
మామగారు... ఊరుకోరు...
దుర్గాప్రసాద్ బీకామ్‌లో ఫిజిక్స్ చదువుకోలేదు. ఒకవేళ అలాంటి ఆడ్ చదువు చదివి ఉంటే అతడికి మనుషుల్ని
సమ్‌సారం
సంసారంలో సినిమా
దుర్గాప్రసాద్ బీకామ్‌లో ఫిజిక్స్ చదువుకోలేదు. ఒకవేళ అలాంటి ఆడ్ చదువు చదివి ఉంటే అతడికి మనుషుల్ని మడత పేచీలని చదవడం తెలిసేదేమో. ముఖ్యంగా మామగారిని చదవడం తెలిసేదేమో. దుర్గాప్రసాద్‌కు అతని మామగారు అర్థం కాడు. ఈ సమస్య ఇప్పుడల్లా పోదు.
దుర్గా ప్రసాద్ మంచి భర్త. అతడు చిన్నప్పుడు చీమలకు చక్కెర పోసేవాడు కాబట్టి దేవుడు మెచ్చి అతడికి మంచి భార్యను ఇచ్చాడు. అయితే అతడే ఒకసారి తన క్లాస్‌మేటు అంజిగాడు జామెట్రీ బాక్సులో దాచుకున్న జీడిముక్కలు కాజేశాడు కనుక దేవుడు కోపగించి అతడికి చెడ్డ మామగారిని కూడా ఇచ్చాడు. చెడ్డ మామగారంటే సినిమాల్లో విలన్‌లా రావుగోపాలరావులా ఉంటాడని అనుకోవడానికి వీల్లేదు. దుర్గా ప్రసాద్ మామగారిది పాము పొట్ట. కనుక ఎంత తిన్నా పొట్ట కనపడదు. వెదురు పుటక. కనుక ఏం చేసినా లావు పెరగడు. ముళ్లపంది అనువంశీకం. కనుక ఎంత దువ్వినా జుట్టు రాలదు. చక్కగా చల్ మోహన్ రంగా అనుకుంటూ ఇప్పటికిప్పుడు పెళ్లి చేసినా తాళి కడతాను అన్నట్టుగా ఉంటాడు. టీచర్‌గా క్లాసులను పొదుపుగా చెప్పి ఎనర్జీని బాగా సేవ్ చేసుకున్నాడు. ఇప్పుడు రిటైరయ్యి ఏం చేయాలో తోచక ఒక్కగానొక్క కుమార్తె దగ్గరకు వచ్చి చేరాడు. ‘పాపం... నాన్న కదండీ’ అంటుంది భార్య. ‘నాకు నరకం కదటే’ అంటాడు భర్త. పుణ్యం కొద్దీ పురుషుడు అనేది పాతమాట. ప్రాప్తం కొద్దీ మామగారు అనేది కొత్తమాట. మగాడనేవాడు గుడికి వెళ్లి మంచి భార్య కోసం మొక్కుకోవడానికి ఒక గజం ముందే మంచి మామగారి కోసం మొక్కుకోవాలని సెంటర్‌లో బండ్లాపి చాయ్‌లు తాగే పెళ్లి కాని కుర్రాళ్లకు చెబుతూ ఉంటాడు.
టార్చర్‌కు కత్తులు కటార్లు అక్కర్లేదు. న్యూస్ పేపర్ చాలు. దుర్గాప్రసాద్ ఏడున్నరకు– అంటే ఎర్లీ కిందనే లెక్క– లేస్తాడు. కాని మామగారు అంతకు హాఫెనవర్ ముందు లేచి ఇంటికి వచ్చే హిందు, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వంటి న్యూస్‌పేపర్లన్నింటినీ చదివి ఫ్రీగా మడత పెట్టి ఉంటాడు. మడత నలిగిన న్యూస్ పేపర్ చదవడం దుర్గాప్రసాద్‌కు నచ్చదు. అలాంటి న్యూస్‌పేపర్ అతడికి చితికిన కమలాపండులా అనిపిస్తుంది. మామగారు రాకమునుపు కరకరలాడే న్యూస్‌పేపర్ తెరిచి కాఫీ తాగుతూ వార్తలు చదవడాన్ని ఎంజాయ్ చేసేవాడు. మామగారు వచ్చాక పేపర్ ఇక్కట్లే కాదు, కాఫీ కష్టాలూ వచ్చాయి. అప్పటికి ఆయన రెండుసార్లు ఫిల్టర్ కాఫీని జుర్రేస్తుండేసరికి తనకు డికాషన్ తక్కువ పలుచటి కాఫీయే గతి అవుతూ ఉంది.
మామగారికి పౌడరు పిచ్చి. అల్లుడుగారికి వాసనలు పడవు. మామగారు బజారు నుంచి రోజ్, జాస్మిన్, కాలిఫ్లవర్ వంటి ఫ్లేవర్స్ ఉన్న పౌడర్లు తెచ్చి మెడకు అద్దుకుని కాలర్ వెనక్కు నెట్టి ఫ్రెష్ ఫీలవుతుంటాడు. అంతటితో ఆగితే మేలే. స్కూలు నుంచి వచ్చిన పిల్లలకి స్నానం చేయించి వారి వొళ్లంతా కూడా జల్లుతాడు. దుర్గాప్రసాద్‌కు ఆఫీసు నుంచి రాగానే పిల్లలను దగ్గరకు తీసుకోవడం అలవాటు. ఈ పౌడరు వాసన పిల్లలను దగ్గరకు తీసుకుంటూ ఉంటే ఊపిరాడక అలర్జీతో ఒకటే తుమ్ములు. మామగారి మూడ్స్ కూడా చాలా తీవ్రంగా మారిపోతుంటాయి. ఉదాహరణకు ‘కొంగు బంగారం’ సీరియల్‌లో వినిత అనే పాత్రధారిని ఆమె భర్త చెంపకు పట్టించి కొట్టిన రోజు ఆయన అగ్గిరాముడే అయ్యాడు.
‘ఆడదాని మీద చెయ్యేస్తాడా. అదే నా కూతురైతేనా వాడి పేగులు తీసి మేకులు దించేవాణ్ణి’ అని ఊగిపోయాడు. దుర్గాప్రసాద్ ఎందుకైనా మంచిదని ఆ రోజు నుంచి ఆయన ఎదుట భార్య భుజం మీద కూడా చేయి వేయడం మానేశాడు. మామగారికి పొట్లకాయ, పనసకాయ, పొటాటో వంటి ‘ప’ అక్షరం కూరగాయలంటేనే ఇష్టం. దుర్గాప్రసాద్‌కు కొంచెం మటన్ ముక్కో చికెన్ తునకో తగలాలి. ‘ఒక మనిషిని సుపారీ ఇచ్చి చంపడం, ఒక కోడిని తరాజులో పెట్టి తూయడం రెండూ పాపాలే’ అంటాడు మామగారు. పైగా మటన్ వండిన రోజు తన నిరసనలో భాగంగా గ్లాసు పాలు మాత్రమే తాగి పడుకుంటాడు. ‘ఇది పరోక్ష హింస కాదా’ అని దుర్గా ప్రసాద్ భార్య దగ్గర వెచ్చటి వెక్కిళ్లు పెట్టేవాడు.
అయితే దేవుడు కూడా ఒక మగవాడే కనుక అతడికి సాటి మగవాడంటే జాలి కనుక దుర్గా ప్రసాద్ దృష్టి ఒక న్యూస్ పేపర్ కటింగ్ మీద పడేలా చేశాడు.ఈ సీజన్‌లో అమర్‌నాథ్ యాత్ర చేయడం పుణ్యదాయకమనీ సీనియర్ సిటిజన్స్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేసి తీసుకుపోతున్నామని కనీసం నెలరోజుల పాటు ఈ యాత్ర సాగుతుందని ఆ ప్రకటన సారాంశం. అయితే దాని కంటే ముఖ్యం – ఆ యాత్రలో ప్రమాదాలు పొంచి ఉంటాయన్న హెచ్చరిక అతణ్ణి ఆకర్షించింది. దుర్గాప్రసాద్ స్వతహాగా పొదుపరి. అయినప్పటికీ మామగారి కోసం ఆ యాత్రను బుక్ చేశాడు. ‘మీరొక్కరే క్షేమంగా వెళ్లి లాభంగా రండి మామగారు’ అని ఎంతో భక్తి శ్రద్ధలు ప్రదర్శించాడు.మామగారు ప్రస్తుతం అమర్‌నాథ్ యాత్రలో ఉన్నారు. దుర్గాప్రసాద్ చాలా రోజుల తర్వాత తృప్తిగా న్యూస్ పేపర్ చదివాడు. తృప్తిగా కాఫీ తాగాడు. ఆ రాత్రి తృప్తిగా కోడికూరతో భోం చేశాడు. అంతే కాదు సుమా. ధైర్యంగా భార్య భుజం మీద చేయి కూడా వేశాడు.మామగారు వచ్చాక మామగారికి ఈ సంగతి తెలిస్తే ఊరుకుంటారో... కోరో.
సినిమాలో సంసారం
పనిమానేసి కబుర్లేంట్రా
సత్తెయ్య(దాసరి నారాయణరావు) సంతలో పశువులు అమ్మడం, కొనడం చేస్తుంటాడు. పశువులు అమ్మిన డబ్బుతో ఇంటికొస్తుండగా ఓ సారి దొంగలు డబ్బు కోసం ఆయన్ను చంపాలని చూస్తారు. వారి బారి నుంచి దుర్గసముద్రం ప్రెసిడెంట్ విజయ్‌బాబు(వినోద్ కుమార్) సత్తెయ్యను కాపాడుతాడు. విజయ్ అక్క (అన్నపూర్ణ), బావ పోతురాజు(కోట శ్రీనివాసరావు) తమ కూతురు రాణిని(ఐశ్వర్య) విజయ్‌కి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు. సత్తెయ్య కూతురు లక్ష్మిని (యమున) ఇష్టపడిన విజయ్‌బాబు ఆమెనే పెళ్లి చేసుకుంటాడు.
ఒంటరి అయిన మామగారిని ఇక కష్టపడకుండా తమతో పాటే ఉండి హాయిగా విశ్రాంతి తీసుకోమని చెబుతాడు విజయ్‌బాబు. కష్టానికి అలవాటు పడ్డ సత్తెయ్య అల్లుడి పొలంలో పని చేస్తూ, ఇతర కూలీలతో పనులు చేయిస్తుంటాడు. ఓ రోజు... పొలంలో పని మానేసి కబుర్లు చెప్పుకుంటుంటారు కూలీలు. వారి వద్దకు వచ్చిన సత్తెయ్య కూలీలతో ‘‘పనిమానేసి కబుర్లేంట్రా. కలుపు తీయడం పూర్తయితే ఎరువులు చల్లాలి. త్వరగా పని కానివ్వండి’’ అంటూ దబాయిస్తుంటాడు. ఈ ముసలాడేంట్రా మన పైన పెత్తనం చెలాయిస్తున్నాడంటూ మాట్లాడుకుంటారు కూలీలు ‘మామగారు’ చిత్రంలో. సత్తెయ్య చేసే కొన్ని పనులు అల్లుడు వినోద్‌కుమార్‌కి ఇబ్బందిగానే ఉంటాయి. అయినా సరే... మామగారు ఎక్కడ నొచ్చుకుంటారోనని ఏమీ అనలేక, అన్నింటినీ భరిస్తుంటాడు.
– శేఖర్ వెనిగళ్ల