పర్స్‌ | Special Story On wallet | Sakshi
Sakshi News home page

పర్స్‌

Published Sat, Oct 28 2017 11:07 PM | Last Updated on Sat, Oct 28 2017 11:07 PM

Special Story On wallet

ఉప్పల్‌ – కూకట్‌పల్లి సిటీ బస్‌ జనంతో కిటకిటలాడుతోంది. తన బ్యాక్‌ పాకెట్‌లో పెట్టుకున్న పర్సు తీయడం కోసం వెనుక జేబులో చేయి పెట్టిన శివ మొఖంలో రంగులు మారిపోయాయి. అసలు తాను ఇంటి నుంచి బయలుదేరే ముందు పర్సు తీసుకొచ్చానా లేదా? అని ఆలోచించాడు. ‘‘నో డౌట్‌.. బస్‌లో కండక్టర్‌ అడిగితే పాస్‌ చూపించాను. సో.. పర్సు బస్సులోనే మిస్‌ అయుండాలి? లేదా ఎవరైనా కొట్టేసైనా ఉండాలి?’’ నిర్ధారణకు వచ్చేశాడు శివ. వెంటనే ‘‘స్టాప్‌.. స్టాప్‌..’’ అంటూ అరిచాడు. అప్పటికే బస్సు ఖైరతాబాద్‌ సర్కిల్‌ దాటి నిమ్స్‌ హాస్పిటల్‌ దగ్గరకు వచ్చేసింది. విషయం కండక్టర్‌కు చెప్పి ప్రయాణీకులను వాకబు చేశాడు.‘‘ఎందుకైనా మంచిది.. పంజాగుట్ట పీఎస్‌లో కంప్లెంట్‌ ఇచ్చి చూడు’’ సలహా ఇచ్చాడు డ్రైవర్‌. బస్సు దిగి పోలీస్‌స్టేషన్‌లోకి వెళ్లిన శివకి ఎదురుగానే కనిపించాడు ఎస్‌ఐ చంద్రమౌళి.  ‘‘ఏంటయ్య కేసు..’’ కాస్త కఠినమైన కంఠంతో ప్రశ్నించాడు ఎస్‌ఐ. ‘‘పర్సు పోయింది సార్‌..’’ అన్నాడు శివ.

‘‘ఎలా పోయింది? పోలీస్‌ స్టేషన్‌కు వచ్చేంత విషయం ఏం ఉంది అందులో?’’‘‘ఐదు వందల క్యాష్‌. ఆధార్‌ కార్డు. ఒక క్రెడిట్‌ కార్డ్‌.. ఉన్నాయి సార్‌’’ ‘‘ముష్టి ఐదొందలకు స్టేషన్‌కు రావాలా?’’‘‘పర్సు దొరక్కపోయినా.. ఐడీలు, బ్యాంక్‌ కార్డ్స్‌ కోసం ఎఫ్‌ఐఆర్‌ ఉపయోగ పడుతుందని..’’ శివ సమాధానంతో ఎస్‌ఐ ముఖంలో కాస్త తేడా వచ్చింది. ‘‘రైటర్‌.. ఎఫ్‌ఐఆర్‌ రెడీ చెయ్యి. సాయంత్రం వచ్చి కాపీ తీసుకోండి’’ అంటూ వెళ్లిపోయాడు ఎస్‌ఐ. బయటకు వచ్చిన శివ యూసఫ్‌గూడలోని తన బ్యాంక్‌కు నేరుగా ఆటోలో బయలుదేరాడు. మరో ఐదు నిమిషాల్లో బ్యాంకు వస్తుందనగా కొలిగ్‌ రఘుకు ఫోన్‌ చేసి అర్జంట్‌గా బయటకు రమ్మని చెప్పాడు. బ్యాంక్‌ దగ్గర దిగి, రఘు దగ్గర డబ్బులడిగి ఆటోకు ఇచ్చేశాడు.‘‘ఏం జరిగింది..’’ బ్యాంకులోకి వస్తూ అడిగాడు రఘు.

‘‘బస్సులో పర్సుపోయింది రా..’’‘‘అయ్యో! ఎంత పనైంది!! డబ్బులెన్ని ఉన్నాయిరా అందులో?’’ఎస్‌ఐకి చెప్పిన సమాధానమే రఘుకూ చెప్పాడు శివ. బ్యాంకులో కూర్చున్న మాటేగానీ శివకి మనసు కుదురుగా లేదు. ఏదో ఇష్టమైన వస్తువే కాదు.. తన వెంట ఉన్న ఒక ఆప్తుడిని మిస్‌ చేసుకున్నంతగా మథనంతో ఒత్తిడిలో పని చేయలేక ఇంటికి వెళ్లిపోవాలనుకున్నాడు. మేనేర్‌ను కలిసి విషయం చెప్పి హాఫ్‌ డే లీవ్‌ తీసుకుని ఇంటికి బయలుదేరాడు.వేళకాని వేళలో ఇంటికి వచ్చిన శివని చూసి ఆశ్చర్యపోయింది భార్య మమత. ‘‘ఏంటండీ అప్పుడే ఇంటికి వచ్చేశారు?’’ అంటూ చేతిలోని లంచ్‌ బాక్స్, బ్యాగ్‌ తీసుకుంది. ‘‘మనసు బాలేదు. కాసేపు పడుకుంటాను. ఇదిగో ఈ డబ్బు లోపల పెట్టు..’’ అంటూ అంతకుముందు బ్యాంకులో డ్రా చేసిన ఐదువేలు మమత∙చేతికిచ్చి బెడ్రూంలోకి వెళ్లాడు. కాసేపటికి కాఫీతో వచ్చిన మమత ‘‘ఏంటండి విషయం.. ఆఫీసులో ఏమన్నా ప్రాబ్లమా? ఎందుకిలా ఉన్నారు?’’ అని అడిగింది.

కాఫీ తాగుతూ విషయం చెప్పాడు. కొద్దిసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం రాజ్యమేలింది. ‘‘అయ్యో! దానికే ఇంత బాధపడిపోతు న్నారా? ఇందుకోసమేనా త్వరగా వచ్చేసింది?’’‘‘అదేంటి అలా అంటావ్‌? డబ్బులు, కార్డులు, ఐడీలు పోయాయి.’’‘‘పోతే? మళ్లీ సంపాదించుకుంటాం కదా? బాధపడడం ఎందుకు? వాటికి మించిన విలువైనవి ఏమైనా ఉన్నాయా అందులో?’’ మమత సమాధానాలతో శివకి మాటలు రాలేదు. ఏం చేయాలో తెలియక మంచంపై నడుం వాల్చాడు. పరిస్థితిని అర్థం చేసుకున్న మమత.. మధ్యాహ్నం వచ్చే సీరియల్‌ చూడడానికి హాల్‌లోని టీవీ ముందు చేరింది. పడుకున్న మాటేగానీ.. శివకి నిద్ర పట్టడంలేదు. ఎస్‌ఐ, కొలిగ్‌ రఘు, మమత వీళ్ల మాటలే గుర్తుకు వస్తున్నాయి. ‘ఒక చిన్న పర్సు కోసం ఎందుకంత బాధపడిపోతున్నాను? అసలు ఆ పర్సులో ఏముంది? నిండైన జీవితాన్ని అది ఎందుకింత ప్రభావితం చేస్తోంది?’ అన్న ప్రశ్నలు అతణ్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.అవును. అసలా పర్సులో ఏమున్నాయి?
 
ప్రతిరోజూ ఉదయం లేవగానే పర్సులో ఉన్న ఫొటోను చూడడంతోనే శివ రోజు మొదలవు తుంది. రాత్రి ఆ ఫొటో చూడనిదే నిద్ర రాదు. ఎప్పుడన్నా జీవితంలో భయమేసినా, ఒత్తిడితో కోపం వచ్చినా, ఆ ఫొటోను చూస్తే చాలు.. వెయ్యి కష్టాలు కూడా దూరమైపోతాయి. ఎవరిదా ఫొటో?ఇంకెవరిది.. మమతదే. 13 ఏళ్ల క్రితం నాటి చిన్న పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటో. శివ, మమతది ప్రేమ పెళ్లి. పుట్టిన ఊర్లు వేర్వేరు అయినా.. ఇద్దరూ ఒకే బస్సులో, ఒకే కాలేజీకి వెళ్లేవారు. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ మొదటి క్లాస్‌లో మమతను చూసి ఆమె మాయలో పడిపోయి నిత్యం ఆమెను ఆరాధించేవాడు. ఓరోజు బస్సులో మమత పుస్తకం దొరికింది. అందులో ఆమె ఫొటోలు కనిపించగానే ఒకటి తీసుకొని తన జేబులో పెట్టుకున్నాడు. అప్పటి నుంచి నిత్యం ఆ ఫొటోతోనే మాటలు, ఊసులు. ఇక పర్సులో ఉన్న మరో విలువైన వస్తువు.. శివ తల్లి కొమురవ్వ ఇచ్చిన పాతబడిపోయిన రూపాయి నోటు.

ఇంటర్‌లో కొత్తగా కొనుక్కున్న పర్సును తల్లి కొమురవ్వకు చూపినప్పుడు ఆమె ఒక రూపాయి నోటును అందులో పెడుతూ..‘‘ఇప్పుడిచ్చిన ఈ రూపాయి నోటు ఎప్పుడూ నీతోనే ఉండాలే! అప్పుడే నీ కాడికి పెద్ద పెద్ద నోట్లు వచ్చి చేరుతయి’’ అంది. ఆ మాట శివపై చాలా ప్రభావాన్ని చూపింది. ఆరోజు నుంచి అన్ని రకాల నోట్లను సేకరించడం మొదలుపెట్టాడు. అరుదైన నోట్లను దాచుకుంటూ వచ్చాడు. పోయిన పర్సులో అలాంటి పాత నోట్లు చాలానే ఉన్నాయి.ఇక పర్సులో ఉన్న మరో విలువైనది.. ఒక ప్రేమలేఖ. లేత వయసులో చిగురించిన ప్రేమను ఇప్పటికీ గుర్తు చేస్తూనే ఉంటుంది ఆ ప్రేమలేఖ.

శివ డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చివరి రోజులు. మమతను ఆరాధించడం మొదలై నాలుగున్నరేళ్లు దాటుతోంది. తనను చూడడం దాదాపుగా సాధ్యంకాని పరిస్థితులు ఒక్కొక్కటిగా ఎదురవుతున్నాయి. ఒకరోజు మమతతో నేరుగా మాట్లాడడానికి ప్రయత్నించాడు. కాలేజ్‌ అయిపోగానే మమత వెనకే బస్టాండ్‌కి చేరాడు. ఆమెతో పాటు మరో ముగ్గురు క్లాస్‌ మేట్స్‌ ఉన్నారు. ‘ఇవాళ మమతతో నేరుగా మాట్లాడతా! లేదంటే లెటర్‌ ఇచ్చేస్తా. ఇది ఫైనల్‌’ అనుకున్నాడు. ప్రేమలేఖను చేతిలోకి తీసుకొని మమతను సమీపించాడు. ‘మమతా!’ అంటూ ఆర్తిగా పిలవబోయాడు. గుండె లోతుల్లోంచి వచ్చిన ఆ పిలుపు.. పెదవులు దాటనే లేదు.ఆశ్చర్యం! మమత ఒక్కసారిగా వెనక్కి తిరిగింది.

‘‘శివా..’’ అంటూ పిలిచింది. ఒక్కసారిగా అతడి గుండె ఆగిపోయినంత పనైంది. అక్షరాలా నాలుగున్నర సంవత్సరాలు. ఏ రోజూ వారిద్దరు మాట్లాడుకున్నది లేదు. ఐదు నిమిషాలు ఒకరికొకరు ఏమీ మాట్లాడుకోలేదు. మరో రెండు నిమిషాల్లో బస్సు వస్తుందనగా మమతే మాట్లాడడం ప్రారంభించింది. ‘‘పరీక్షలు మొదలవ్వడమే ఇంట్లో వాళ్లు నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు. సంబంధాలు కూడా చూస్తున్నారు’’ అంది. కాళ్ల కింద భూమి ఒక్కసారిగా కంపించి పోయింది శివకి. తన ప్రేమలేఖను ఇవ్వడం వ్యర్థం అనుకున్నాడు. బస్సు రావడంతో ఇద్దరూ బస్సు ఎక్కేశారు. అరగంట తర్వాత శివ ఊరు వచ్చింది. శివ బస్సు దిగుతుండగా ఒక నోట్స్‌ అందించింది మమత. నోట్స్‌ అందుకున్న శివ ఎందుకిచ్చిందో కూడా ఆలోచించే స్థితిలో లేడు. కాళ్లు ఒక్క చోట నిలవడంలేదు. మనసును దు:ఖం ఆవహించింది. రాత్రి అన్నం కూడా తినకుండానే మంచంపై పొర్లుతున్నాడు. అర్ధరాత్రి మంచినీళ్ల కోసం లేచిన శివ చూపు ఎదురుగా ఉన్న పుస్తకాలపై పడింది. మమత ఇచ్చిన నోట్స్‌ మధ్య ఏదో గులాబీ రంగు కాగితం కనిపించింది. అందులో మమత చేతిరాత. చూడగానే గుర్తించాడు. చదవడం ప్రారంభించాడు.

