అమ్మా.. నువ్వే నా డాక్టర్‌ | Special Story on Schizophrenia | Sakshi
Sakshi News home page

అమ్మా.. నువ్వే నా డాక్టర్‌

Published Thu, Jul 18 2019 11:54 AM | Last Updated on Thu, Jul 18 2019 11:54 AM

Special Story on Schizophrenia - Sakshi

సద్గుణాలు, దుర్గుణాలు ప్రకృతిలో ఉన్నాయి.భౌతిక అనారోగ్యం, మానసిక అనారోగ్యం కూడా ప్రకృతిలో ఉంది.కాని ఒకదాని విషయంలో ఆందోళన ఉంటుంది.మరో దాని విషయంలో నిర్లక్ష్యం ఉంటుంది.
ర్యాగింగ్‌ వల్ల బాధపడుతూ ఫోన్‌ చేసే పిల్లల విషయం ఎంత సీరియస్సోనా మనసు బాగలేదు, చెవుల్లో వింత శబ్దాలు వినిపిస్తున్నాయిఅని ఫోన్‌ చేసే పిల్లల సంగతి కూడా అంతే సీరియస్‌.దీనికి ఎవరి వంశం కారణం అని వెతకడం అనవసరం.ఏం చేయగలం అని ఆలోచించడమే కర్తవ్యం.

మానవ జాతి ఒక తరం నుంచి మరో తరానికి తన తెలివిని మేధస్సును చాకచక్యాన్ని అందిస్తూ వచ్చినట్టే తాను మోస్తున్న జబ్బుల్ని కూడా ఇస్తూ వచ్చింది. వాటి నుంచి మనం తప్పించుకోలేము. దానికి కారణాలు వెతుక్కోవడం కన్నా వచ్చాక ఎలా ఫేస్‌ చేయాలి అనేదే ముఖ్యం. మీ అమ్మాయికి స్క్రిజోఫినియా వచ్చింది. ఇది తల్లి తరపు కుటుంబాల్లో ఉందా తండ్రి తరపు కుటుంబాల్లో ఉందా అనే వెతుకులాట అనవసరం.

విజయవాడలో ఉన్న విజయరామ్‌కు గుర్‌గావ్‌లో ఉన్న యూనివర్సిటీ నుంచి ఫోన్‌ వచ్చింది.‘మీరు ఒకసారి యూనివర్సిటీకి వెంటనే రావాలి’ అవతలి వైపు స్టూడెంట్‌ కోఆర్డినేటర్‌ చెప్పింది.‘ఏంటి విషయం?’ కంగారుగా అడిగాడు విజయరామ్‌.‘ఏం లేదు. మీ అమ్మాయి ఆరోగ్యం బాగలేదు. కొన్నాళ్లు ఇంటికి తీసుకెళ్లి బాగయ్యాక పంపండి. ఒక్కదాన్నే అంతదూరం మేం పంపలేము’విజయరామ్‌ ఫోన్‌ పెట్టేసి భార్య శివలక్ష్మికి ఫోన్‌ చేశాడు.

‘అయ్యో.. అదేంటండీ.. రోజూ మనతో మాట్లాడుతోందిగా’ అందామె.‘ఏం మాట్లాడుతోంది... ఏదో పోగొట్టుకున్నదానిలా మాట్లాడుతోంది... నేను గమనించాను’‘నేనూ గమనించాననుకోండి. కాని దాని వ్యవహారం అంతే కదా.. మూడ్స్‌ అనుకున్నాను’ అంది.‘సరే. అర్జెంట్‌గా బ్యాగ్‌ సర్దు. తీసుకొస్తాను’

గుర్‌గావ్‌ యూనివర్సిటీకి వెళ్లేసరికి విజయరామ్‌ నెత్తి మీద పిడుగు పడింది. అప్పటికే అక్కడ టి.సి. రెడీ చేసి ఉన్నారు. మంచి యూనివర్సిటీ అని కూతురుని అంత దూరం తీసుకొచ్చి చేర్పించాడు. రెండేళ్లు కూడా కాలేదు. ఇంతలో ఈ ఉత్పాతం.
‘సారీ.. మీ అమ్మాయిని మా యూనివర్సిటీలో ఉంచుకోలేము. తను ఎవరినీ ట్రస్ట్‌ చేయడం లేదు. ఎవరితోనూ ఫ్రెండ్‌షిప్‌ చేయడం లేదు. ఎవరితోనూ కలిసి ఉండటానికి ఇష్టపడటం లేదు. అందరూ తన గురించే మాట్లాడుకుంటున్నారు. అందరూ తనను చూసే నవ్వుకుంటున్నారట. చీటికి మాటికి ఆందోళన పడుతోంది. పైగా రోజుకొక ప్రొఫెసర్‌ను బ్లేమ్‌ చేస్తోంది. ప్రొఫెసర్‌లు తనను తొక్కేయడానికి ట్రై చేస్తున్నారని, తనకు మార్కులు రాకుండా చూడ్డానికి ప్లాన్స్‌ వేస్తున్నారని కంప్లయింట్స్‌ చేస్తోంది’ అన్నాడు కాలేజీ హెడ్‌.

విజయరామ్‌కు కోపం వచ్చింది.
‘మా అమ్మాయికి పిచ్చా. మీ వాళ్లు ఏదో తేడాగా బిహేవ్‌ చేయకపోతే తనెందుకు బ్లేమ్‌ చేస్తుంది?’ ‘పిచ్చి మాక్కాదు.. తనకే... కాసేపు గమనించి చూస్తే మీ కూతురు తనలో తాను మాట్లాడుకోవడం మీరు గమనిస్తారు. ఇక వెళ్లండి. మీ అమ్మాయి ఇక్కడే ఉంటే వేరే స్టూడెంట్స్‌ ఇక్కడి నుంచి పారిపోతారు’ అన్నాడు హెడ్‌. విజయరామ్‌ తన కూతురి వైపు చూశాడు. మౌనంగా తల వొంచుకొని ఉంది.ఆ రోజు అక్కడే ఉండే మరుసటి రోజు ప్రయాణ ఏర్పాట్లు చేసుకొని కూతురిని తీసుకుని విజయవాడ చేరాడు విజయ్‌రామ్‌.

సాధారణంగా ఇలాంటి సమయంలో భార్యాభర్తలు ఏకమయ్యి కూతురి క్షేమం కోసం ఆలోచించాలి. కాని కూతురు ఇంటికి రావడంతోటే ఒకరితో ఒకరు కాట్లాడుకోవడం మొదలెట్టారు. దీనికి బాధ్యులెవరో తేల్చాలని ఇద్దరి తాపత్రయం.
‘మీ వంశంలో పిచ్చి ఉందని నాకు పెళ్లికి ముందే ఎవరో చెప్పారు. నేను పట్టించుకోలేదు. ఇప్పుడు నా కూతురు అనుభవిస్తోంది’ అన్నాడు విజయ్‌రామ్‌.
‘మా ఇంట్లో ఎవరికీ పిచ్చి లేదు. ఉంటే గింటే మీ వంశంలోనే ఉండాలి వెర్రి. మాకు సంబంధం వచ్చినప్పుడు కూడా చెప్పారు వాళ్లు తిక్కోళ్లు... వాళ్లతో ఎందుకు అని’ భార్య అంది.
‘అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలి అని అందుకే అన్నారు. మీ నానమ్మనో ఎవరినో చివరి రోజుల్లో సంకెళ్లతో కట్టేసి పడేశారని నాకు తెలుసులే’
‘మీ తాత బట్టలిప్పుకుని రోడ్డున పడేవాడని మేమూ విన్నాం’ వీళ్ల గొడవ స్నేహితులకు తెలిసింది. వాళ్ల ప్రోద్బలం మీద తల్లి తండ్రి కూతురు హైదరాబాద్‌లో సైకియాట్రిస్ట్‌ను కలిశారు.

‘ముందు మీరిద్దరు కొట్టుకోవడం మాని మీ అమ్మాయి కోసం నిలబడండి’ అంది సైకియాట్రిస్ట్‌ మొత్తం గొడవంతా విని.విజయ్‌రామ్, శివలక్ష్మి ఇద్దరూ మౌనంగా ఉన్నారు.
‘వంశాలు చూసుకొని కుటుంబాలు గమనించుకొని పెళ్లిళ్లు చేసుకోవాలనే పెద్దల మాట మంచి నడవడిక, సంస్కారం ఉన్నవారితో జత పడటం కోసమే తప్ప వారి జబ్బుల ఆనుపానులు తెలుసుకొని పెళ్ళిళ్లు చేసుకోమని కాదు. మానవ జాతి ఒక తరం నుంచి మరో తరానికి తన తెలివిని మేధస్సును చాకచక్యాన్ని అందిస్తూ వచ్చినట్టే తాను మోస్తున్న జబ్బుల్ని కూడా ఇస్తూ వచ్చింది. వాటి నుంచి మనం తప్పించుకోలేము. దానికి కారణాలు వెతుక్కోవడం కన్నా వచ్చాక ఎలా ఫేస్‌ చేయాలి అనేదే ముఖ్యం. మీ అమ్మాయికి స్క్రిజోఫినియా వచ్చింది. ఇది తల్లి తరపు కుటుంబాల్లో ఉందా తండ్రి తరపు కుటుంబాల్లో ఉందా అనే వెతుకులాట అనవసరం. ఇది అనువంశికంగా వచ్చే జబ్బే అయినా ముందు తరాల్లో లేకపోయినప్పటికి కూడా రావచ్చు. సాధారణంగా ఇది టీనేజీ వయసులో బయటపడుతుంది. మీ అమ్మాయికి కూడా బయటపడింది. కాకుంటే మనం వెంటనే గుర్తించాం. ఇది లేటయ్యి మరో రెండేళ్లు వైద్యం అందక గుర్‌గావ్‌లోనే మీ అమ్మాయి చదువుకుంటూ ఉండిపోతే జబ్బు ముదిరిపోయేది‘ అంది సైకియాట్రిస్ట్‌.
‘దీని లక్షణాలు ఏంటి డాక్టర్‌’ అడిగింది శివలక్ష్మి.

‘భ్రాంతులు ఉంటాయి. కొందరికి చెవుల్లో శబ్దాలు వినిపిస్తాయి. వాటిని ఆడిటరీ హెలూసినేషన్స్‌ అంటాం. అనుమానం పెరిగిపోతుంది. దానిని పారనాయిడ్‌ థింకింగ్‌ అంటాం. ఊహాగానాలతో వాళ్లు తమను తాము క్షోభ పెట్టుకుంటారు. మీ అమ్మాయికి వచ్చింది సీరియస్‌ ప్రాబ్లం. వెళ్లి రెండు రోజులు ఆమెతో ఫ్రీగా, ప్రెండ్లీగా గడపండి. ధైర్యం చెప్పండి. నెమ్మదిగా చదువుకుందూలే... విజయవాడలోనే నీకు నచ్చిన కాలేజీలో కోర్సు కంటిన్యూ చేద్దువు ఇలాంటి మాటలు చెప్పండి’ అని నెక్స్‌›్ట కన్సల్టేషన్‌ డేట్‌ వేసింది సైకియాట్రిస్ట్‌.

విజయ్‌రామ్, శివలక్ష్మిలలో మొదటగా మేల్కొంది శివలక్షే్మ. ఒక్కగానొక్క కూతురు. అమ్మాయికి కష్టం వస్తే తనే ఒక గోడలా నిలబడి పిల్లను కాచుకోవాలని నిశ్చయించుకుంది. అంతే... కూతురితో ఎక్కువ సేపు గడపడం, మాట్లాడటం, షికారుకు తీసుకెళ్లడం, నవ్వించడం, మానసికంగా పూర్తిగా స్థిమితం పొందేలా తన దగ్గరే పడుకోబెట్టుకోవడం.. ఇలా చాలా జాగ్రత్తలు తీసుకుంది. తిరిగి సైకియాట్రిస్ట్‌ దగ్గరకు వెళ్లినప్పుడు సైకియాట్రిస్ట్‌ సంతృప్తి వ్యక్తం చేసింది కూతురిని చూసి

‘చూడండి... ఫస్టఫాల్‌ ఇది ఒక రోజు జబ్బు కాదని మీరు గుర్తించాలి. ఏవో పూజలు చేయడం వల్ల, వ్రతాలు పట్టడం వల్ల, మొక్కులు మొక్కడం వల్ల మీకు ధైర్యం రావచ్చు కాని జబ్బు తగ్గదు. కాకపోతే అదుపులో ఉంచుకుని సాధారణ జీవితం గడపవచ్చు. అందుకు తప్పనిసరిగా కంటిన్యూయెస్‌గా వైద్యం తీసుకుంటూ ఉండాలి. జీవితాంతం చేస్తూనే ఉండాలి. చాలామంది ఏమనుకుంటారంటే మందులు లేకుండా కేవలం కౌన్సిలింగ్‌తో ఇది తగ్గుతుందని. అలా తగ్గదు. మందులు ఆపకూడదు. ధైర్యం కోల్పోకూడదు. ఈ జబ్బు ఉన్న చాలామంది ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటూ మామూలు జీవితం గడుపుతున్నారు. మీ అమ్మాయి కూడా గడపవచ్చు’ అంది సైకియాట్రిస్ట్‌.
‘చెప్పండి డాక్టర్‌ మీరేం చేయమంటే అది చేస్తాం’ అన్నాడు విజయరామ్‌.
‘ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంచండి. మీ ఇద్దరూ ఒక బలంగా మారి మీ అమ్మాయికి బలం ఇవ్వండి. మాట.. మందులు ఇవి కొనసాగిస్తూ ఉండండి. చాలు. జలుబు, జ్వరం, ఏదైనా గుండెజబ్బు ఇవి పిల్లలకు వస్తే తల్లిదండ్రులు వైద్యం కోసం పరిగెత్తుతారు. భౌతిక అనారోగ్యాల వంటివే మానసిక అనారోగ్యాలు కూడా. పిల్లల్లో అవి కనిపిస్తే వెంటనే స్పందించే కుటుంబమే నా దృష్టిలో మంచి కుటుంబం’ అంది సైకియాట్రిస్ట్‌.

నిర్లక్ష్యమే సగం ఆనారోగ్య హేతువు. కాని విజయరామ్, శివలక్ష్మిలు తమ కూతురి విషయంలో అసలు నిర్లక్ష్యం పాటించలేదు. చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. కూతురు కూడా తల్లిదండ్రులకు సహకరించింది. కేన్సర్‌ వంటి ప్రాణాంతకమైన రోగాలు వచ్చి కూడా బయటపడి ఆనందంగా ఉన్న పిల్లలు ఉన్నారు. ఈ మానసిక అనారోగ్యాన్ని తాను ఫేస్‌ చేయగలదు అనే ధైర్యం తల్లిదండ్రుల వల్ల ఆ అమ్మాయి పొందింది. మెల్లగా బి.టెక్‌ పూర్తి చేసిన ఆ అమ్మాయి విజయవాడలోనే స్ట్రెస్‌కు తావు లేని తేలికపాటి ఉద్యోగం చేస్తూ సాధారణ జీవితం గడుపుతోంది. అర్థం చేసుకునే అబ్బాయి దొరికితే పెళ్లికి ఎదురు చూస్తోంది. పెళ్లి జరుగుతుందే ఆశిద్దాం. – కథనం: సాక్షి ఫ్యామిలీఇన్‌పుట్స్‌: డా. పద్మ పాల్వాయి, సైకియాట్రిస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement