
మహరాణుల పిల్లలే కానక్కర్లేదు. తెర మీదకు వస్తే.. మనకు వాళ్లు రాకుమారిలే! చాలా మంచి ఆడియన్స్ మనం. కొత్త టాలెంట్ కనపడితే చప్పట్లకు కరువుండదు. అభినయం ఉన్న అందం అయితే.. గుడులూ తక్కువ ఉండవు. హీరోయిన్‌లకు ఎర్ర తివాచీలను మన గుండెల దాకా పరుస్తాం. రా.. కుమారి.
► 1 జాహ్నవి కపూర్ (20) కరణ్ జోహార్ నిర్మిస్తున్న మరాఠీ చిత్రం ‘సైరాత్’ రీమేక్‌లో నటిస్తోంది.
► 2 సారా అలీఖాన్ (24) అభిషేక్ కపూర్ ‘కేదార్‌నాథ్’లో నటిస్తోంది
► 3 తారా సుతారియా (21) కరణ్ జోహార్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 లో నటిస్తోంది
► 4 అన్యా సింగ్ (20) పేరింకా పెట్టని యశ్‌రాజ్ ఫిల్మ్స్ ప్రాజెక్టు
► 5 సయేషా సైగల్ (20) అజయ్ దేవగణ్ ‘శివాయ్’ (2016) చిత్రంలో నటించింది
► 6 సాన్యా మల్హోత్రా (23) ఆమీర్ ఖాన్ ‘దంగల్’ చిత్రంలో నటించింది.
► 7 మెహ్రీన్ కౌర్ పిర్జాదా (21) కృష్ణగాడి వీర ప్రేమ గాథ (2016), అనుష్కాశర్మ నిర్మించిన ఫిల్లారీ (2017) లలో నటించింది
► 8 ఫాతిమా సనా షేక్ (25) ఆమీర్ ఖాన్ ‘దంగల్’ చిత్రంలో నటించింది.
► 9 సయామీ ఖేర్ (26) రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా మూవీ ‘మీర్జా’ (2016)లో నటించింది. రేయ్ (2015) అనే తెలుగు సినిమాలో నటించింది
► 10 రితిక సింగ్ (22) సాలా ఖడూస్ (2017) చిత్రంలో నటించింది
► 11 నిధి అగర్వాల్ (24) టైగర్ ష్రాఫ్ ‘మున్నా మైఖేల్’ (2017) లో నటించింది
► 12 అనన్యా పాండే (16) కరణ్ జోహార్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 లో నటిస్తోంది
► 13 ఆయేషా కపూర్ (23) శేఖర్ కపూర్ ‘పానీ’ (2017) చిత్రంలో నటించింది
ఒక పువ్వు పూసింది! తోటలో సందడి. దేవ దేవ దేవ దేవ.. దేవుడా.. దేవుడా! కుర్ర పక్షుల దేవరాగం.మార్నింగ్ మార్నింగ్ సూర్యా అంకుల్ షాక్. కుంకలు అప్పుడే లేచాయా? పళ్లెప్పుడు తోమాయి? ఒళ్లెప్పుడు రుద్దాయి? ముఖానికి అప్పుడే పౌడర్ అద్దేస్తున్నాయి. అద్దం బద్దలైపోతుంది.. చాలాపండ్రా పిల్ల ‘కావ్’ లూ! ‘బేబీ... యు ఆర్ సో సెక్సీ.. బేబీ యు ఆర్ ఇన్ ద గెలాక్సీ!’ సూర్య అంకుల్ మళ్లీ షాక్ ‘‘నాకు తెలీకుండా గెలాక్సీలో ఎవర్రా ఆ బేబీ?’’ ‘‘యా.. మామా.. నూన్‌షోకి వచ్చేయ్’’.
ప్రతి ఇంట్లో పదహారేళ్ల మనసు.. కొత్తల్లో శ్రీదేవి. ప్రతి మనసులో ప్రత్యేకంగా ఒక గది.. కొత్తల్లో జయసుధ. ప్రతి గదిలో ఒక బ్లోఅప్ పోస్టర్.. కొత్తల్లో జయప్రద. ప్రతి పోస్టర్‌లో ఒక స్వీట్ వెపన్.. కొత్తల్లో విజయశాంతి. స్క్రీన్ మీదకి కొత్తగా ఎవరొచ్చినా... కుండెడు అన్నం మిగిలిపోయేది. కొన్ని గుండెలు రిలీజ్ రోజే పగిలిపోయేవి. యూత్ అన్నమూ నీళ్లు మానేసి.. మైదా అంటించిన వాల్ పోస్టర్‌లతో కళ్లు, కడుపు నింపుకునేది మరి! నోట్ బుక్‌లో సెంటర్ పేజీలు చింపేసి కొత్త హీరోయిన్ను ఊహించుకుంటూ ప్రియురాలికి ప్రేమలేఖలు రాసేది మరి. ఏ.. అంతకుముందు శారద, వాణీశ్రీ, మంజుల, చంద్రకళ లేరా? ఉన్నారు. అంతకన్నా ముందు సావిత్రి, జమున, భానుమతి, కృష్ణకుమారి లేరా? ఉన్నారు. అంతకన్నా ముందు.. ఉన్నారు.. ఉన్నారు.. అంతకన్నా ముందు కన్నాంబ ఉన్నారు. కాంచనమాలా ఉన్నారు.
ఫ్రమ్ దేర్.. టిల్ డేట్.. తమన్నా, కాజల్, శ్రియ, త్రిష, నయనతార, రకుల్, తాప్సీ, పూజా లేటెస్టుగా అర్జున్ రెడ్డి ఆరో ప్రాణం... షాలినీ పాండే వరకు.. పదేళ్లకో పెద్ద పూలతోట తెలుగు ఇండస్ట్రీ. హీరోయిన్‌ల çపూలతోట. ఆ తోటల్లో వెరైటీ వెరైటీ పూలు. నార్త్ పూలు, సౌత్ పూలు. ఆఖరికి హాలీవుడ్ పూలు కూడా! తెలుగు పూలే కాస్త తక్కువయ్యాయి. కాస్త తక్కువవడం కాదు. కరువైపోయాయనుకోండి. అయినా తెలుగేమిటి? తమిళేమిటి? కన్నడమేంటి? మలయాళమేంటి? హిందీ ఏంటి? ఇంగ్లిష్ ఏంటీ? పూలకు ప్రాంతీయ భేదాలు ఏంటని.. యూత్ ప్రతి హీరోయిన్నీ ఆరాధిస్తోంది. పరిశ్రమ ప్రతి పరదేశీనీ ఆహ్వానిస్తోంది. స్క్రీన్ మీద నూతన పరిచయం అనగానే గాల్లోకి రంగు కాగితాల కాల్పులు. కొత్తమ్మాయ్ అంటే ఆ మాత్రం కాల్పులు జరగవా?
హీరోయిన్‌లు ఎవరి రేంజ్‌లో వాళ్లు, ఏ జనరేషన్‌కి ఆ జనరేషన్‌ని రాక్ చేసి, గుండెల మీద వాక్ చేసి వెళ్లిపోయారు. పెద్ద పెద్ద వాళ్లు.. రాజకీయవేత్తలు, పారిశ్రామికవేత్తలు, శిశుర్వేత్తులు, పశుర్వేత్తులు ‘ఇట్లు.. మీ అభిమాని’ అంటూ అడుగున సంతకం పెట్టి మరీ.. మద్రాస్‌కి ఉత్తరాలు పోస్ట్ చేశారు. రిప్లయ్ వచ్చిందా.. సంతోషం! ‘కలుద్దాం రండి’ అని పిలుపే వచ్చిందా.. ఎస్టానిష్‌మెంట్! కొన్నిసార్లు హీరోయిన్‌లే వీళ్లను కలవడానికి వచ్చేవాళ్లు. ఆకాశం కిందికి దిగితే.. భూమి పందిరి వెయ్యకుండా ఉంటుందా? పాదాల కింద హృదయాన్ని పరవకుండా ఉంటుందా? వేశారు. పరిచారు. ఎందుకంత క్రేజ్! హీరోయిన్లు బాబూ.. హీరోయిన్‌లు. కొత్తవాళ్లు కళ్లు తిప్పుకోనివ్వరు. పాతవాళ్లు పాత మధురిమల్ని వదలనివ్వరు. హీరోలంటే గ్రేట్ అనుకుంటాం కదా. అంత గ్రేట్ హీరోలు కూడా తమతో నటించిన క్యూట్ గర్ల్స్‌తో ప్రేమలో పడ్డవాళ్లే. హీరోయిన్‌ని ప్రేమించిన దర్శకులు, నిర్మాతలు కూడా తక్కుమందేం లేరు. కొన్ని సక్సెస్. కొన్ని బ్రేకప్స్. అవొద్దులెండి ఇప్పుడు.
చూడండి. ఏ తరానికైనా ఒకరిద్దరే హీరోలు. హీరోయిన్‌లు మాత్రం పదులు, ఇరవైలు. అదికూడా ఇరవైల్లో ఎంట్రీ ఇచ్చినవాళ్లు. హీరోయిన్‌ని ఇప్పటి వరకు మనం పువ్వు అనుకున్నాం కదా. కె.రాఘవేంద్రరావుకు మాత్రం పండు. అవడానికి డైరెక్టరే. హీరోయిన్ కనబడగానే కెమెరామన్ అయిపోతారు. బత్తాయిలు, జామపండ్లు, ద్రాక్ష గుత్తులు.. పాటలో ఆ కాసేపూ హీరోయిన్ కనిపించదు. మొజాంజాహీ మార్కెట్ కనిపిస్తుంది. డైరెక్టర్ వంశీ కూడా హీరోయిన్‌లను తిన్నగా ఉండనివ్వడు. హీరోయిన్‌లను కాదులెండి, ప్రేక్షకుల్ని తిన్నగా కూర్చోనివ్వడు. భానుప్రియ ఒంటినంతా ఆయన ఏదో పాటలో కూరగాయలతో అలంకరించారు. ఈ ప్రయోగాల్ని హీరోలపై చేయడం కుదరదు. కుదిరినా చూడ్డానికి హాల్లో ఎవరూ ఉండరు.
దేశవాళీ పండ్లు వద్దనుకుంటే రాఘవేంద్రరావు బయటి నుంచి లోడ్ దింపుకుంటారు. శ్రీదేవి శివకాశి అమ్మాయి. పదహారేళ్ల వయసులోకి ఆమెను తెచ్చేసుకుంది ఆయనే. అప్పటికి ఆయనకు పండంటి ఆలోచన లేదు. సిరిమల్లె పువ్వుతో సరిపెట్టుకున్నాడు. ప్రీతీజింతాను, తాప్సీని దిగుమతి చేసుకుంది కూడా రాఘవేంద్రుడే. ఇక రామ్‌గోపాల్ వర్మ, పూరి జగన్నాథ్ వెరీ వెరీ పర్టిక్యులర్. కథ కంటే ముందు వాళ్లు హీరోయిన్‌ని వెదకడానికి వెళ్లారా అని డౌట్ వస్తుంది.. వాళ్లొక వారం రోజులు హైదరాబాద్‌లో కనిపించకపోతే. ఊర్మిళ టు నథాలియా.. అందరూ వర్మ ఇన్వెషన్సే! నిషా కోఠారీ. ఆంత్రమాలి. మధుశాలిని. పూరి కూడా వేరియేషన్ చూపెడతాడు. అనుష్క ముద్దమ్మాయ్. హన్సిక బొద్దమ్మాయ్. ఆసిన్ తేటగీతి. రక్షిత ఆటవెలది. ఆయేషా, నేహా, ఆదా, రేణు.. అంతా ఫ్లిప్‌కార్ట్‌లోనో, ఆమెజాన్‌లో డెలివరీ అయి వచ్చినట్లుంటారు. పూరి ఎప్పుడు వెళ్తాడో తెలీదు. ఎప్పుడు తెచ్చేస్తాడో తెలీదు.
ఇప్పుడు ఇంకో బ్యాచ్ రెడీగా ఉంది. 20–25 మధ్య బ్యాచ్. వీళ్లలో కొందరు ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చారు. మిగతావాళ్లు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. బాలీవుడ్‌లో కరణ్ జోహర్.. మన పూరీ లాగే టాలెంట్‌ల వేటగాడు. ఇప్పటికే అక్కడి సెలబ్రిటీ పిల్లలకు ఆయన ట్రైనింగ్ ఇస్తున్నారు. శ్రీదేవి కూతురు జాహ్నవి, తారా సుతారా అనే పిల్ల, అనన్యా పాండే.. కరణ్ ప్రాజెక్టు కోసం సెట్స్‌లోంచి బయటికే రావడం లేదు. సారా అలీఖాన్ అనే న్యూ ఫేస్ ‘కేదార్‌నాథ్’ కోసం కష్టపడుతోంది. అభిషేక్ కపూర్ తీస్తున్నాడు ఆ ఫిల్మ్‌ని. అన్యాసింగ్ అనే అమ్మాయి పేరింకా ఖరారు కాని యశ్‌రాజ్ చిత్రం కోసం ప్రాక్టీస్ చేస్తోంది. వీళ్లతో పాటు మెహ్రీన్ కౌర్ పిర్జాదా, సాన్యా మల్హోత్రా, సనా షేక్, నిధి అగర్వాల్, సయామీ ఖేర్, రితికా సింగ్, సయేషా సైగల్, ఆయేషా కపూర్.. ఒకటీ రెండు సినిమాలతో వెనకేసుకున్న ప్రొఫైల్ పట్టుకుని ఫోకస్‌లోకి వచ్చేస్తున్నారు. మరి మనకేంటి? దీజ్ గాళ్స్.. హిందీ అమ్మాయిలు కదా! మరి మనకేంటి? ఇంకా ఏ ఉడెన్ హౌస్‌లో ఉండిపోయారు బాస్? బిగ్ బ్రదర్ మనదేంటి? బిగ్‌బాస్ మనదేంటి? ముమైత్‌ఖాన్ మనమ్మాయేంటి? దీక్షా పంత్ మన చుట్టాల పిల్లేంటి? ‘గోపాల గోపాల’లో ‘దీక్ష’ను ఏకధ్యానంతో చూడలేదా? ‘పోకిరి’ కేమియోలో.. ‘ఇప్పటికింకా నా వయసు.. నిండా పదహారే’ అని పాడుతుంటే ముమైత్‌తో పాటు పరవశించలేదా? పదేళ్ల తర్వాత కూడా ఇప్పటికీ.. ‘మాహా మాహా... మాహా మాహా’ అని వినిపిస్తే చార్మీ కౌర్ గుర్తుకురావడంలా?! హీరోలకు మాత్రమే ఆ ఉడ్డూ, ఈ ఉడ్డూ. హీరోయిన్‌లు యూనివర్శల్. రంభ, అంజలి ఇక్కడే ఉండిపోయారా? రితిక, జాహ్నవీ అక్కడే ఉండిపోడానికి?!
మొన్న రిలీజ్ అయిన ‘జై లవ కుశ’లో రాశీఖన్నా హీరోయిన్. రిలీజ్‌కి రెడీ అవుతున్న ‘స్పైడర్’లో రకుల్ హీరోయిన్. ‘ఒక్కడు మిగిలాడు’లో రెజీనా కసాండ్రా, ‘జవాన్’లో మెహ్రీన్ పిర్జాదా, ‘ఏంజెల్’లో హెబ్బా పటేల్, ‘ఇది నా లవ్ స్టోరీ’లో ఒవియా హెలెన్, ‘గరుడ వేగ’లో సన్నీ లియోన్, ‘స్కెచ్’లో తమన్నా భాటియా, ‘శరభ’లో మిష్తీ చక్రవర్తి హీరోయిన్‌లు. వీళ్లంతా.. ఏ దివిలో విరిసిన పారిజాతాలైనా.. ఒకసారి మన వెండితెర మీదకు వచ్చాక మనవాళ్లే