ప్రేమ వాహనాన్ని సవారీ చేసి ప్రతి ఒక్కరూ చేరుకోవడానికి తహతహలాడే డెడ్ ఎండ్‌నే పెళ్లి అంటారు.ప్రేమలో మోహం ఉంటుంది. ఆకర్షణ ఉంటుంది. కోరిక ఉంటుంది. హక్కు ఉంటుంది. పై చేయి ఉంటుంది. దబాయింపు ఉంటుంది. సంజాయిషీ ఉంటుంది. పెత్తనం ఉంటుంది. పగ ఉంటుంది.కాని స్నేహం మాత్రం ఉండదు.స్నేహంలో ఇష్టం ఉంటుంది. సర్దుబాటు ఉంటుంది. ఇచ్చి పుచ్చుకోవడం ఉంటుంది. అంగీకారం ఉంటుంది. సమభావన ఉంటుంది. అందుకే ఆ అమ్మాయి డైలమాలో పడుతుంది. ప్రేమా? స్నేహమా?ఈ సినిమాలో టబూ ఆమె తండ్రితో– నా భర్త నాకు మంచి స్నేహితుడిలా ఉండాలి అని అంటుంది. అప్పటికే ఆమె ఇద్దరితో స్నేహంలో ఉంది.ఒకరు వినీత్. మరొకరు అబ్బాస్.అది గమనించిన తండ్రి ఆమెతో అంటాడు– ‘మరి వారిద్దరిలోనే ఒకరిని ఎంచుకోవచ్చు కదా’.అంతే కాదు మరో మాట కూడా అంటాడు ‘నీకు కాబోయే భర్త నీకు మంచి స్నేహితుడు కాలేకపోవచ్చు. కాని మంచి స్నేహితుడు తప్పకుండా నీకు మంచి భర్త అవుతాడు’.మంచి సలహా.ఎదురుగా ఇద్దరు ఉన్నారు.ఇప్పుడు సమస్య వచ్చింది.ఎవరిని ఎంచుకోవాలి?
ఆ సమస్య ఆమెదైతే తమలో ఎవరు ఆ అమ్మాయిని సొంతం చేసుకోవాలనే సమస్య వినీత్, అబ్బాస్‌లకు వస్తుంది. వినీత్ పేదవాడు. అబ్బాస్ ధనవంతుడు. కాని ఇద్దరూ మంచి సంస్కారవంతులు. ఇద్దరూ గాఢ స్నేహితులవుతారు. ఒకరికి తెలియకుండా మరొకరు టబూని ప్రేమిస్తారు. కాని ఎప్పుడైతే ఆ సంగతి వారికి అర్థమవుతుందో బద్ధ శత్రువులవుతారు. ఇద్దరివీ వేరు వేరు కాలేజీలు కావడం ఈ శతృత్వాన్ని పెంచుతుంది. పేదోళ్ల కాలేజీ అబ్బాయిల గర్ల్‌ఫ్రెండ్స్‌ని డబ్బున్న కాలేజీ అబ్బాయిలు తన్నుకుపోతున్నారని ఇది వరకే కొట్లాటలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ల ప్రేమకు ఆ నేప«థ్యం తోడైంది. వినీత్ ఫ్రెండ్స్ అబ్బాస్‌పై అబ్బాస్ ఫ్రెండ్స్ వినీత్‌పై దాడి చేస్తారు. గాయపరుస్తారు. కాని ఇదంతా అబ్బాస్, వినీత్‌లకు ఇష్టం ఉండదు. ఇది మా పర్సనల్ సమస్య.. మేమే తేల్చుకుంటాం అంటారు. అబ్బాస్ తన ప్రేమను త్యాగం చేసి వేరే ఊరు వెళ్లిపోవడానికి ట్రైన్ ఎక్కుతాడు. కాని వినీత్ ఒప్పుకోడు. ట్రైనెక్కి అతణ్ణి కిందకు దించేస్తాడు. ‘ప్రేమను త్యాగం చేయడం కంటే మించిన అబద్ధం ఇంకోటి ఉండదు. ఒక్కసారి ప్రేమిస్తే జీవితాంతం ఆ జ్ఞాపకాలు ఉంటాయి. వాటిని త్యాగం చేసి ఎవరూ ఉండలేరు. నువ్వు చేసిన త్యాగాన్ని భారంగా మోస్తూ నేను సుఖంగా ఉండలేను’ అంటాడు. మనం మనం కొట్టుకోవడం ఎందుకు... ఛాయిస్ ఆమెకే వదిలిపెడదాం... ఎవర్ని చేసుకుంటుందో అంటాడు. ఇది కూడా బాగానే ఉంది.కాని ఛాయిస్ ఎంచుకోవడం ఎలా?
టబూకి ఈ ఎంపిక ప్రాణ సంకటంగా మారుతుంది.ఇద్దరూ మంచి మిత్రులు. యోగ్యులు. ఇద్దరూ తనకు సమానమైన వారు.ఎవరినో ఒకర్ని ఎంచుకోవచ్చు. కాని ఆమె ప్రేమలో కంటే ముందు స్నేహంలో ఉంది. ప్రేమ– మనసు నొప్పించగలదేమోకాని స్నేహం నొప్పించలేదు. అందుకే తాను వారిలో ఒకరిని ఎంచుకుని మరొకరి మనసు నొప్పించాలని అనుకోదు.వారిరువురినీ తన ఫామ్ హౌస్‌కు పిలిచి ఒక మాట చెబుతుంది– ‘నాకు మీరిద్దరూ ముఖ్యమే. మీరిద్దరూ నాకు స్నేహితులుగా ఉండాలి. నా మీద మీకున్న ప్రేమను స్నేహంగా మలచండి. జీవితాంతం మీ స్నేహితురాలిగా ఉంటాను. స్వార్థం లేని స్నేహం నాకు కావాలి. మీ ఇద్దరి కోసం కావాలంటే నా జీవితాన్నే త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను’ అంటుంది.వారిద్దరి మనసులో కూడా బహుశా ఇదే ఉండొచ్చు. ప్రేమకు పంచడం రాదు. కాని స్నేహానికి వచ్చు. అందుకే ఆ ముగ్గురు స్నేహితులుగా మిగలడంతో సినిమా పూర్తవుతుంది.అప్పుడు దర్శకుడు ఒక మాట అంటాడు – ఈ స్నేహం వీరిలోనే కాదు అన్న చెల్లి, అమ్మ నాన్న, భార్య భర్త... వీరందరి రిలేషన్‌లో కూడా స్నేహం అభివృద్ధి కావాలి. అప్పుడే ఆ బంధాలు మరింత ఫలవంతం అవుతాయి అని.సినిమా క్లయిమాక్స్‌లో వాన వెలుస్తుంది.మనక్కూడా సందేహాలు వెలిసిన అనుభూతి లేదా ఒక మంచి కథలో తడిసిన అనుభూతి. ప్రేమ, స్నేహం ఉన్నంత కాలం ఈ జడి, ఈ సినిమా తప్పక ఉంటాయి.
కాదల్ దేశం
1996లో దర్శకుడు కదిర్ చేసిన సంచలనమే ‘కాదల్ దేశం’. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లోని కుర్రకారుని ఒక రకమైన ఉన్మాదంలో ముంచెత్తిందని చెప్పుకోవాలి. ప్రేమ, స్నేహాలకు ముఖ్యమైన విలువ ఏర్పడే టీనేజ్‌లో ఉన్న వాళ్లందరూ ఈ సినిమాను పదే పదే చూశారు. మొదటిసారి నటించిన అబ్బాస్ ఈ సినిమాతో ఆడపిల్లల కలల రాకుమారుడు అయ్యాడు. ఈ సినిమాలోని ‘ముస్తఫా.. ముస్తఫా’ పాటకు థియేటర్స్‌లో గ్రూపులు గ్రూపులుగా నిలబడి కుర్రాళ్లు డాన్స్ చేసిన విడ్డూరం సంభవించింది. మామూలు ప్రేమ కథకు కూడా భారీ ఖర్చు, సెట్టింగులు వేయడం వల్ల దర్శకుడు కదిర్‌కి, నిర్మాత కుంజుమోహన్‌కి పెద్ద పేరు వచ్చింది. అప్పటిదాకా ముక్కోణ ప్రేమ కథ అంటే ఎవరో ఒకరు త్యాగం చేయడమే. ఆ మూసను ఈ సినిమా బద్దలు కొట్టి కొత్త క్లయిమాక్స్‌కు చోటిచ్చింది. రెహమాన్ ఊపు ఈ సినిమా పాటల్లో, రీరికార్డింగ్‌లో చూడవచ్చు. ‘హలో డాక్టర్... హార్ట్ మిస్సాయే’... ‘వెన్నెలా వెన్నెలా’, ‘కాలేజీ స్టయిలే’.. ‘ప్రేమా’... ఇవన్నీ ఇప్పుడూ ఫేవరెట్ పాటలే. ‘తొలిప్రేమ’ తో డైరెక్టర్ అయిన కరుణకారన్ ఈ సినిమాకు క్లాప్ అసిస్టెంట్. అలాగే ‘రంగం’తో డైరెక్టర్ అయిన సినిమాటోగ్రాఫర్ ఆనంద్ ఈ సినిమాకు జాతీయ అవార్డు పొందాడు. అద్భుతమైన ఫొటోగ్రఫీ, సంగీతం, దర్శకత్వం, భారీ ఖర్చు, నటీనటులు ఇవన్నీ ‘ప్రేమదేశం’ ను చిరకాలం నిలిచేలా చేశాయి. ‘ఒక గుడిలో ఎంతమంది దేవుళ్లైనా ఉండొచ్చు.. కాని ఆడదాని గుండెలో ఇద్దరు మగాళ్లు ఉండకూడదు’ వంటి తమిళ్ మార్క్ డైలాగులు ఉన్నాయి. కదిర్ మీద చాలామందికి ఆశలు ఉండేవి. అతడు ‘ప్రేమికుల రోజు’ తర్వాత మళ్లీ ఆ స్థాయి సినిమాలు తీయక కనుమరుగయ్యాడు.
– కె
ప్రేమ నిండిన స్నేహం ప్రేమదేశం
Published Tue, Dec 12 2017 11:57 PM | Last Updated on Tue, Dec 12 2017 11:57 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment