
లవ్ అన్‌ఫెయిర్
పొగచూరిన గుండెని ఏం పెట్టి తోమితే ఆ మసి పోతుంది? ఎలా పోతుంది లెండి.. ప్రేమ జిడ్డు కదా! కొన్ని బంకల్ని వదిలించు కోవాలనిపిస్తుంది. కానీ ప్రేమ.. కాదన్నా, కాదనుకున్నా కావాలనిపిస్తుంది. అందుకేనండీ.. ప్రేమ ఫెయిరా? అన్‌ఫెయిరా, అఫెయిరా.. మీరే డిసైడ్ అవ్వండి.
సినిమాలన్నీ ప్రేమకథలే. మనిషి జీవితం నిండా ప్రేమే కాబట్టి, దాన్నుంచి ఎస్కేపై సినిమా ఇంకో కథను చెప్పలేదు. యాక్షన్ ప్రేమ. అడ్వెంచర్ ప్రేమ. కామెడీ ప్రేమ. క్రైమ్ ప్రేమ. డ్రామా ప్రేమ. ఫాంటసీ ప్రేమ. హిస్టారికల్ ప్రేమ. ఇవేవీ కాకపోతే.. ఓ పిచ్చి ప్రేమ. రాయిని గిర్రున తిప్పి, గురి చూడకుండా కొట్టినా అది వెళ్లి తగిలిన స్క్రీన్‌పై అప్పటికి ఆడుతూ ఉండేదీ ప్రేమే. ప్రేమదీ సినిమాదీ పెద్ద లవ్ అఫైర్. లవ్ అఫైర్ ఒక్కోసారి ఎంత లవ్లీగా ఉంటుందో చెప్పాలా? ఊహు. చెప్తే కళ్లు క్యాచ్ చెయ్యలేవు. కళ్లు మూసుకోవాలి. 1989లోకి వెళ్లాలి. ‘గీతాంజలి’ ఆడుతున్న సినిమా థియేటర్‌లోకి వెళ్లి కూర్చోవాలి.
కొండ ప్రాంతపు మంచు ప్రదేశం. గెస్ట్ హౌస్ అద్దాల్లోంచి శూన్యంలోకి చూస్తూ ఉంటాడు నాగార్జున. ఒక్కసారిగా పొగమంచు అతడిని కప్పేయడానికి ఇంట్లోకి వచ్చేస్తుంది. చల్లగా తాకుతుంది. వెనక్కి తిరిగి చూస్తాడు. గిరిజ! భుజం చుట్టూ చీర కప్పుకుని, చలికి చేతులు కట్టుకుని నాగార్జునకు దగ్గరగా వస్తుంది. నాగార్జునా వచ్చేస్తాడు ఆమెకు దగ్గరగా. బాగా దగ్గరగా. నువ్వు చెప్పింది నిజమేనా?’’ అంటుంది.. మెల్లగా.. మెలోడియస్‌గా. ప్రేమ మాత్రమే ఇవ్వగల మెలడీ అది. ఆమె చెంపల్ని నిండుగా చేతుల్లోకి తీసుకుని, కళ్లల్లోకి చూస్తూ ‘ఐ లవ్యూ’ అంటాడు. నేను చెప్పింది నిజమే అన్నట్లు.
‘ఏ?’అంటుంది. ‘ఎందుకో తెలీదు. కానీ నిజం అని మాత్రం తెలుసు’ అంటాడు. ‘ఎలా?’ అంటుంది. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని తన గుండెకు ఆన్చుకుంటాడు. ‘గుండె బద్దలయ్యేలా కొట్టుకుంటోంది’ అంటాడు. ‘నాక్కూడా’ అంటుంది. ‘నిజంగా?’ అంటాడు. ‘అవును’ అన్నట్లు కళ్లతో చెప్పి అతడి చెవిని తన గుండెకు ఆన్చుకుంటుంది. డబ్ డబ్.. డబ్ డబ్... డబ్ డబ్.. డబ్ డబ్.. నయన శ్రుతులు, హృదయ లయలు, అధర గతులు, మధుర స్మృతులు.. లాక్‌డ్ విత్ లిప్స్. అదుముకున్న పెదవులు పెదవుల్లా ఉండవు. హత్తుకున్న హృదయాల్లా ఉంటాయి. ఇంకో భావం కనిపించదు.
అర్జున్‌రెడ్డీ పెట్డాడు ముద్దు. దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత.. ఇప్పుడొక కొత్త ముందు. అది గీతాంజలి ముద్దు కాదు. అదర్‌దేన్ హార్ట్.. దేహంలోని ఏ భాగంలోంచో మోహం తన్నుకొస్తే పెట్టిన ముద్దు. ప్రేమంటాడు దాన్ని అర్జున్‌రెడ్డి! కాదనలేం. ఔననలేం. ఆ పిల్లని తిడతాడు, భయపెడతాడు, బెదిరిస్తాడు. సైకో వెధవ! పిల్లల్ని ఎట్లా సినిమాకు పంపడం?! పంపకండి. అప్పుడేం జరుగుతుంది? అర్జున్‌రెడ్డి అనేవాడు లేకుండా పోతాడా? థియేటర్‌లో లేకుండా పోతాడు. లోకం లోనే లేకుండా పోతాడా? ఎవడి క్యారెక్టర్ ఏంటో అదేగా మనకు కనిపించేది? మనం చూపించాల్సింది. అర్జున్‌రెడ్డి ఇలాగే మాట్లాడతాడు. థియేటర్ లోపల, థియేటర్ బయటా. వాణ్ణని తప్పులేదు. ప్రేమ క్యారెక్టరే మారిపోయింది. మారిపోతోంది. ప్రేమకు క్యారెక్టరా? అవును. ప్రేమ రంగు, రుచి, వాసన.. అప్‌డేట్ అవుతున్నాయి. ‘ఇన్‌సెర్షన్’ని అర్జున్‌రెడ్డి ప్రేమ అంటుంటే.. మొన్నీ మధ్యే ‘ఎరకై్టల్ డిస్‌ఫంక్షన్’లోంచీ ఒక బాలీవుడ్ ప్రేమ రిలీజ్ అయింది.. శుభ మంగళ్ సౌధాన్.
గీతాంజలికి ఎనిమిదేళ్లకు ముందే ప్రేమకు పెద్ద బ్రేక్.. ‘సీతాకోక చిలుక’ (1981). అది లేలేత ప్రేమ. పలుకులు మూగబోయినప్పుడు ఒలికిన ప్రేమ. కార్తీక్ బ్రామ్మలబ్బాయి. అరుణ క్రిస్టియన్. అది కాదు సమస్య కార్తీక్‌కి. ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ లవ్. అరుణంటే ఇష్టం. చెప్పడానికి భయం. ప్లేస్ కావాలి. ప్రైవసీ కావాలి. వాటికన్నా ముఖ్యం ధైర్యం. అది కావాలి. అటు వైపు పూర్తి యాంటీ. కార్తీక్ కనపడగానే అరుణ అపరకాళి అవుతుంటుంది. సముద్రం ఒడ్డున ఆడపిల్లలంతా చేరి దాగుడు మూతలు ఆడుతుంటారు. అరుణ చూపు కోసం, అరుణ మాట కోసం ఆరాటంతో ఉన్న కార్తీక్.. ఆ కొండ రాళ్లలో ఎవరికీ కనిపించకుండా, ఆమెను ఇసుకలో తన అడుగులతో తన వైపుకు దారి మళ్లించుకుంటాడు. దగ్గరికి రప్పించుకుంటాడు. గుహలాంటి ప్రదేశం అది. కార్తీక్‌ని చూసి షాక్ తింటుంది. అరుణ. వెంటనే అక్కడి నుంచి పారిపోబోతుంది. ‘కరుణా.. కరుణా.. నేను..’ అంటూ పరుగున వచ్చి ఆమె చెయ్యి పట్టుకుంటాడు కార్తీక్. మళ్లీ అపరకాళి అవతారం. చాచి చెంపమీద కొడుతుంది అరుణ. దవడ అదిరిపోతుంది. కార్తీక్ కంట్లోంచి నీరు. అమె చెయ్యి అతడి చెంప దిగకముందే ఆ చేతిపై చెయ్యివేస్తాడు కార్తీక్. అరుణకది రెండో షాక్. అతడినే చూస్తుంటుంది. అరుణ చేతిపై నుంచి తన చేతిని కార్తీక్ దించేసినా, ఆమె చెయ్యి ఇంకా కార్తీక్ చెంపకు అంటుకునే ఉంటుంది. ఆ వెంటనే తేరుకుని, తత్తరపడి పరుగున వెళ్లిపోతుంది. కార్తీక్ కన్నీళ్లు అరుణ దోసిళ్లలో ప్రేమ పూలై రాలుతాయి.
ఈ చిత్రం ప్రారంభ దశ నుంచీ అన్ని విధాలా సహకరించిన శ్రీ అల్లు అరవింద్ (ఇలా అని ‘సీతాకోకక చిలుక’ టైటిల్స్‌లో ఉంటుంది) ఏం సహాయం చేశారో కానీ.. ఇరవై మూడేళ్ల తర్వాత 2004లో వచ్చిన మరో బ్రేకింగ్ ప్రేమ కథా చిత్రానికి పెద్ద సహాయం చేశారు. దానికి హీరోని అందించారు. సీతాకోక చిలుక రిలీజ్ అయినప్పుడు అల్లు అరవింద్ కొడుకు అర్జున్ (బన్నీ) రెండేళ్లవాడు. ఆ రెండేళ్లవాడే సుకుమార్ డైరెక్షన్‌లో ‘ఆర్య’గా ప్రేమను కొత్త ట్రాక్ ఎక్కించాడు. ఆర్యకు కాలేజ్‌లో అది ఫస్ట్ డే. సైకిలేసుకుని వెళ్తాడు. అక్కడ శివ బాలాజీ కాలేజ్ బిల్డింగ్ పైకెక్కి అక్కడి నుంచి కిందికి చూసి పెద్దగా అరుస్తూ అనూ మెహ్‌తాను ఐ లవ్ యూ చెప్పమంటాడు. లేదంటే దూకేస్తానంటాడు. అతడి చేతిలో గులాబీ పువ్వున్న కొమ్మ కూడా ఉంటుంది. బిల్డింగ్ కింద స్టూడెంట్స్ అంతగా గుమికూడి ఆదుర్దాగా పైకి చూస్తుంటారు. అనూ చుట్టూ అమ్మాయిలు చేరి, ‘ఐ లవ్ యూ చెప్పవే లేదంటే దూకేస్తాడు’ అని బలవంతం చేస్తుంటారు. ఆ భయానికి ఆ అమ్మాయి ఐ లవ్ యు చెప్తుంది. పెద్దగా చెప్పమంటాడు శివబాలాజీ. కాలేజ్ కాంపౌండ్ అంతా అదిరిపోయేలా ఐ... లవ్... యు.. అని చెబుతూ ఉంటుంది అను. సరిగ్గా అప్పుడొస్తాడు ఆర్య. ఆ అమ్మాయిని చూసి ఫ్లాట్ అయిపోతాడు. ప్రేమలో పడిపోతాడు. ఓ మౌత్ ఆర్గాన్ ఊదుకుంటూ తన ప్రేమకు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వేసుకుంటూ ఉంటాడు. మ్యూజిక్‌లకు, మ్యాజిక్‌లకు అమ్మాయిలు పడిపోతారా? పోయినా పోకున్నా.. ఇదేం ప్రేమ? ఇంకొకర్ని లవ్ చేస్తున్న అమ్మాయిని లవ్ చెయ్యడం?
కానీ చేస్తాడు. అనూని (సినిమాలో గీత) లవ్ చేస్తాడు ఆర్య. ఐ లవ్ యు అని కూడా చెప్తాడు. అదీ కూడా శివబాలాజీ పక్కన ఉండగానే చెప్తాడు! ఓసారి ఏకంగా లవ్ లెటర్ ఇస్తాడు! ‘ఏంటీ జోక్ చేస్తున్నావా?’ అంటుంది. ‘నో. ఐ యామ్ వెరీ సీరియస్’ అంటాడు. ‘చూడూ.. నిన్న నాతో పాటు ఉన్న అతను అజయ్’ అంటుంది. ‘తెలుసూ’ అంటాడు. ‘మీరు అతన్ని లవ్ చేస్తున్నారు. నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను’ అని కూడా అంటాడు! ‘అంటే.. తెలిసే లవ్ చేస్తున్నావా?’ అంటుంది. ‘అంటే మీరొకర్ని లవ్ చెయ్యగానే మేం డ్రాప్ అయిపోవాలా?’ అంటాడు. ‘అసలలా డ్రాప్ అయితే అది ప్రేమ ఎలా అవుతుందండీ’ అంటాడు. అనూ ‘నో’ అంటుంది. ‘హే.. మీరు నన్నేం లవ్ చెయ్యక్కర్లా.. జస్ట్ ఫీల్ మై లవ్’ అంటాడు. యూత్ విరగబడి చూసింది. చాలా గ్యాప్ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రేమ విరగ్గాసింది. రోజ్ కాదు, జాస్మిన్.. కాదు. లీల్లీలాంటి ఓ లవ్‌లీ సుకుమార సమీరం అది. తర్వాత ఆరేళ్లకు వచ్చిన ఓ రేంజి లవ్వు ‘ఆరెంజ్’. ఆర్యతో తెలుగు సినిమా కొత్త ట్రాక్‌లోకి వస్తే, ఆరెంజ్ సినిమాతో కొత్త హైట్‌లోకి ఎక్కేసింది.
ఆరెంజ్‌లో చరణ్‌కి ప్రేమ మీద నమ్మకం ఉండదు. అలాగని ప్రేమించకుండా ఉండడు. సముద్రమంత ప్రేమ కావాలనుకుంటాడు. నచ్చిన ప్రతి అమ్మాయినీ ప్రేమిస్తుంటాడు. నచ్చినన్నాళ్లు ప్రేమిస్తాడు. అన్నాళ్లూ సిన్సియర్‌గా తిప్పుతాడు, థ్రిల్స్ ఇస్తాడు, ముద్దులూ, గిఫ్టులు ఇస్తుంటాడు. హ్యాపీ బర్త్‌డేలు, ఐ లవ్ యూలు చెబుతుంటాడు. ఆ ప్రేమను నిలబెట్టుకోడానికి అబద్ధాలు కూడా చెబుతుంటాడు. పచ్చి అబద్ధాలు. అయితే ఇదంతా ఇంకో పిల్ల నచ్చేంత వరకే. మధ్యలోకి పాత పిల్ల వచ్చి డిస్టర్బ్ చేస్తే నచ్చదు. అలాంటి ప్రేమబోతు జెలీనియా లెఫ్‌లోకి వస్తాడు. ‘పాపం.. జెనీలియా’ అనిపిస్తుంది మనకు. చరణ్‌పై పీకల్తాగా కోపం కూడా వచ్చేస్తుంది. కానీ చివర్లో మారిపోతాడు. జెనీలియా మార్చేస్తుంది. ఆ అమ్మాయి కోపం, అలక సతాయింపు, బాధ, ఆవేదన.. అన్నీ చరణ్‌ని మార్చేస్తాయి. ఈ ప్రేమ జనానికి ఎక్కలేదు. చూడ్డానికి బాగుంది. బట్ మనసుకు ఎక్కలేదు. చాలా హైట్‌లో ఉన్న ప్రేమ మరి.
‘ఆర్య’లో ఇంకొకర్ని ప్రేమించిన అమ్మాయిని లవ్ చేస్తాడు కదా ఆర్య, ‘మహర్షి’లో ఇంకొకరి భార్యను లవ్ చేస్తాడు రాఘవ. ముందే లవ్ చేస్తాడు. ఆ అమ్మాయి పెళ్లయిపోతుంది. తర్వాత ఆ లవ్ ఇంకా గాఢం అవుతుంది. చివరికి రాఘవ సైకో అయిపోతాడు. 1988లో వచ్చిన మహర్షికి, 2017లో వచ్చిన అర్జున్‌రెడ్డికి కొన్ని పోలీకలు ఉన్నాయి. థీమ్‌లో కాదు. క్యారెక్టర్స్‌లో. మహర్షి, అర్జున్‌రెడ్డి ఇద్దరూ కోపాన్ని అదుపు చేసుకోలేని వారు. ఇద్దరూ డిప్రెషన్‌లోకి వెళ్లివచ్చిన వాళ్లు. ప్రేమ టై–అప్ కాక మహర్షి, ప్రేమ బ్రేక్–అప్ అయ్యి అర్జున్ రెడ్డి థియేటర్‌లో అల్లకల్లోలం సృష్టిస్తారు. అవును. ప్రేమ కల్లోలమే. ప్రేమించినా కల్లోలమే, ప్రేమించకపోయినా కల్లోలమే, ప్రేమిస్తూ ఉన్నా కల్లోలమే, ప్రేమిస్తూ ఉండకపోయినా కల్లోలమే.ఎలా మరి బతకడం? కల్లోలం నుంచి ప్రేమే మళ్లీ కౌగిట్లోకి తీసుకుంటుంది. నాగార్జునలా లవ్‌లీగా హత్తుకున్నా, అర్జున్‌రెడ్డిలా రఫ్‌గా అదుముకున్నా ప్రేమ ప్రేమే. సినిమాలన్నీ ప్రేమ కథలే అయినా, ప్రేమే కథగా ఉన్న సినిమాల గురించి అందుకే మనం ఇలా పదే పదే మాట్లాడుకుంటుంటాం.
ప్రేమ ఏ ట్రాక్‌లో, ఏ రూట్‌లో మనిషి పడేస్తుందో చెప్పలేం. పడ్డాక లేచి చూసుకోవలసిందే. ‘ఆర్య’లో నువ్వు ప్రేమించకపోతే బిల్డింగ్ పై నుంచి పడిపోతానంటాడు శివబాలాజీ. ‘ఇడియట్’లో నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టే బిల్డింగ్ పైనుంచి పడిపోనంటాడు రవితేజ!
ప్రేమ పరిమళం
లోకంలో ప్రతి దానికీ ఓ నిర్వచనం ఉంది. ప్రేమకు లేదు! మనిషిని బట్టే ప్రేమ తప్ప, ప్రేమ కంటూ సొంతంగా ఓ స్తుతీ, స్తోత్రం లేవు. ప్రేమను డిఫైన్ చెయ్యడం అంటే దేవుడికి రూపం చెక్కడమే. మనిషి ఊహకు ఏ రేఖలోస్తే అవే దేవుడు. మనిషి మనసు ఏ రెక్కలు కట్టుకుంటే అదే ప్రేమ. చెంప ఛెళ్లు మన్నప్పుడు ఆ మంటలో లేపనాల పూలు పూస్తాయి. ఆ పరిమళం ప్రేమ. ‘ఛీ.. నీ మీద ప్రేమ లేదు ఫో’ అన్నప్పుడు.. ‘లేదంటూనే ఫీల్ మై లవ్’ అంటూ అమ్మాయి చుట్టూ చక్కర్లు కొట్టడం ఫిలసాఫికల్లీ సాధింపు ప్రేమ. ఈ రెండు ప్రేమలూ తెలుగు సినిమాకు పెద్ద బ్రేక్! ‘ఆరెంజ్’ ప్రేమ ఇంకో బ్రేక్. ‘హాయ్ రే హాయ్.. జాంపండు రోయ్’ టైపు ప్రేమల్ని కోసి, కారం పెట్టి జాడీల్లో పడేసిన బ్రేక్‌లు ఇవి.
ఎక్కువ కాలం.. తక్కువ ప్రేమ!
చిన్నప్పుడు మీనాక్షి టీచర్ నుంచి అప్పటికి ప్రేమిస్తున్న మధు వరకు మొత్తం తొమ్మిది మందిని ప్రేమించి ఉంటాడు చరణ్. నైన్ లవ్ స్టోరీస్. పదో అమ్మాయి జెనీలియా. ప్రేమించుకున్నంత కాలం ప్రేమించుకుని హ్యాపీగా విడిపోదాం అంటాడు. జెనీలియా గుండె గతుక్కుమంటుంది. ఏంటి వీడి క్యారెక్టర్... జెనీలియా డైలమా. ప్రేమ ఎవర్ గ్రీన్ కాదంటాడు చరణ్. ఎప్పుడో టక్కున రెడ్‌లైట్ పడుతుందంటాడు. ఎక్కువ కాలం ప్రేమిస్తే, ప్రేమ తక్కువ కాలం ఉంటుందంటాడు. ప్రేమ స్టాచ్యూ కాదు, ఎప్పుడూ ఒకేలా ఉండిపోడానికి అంటాడు.
పైకి చెబితేనే అది ప్రేమ
లిటిల్ మాన్‌హట్టన్’ (2005) సినిమాలో గేబ్ అనే పిల్లాడు ఉంటాడు. వాడికి పదేళ్లు. వాడు ప్రేమించిన అమ్మాయి రోస్‌మేరీ కి 11 ఏళ్లు. ఇద్దరూ క్లాస్‌మేట్స్. బాక్సింగ్ క్లాసులో పార్ట్‌నర్స్. ఒకళ్లతో ఒకళ్లు ఫైట్ చెయ్యాలి. రోస్‌మేరీతో ఫైట్ చెయ్యడం గేబ్‌కి బాగుంటుంది. ఓసారి ముద్దు కూడా పెడతాడు! ఆమెపై ఫీలింగ్స్. ఆ సంగతి వాడికీ తెలీదు. సెలవుల తర్వాత బాక్సింగ్‌లో రోస్‌మేరీకి కొత్త పార్ట్‌నర్ వస్తాడు. వాడు వీడికన్నా అందంగా ఉంటాడు. వీడికన్నా బలంగా ఉంటాడు. వీడికన్నా పొడవుగా ఉంటాడు. ఆ కొత్తవాడి మీద రోస్‌మేరీకైతే ఎలాంటి ఫీలింగ్సూ ఉండవు కానీ, వీడే ఇక్కడ కుమిలిపోతుంటాడు. రోస్‌మేరీతో తనను తప్ప ఇంకొకర్ని జీర్ణించుకోలేని ప్రేమ! చివరికి ఆ అమ్మాయికి చెప్తాడు. ‘నాకింకా అంత వయసు రాలేదు’ అంటుంది రోస్‌మేరీ. ప్రేమను మనసులోనే దాచేసుకుంటే అది ఏనాటికీ ప్రేమ అవదన్నది సినిమా.