ఈ సీజన్ సిరి ఉసిరి | special story to usiri | Sakshi
Sakshi News home page

ఈ సీజన్ సిరి ఉసిరి

Published Mon, Nov 23 2015 10:41 PM | Last Updated on Sun, Sep 3 2017 12:54 PM

ఈ సీజన్ సిరి ఉసిరి

ఈ సీజన్ సిరి ఉసిరి

వేడి అన్నంలో ఉసిరి ఆవకాయ... ఆహా. కాసింత ఉసిరి పచ్చడికి కూసింత నేతి చుక్క... ఓహో.దోసెల్లోకి ఇడ్లీల్లోకి ఉసిరిపొడి... సాహో. ఇది కార్తీక మాసం. మార్కెట్లో ఉసిరి సిరి దొరికే మాసం. ఆరోగ్యమే ఐశ్వర్యం అనుకునేవారికి ఉసిరికి మించి ఔషధి లేదు. పిల్లలూ పెద్దలూ నిర్భయంగా దీని రక్షణలోకి వెళ్లొచ్చు. పట్రండి. పచ్చడి పెట్టండి. భలేగా రుచి చూడండి.
 
 ఉసిరి పొడి

 కావలసినవి: ఉసిరి కాయలు - 6, ఉల్లిపాయ - 1 (చిన్నది), వెల్లుల్లి రేకలు - 3, నూనె - 3 టేబుల్ స్పూన్లు, కారం - 2 టీ స్పూన్లు, ఉప్పు - తగినంతపోపుకోసం: ఆవాలు - పావు టీ స్పూను, జీలకర్ర - పావు టీ స్పూను, కరివేపాకు - 2 రెమ్మలు
తయారీ:  ఉసిరికాయలను శుభ్రంగా కడిగి, తడి పోయే వరకు నీడలో ఆరబెట్టి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి గింజలు తీసేయాలి  ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి  మిక్సీలో... ఉసిరికాయ ముక్కలు, ఉల్లి తరుగు వేసి కచ్చాపచ్చాగా తిప్పాలి  బాణలిలో మూడు టీ స్పూన్ల నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి చిటపటలాడే వరకు వేయించాలి  ఉసిరి మిశ్రమం జత చేసి బాగా కలపాలి  కారం, ఉప్పు జత చేసి మరోమారు కలిపి మిశ్రమం విడివిడిలాడే వరకు ఉంచి, దింపేయాలి  చల్లారాక గాలి చొరని డబ్బాలో వేసి, ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవాలి  అన్నంలో కాని, ఇడ్లీలతో కాని తింటే బావుంటుంది.
 
ఉసిరికాయ పచ్చడి
కావలసినవి: ఉసిరి కాయలు - 12, సెనగ పప్పు - 2 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు - టేబుల్ స్పూను, ఆవాలు - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, వెల్లుల్లి రేకలు - 8, కరివేపాకు - 3 రెమ్మలు, ఎండు మిర్చి - 8, పచ్చి మిర్చి - 6, కారం - అర టీ స్పూను, పసుపు - పావు టీ స్పూను, ఉప్పు - 2 టీ స్పూన్లు, పంచదార లేదా బెల్లం - టీ స్పూను, నూనె - 4 టేబుల్ స్పూన్లు, చింతపండు గుజ్జు - టేబుల్ స్పూను, ఇంగువ - పావు టీ స్పూను

తయారీ:  బాణలిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడయ్యాక, ఆవాలు, జీలకర్ర, సెనగ పప్పు, మినప్పప్పు వేసి వేయించి తీశాక, పచ్చి మిర్చి తరుగు, ఎండు మిర్చి, వెల్లుల్లి రేకలు విడివిడిగా వేసి వేయించి తీసేయాలి.  అదే బాణలిలో టేబుల్ స్పూను నూనె వేసి కాగాక ఉసిరికాయలు (శుభ్రంగా కడిగి తడి పోయేవరకు నీడలో ఆరబెట్టాలి) వేసి, పైన కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టాలి  ఐదు నిమిషాలయ్యాక చింతపండు గుజ్జు వేసి ఉసిరికాయలు మెత్తబడే వరకు ఉడికించాలి  ఉసిరికాయలు బాగా చల్లారాక కాయలను చేతితో జాగ్రత్తగా నొక్కి, గింజలు వేరు చేయాలి  మిక్సీలో ముందుగా వేయించి ఉంచుకున్న పోపు వేసి మెత్తగా పొడి చేయాలి  పచ్చి మిర్చి, ఎండు మిర్చి జత చేసి మరోమారు తిప్పాలి  కారం, ఉప్పు, పంచదార లేదా బెల్లం, వెల్లుల్లి రేకలు జత చేసి మరోమారు తిప్పాలి  చివరగా ఉసిరికాయ ముక్కలు వేసి కచ్చాపచ్చాగా తిప్పి, తీసేయాలి  బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి వేయించి తీసి, పచ్చడిలో పైన వేసి కలపాలి   వేడి వేడి అన్నంలో కమ్మటి నేతితో కలుపుకుని తింటే రుచిగా ఉంటుంది.
 
ఉసిరికాయ  నల్ల పచ్చడి

కావలసినవి: ఉసిరి కాయలు - పావు కేజీ, ఉప్పు - తగినంత, పసుపు - టీ స్పూను
తయారీ:  ముందుగా ఉసిరి కాయలను శుభ్రంగా కడిగి, నీడలో ఆరబోసి తడిపోయాక, మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా అయ్యాక తీసేసి, గింజలను వేరు చేయాలి  పసుపు జత చేసి ఉసిరికాయ ముక్కలను గాలిచొరని డబ్బాలో రెండు రోజులు ఉంచాలి  మూడవ నాడు బయటకు తీసి చేతితో మెత్తగా మెదిపి, ఉప్పు జత చేసి బాగా కలిపి జాడీలో ఉంచాలి  వారం రోజుల తర్వాత వాడుకోవాలి  ప్రతిరోజూ వేడి వేడి అన్నంలో మొదటి ముద్దలో ఉసిరికాయ పచ్చడి, కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే ఆరోగ్యం.    
 
మెంతి ఉసిరికాయ
కావలసినవి: ఉసిరి కాయలు - 10, మెంతులు - టీ స్పూను (దోరగా వేయించి మెత్తగా పొడి చేయాలి), కారం - 2 టీ స్పూన్లు, ఆవాలు - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, నూనె - 2 టేబుల్ స్పూన్లు, పసుపు - కొద్దిగా, ఇంగువ - కొద్దిగా, ఉప్పు - తగినంత, ఎండు మిర్చి - 6 (ముక్కలు చేయాలి) తయారీ:  ఉసిరి కాయలను శుభ్రంగా కడిగి తడి పోయే వరకు నీడలో ఆరబెట్టి, చిన్న ముక్కలు చేయాలి  బాణలిలో నూనె వేసి కాగాక ఉసిరికాయ ముక్కలు వేసి దోరగా వేయించి తీసేయాలి  అదే బాణలిలో ఇంగువ, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి వేయించి తీసేయాలి  ఒక పాత్రలో ఉసిరికాయ ముక్కలు, మెంతి పొడి, ఉప్పు, నూనె, పసుపు వేసి బాగా కలపాలి  చివరగా పోపు వేసి బాగా కలిపి రెండు రోజులు ఊరనిచ్చాక వాడుకోవాలి.
 
 ఉసిరి ఆవకాయ
 
కావలసినవి  ఉసిరి కాయలు - అర కేజీ, కారం - 100 గ్రా., ఉప్పు - 100 గ్రా., ఆవపొడి - 150 గ్రా., నూనె - అర కేజీ, మెంతులు - టీ స్పూను. తయారీ:  ఉసిరి కాయలను శుభ్రంగా కడిగి నీడలో తడిపోయే వరకు ఆరబెట్టి, కాయలకు చిన్న చిన్న గాట్లు పెట్టాలి  బాణలిలో నూనె కాగాక ఉసిరి కాయలను వేసి దోరగా వేయించి దింపేయాలి  ఒక గిన్నెలో ఉప్పు, కారం, ఆవ పొడి వేసి కలపాలి  ఉసిరికాయ ముక్కలను జతచేసి బాగా కలిపి రెండు రోజుల తర్వాత మరింత నూనె పోసి బాగా కలపాలి  వారం రోజుల తర్వాత వాడుకుంటే రుచిగా ఉంటుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement