గుంటూరు బ్రాడీపేటకు చెందిన సుజాత తన తల్లిదండ్రులపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనను తల్లిదండ్రులే చంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొంది. యుక్తవయస్సులో ఉన్న కుమార్తె తమపై పోలీసులకు ఫిర్యాదు చేయటంతో దెయ్యం పట్టినట్లుగా తల్లిదండ్రులు భావించి భూత వైద్యులను సంప్రదించారు. అంత్రాలు కట్టించినా, తాయత్తులు మెడలో వేయించినా సుజాత మానసిక పరిస్థితిలో మార్పు రాలేదు. సుమారు రెండేళ్లపాటు భూతాలు వదిలించేవారి చుట్టూ, దర్గాలు, గుడులు చుట్టూ తిప్పి తదుపరి జీజీహెచ్‌లోని మానసిక రోగుల వైద్య విభాగంలో చికిత్స చేయించారు. వ్యాధి ముదిరినాకా వచ్చాక సుజాతను ఆస్పత్రికి తీసుకురావటంతో వ్యాధిని తగ్గించేందుకు ఆస్పత్రి వైద్యులు ఎక్కువగా కష్టపడాల్సి వచ్చింది.
విజయవాడ గుణదల సెంటర్‌కు చెందిన సురేష్ ప్రతి రోజూ కూలీ పనులకు సక్రమంగా వెళ్లి వచ్చిన ఆదాయాన్ని తల్లిదండ్రలకు ఇచ్చి చేదోడు వాదోడుగా ఉండేవాడు. రెండేళ్ల కిందట అతడి ప్రవర్తనలో మార్పు వచ్చింది. పనికి వెళ్లటం మానివేశాడు. ఎవరు పిలిచినా పలకకుండా ఏదో ఆలోచనలో ఉన్నట్లు ఒంటరిగా గడపటం ప్రారంభించాడు. చివరకు స్నానం చేయటం, అన్నం తినటం మానేసి గెడ్డం పెంచుకుని తిరుగుతూ ఉండేసరికి ఏదైనా ప్రేమ వ్యవహారం అయి ఉంటుందని భావించి స్నేహితులను విచారించినా ఏమీ తెలియకపోవటంతో అతడి తల్లిదండ్రులు ఏదో గాలి సోకిందని భావించి భూత వైద్యుడికి వద్దకు తీసుకెళ్లి అంత్రాలు వేయించారు. మూడేళ్లకుపైగా ఊరూరా తిప్పి అన్ని రకాల అంత్రాలు వేయించినా సాధారణ స్థితికి రాకపోయేసరికి చివరకు జీజీహెచ్ మానసిక వైద్యులను సంప్రదించారు.
గుంటూరు మెడికల్: ఇలా వివిధ మానసిక సమస్యలతో బాధపడుతూ ఉండేవారు తొలుత భూత వైద్యులను సంప్రదించి చివరి స్థితిలో మానసిక వైద్యులను సంప్రదిస్తున్నారు. మానసిక వ్యాధి లక్షణాలను ముందుగానే గుర్తించి ప్రాథమిక దశలోనే వైద్యం చేయించటం వల్ల అతి తక్కువ కాలంలోనే వారు సాధారణ స్థితికి చేరుకుంటారు. లేదంటే దీర్ఘకాలం వ్యాధితో బాధపడుతూ అది చూసి కుటుంబ సభ్యులు కూడా కుంగిపోవాల్సి వస్తుందని మానసిక వ్యాధుల వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధిపై అందరికి అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది మే 24వ తేదీన ‘ప్రపంచ స్కిజోఫ్రినియా డే’నిర్వహిస్తున్నారు. సందర్భంగా సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం.
వ్యాధి లక్షణాలు...
వ్యాధి సోకిన వారు తనలో తాను నవ్వుకోటం, కోపంతో అరవటం, తిట్టటం, కొట్టడం, మాటలో మార్పు, ప్రవర్తనలో తేడా, ఎవరో కనబడుతున్నట్లు అనుమానాలు వ్యక్తంచేయటం, చెవిలో మాటలు వినిపిస్తున్నట్లు చెప్పటం, తమను బంధువులు, కుటుంబ సభ్యులో చంపాలని చూస్తున్నారని భ్రమపడటం తదితర లక్షణాలు కనిపిస్తాయి. రోజూ చేసే పనులు చేయకుండా మానివేయటం, పిలిచినా పలకకుండా ఏదో ఆలోచనలో పరధ్యానంగా ఉండటం, నిద్రపోకుండా, అన్నం తినకుండా, స్నానం చేయకుండా ఉండటం ,ఒంటరిగా గడపటం చేస్తుంటారు. ఇలాంటి వారిని స్కిజోఫ్రినియా వ్యాధి గ్రస్తులుగా గుర్తించి తక్షణమే మానసిక వైద్య నిపుణులను సంప్రదించాలి.
వ్యాధిగ్రస్తులు అధికమే
గుంటూరు జీజీహెచ్ మానసిక వ్యాధుల వైద్య విభాగానికి రోజూ 100 నుంచి 130 మంది వివిధ రకాల మానసిక సమస్యలతో చికిత్స కోసం వస్తున్నారు. వీరిలో 30 నుంచి 40 మంది స్కిజోఫ్రినియా వ్యాధి బాధితులే. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 50 మంది మానసికవ్యాధి వైద్య నిపుణులు ఉండగా ఒక్కో వైద్యుడి వద్దకు రోజూ 20 నుంచి 40 మంది బాధితులు చికిత్స కోసం వెళ్తున్నారు. ఈ వ్యాధి గ్రస్తులకు రోజూ 21 వ నెంబర్ ఓపీ గదిలో అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేసి మందులు కూడా ఉచితంగా అందిస్తున్నాం. డాక్టర్ వడ్డాది వెంకటకిరణ్, అసిస్టెంట్ ప్రొఫెసర్,మానసిక వ్యాధుల వైద్య విభాగం, గుంటూరు జీజీహెచ్.
ప్రాథమిక దశలోనే సంప్రదించాలి
మానసిక వ్యాధులకు ఆధునిక నాణ్యమైన మందులు అందుబాటులో ఉన్నాయి. మానసిక వ్యాధులకు చికిత్స ఉందన్న విషయాన్ని ప్రజలు గుర్తెరిగి నాటు మందులనువాడటం, భూత వైద్యులను సంప్రదించటం మాని వేసి మానసిక వైద్యులను సంప్రదించాలి. రోజూ 8 గంటలపాటు నిద్ర, పౌష్టిక ఆహారం, రోజూ శారీరక వ్యాయామంతోపాటుగా మద్యపానం, ధూమపానం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. డాక్టర్ పబ్బతి లోకేశ్వరరెడ్డి, అసోసియేట్ ప్రొఫెసర్,మానసికవ్యాధుల వైద్య విభాగం, గుంటూరు జీజీహెచ్.
Comments
Please login to add a commentAdd a comment