కొంగుముడికి రండి...
కల్యాణ క్షేత్రాలు
గండి
చుట్టూ కొండలు, మధ్యలో ప్రవహించే పాపాఘ్ని నది, ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం, నిత్యం భక్తుల తాకిడి... వైఎస్సార్ జిల్లా చక్రాయపేట మండలం గండి శ్రీ వీరాంజనేయస్వామి క్షేత్రంలో నిత్యం కనిపించే దృశ్యాలివి...! రెండు కొండలను చీల్చుకుని పాపాఘ్ని నది ప్రవహిస్తుండడంతో ఈప్రాంతానికి గండి అని పేరొచ్చింది. ఇక్కడి శ్రీవీరాంజనేయస్వామి క్షేత్రం జిల్లాలో ఎక్కువ మంది భక్తులు హాజరయ్యే పర్యాటక కేంద్రంగా కూడా ఎంతో ప్రసిద్ధి గాంచింది.
శ్రీరాముడే స్వయంగా....: ఈ క్షేత్రం వెనుక ఒక గాథ ప్రచారంలో ఉంది. రావణవధ అనంతరం శ్రీ సీతారామ లక్ష్మణులు ఈ వైపుగా వెళుతుండగా వాయుదేవుడు వారికి రెండు కొండల మధ్య బంగారు మామిడి ఆకుల తోరణం కట్టి స్వాగతం పలికాడట. అయితే అక్కడికి చేరుకోగానే లక్ష్మణుడు ధిక్కారధోరణితో అన్నకు విల్లుంబులు అప్పగించి మీ బరువు నా నెత్తిన ఎందుకు వేస్తున్నారు మీవి మీరే మోసుకోండి అని హూంకరించాడట. అయితే ఇది లక్ష్మణుడి దోషం కాదని, గడ్డ ప్రభావమని గ్రహించిన శ్రీరామచంద్రుడు అక్కడ హనుమంతుని ప్రతిష్టించాలని తలిచాడు. అందుకు ఓ శిలపై తన బాణం ములికితో హనుమంతుని చిత్రం చెక్కడం ప్రారంభించాడు. అయితే చిత్రం పూర్తయి చిటికెన వేలు మాత్రం మిగిలిపోయింది. తెల్లవారాక చిటికెన వేలు చెక్కుతుండగా రక్తం బహిర్గతమైందని, దాంతో అసంపూర్తిగా విగ్రహాన్ని అలాగే ఉంచేశాడని అంటారు. దానికి నిదర్శనంగా ఇప్పటికీ మూలవిరాట్టు ఎడమ చేతికి చిటికెన వేలు ఉండదు. ఇక్కడి వాతావరణం, నదీ స్నానం మొండి వ్యాధులను కూడా నయం చేస్తుందని భక్తుల విశ్వాసం. భూత, ప్రేతాలు, గాలి తదితర దుష్టశక్తులు ఆవరించాయని భావించే భక్తులు స్వామి సన్నిధిలో మండలంపాటు సేవలు అందించి ఆ రుగ్మతల నుంచి బయటపడతారు.
పెళ్లిళ్ల పంట: శ్రావణమాసం వచ్చిందంటే చాలు గండి క్షేత్రంలో సామూహిక వివాహాల సందడి కనిపిస్తోంది. కులాల వారీగా దాదాపు నెల రోజుల నుంచి వివాహాల కోసం నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకుంటారు. ముందే వధూవరుల పేర్లను నమోదు చేసుకుని వారి గురించి అన్ని వివరాలు సేకరించి అన్నీ కుదిరిన తర్వాతనే వివాహాలకు దిగుతారు. తాళి, మట్టెలు, బాసికాలు, వధూవరులకు నూతన వస్త్రాలు, భజంత్రీలు, పూజా సామాగ్రిని నిర్వాహకులే అందజేస్తారు. స్వామిపై మొక్కుతో ఈ కార్యక్రమాలను ప్రతి సంవత్సరం శ్రావణమాసంలోని నాలుగు శనివారాలు క్రమం తప్పక నిర్వహిస్తారు. మిగతా రోజుల్లో కూడా ఈ వివాహాలు నిర్వహిస్తారు. చుట్టుపక్కల పది మండలాలకు చెందిన భక్తులు ఆంజనేయస్వామిని తమ ఇలవేల్పుగా భావించి తమ కుటుంబాలకు చెందిన అన్ని వివాహాలు ఆ స్వామి సన్నిధిలోనే నిర్వహిస్తారు. ముహూర్తాలు లేని సమయంలో తప్పనిసరి అయితే దోష నివారణ పూజలు నిర్వహించి కల్యాణాలు చేసుకుంటారు. స్వామి బ్రహ్మచారి అయినా కార్యదక్షత, పట్టుదల, శక్తియుక్తులకు మారుపేరని తలచి ఈ సన్నిధిలో చేసుకోవడం అత్యంత శుభ, ఫలదాయకంగా భావిస్తూ భక్తులు సంవత్సరం పొడవునా ఈ క్షేత్రంలో వివాహాలు నిర్వహిస్తుంటారు.
చేరుకునేమార్గం: జిల్లా కేంద్రం కడప నుంచి వేంపల్లె మీదుగా గండికి చేరుకోవచ్చు. కడప నుంచి 60 కిలోమీటర్లు దూరం. కడపకు రైలు, విమానం సౌకర్యాలున్నాయి. గండిక్షేత్రంలో టూరిజం గెస్ట్‌హౌస్ అందుబాటులో ఉంది. రాయచోటి, పులివెందుల నుంచి కూడ గండికి మార్గాలున్నాయి. అనంతపురం జిల్లాలోని కదిరి నుంచి తలుపుల మీదుగా గండికి చేరు కోవచ్చు. - మోపూరి బాలకృష్ణారెడ్డి, కడప