హైస్సా.. హైలెస్సా | special story to garikapati narasimha rao | Sakshi
Sakshi News home page

హైస్సా.. హైలెస్సా

Published Tue, Jan 2 2018 11:29 PM | Last Updated on Tue, Jan 2 2018 11:30 PM

special  story to garikapati narasimha rao - Sakshi

గరికపాటి నరసింహారావు, అవధాని, ఉపన్యాసకులు

పామరుడు తన శక్తికి మించిన కార్యం చేస్తున్నప్పుడు
దేవుణ్ని ఇలాగే తలచుకుంటాడేమో!
ఆ పామరుడికి తను దేవుణ్ణి తలచుకుంటున్నానన్న
విషయం కూడా తెలియకపోవచ్చు. 
హైస్సా.. హైలెస్సా.. అనే ఈ ఐదు అక్షరాలే..
అతడి పంచాక్షరీ మంత్రమేమో!
గరికపాటి ఈ సూక్ష్మాన్ని వివరిస్తూ..
‘పనే దైవం.. శ్రమే దైవ పూజ’ అని వ్యాఖ్యానించారు.

శాస్త్రాలు కనపడతాయి. దేవుడు కనపడడు కదా! శాస్త్రాలు దేవుడిని ఏ విధంగా చూపించాయి?  
వేదంలో దైవాన్ని ‘తత్‌’ అన్నారు. తత్‌ అంటే ‘అది’ అంటే వ్యాకరణంలో సర్వనామం. ఈ పదాన్ని వస్తువులకు, మనుషులకు అన్నింటికీ ఉపయోగిస్తాం. ‘అది’ ఒక శక్తి. దానికి తలో రకమైన భావన ఇచ్చుకున్నారు. చూసేవాళ్లు ఎంత మంది ఉంటే ‘అది’ అన్ని విధాలుగా కనపడు తుంది. వైదిక ధర్మంలో దైవానికి రూపకల్పన చేయలేదు. తర్వాత్తర్వాత ఓ రూపం తీసుకున్నారు. దైవాన్ని అంతర్ముఖంగా దర్శించాలే తప్ప బయటకు కనిపించేది కాదు.  

అంతర్ముఖులు అవడం అందరికీ సాధ్యమయ్యేదేనా? దైవాన్ని ఎలా దర్శించాలి?
సాధన చేస్తే ఏదైనా సాధ్యమే! కరెంట్‌ వైర్లలో విద్యుచ్ఛక్తి ఉంటుంది. కానీ, బయటకు కనిపిం చదు. బల్బు ద్వారా మనకు కరెంట్‌ ఉన్నట్టు తెలుస్తుంటుంది. అలాగే దేవుడు విశ్వమంతటా వ్యాపించి ఉన్నాడు. మనకు కనిపించడు. మంత్రం, బీజాక్షరంతో ఆలయంలో ప్రతిష్టించారు కాబట్టి అక్కడ దైవశక్తి వ్యక్తం అవుతుంది. దేవుడికి రూపం ఇవ్వకపోతే అర్చన, ఆరాధనలకు అనుకూలంగా ఉండవు కాబట్టి ఎవరి మనోభావాలను బట్టి వారు దైవాన్ని ప్రతిష్టించి, పూజించుకుంటున్నారు.  

ఈ తరహా ఆలోచనకు ముందు మీరు ఏ దైవాన్ని నమ్మేవారు?  
మా నాన్నగారు కనకదుర్గా ఉపాసకులు. ఆయన ఎప్పుడూ దైవం అనేవారు కాదు. ఏదైనా సమస్య వస్తే ‘అన్నీ అమ్మ చూసుకుంటుంది లేరా’ అనేవారు. మా కుటుంబసభ్యుల్లో అమ్మవారినీ ఒకరుగా భావించేవాళ్లం. అమ్మవారు శక్తి స్వరూపిణి. మనల్ని నడిపిస్తున్నది శక్తిగానే చెబుతాం. అందుకే ఆ శక్తిని అమ్మవారుగా భావించుకుంటాను. నా పద్యాల్లో ఎక్కువ భాగం అమ్మవారు, శివుడి మీదే ఉంటాయి. 

వెయ్యిమంది పండితులతో అవధానం చేశారు. మీకు అంతటి శక్తి ఎలా వచ్చింది?
ఇది కూడా లోపల ఉండే శక్తే. ప్రతి వ్యక్తిలోనూ శక్తి ఉంటుంది. సాహిత్యపరంగా ఉన్న ఆసక్తితో గ్రంథాలు చదవడం, దానిని వినియోగించుకోవడం వల్ల నాకీ «శక్తి వచ్చింది. చిన్ననాటి నుంచే తెలుగంటే అమితాసక్తి. పై తరగతులకు వెళ్లడానికి ముందే వేసవి సెలవుల్లో తెలుగు ఉపవాచకాన్ని కంఠతా చేసేవాడిని. అలా డిగ్రీకి వచ్చేసరికి నాలుగైదు వందల పద్యాలు కంఠస్తం చేశాను. ఫలానావాళ్లు వృద్ధిలోకి వచ్చారంటే వారెంచుకున్న రంగంలో సాధన చేశారన్నది ముఖ్యం. దానికి సమాధానం చెప్పలేనివారు అదృష్టమనో, పూర్వజన్మ సుకృతమనో అంటారు.  

శాస్త్రాన్ని ఉన్నదున్నట్టు చెప్పాలి కదా! మీరు లౌక్యంగా చెబుతారంటారు నిజమేనా?
ఈ రోజులు ఎలా ఉన్నాయంటే ఒకడు బల్లిశాస్త్రం అంటాడు, మరొకడు పుట్టుమచ్చల శాస్త్రం అంటాడు. ఇదంతా మిడిమిడి జ్ఞానం. మహానుభావులు తమ పబ్బం గడుపుకోవడానికి ఎన్నో శాస్త్రాలు పుట్టించారు. అవాస్తవాలను పెంచడం ఈ కాలంలో ఎక్కువైపోయింది. ఈ కాలానికి తగ్గట్టు వాస్తవాలను చెప్పగలగాలి.

ఇలా మాట్లాడితే సంప్రదాయవాదులు వ్యతిరేకించరా? 
బోలెడుసార్లు సవాల్‌ చేశాను. వివేకానందుడు చెప్పినట్టు సత్యానికి సమాజం తలవంచాల్సిందే! కాదనేవాడిని రమ్మనమనండి. దేవుడు ఎందుకు సంకల్పిస్తాడు? ఎక్కడికో వెళ్లాలనుకుని ప్రయాణం పెట్టుకు న్నాను. కాలుజారి దెబ్బ తగిలి ప్రయాణం వాయిదా పడింది. మన ప్రయాణం వాయిదా వేయడానికి దేవుడికేం అవసరం? ఏ పూజ చేసినా ఆ స్థితి ఆ స్థితియే! నాకున్న ఆధ్మాతికానందం ఇప్పుడు ఎలా ఉందంటే.. భాగవతం చదవడానికి, బట్టలు మడతెట్టుకోవడానికి పెద్దగా తేడా తెలియడం లేదు. ఆ బట్ట కూడా నాకు భగవత్‌స్వరూపమే! ఆధ్యాత్మిక వేత్త ఆ స్థితికి చేరుకోవాలి.

మరి ఈ పూజలన్నీ ఎందుకు? పూజల పేరుతో ఇంత ఖర్చు దేనికి? 
పూజలు మానకూడదు. పూజ చేయడం వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. పూజల ఉద్దేశ్యం దృష్టిని దైవం మీద పెట్టడమే. అలాగే, ఈ పూజలన్నింటిలోనూ ఎక్కువగా దానాలుంటాయి. దానం వల్ల   పాపం నశిస్తుంది. కానీ, చాలామంది పూజలు అనగానే అర్థాలు తెలియకపోయినా స్తోత్రాలు చదివేస్తూ ఉంటారు. పండితులు వాటికి అర్థాలు చెప్పరు. వీరు తెలుసుకోరు. వందసార్లు విష్ణుసహస్రనామం చదివినా వీళ్లు ఎక్కడున్నారో అక్కడే ఉంటారు. అదే ఒక్కనామానికి అర్థం తెలుసుకుని ఆలోచిస్తే గొప్ప మార్పు వస్తుంది. 

గుణం తల్లిదండ్రులు ఇచ్చారంటారు. తెలివి దేవుడు ఇచ్చినదేనా? ఇది దైవ సంకల్పమా?
దేవుడు నాకు మాత్రమే ధారణ ఇవ్వాలని ఎందుకనుకుంటాడు. నామీదే ఆయనకు ప్రత్యేకమైన ఇష్టం ఏంటి? దైవ సంకల్పం అని ఎందుకంటారు. అలా అనుకుంటే దేవుడు పక్షపాతి కాదా! అలాంటివాడు దేవుడు ఎలా అవుతాడు. అనేకానేక మాయ మాటల్లో ఇదొకటి. కృషి వల్ల వచ్చిందని చెప్పరు. ఇప్పుటిదాకా 11వేల పద్యాలు రాశాను. రోజూ అరగంట పాటు ఆ పద్యాలన్నీ మళ్లీ ఎన్ని వీలైతే అన్ని చదువుకుంటాను. దానికి చేయాల్సిన రాక్షస పరిశ్రమ చేయాలి. అందుకే నన్ను ధారణాబ్రహ్మరాక్షసుడు అన్నారు. దైవసంకల్పం అని ఈ ప్రచారం కూడా మాలాంటి వాళ్లే చేస్తారు. ఇది దైవశక్తి అంటే మాకు గౌరవాలు, పాదాభివందనాలు, దక్షిణలు పెరుగుతాయిగా!  

మీరు నమ్మే దైవం మీకు మంచి చేసిందని ఎప్పుడు నమ్మారు..?
ఎప్పుడూ నమ్ముతాను. అయితే, నా ప్రయత్నం వల్ల కూడా జరగనిది దైవప్రేరణతో జరిగిన ఘటనలు మూడు నాలుగు ఉన్నాయి. సమస్య చేయి దాటినప్పుడు అమ్మవారి ఫొటో ముందుకు వెళ్లి బొమ్మా బొరుసు వేస్తాను. బొమ్మ పడితే ప్రయత్నం విడవను అని. ఇది చిన్నపిల్లవాడి మనస్తత్వంగా భావించవచ్చు. కానీ, దాని వెనకాల ఉన్న విశ్వాసం పెద్దది. హైదరాబాద్‌లో ఇల్లు కొనడం కోసం కాకినాడలో స్థలం అమ్మి బిల్డర్‌కి డబ్బు ఇచ్చాను. ఏడాది చూశాను. ఇల్లు అవడం లేదు, డబ్బులు రావడం లేదు. విసుగొచ్చింది. మరో దారి కన్పించలేదు. అమ్మవారి ముందుకెళ్లి  ‘భిక్షాటన చేసైనా ఐదు కోట్లు తెచ్చిస్తా గరికపాటికి నా పాదాలు రాసిచ్చాను అని రిజిస్టర్‌ చేసి అందరికీ చెప్పు. లేదంటే నేను సంపాదించినదాంట్లో దోషం చూపించు. నా కష్టార్జితం పోతే నేను రేపు నీ గురించి పదిమందికి ఏం చెప్పను’ అన్నాను. ప్రయత్నం చేయమన్నట్టుగా బొమ్మపడింది. ఎలా ప్రయత్నం చేయాలో అర్థం కాలేదు. కానీ, పరిస్థితులు కలిసి వచ్చాయి. వారం రోజుల్లో నా డబ్బు చేతికొచ్చింది. కష్టం వస్తే ‘అమ్మా, కొత్త కష్టాలు వస్తే నే కొత్త పద్యాలు చెబుతానని నీ ఆశా! జీవితాంతం పద్యాలు చెబుతా గానీ, కష్టపెట్టకమ్మా!’ అని చెబుతుంటాను. మొన్నీ మధ్య ఇంట్లో ఎవరూ లేరు. నేను అమ్మవారి దగ్గర కూర్చుని ‘నువ్వు, నేను తప్ప అవనీతలమున ఎవ్వరూ లేరు. నీవు ఒకసారి కనపడితే ఎవరికీ చెప్పను తల్లీ.. అని పద్యరూపకంగా చెప్పాను. ఇది మధురభక్తి. అదో అనుభవం.  

ఇంతటి మధుర భక్తిని అనుభూతించే మీరు దైవం గురించి విమర్శనా వ్యాఖ్యలు కూడా చేస్తుంటారు? 
దైవం గురించి కాదు మూఢభక్తి గురించి. శివుడి గుళ్లో వందల లీటర్ల పాలతో అభిషేకం చేస్తున్నారు. ఎందుకు? నీళ్లతోనే అభిషేకం చేయాలి. అభిషేకాల పేరుతో చాలా శివాలయాలు ఇప్పటికే మూత పడ్డాయి. దేవుడికి ఇవి కాస్టీ›్ల, ఇవి చీప్‌ అని ఉండదు. అభిషేకానికి నీళ్లే వాడాలి. ధారాపాత్ర గుండా నీళ్లు లింగం మీదుగా పడుతుండాలి. ద్రాక్షారామంలో అలా అభిషేకం జరుగుతుండగా ఉద్వేగానికి లోౖ¯ð  ఆశువుగా ‘ధారాపాత్ర నుండి నీరు జారునయట్లు క్షణ క్షణం బతుకు జారిపోవు... అని పద్యం చెప్పాను. వేంకటేశ్వరస్వామికి గడ్డం మీద గాయం వల్ల అయిన మచ్చ ఉంటుంది. ఇప్పటికీ దాని మీద వెన్న రాస్తారు. అంత శక్తి గల స్వామి తన గాయాన్ని ఎందుకు మాన్పుకోలేకపోయాడు. అని ఆలోచన ఎవరూ చేయరు. ఇప్పటికీ మొట్టమొదట గా ఓటికుండలో పెట్టిన అన్నమే స్వామికి నైవేద్యం. ఎందుకు? ఇవేవీ ఆలోచించరు. దేవుడికి కులం, మతం పట్టింపుల్లేవు. అది ఎందుకు గ్రహించరు. ఏది అజ్ఞానం అనిపిస్తే దాన్ని విమర్శిస్తాను.  

ఇలాంటి వ్యాఖ్యానాల వల్ల కొందరి మనోభావాలు దెబ్బతింటాయేమో కదా! 
ఈ రోజుల్లో తొమ్మిదో తరగతి కుర్రాడికీ మనోభావాలు ఉంటున్నాయి. అందుకే వాడికి తోచింది ఫేస్‌బుక్‌లో పెట్టేస్తుంటాడు. ఆవుని పూజించమంటారు. ఆవును పూజించేవాళ్లే దూడ పాలు తాగుతుంటే దాన్ని చితగ్గొట్టి పాలు పితుక్కుంటున్నాడు ఇది జీవహింస కాదా! పుణ్యమని గోవు చుట్టూ ప్రదక్షణ చేస్తున్నారు. గోవులను వ్యాపారం చేసేవారి గురించి మాట్లాడరెందుకు. ఇలాంటివాటికి మొదట్నుంచీ వ్యతిరేకిని. తప్పుడు భావం అయితే అది ఎలాంటిదైనా ఖండిస్తాను.‘సకలభూత హితాన్ని కోరి చెప్పే మాటలు దైవం మెచ్చును..’ నే చెప్పింది తప్పనిపిస్తే వాస్తవం చెప్పండి. వింటాను. 

కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి తలుచుకున్న సందర్భం? 
1978 నుంచి దాదాపు పదేళ్లు చాలా స్ట్రగుల్‌ పడ్డాను. రోజులు గడవక కాదు. ‘ఏంటీ దేవుడు..’ అని ఆలోచన. వాస్తవా లను గ్రహించడానికి వందల పుస్తకాలు చదివాను. ఉదాహరణకు కార్తీక మాసంలో చన్నీటి స్నానం, ఉపవాసం పుణ్యం అన్నారు. వాస్తవం– ఇంద్రియ నిగ్రహానికి చన్నీటి స్నానం. ఉపవాసం – నవంబర్‌ మాసానికి పల్లెల్లో గాదెలు ఖాళీ అయ్యేవి. అప్పట్లో ఇంట్లో పది మందికి పైగా ఉండేవారు. చలి వల్ల ఎలాగూ జీర్ణశక్తి మందగిస్తుంది. వీటిని దృష్టిలో పెట్టుకుని ఉపవాసం అన్నారు.  మన మనస్సు దేవుడి సన్నిధిలో ఉండాలి. అంతేగానీ, అన్నం మానేస్తే దేవుడు కరుణించడు. పూజలు చిత్తశుద్ధితో చేస్తే ఒకనాటికి మనలో మార్పు వస్తుంది. ఇలా పదేళ్ల పాటు సందిగ్ధావస్థలోనే ఉన్నాను. తర్వాత ఉపాధ్యాయ ఉద్యోగం మానేసి  అవధానాల్లో పాల్గొన్నాను. అవధానంలో ముందు దైవప్రార్థన చేయాలి. నేను నమ్మంది చెప్పను. ఎలా అని ఆలోచించి అమ్మమీద పద్యం చెప్పాను. ఆ పద్యం చెబుతుంటే నా కళ్లు తడిసిపోతున్నాయి, గుండె తడిసిపోతోంది. ఈ స్పందన,  భావాలు ఎక్కడనుంచి వస్తున్నాయి? ఈ ఆలోచనలు దైవం వైపుగా నడిపిం చాయి. ఆనందం మనలోనే ఉందని అప్పుడే అర్థమైంది. 
– నిర్మలారెడ్డి చిల్కమర్రి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement