Schizophrenia
-
ఎవరికీ కనిపించనివి కనిపిస్తున్నాయా?
‘సర్, చూడండీ.. అతను ఇక్కడే ఉన్నాడు. ఆ తలుపు చాటు నుంచి చూస్తున్నాడు’ అంది శోభ. నిజానికి అక్కడెవ్వరూ లేరు. అయినా ‘అతనెవరూ?’ అని అడిగాను. ‘తెలీదు సర్. కానీ నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నాడు. ఆఖరికి వాష్‌రూమ్‌కి కూడా. అందుకే స్నానం చేయడం కూడా మానేశా. ’‘ఎన్నాళ్ల నుంచీ ఇలా జరుగుతోంది? ’‘రెండు నెలల నుంచి సర్. ’‘ఇంకా ఏం జరుగుతోంది? ’‘నిన్ను చంపేస్తా అంటున్నారు సర్. ’‘ఎవరంటున్నారు? ’‘ఎవరో తెలియదు సర్. నాలోంచే మాటలు వినిపిస్తున్నాయి. చాలా భయమేస్తోంది. అందుకే ఎక్కడికీ వెళ్లడం లేదు. ’‘సర్లెండి. వాళ్లతో నేను మాట్లాడతాను’ అని ధైర్యం చెప్పా. శోభ ఒక గృహిణి. భర్త సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఇద్దరు పిల్లలు. అందమైన కుటుంబం. అయితే గత రెండు నెలలుగా శోభ ప్రవర్తనలో విపరీతమైన మార్పులు కనిపిస్తున్నాయి. తనతో ఎవరో మాట్లాడుతున్నారని, తనకు ఎవరో కనిపిస్తున్నారని, తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని భయపడుతూ తన గది నుంచి బయటకు రావడంలేదు. మొదట సర్ది చెప్పాలని ప్రయత్నించిన భర్త తన ప్రయత్నాలు విఫలం కావడంతో కౌన్సెలింగ్ సెంటర్‌కు తీసుకువచ్చారు. శోభ డెల్యూజన్స్, హెలూసినేషన్స్తో బాధపడుతోందని అర్థమైంది. సైకో డయాగ్నసిస్ అనంతరం ఆమె స్కిజోఫ్రీనియాతో బాధపడుతోందని నిర్ధారించుకుని చికిత్సకోసం సైకియాట్రిస్ట్‌కు రిఫర్ చేశాను. తీవ్రమైన మానసిక రుగ్మత స్కిజోఫ్రీనియా తీవ్రమైన మానసిక రుగ్మత. అది మెదడు పనితీరుకు అంతరాయం కలిగిస్తూ ఆలోచనలు, జ్ఞాపకశక్తి, ప్రవర్తనలో జోక్యం చేసుకుంటుంది. దానివల్ల రోజువారీ జీవితం కష్టంగా మారుతుంది. ఇది లక్షకు 220 మందిలో కనిపిస్తుంది. ప్రాణాంతకం కాదు. కానీ ప్రమాదకరమైన, హానికరమైన ప్రవర్తనలకు దారితీయవచ్చు. మూడింట ఒక వంతు మందిలో లక్షణాలు కాలక్రమేణా తీవ్రం అవుతాయి. పదిశాతం మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. అందువల్ల సక్రమంగా చికిత్స చేయిస్తూ, జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలి. మూడు ప్రధానకారణాలు.. స్కిజోఫ్రీనియాకు నిర్దిష్టంగా ఒక కారణమంటూ లేదు. వివిధ కారణాల వల్ల సంభవిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. చుట్టూ ఉన్న పరిస్థితులు, ఆటో ఇమ్యూన్ వ్యాధులు, తీవ్రమైన ఒత్తిడి కారణాలు కాగలవు. అలాగే గర్భధారణ సమయంలో తల్లి అనారోగ్యం, తక్కువ బరువుతో పుట్టడం వల్ల కూడా స్కిజోఫ్రీనియా వచ్చే ప్రమాదం పెరుగుతుంది. యుక్తవయసులో భారీగా గంజాయి వాడకం వల్ల కూడా ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. కుటుంబంలో స్కిజోఫ్రీనియా ఉంటే వచ్చే ప్రమాదం ఎక్కువ. స్కిజోఫ్రీనియాకు మూడు ప్రధాన కారణాలు: 1. సెల్–టు–సెల్ కమ్యూనికేషన్ కోసం మీ మెదడు ఉపయోగించే రసాయన సంకేతాలలో అసమతుల్యత. 2. పుట్టుకకు ముందు మెదడు అభివృద్ధి సమస్యలు. 3. మెదడులోని వివిధ ప్రాంతాల మధ్య కనెక్షన్లు నష్టపోవడం. శాశ్వత చికిత్స లేదు.. స్కిజోఫ్రీనియాను శాశ్వతంగా నయం చేసే చికిత్స లేదు. అయితే చికిత్సతో లక్షణాలను మేనేజ్ చేయవచ్చు. కొద్దిమంది పూర్తిగా కోలుకోవచ్చు. స్కిజోఫ్రీనియా చికిత్సలో సాధారణంగా యాంటీసైకోటిక్స్ మందులు ఉపయోగిస్తారు. ఇవి సెల్–టు–సెల్ కమ్యూనికేషన్ కోసం మెదడు స్రవించే రసాయనాలను అడ్డుకుంటాయి ∙కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (ఇఆఖీ) వంటి టాక్ థెరపీ పద్ధతులు పరిస్థితిని ఎదుర్కోవటానికి సహాయపడతాయి. ఇతర చికిత్సలు పని చేయకపోతే వైద్యులు ఎలక్ట్రోకన్వల్సివ్ థెరపీ (ఉఇఖీ)ని సిఫార్సు చేయవచ్చు ∙స్కిజోఫ్రీనియా ఉన్న వ్యక్తులు క్రమం తప్పకుండా మందులు తీసుకోవాలి. వైద్యులు చెప్పకుండా ఆపకూడదు నిర్దేశించినట్లుగా డాక్టర్ని సంప్రదించాలి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా చర్చించాలి. ∙మద్యం, మాదక ద్రవ్యాలను పూర్తిగా నివారించాలి ∙కుటుంబ సభ్యుల సహకారం చాలా అవసరం. ఐదు ప్రధాన లక్షణాలు.. స్కిజోఫ్రీనియాతో బాధపడుతున్న వ్యక్తులు లక్షణాలను గుర్తించలేరు. కానీ చుట్టూ ఉన్నవారు గుర్తించవచ్చు. దీనికి ఐదు ప్రధాన లక్షణాలు ఉన్నాయి. వీటిలో ఏ మూడు లక్షణాలు నెలకు పైబడి కనిపించినా వెంటనే సైకాలజిస్ట్ లేదా సైకియాట్రిస్ట్‌ను సంప్రదించాలి. సైకోడయాగ్నసిస్తో పాటు వైద్య పరీక్షల అనంతరం నిర్ధారణ చేసుకోవాలి. 1. కొన్ని నమ్మకాలు తప్పు అని చాలా సాక్ష్యాలు ఉన్నప్పటికీ అవి నిజమేనన్న భ్రమలో ఉండటం. 2. ఎవరికీ వినిపించని స్వరాలను వినడం, ఎవరూ చూడలేని వాటిని చూడటం. అలాగే వాసన, రుచి చూడగలగడం. 3. ఆలోచనల్లో గందరగోళం వల్ల మాటల్లో కూడా స్పష్టత లేకపోవడం. అసంబద్ధంగా మాట్లాడటం. 4. చుట్టూ ఉన్న వ్యక్తులు ఊహించిన దానికంటే భిన్నంగా కదలడం లేదా ఎలాంటి కదలికలూ లేకుండా రాయిలా ఉండిపోవడం. 5. రోజువారీ పనులను చేయగల సామర్థ్యం తగ్గడం లేదా కోల్పోవడం. మాటల్లో, ముఖకవళికల్లో ఎలాంటి ఎమోషన్స్ చూపకపోవడం. 6. ఇంకా పరిశుభ్రతను పట్టించుకోకపోవడం, అనుమానించడం, భయపడటం, నిరాశ, ఆందోళన, ఆత్మహత్య ఆలోచనలు. సైకాలజిస్ట్ విశేష్ (చదవండి: ఎక్స్ట్రీమ్ వెయిట్ లాస్ స్టార్ జస్ట్ 40 ఏళ్లకే నూరేళ్లు.. బరువు తగ్గడం ఇంత ప్రమాదమా?) -
రష్యా అధ్యక్షుడు పుతిన్ జీవించేది మరో రెండేళ్లే!
మాస్కో: రష్యా అధ్యక్షుడు పుతిన్(69) ఆరోగ్యం నానాటికీ వేగంగా క్షీణిస్తోందని, ఆయన మరో రెండేళ్ల కంటే ఎక్కువ కాలం జీవించే అవకాశం లేదని ఉక్రెయిన్ నిఘా విభాగం అధికారి మేజర్ జనరల్ కైరిలో బుడానోవ్ వెల్లడించారు. తాను ఇటీవలే రష్యాలో రహస్యంగా పర్యటించానని, ఈ మేరకు కచ్చితమైన సమాచారం ఉందని చెప్పారు. పుతిన్ ఆరోగ్యంపై గత కొన్ని నెలలుగా రకరకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలయ్యాక పుతిన్ తన మిలటరీ అధికారులతో తరచుగా సమావేశమవుతున్నారు. యుద్ధ వ్యూహాలు రచిస్తున్నారు. రష్యా విడుదల చేస్తున్న చిత్రాల్లో పుతిన్ అస్వస్థతతో ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఇటీవల మాస్కోలో జరిగిన కార్యక్రమంలో పుతిన్ ఎక్కువసేపు నిలబడలేకపోయారు. మరో కార్యక్రమంలో నీరసంగా వెనుకా ముందు ఊగుతూ దర్శనమిచ్చారు. బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని వైద్యులు ఆయనకు సూచించినట్లు వార్తలు వచ్చాయి. పుతిన్ కంటిచూపు కూడా తగ్గిపోయినట్లు తెలుస్తోంది. పార్కిన్సన్స్, స్కిచోఫ్రినియా లక్షణాలు సైతం ఉన్నాయని రష్యా వర్గాలు తెలియజేశాయి. పుతిన్ ఇప్పటికే క్యాన్సర్ బాధితుడు. గతంలో క్యాన్సర్ సర్జరీ జరిగినట్లు సమాచారం. ఆయనలో మళ్లీ తీవ్రమైన క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తున్నాయని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. -
తల్లిదండ్రులపైనే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు
గుంటూరు బ్రాడీపేటకు చెందిన సుజాత తన తల్లిదండ్రులపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనను తల్లిదండ్రులే చంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొంది. యుక్తవయస్సులో ఉన్న కుమార్తె తమపై పోలీసులకు ఫిర్యాదు చేయటంతో దెయ్యం పట్టినట్లుగా తల్లిదండ్రులు భావించి భూత వైద్యులను సంప్రదించారు. అంత్రాలు కట్టించినా, తాయత్తులు మెడలో వేయించినా సుజాత మానసిక పరిస్థితిలో మార్పు రాలేదు. సుమారు రెండేళ్లపాటు భూతాలు వదిలించేవారి చుట్టూ, దర్గాలు, గుడులు చుట్టూ తిప్పి తదుపరి జీజీహెచ్‌లోని మానసిక రోగుల వైద్య విభాగంలో చికిత్స చేయించారు. వ్యాధి ముదిరినాకా వచ్చాక సుజాతను ఆస్పత్రికి తీసుకురావటంతో వ్యాధిని తగ్గించేందుకు ఆస్పత్రి వైద్యులు ఎక్కువగా కష్టపడాల్సి వచ్చింది. విజయవాడ గుణదల సెంటర్‌కు చెందిన సురేష్ ప్రతి రోజూ కూలీ పనులకు సక్రమంగా వెళ్లి వచ్చిన ఆదాయాన్ని తల్లిదండ్రలకు ఇచ్చి చేదోడు వాదోడుగా ఉండేవాడు. రెండేళ్ల కిందట అతడి ప్రవర్తనలో మార్పు వచ్చింది. పనికి వెళ్లటం మానివేశాడు. ఎవరు పిలిచినా పలకకుండా ఏదో ఆలోచనలో ఉన్నట్లు ఒంటరిగా గడపటం ప్రారంభించాడు. చివరకు స్నానం చేయటం, అన్నం తినటం మానేసి గెడ్డం పెంచుకుని తిరుగుతూ ఉండేసరికి ఏదైనా ప్రేమ వ్యవహారం అయి ఉంటుందని భావించి స్నేహితులను విచారించినా ఏమీ తెలియకపోవటంతో అతడి తల్లిదండ్రులు ఏదో గాలి సోకిందని భావించి భూత వైద్యుడికి వద్దకు తీసుకెళ్లి అంత్రాలు వేయించారు. మూడేళ్లకుపైగా ఊరూరా తిప్పి అన్ని రకాల అంత్రాలు వేయించినా సాధారణ స్థితికి రాకపోయేసరికి చివరకు జీజీహెచ్ మానసిక వైద్యులను సంప్రదించారు. గుంటూరు మెడికల్: ఇలా వివిధ మానసిక సమస్యలతో బాధపడుతూ ఉండేవారు తొలుత భూత వైద్యులను సంప్రదించి చివరి స్థితిలో మానసిక వైద్యులను సంప్రదిస్తున్నారు. మానసిక వ్యాధి లక్షణాలను ముందుగానే గుర్తించి ప్రాథమిక దశలోనే వైద్యం చేయించటం వల్ల అతి తక్కువ కాలంలోనే వారు సాధారణ స్థితికి చేరుకుంటారు. లేదంటే దీర్ఘకాలం వ్యాధితో బాధపడుతూ అది చూసి కుటుంబ సభ్యులు కూడా కుంగిపోవాల్సి వస్తుందని మానసిక వ్యాధుల వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధిపై అందరికి అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది మే 24వ తేదీన ‘ప్రపంచ స్కిజోఫ్రినియా డే’నిర్వహిస్తున్నారు. సందర్భంగా సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం. వ్యాధి లక్షణాలు... వ్యాధి సోకిన వారు తనలో తాను నవ్వుకోటం, కోపంతో అరవటం, తిట్టటం, కొట్టడం, మాటలో మార్పు, ప్రవర్తనలో తేడా, ఎవరో కనబడుతున్నట్లు అనుమానాలు వ్యక్తంచేయటం, చెవిలో మాటలు వినిపిస్తున్నట్లు చెప్పటం, తమను బంధువులు, కుటుంబ సభ్యులో చంపాలని చూస్తున్నారని భ్రమపడటం తదితర లక్షణాలు కనిపిస్తాయి. రోజూ చేసే పనులు చేయకుండా మానివేయటం, పిలిచినా పలకకుండా ఏదో ఆలోచనలో పరధ్యానంగా ఉండటం, నిద్రపోకుండా, అన్నం తినకుండా, స్నానం చేయకుండా ఉండటం ,ఒంటరిగా గడపటం చేస్తుంటారు. ఇలాంటి వారిని స్కిజోఫ్రినియా వ్యాధి గ్రస్తులుగా గుర్తించి తక్షణమే మానసిక వైద్య నిపుణులను సంప్రదించాలి. వ్యాధిగ్రస్తులు అధికమే గుంటూరు జీజీహెచ్ మానసిక వ్యాధుల వైద్య విభాగానికి రోజూ 100 నుంచి 130 మంది వివిధ రకాల మానసిక సమస్యలతో చికిత్స కోసం వస్తున్నారు. వీరిలో 30 నుంచి 40 మంది స్కిజోఫ్రినియా వ్యాధి బాధితులే. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 50 మంది మానసికవ్యాధి వైద్య నిపుణులు ఉండగా ఒక్కో వైద్యుడి వద్దకు రోజూ 20 నుంచి 40 మంది బాధితులు చికిత్స కోసం వెళ్తున్నారు. ఈ వ్యాధి గ్రస్తులకు రోజూ 21 వ నెంబర్ ఓపీ గదిలో అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేసి మందులు కూడా ఉచితంగా అందిస్తున్నాం. డాక్టర్ వడ్డాది వెంకటకిరణ్, అసిస్టెంట్ ప్రొఫెసర్,మానసిక వ్యాధుల వైద్య విభాగం, గుంటూరు జీజీహెచ్. ప్రాథమిక దశలోనే సంప్రదించాలి మానసిక వ్యాధులకు ఆధునిక నాణ్యమైన మందులు అందుబాటులో ఉన్నాయి. మానసిక వ్యాధులకు చికిత్స ఉందన్న విషయాన్ని ప్రజలు గుర్తెరిగి నాటు మందులనువాడటం, భూత వైద్యులను సంప్రదించటం మాని వేసి మానసిక వైద్యులను సంప్రదించాలి. రోజూ 8 గంటలపాటు నిద్ర, పౌష్టిక ఆహారం, రోజూ శారీరక వ్యాయామంతోపాటుగా మద్యపానం, ధూమపానం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. డాక్టర్ పబ్బతి లోకేశ్వరరెడ్డి, అసోసియేట్ ప్రొఫెసర్,మానసికవ్యాధుల వైద్య విభాగం, గుంటూరు జీజీహెచ్. -
అమ్మా.. నువ్వే నా డాక్టర్
సద్గుణాలు, దుర్గుణాలు ప్రకృతిలో ఉన్నాయి.భౌతిక అనారోగ్యం, మానసిక అనారోగ్యం కూడా ప్రకృతిలో ఉంది.కాని ఒకదాని విషయంలో ఆందోళన ఉంటుంది.మరో దాని విషయంలో నిర్లక్ష్యం ఉంటుంది. ర్యాగింగ్ వల్ల బాధపడుతూ ఫోన్ చేసే పిల్లల విషయం ఎంత సీరియస్సోనా మనసు బాగలేదు, చెవుల్లో వింత శబ్దాలు వినిపిస్తున్నాయిఅని ఫోన్ చేసే పిల్లల సంగతి కూడా అంతే సీరియస్.దీనికి ఎవరి వంశం కారణం అని వెతకడం అనవసరం.ఏం చేయగలం అని ఆలోచించడమే కర్తవ్యం. మానవ జాతి ఒక తరం నుంచి మరో తరానికి తన తెలివిని మేధస్సును చాకచక్యాన్ని అందిస్తూ వచ్చినట్టే తాను మోస్తున్న జబ్బుల్ని కూడా ఇస్తూ వచ్చింది. వాటి నుంచి మనం తప్పించుకోలేము. దానికి కారణాలు వెతుక్కోవడం కన్నా వచ్చాక ఎలా ఫేస్ చేయాలి అనేదే ముఖ్యం. మీ అమ్మాయికి స్క్రిజోఫినియా వచ్చింది. ఇది తల్లి తరపు కుటుంబాల్లో ఉందా తండ్రి తరపు కుటుంబాల్లో ఉందా అనే వెతుకులాట అనవసరం. విజయవాడలో ఉన్న విజయరామ్‌కు గుర్గావ్లో ఉన్న యూనివర్సిటీ నుంచి ఫోన్ వచ్చింది.‘మీరు ఒకసారి యూనివర్సిటీకి వెంటనే రావాలి’ అవతలి వైపు స్టూడెంట్ కోఆర్డినేటర్ చెప్పింది.‘ఏంటి విషయం?’ కంగారుగా అడిగాడు విజయరామ్.‘ఏం లేదు. మీ అమ్మాయి ఆరోగ్యం బాగలేదు. కొన్నాళ్లు ఇంటికి తీసుకెళ్లి బాగయ్యాక పంపండి. ఒక్కదాన్నే అంతదూరం మేం పంపలేము’విజయరామ్ ఫోన్ పెట్టేసి భార్య శివలక్ష్మికి ఫోన్ చేశాడు. ‘అయ్యో.. అదేంటండీ.. రోజూ మనతో మాట్లాడుతోందిగా’ అందామె.‘ఏం మాట్లాడుతోంది... ఏదో పోగొట్టుకున్నదానిలా మాట్లాడుతోంది... నేను గమనించాను’‘నేనూ గమనించాననుకోండి. కాని దాని వ్యవహారం అంతే కదా.. మూడ్స్ అనుకున్నాను’ అంది.‘సరే. అర్జెంట్‌గా బ్యాగ్ సర్దు. తీసుకొస్తాను’ గుర్గావ్ యూనివర్సిటీకి వెళ్లేసరికి విజయరామ్ నెత్తి మీద పిడుగు పడింది. అప్పటికే అక్కడ టి.సి. రెడీ చేసి ఉన్నారు. మంచి యూనివర్సిటీ అని కూతురుని అంత దూరం తీసుకొచ్చి చేర్పించాడు. రెండేళ్లు కూడా కాలేదు. ఇంతలో ఈ ఉత్పాతం. ‘సారీ.. మీ అమ్మాయిని మా యూనివర్సిటీలో ఉంచుకోలేము. తను ఎవరినీ ట్రస్ట్ చేయడం లేదు. ఎవరితోనూ ఫ్రెండ్షిప్ చేయడం లేదు. ఎవరితోనూ కలిసి ఉండటానికి ఇష్టపడటం లేదు. అందరూ తన గురించే మాట్లాడుకుంటున్నారు. అందరూ తనను చూసే నవ్వుకుంటున్నారట. చీటికి మాటికి ఆందోళన పడుతోంది. పైగా రోజుకొక ప్రొఫెసర్‌ను బ్లేమ్ చేస్తోంది. ప్రొఫెసర్లు తనను తొక్కేయడానికి ట్రై చేస్తున్నారని, తనకు మార్కులు రాకుండా చూడ్డానికి ప్లాన్స్ వేస్తున్నారని కంప్లయింట్స్ చేస్తోంది’ అన్నాడు కాలేజీ హెడ్. విజయరామ్‌కు కోపం వచ్చింది. ‘మా అమ్మాయికి పిచ్చా. మీ వాళ్లు ఏదో తేడాగా బిహేవ్ చేయకపోతే తనెందుకు బ్లేమ్ చేస్తుంది?’ ‘పిచ్చి మాక్కాదు.. తనకే... కాసేపు గమనించి చూస్తే మీ కూతురు తనలో తాను మాట్లాడుకోవడం మీరు గమనిస్తారు. ఇక వెళ్లండి. మీ అమ్మాయి ఇక్కడే ఉంటే వేరే స్టూడెంట్స్ ఇక్కడి నుంచి పారిపోతారు’ అన్నాడు హెడ్. విజయరామ్ తన కూతురి వైపు చూశాడు. మౌనంగా తల వొంచుకొని ఉంది.ఆ రోజు అక్కడే ఉండే మరుసటి రోజు ప్రయాణ ఏర్పాట్లు చేసుకొని కూతురిని తీసుకుని విజయవాడ చేరాడు విజయ్‌రామ్. సాధారణంగా ఇలాంటి సమయంలో భార్యాభర్తలు ఏకమయ్యి కూతురి క్షేమం కోసం ఆలోచించాలి. కాని కూతురు ఇంటికి రావడంతోటే ఒకరితో ఒకరు కాట్లాడుకోవడం మొదలెట్టారు. దీనికి బాధ్యులెవరో తేల్చాలని ఇద్దరి తాపత్రయం. ‘మీ వంశంలో పిచ్చి ఉందని నాకు పెళ్లికి ముందే ఎవరో చెప్పారు. నేను పట్టించుకోలేదు. ఇప్పుడు నా కూతురు అనుభవిస్తోంది’ అన్నాడు విజయ్‌రామ్. ‘మా ఇంట్లో ఎవరికీ పిచ్చి లేదు. ఉంటే గింటే మీ వంశంలోనే ఉండాలి వెర్రి. మాకు సంబంధం వచ్చినప్పుడు కూడా చెప్పారు వాళ్లు తిక్కోళ్లు... వాళ్లతో ఎందుకు అని’ భార్య అంది. ‘అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలి అని అందుకే అన్నారు. మీ నానమ్మనో ఎవరినో చివరి రోజుల్లో సంకెళ్లతో కట్టేసి పడేశారని నాకు తెలుసులే’ ‘మీ తాత బట్టలిప్పుకుని రోడ్డున పడేవాడని మేమూ విన్నాం’ వీళ్ల గొడవ స్నేహితులకు తెలిసింది. వాళ్ల ప్రోద్బలం మీద తల్లి తండ్రి కూతురు హైదరాబాద్‌లో సైకియాట్రిస్ట్‌ను కలిశారు. ‘ముందు మీరిద్దరు కొట్టుకోవడం మాని మీ అమ్మాయి కోసం నిలబడండి’ అంది సైకియాట్రిస్ట్ మొత్తం గొడవంతా విని.విజయ్‌రామ్, శివలక్ష్మి ఇద్దరూ మౌనంగా ఉన్నారు. ‘వంశాలు చూసుకొని కుటుంబాలు గమనించుకొని పెళ్లిళ్లు చేసుకోవాలనే పెద్దల మాట మంచి నడవడిక, సంస్కారం ఉన్నవారితో జత పడటం కోసమే తప్ప వారి జబ్బుల ఆనుపానులు తెలుసుకొని పెళ్ళిళ్లు చేసుకోమని కాదు. మానవ జాతి ఒక తరం నుంచి మరో తరానికి తన తెలివిని మేధస్సును చాకచక్యాన్ని అందిస్తూ వచ్చినట్టే తాను మోస్తున్న జబ్బుల్ని కూడా ఇస్తూ వచ్చింది. వాటి నుంచి మనం తప్పించుకోలేము. దానికి కారణాలు వెతుక్కోవడం కన్నా వచ్చాక ఎలా ఫేస్ చేయాలి అనేదే ముఖ్యం. మీ అమ్మాయికి స్క్రిజోఫినియా వచ్చింది. ఇది తల్లి తరపు కుటుంబాల్లో ఉందా తండ్రి తరపు కుటుంబాల్లో ఉందా అనే వెతుకులాట అనవసరం. ఇది అనువంశికంగా వచ్చే జబ్బే అయినా ముందు తరాల్లో లేకపోయినప్పటికి కూడా రావచ్చు. సాధారణంగా ఇది టీనేజీ వయసులో బయటపడుతుంది. మీ అమ్మాయికి కూడా బయటపడింది. కాకుంటే మనం వెంటనే గుర్తించాం. ఇది లేటయ్యి మరో రెండేళ్లు వైద్యం అందక గుర్గావ్లోనే మీ అమ్మాయి చదువుకుంటూ ఉండిపోతే జబ్బు ముదిరిపోయేది‘ అంది సైకియాట్రిస్ట్. ‘దీని లక్షణాలు ఏంటి డాక్టర్’ అడిగింది శివలక్ష్మి. ‘భ్రాంతులు ఉంటాయి. కొందరికి చెవుల్లో శబ్దాలు వినిపిస్తాయి. వాటిని ఆడిటరీ హెలూసినేషన్స్ అంటాం. అనుమానం పెరిగిపోతుంది. దానిని పారనాయిడ్ థింకింగ్ అంటాం. ఊహాగానాలతో వాళ్లు తమను తాము క్షోభ పెట్టుకుంటారు. మీ అమ్మాయికి వచ్చింది సీరియస్ ప్రాబ్లం. వెళ్లి రెండు రోజులు ఆమెతో ఫ్రీగా, ప్రెండ్లీగా గడపండి. ధైర్యం చెప్పండి. నెమ్మదిగా చదువుకుందూలే... విజయవాడలోనే నీకు నచ్చిన కాలేజీలో కోర్సు కంటిన్యూ చేద్దువు ఇలాంటి మాటలు చెప్పండి’ అని నెక్స్›్ట కన్సల్టేషన్ డేట్ వేసింది సైకియాట్రిస్ట్. విజయ్‌రామ్, శివలక్ష్మిలలో మొదటగా మేల్కొంది శివలక్షే్మ. ఒక్కగానొక్క కూతురు. అమ్మాయికి కష్టం వస్తే తనే ఒక గోడలా నిలబడి పిల్లను కాచుకోవాలని నిశ్చయించుకుంది. అంతే... కూతురితో ఎక్కువ సేపు గడపడం, మాట్లాడటం, షికారుకు తీసుకెళ్లడం, నవ్వించడం, మానసికంగా పూర్తిగా స్థిమితం పొందేలా తన దగ్గరే పడుకోబెట్టుకోవడం.. ఇలా చాలా జాగ్రత్తలు తీసుకుంది. తిరిగి సైకియాట్రిస్ట్ దగ్గరకు వెళ్లినప్పుడు సైకియాట్రిస్ట్ సంతృప్తి వ్యక్తం చేసింది కూతురిని చూసి ‘చూడండి... ఫస్టఫాల్ ఇది ఒక రోజు జబ్బు కాదని మీరు గుర్తించాలి. ఏవో పూజలు చేయడం వల్ల, వ్రతాలు పట్టడం వల్ల, మొక్కులు మొక్కడం వల్ల మీకు ధైర్యం రావచ్చు కాని జబ్బు తగ్గదు. కాకపోతే అదుపులో ఉంచుకుని సాధారణ జీవితం గడపవచ్చు. అందుకు తప్పనిసరిగా కంటిన్యూయెస్‌గా వైద్యం తీసుకుంటూ ఉండాలి. జీవితాంతం చేస్తూనే ఉండాలి. చాలామంది ఏమనుకుంటారంటే మందులు లేకుండా కేవలం కౌన్సిలింగ్‌తో ఇది తగ్గుతుందని. అలా తగ్గదు. మందులు ఆపకూడదు. ధైర్యం కోల్పోకూడదు. ఈ జబ్బు ఉన్న చాలామంది ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటూ మామూలు జీవితం గడుపుతున్నారు. మీ అమ్మాయి కూడా గడపవచ్చు’ అంది సైకియాట్రిస్ట్. ‘చెప్పండి డాక్టర్ మీరేం చేయమంటే అది చేస్తాం’ అన్నాడు విజయరామ్. ‘ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంచండి. మీ ఇద్దరూ ఒక బలంగా మారి మీ అమ్మాయికి బలం ఇవ్వండి. మాట.. మందులు ఇవి కొనసాగిస్తూ ఉండండి. చాలు. జలుబు, జ్వరం, ఏదైనా గుండెజబ్బు ఇవి పిల్లలకు వస్తే తల్లిదండ్రులు వైద్యం కోసం పరిగెత్తుతారు. భౌతిక అనారోగ్యాల వంటివే మానసిక అనారోగ్యాలు కూడా. పిల్లల్లో అవి కనిపిస్తే వెంటనే స్పందించే కుటుంబమే నా దృష్టిలో మంచి కుటుంబం’ అంది సైకియాట్రిస్ట్. నిర్లక్ష్యమే సగం ఆనారోగ్య హేతువు. కాని విజయరామ్, శివలక్ష్మిలు తమ కూతురి విషయంలో అసలు నిర్లక్ష్యం పాటించలేదు. చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. కూతురు కూడా తల్లిదండ్రులకు సహకరించింది. కేన్సర్ వంటి ప్రాణాంతకమైన రోగాలు వచ్చి కూడా బయటపడి ఆనందంగా ఉన్న పిల్లలు ఉన్నారు. ఈ మానసిక అనారోగ్యాన్ని తాను ఫేస్ చేయగలదు అనే ధైర్యం తల్లిదండ్రుల వల్ల ఆ అమ్మాయి పొందింది. మెల్లగా బి.టెక్ పూర్తి చేసిన ఆ అమ్మాయి విజయవాడలోనే స్ట్రెస్‌కు తావు లేని తేలికపాటి ఉద్యోగం చేస్తూ సాధారణ జీవితం గడుపుతోంది. అర్థం చేసుకునే అబ్బాయి దొరికితే పెళ్లికి ఎదురు చూస్తోంది. పెళ్లి జరుగుతుందే ఆశిద్దాం. – కథనం: సాక్షి ఫ్యామిలీఇన్‌పుట్స్: డా. పద్మ పాల్వాయి, సైకియాట్రిస్ట్ -
హైస్కూల్ చదువు.. మెంటల్ డాక్టర్ కొలువు..!!
మాస్కో : మానవత్వం కనుమరుగై స్నేహితుని గొంతు కోసి చంపడమే కాకుండా అతని రక్తం తాగిన ఓ రాక్షసుడు డాక్టర్ అవతారం ఎత్తాడు. హోమిసైడల్ స్క్రీజోఫీనియా అనే మానసిక వ్యాధితో.. ఉన్మాదిగా మారిన ఆ వ్యక్తి ఏకంగా సైకియాట్రిక్ డాక్టర్‌గా చలామణి అయ్యాడు. వివరాలు.. ఉరల్స్ పట్టణంలోని ఓ సైకియాట్రిక్ ఆస్పత్రిలో బోరిస్ కొంద్రషీన్ (36) డాక్టర్‌గా పనిచేస్తున్నారు. ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగం చేస్తున్నట్టు గత నవంబర్‌లో గుర్తించారు. రాక్షసుడిగా అవతారం 1998లో కొంద్రషీన్ 16 ఏళ్ల తన హైస్కూల్ స్నేహితున్ని మత్తుమందు ఇచ్చి హత్య చేశాడు. అనంతరం తనను తాను రాక్షసుడిగా ఊహించుకుని అతని రక్తం తాగాడు. కొంద్రషీన్ మానసిక వ్యాధితో బాధపడుతున్నందున కోర్టు అతనికి సైకియాట్రిక్ ట్రీట్మెంట్ ఇప్పించాలని అతని కుటుంబాన్ని 2000 సంవత్సరంలో ఆదేశించింది. పదేళ్లపాటు ట్రీట్మెంట్ పొందిన కొంద్రషీన్ ఫేక్ సర్టిఫికెట్లు సంపాదించి నగరంలోని‘ సిటీ హాస్పిటల్’లోఉద్యోగంలో చేరాడు. మద్యం సేవించడం.. పొగ త్రాగడం వల్ల వచ్చే అనర్ధాలను వివరిస్తూ ప్రజల్ని అప్రమత్తం చేయడమే అక్కడ కొంద్రషీన్ పని. ఎవరికీ అనుమానం రాకుండా డాక్టర్‌గా నటిస్తూ అందర్నీ నమ్మించాడు. అయితే ఇంటర్‌ఫ్యాక్స్ అధికారులు సదరు ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహించడంతో ఈ నరహంతక ‘సైకియాట్రిక్’బండారం బయటపడింది. ఇంద్రషీన్ను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. ‘నాకు గానీ, మా అమ్మకు గానీ కొంద్రషీన్ జాబ్ చేస్తున్నాడని తెలియదు. అతను హైస్కూల్ వరకే చదువుకున్నాడు’ అని కొంద్రషీన్ సోదరి చెప్పారు. అయితే, ట్రీట్మెంట్ అనతరం తన సోదరుడు పూర్తిగా మారిపోయాడని, ఎవరికీ హాని తలపెట్టడం లేదని తెలిపారు. అతను ఇంకొన్నాళ్లు వైద్యుల పర్యవేక్షలో ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. -
మనోబలమే మందు
నిజామాబాద్‌అర్బన్ : స్కిజోఫ్రీనియా వ్యాధి తీవ్రమైన మానసిక రుగ్మత, ప్రతి వంద మందిలో ఒకరు ఈ వ్యాధికి గురవుతున్నారు. ఈ వ్యాధి 17–40 సంవత్సరాలలో ఉన్న వారికి ఎక్కువగా వస్తుంది. కొంత మందిలో 40 సంవత్సరాలు దాటిన కూడా రావచ్చు. ఈ వయస్సులో ఆడవాళ్లకు ఎక్కువగా వస్తుంది. ఆడవారితో పోలిస్తే ఈ వ్యాధి మగవారిలో తక్కువ వయస్సులోనే వస్తుంది. మనోబలంతో ఈవ్యాధిని జయించవచ్చు. రెండు రకాల లక్షణాలు హల్యుసినేషన్స్ వీరికి చుట్టూ వ్యక్తులు లేకపోయిన స్పష్టంగా మాటలు వినపడతాయి. మెదుడులో రసాయనాల మార్పిడితో నిజంగానే మాటలు వినబడతాయి. ఈ వినపడే మాటాలకు ప్రతి స్పందనగా వీరు మాట్లాడుకుంటుంటారు. ఈ మాటలు వీరు ఊహించుకుంటారు. దీంతో వ్యాధి సోకిన వ్యక్తి తనలోతాను నవ్వుకుంటు, తనలో తను మాట్లాడుకుంటున్నట్లు ఇతరులకు కనిపిస్తారు. క్రమేణ ఈ మాటలు నిజం అని ధృడంగా నమ్మతారు. వాస్తవానికి ఇవి నిజాలు కాకపోవడంతో సమాజాన్ని ఎక్కువగా అనుమానిస్తాడు. వాటినే డెల్సుషన్స్ అని అంటారు. వింతగా ప్రవర్తిస్తుంటారు. రోజువారి విధులను సక్రమంగా నిర్వర్తించలేకపోవడం, స్నానం చేయకపోవడం, బట్టలు మార్చుకోకపోవడం.ఆలోచన అర్థం వర్ధం లేకుండా ఉండటం, మాటకూడా అస్పష్టంగా అర్థం కాకుండా ఉంటుంది. వ్యాధి ప్రారంభానికి ముందు లక్షణాలు ఈ వ్యాధి ప్రారంభంలో వారు తమ పనులు చేసుకోవాడానికి కావలసిన ఫోకస్ కోల్పొతారు. ఏదైనా ఉద్యోగం ప్రారంభంలో బాగా చేస్తారు. ఆ తర్వాత ఏం చేయాలో తెలియక తికమక చెందుతారు. పనిని సగంలో వదిలేస్తారు. ఆ తర్వాత కాలేజీ, ఉద్యోగం వెళ్లడం మానివేసి ఇంట్లోనే ఉండటం ఆరంభిస్తారు. ప్రారంభ దశలో వ్యాధిని గుర్తించడం కష్టం. ఒకవేళ గుర్తించి చికిత్సను అందిస్తే వారిలో కలిగే మనో క్షీణతను ఆపవచ్చు. వంశంలో, కుటుంబంలో ఈ వ్యాధి ఉన్నవారు తొలి దశలోనే గుర్తించి జాగ్రత్త పడవచ్చు. ఈ వ్యాధి ఆలోచన, ఆచరణ, భావావేశాల మధ్య సమన్వయం తీవ్రంగా దెబ్బ తింటుంది. అంటే మనసులోని ముఖ్య విధుల మధ్య చీలిక ఏర్పడుతుంది.అందుకే స్కిజోఫ్రినియా అంటే చీలిపోయిన మనసు అన్నారు. ఎలా వస్తుంది.... వ్యాధి లక్షణాలు ఒక్కసారిగా కనబడవు. మనోబలం కోల్పోతారు. లక్షణాలు బయటపడకముందే వ్యాధిని గుర్తించి చికిత్స చేయడానికి పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ వ్యాధి పలు దశలలో అనగా కుటుంబచరిత్ర(జన్యుపరమైన కారణాలు), వ్యక్తి తల్లి గర్భంలో ఉన్నప్పుడు, ప్రసవం జరిగేటప్పుడు, ప్రసవం అయిన తర్వాత పెరిగే దశలలో ఏదేని కారణాల వలన నాడికణాల ఎదుగుదల అపసవ్యంగా జరుగుతుంది. ఆ తర్వాత తల్లిదండ్రుల పెంపకం, టినేజి, తొలి యవ్వన దశలో తనకు కలిగే ఒత్తిడి వలన మెదడు రసాయనాలలో శాశ్వత మార్పులు జరిగి వ్యాధి బయటపడుతుంది. వ్యక్తి తీవ్రమైన ప్రవర్తనతో చుట్టు ఉన్న వారికి గాని, తనకు గాని ఇబ్బంది కలిగిస్తున్నప్పుడు అందరికి దృష్టిలోకి వస్తుంది. దీనిని ఈ ఉదాహరణతో చెప్పవచ్చు. ఎదేని ఒక బ్రిడ్జి యొక్క నిర్మాణం యొక్క పలు దశలలో లోపం జరిగి ఉండవచ్చు. దానిని ఉపయోగంలోకి తెచ్చిన తర్వాత అది తట్టుకునే సామర్థానికి దాటిలోడు(బరువు) పడినప్పుడు మాత్రమే బ్రిడ్జి కూలిపోతుంది. వ్యాధి చికిత్స–నివారణ చర్యలు ఈ వ్యాధి ఉన్న వారు జీవితాంతం మందులు వాడాల్సి వస్తుంది. ఈ మందులు మెదడులో జరిగే మార్పులను యధావిధిగా సాధారణ స్థాయిలో ఉంచడానికి తోడ్పడాతాయి. మందులు ఆపివేస్తే వ్యాధి ముదిరే అవకాశం ఉంటుంది. అంటే రక్తపోటు, మధుమేహం మందులాలగా మందులు వాడుతూ లక్షణాలను నియంత్రణలోకి పెట్టుకోవాలి. స్కిజోఫ్రినియాతో బాధపడేవారు తను అసాధారణంగా ఉన్నాను. తను మందులు వాడాలి అన్న స్పృహ కలిగి ఉండరు. వ్యాధి లక్షణాలు తగ్గిన తర్వాత ఈ అంతర్ దృష్టి పూర్తిగా వచ్చినచోరోగి మందులు తనకు తానుగా వాడుకో గలుగుతాడు. అందుకే చాలా మంది రోగులు మందులు ఆపివేస్తుంటారు. కొంత మంది రోగులు లేదా వారి బంధువులు మందులతో సైడ్ ఎఫెక్టస్ కలుగుతున్నాయని , కలుగుతాయేమోనని మానసిక వైద్యంపై అవగాహన లేనివారి మాటలు విని బంధువులు నివసించడం ముఖ్యం. రోగికి స్వతహాగ మందులు మింగుతున్నాడా అని పరిశీలిస్తుండాలి, రోగికి గుర్తు చేస్తుండాలి. చికిత్స తీసుకోవాలి ఈ వ్యాధి గురించి అవగాహన లేకపోవడంతో చాలాసార్లు ఈ లక్షణాలు చేతబడి, మనిశికోడి, దేవుని కోడి, దయ్యం పట్టింది. చెడుగాలితో కల్గిందని చికిత్స తీసుకోకుండా వ్యాధి తీవ్రత పెరిగే వరకు సమయాన్ని వృథా చేస్తుంటారు. దీని వలన పూర్తిగా మేధో క్షీణత జరిగిపోతుంది. వ్యాధి తొలిదశలోనే గుర్తించి తొందరగా చికిత్స ప్రారంభిస్తే సుమారుగా 20 శాతం రోగులు పూర్తిగా కోలుకునే అవకాశం ఉంది. 5–6 శాతం రోగులు ఆత్మహత్య చేసుకొని చనిపోతారు. వెంటనే చికిత్స తీసుకోవాలి. – డా.అచ్చంపేట వికాస్, మానసిక వైద్యుడు -
ఆ పోస్టులు వ్యాధులను తెలుపుతాయి!
లండన్: ఫేస్బుక్లో మనం పెట్టే స్టేటస్, కొట్టే లైకులు, ఫొటోలు మానసిక వ్యాధులను కనుగొనడంలో సాయపడే అవకాశం ఉందట. సామాజిక అనుసంధాన వెబ్సైట్లను ఉపయోగించేవారిపై చేసిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. దీని ద్వారా మనం డిప్రెషన్, స్క్రీజోఫ్రేనియా వంటి మానసిక వ్యాధుల గురించి తెలుసుకోవచ్చు. ఫేస్బుక్ ద్వారా తెలిసిన సమాచారం.. ఆ వ్యక్తి ప్రవర్తన ద్వారా తెలుసుకున్న సమాచారం కంటే మరింత వాస్తవికంగా ఉందన్నారు. అంతేకాకుండా వ్యకిగతంగా ప్రశ్నలు అడిగినప్పుడు సరైన సమాచారం రాబట్టడం, అతని ప్రవర్తనను అంచనా వేయడం కొంచెం కష్టమేనని తెలిపారు. సోషల్ మీడియాలో వారు వాడిన పదజాలం, వెల్లడించిన భావోద్వేగాలు, లేవనెత్తిన అంశాల ద్వారా మరిన్ని అంశాలను తెలుసుకోవచ్చు. ఫేస్బుక్లో రోజుకు 35 కోట్ల ఫొటోలు అప్లోడ్ అవుతున్నాయని, ముఖకవళికలను గమనించే యాంత్రిక చిత్రాల విశ్లేషణ ఈ ప్రక్రియను మరింత సులభతరం చేస్తుందన్నారు.