‘‘శివా! కాలేజీలో చేరిన రోజు నుంచే మీరు నన్ను చూడడం గమనించా. మీకో విషయం చెప్పనా? అదే రోజు నుంచి నేనూ మిమ్మల్ని చూస్తున్నా. మీరు నా గురించి ఎన్ని విధాలుగా ఆలోచిస్తున్నారో గుర్తించగలను. ఎందుకంటే నేను కూడా మీ గురించి అంతే ఆలోచిస్తున్నా. ఈ నాలుగున్నరేళ్లుగా మీ వ్యక్తిత్వం గమనించి ఒక నిర్ణయానికి వచ్చాను. మీరు నన్ను ప్రేమిస్తున్న విషయం నాకు నేరుగా చెప్పలేరు. నేను ఎలా రియాక్ట్‌ అవుతానో అన్న భయం. నేను మాత్రం మిమ్మల్ని ప్రేమిస్తున్న విషయం చెప్పాలని నిర్ణయించుకున్నాను. మీకన్నా ముందుగా మా అమ్మానాన్నలకు చెప్పా. వాళ్లు ఒప్పుకోలేదు. కానీ నా ప్రయత్నాలు ఫలించాయి. రేపు మీ ఇంట్లో వాళ్లతో మాట్లాడడానికి మా వాళ్లు వస్తున్నారు.’’ శివ ఆనందానికి హద్దులు లేవు. వెంటనే తన వాళ్లను నిద్రలేపి విషయం చెప్పి ఒప్పించాడు. మరుసటి రోజు ఇరువురి పెద్దలు ముహూర్తం నిశ్చయించారు. అప్పటి నుంచి ఆ ఉత్తరాన్ని పర్సులోనే దాచుకున్నాడు. ఆ లేఖ అతడికి ప్రపంచంలోనే అత్యంత విలువైన బహుమతి. అందులోని ప్రతీ అక్షరం అతడికి ప్రాణప్రదం.

సాయంత్రం 6 గంటలకు నిద్రలేపింది మమత. ‘‘ఇంట్లోకి వస్తువులు తీసుకోవాలి. బయటకు వెళదామా?’’ అంది. శివ రాలేననడంతో ఒక్కత్తే బయటకు వెళ్లి అరగంట తరువాత ఇంటికి చేరింది. శివను డిస్టర్బ్‌ చేయకుండా ఇంటి పనులన్నీ చేసుకుంటున్న మమతను చూసి ఏమీ మాట్లాడకుండా బెడ్‌ రూంలోకి వెళ్లి నిద్రపోయాడు శివ. మరుసటి రోజు నిద్రలేవగానే మమత ఫొటో చూడడం కోసం పర్సు తీసిన శివ.. అందులోని ఫొటోకు చిన్న స్మైల్‌ ఇచ్చి కళ్లు మూసుకున్నాడు. పది సెకన్లలో నిద్రమత్తు ఒదిలిపోయింది.

‘ఏంటిది! నేనింకా కల కంటున్నానా? పర్సు పోయింది కదా? అందులో ఉన్న ఫొటో, లెటర్, పాత నోట్లు అన్నీ పోయాయిగా? మరి ఇదంతా ఎలా?’ ఒక్కసారిగా పక్కనుంచి లేచాడు. అది కల కాదు నిజమే. మెత్త కింద పర్సు ఉంది. ఆత్రుతగా పర్సును చూడడం ప్రారంభించాడు. పర్సు కొత్తదే. కానీ అందులో ఉన్న ఫొటో, నోట్లు, గులాబీ రంగు కాగితం అన్నీ అలాగే ఉన్నాయి. లెటర్‌ తెరిచాడు. అవే అక్షరాలు. అవే పదాలు. అదే చేతిరాత. మమత కొత్త పర్సును పెట్టిందని అర్థమైపోయింది. వంటింట్లో ఉన్న మమత దగ్గరకు వెళ్లాడు. శివను చూస్తూనే నవ్వుల చిరుజల్లు కురిపించింది మమత.‘‘ఎలా ఇదంతా?’’ అన్నాడు. ‘‘మీకేం కావాలో నాకు తెలియదా?’’ సమాధానంలో ప్రశ్నను సంధించింది. ‘‘నిజమే కానీ.. ఫొటో, పాత నోట్లు?’’ అన్నాడు. ‘‘నోట్ల సేకరణ మీ ఇన్‌స్పిరేషన్‌తో పదేళ్ల క్రితమే మొదలైంది. ఇక ఫొటో సంగతా.. ఆరోజు మీరు ఒకటి తీసుకోగా మిగిలిన ఫొటోలు నా దగ్గరే జాగ్రత్తగా ఉన్నాయి.’’ అంటున్న మమతను చూస్తుంటే అసలైన పర్స్‌ దొరికినట్టయ్యింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement