన్సర్‌ బాధితురాలే. అయితే సినిమాల్లోకి రావడానికి ముందే ఆమె ఈ వ్యాధి బారిన పడటం, దానిపై గెలవడం కూడా జరిగిపోయాయి. అదే సినిమాకు దర్శకత్వం వహించిన అనురాగ్‌ బసు, బార్బరాలు ఇద్దరూ  క్యాన్సర్‌ సర్వైవర్‌లే. ఆ సినిమా షూటింగ్‌ సమయంలోనే వీరిరువురూ తమ విజయగాథలను పంచుకున్నారు. 

ఇర్ఫాన్‌ ఖాన్‌: ప్రస్తుతం బాలీవుడ్‌లో క్రేజీ యాక్టర్‌గా వెలుగుతున్న సమయంలోనే ఇర్ఫాన్‌ సైతం క్యాన్సర్‌కు గురయ్యాడు. కొన్ని వారాల పాటు తన ఆరోగ్యంపై వచ్చిన వదంతుల అనంతరం ఈ బాలీవుడ్‌ యాక్టర్‌... మార్చి 16న తనకు న్యూరాన్‌ డొక్రైమ్‌ ట్యూమార్‌ ఉన్నట్టు ట్వీట్‌ ద్వారా నిర్ధారించాడు. ప్రస్తుతం లండన్‌లో చికిత్స పొందుతున్నాడు.  అలసిపోవడం సహజం. ఆగిపోవడం మరణం. ఊపిరి ఉన్నంత వరకూ ఆశను ఉంచుకో... అంటూ పట్టుదలతో ప్రాణాల్ని పట్టి ఉంచుతున్న ఈ తెరవెలుగుల ప్రయాణం మరెందరికో స్ఫూర్తిని అందిస్తుంది. తారల్లో రేపటి విజేత గురించి రాసేందుకు మరో పేజీని నీ కోసం సిద్ధంగా ఉంచాం... గెట్‌ వెల్‌ సూన్‌ సోనాలి. 

ఇల్‌నెస్‌.. విల్‌పవర్‌
పాంక్రియాస్‌ క్యాన్సర్‌కు మూడు నెలల పాటు యు.ఎస్‌.లో చికిత్స తీసుకుని ఇటీవలే తిరిగి విధులకు హాజరైన గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ గురువారం నాడు పత్రికా సంపాదకులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతున్నప్పుడు ప్రస్తావన మాత్రంగా క్యాన్సర్‌తో తనెలా పోరాడిందీ ఎంతో స్ఫూర్తివంతంగా చెప్పారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల తర్వాత తిరిగి ఆరు రోజుల పాటు చికిత్స కోసం యు.ఎస్‌.లో ఉండవలసి వస్తుందని చెబుతూ, విల్‌పవర్‌ ఉంటే ఎవరైనా, ఎలాంటి ‘ఇల్‌నెస్‌’నైనా ధైర్యంగా ఎదుర్కోవచ్చునని ఆయన అన్నారు. 
– సత్యబాబు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement