
అత్రి మహర్షి బ్రహ్మ మానస పుత్రులలో మొదటివాడు. సప్తరుషులలో రెండవవాడు. అత్రి మహర్షికి కర్దమ ప్రజాపతి కూతురు అనసూయతో వివాహం జరుగుతుంది. ఆమె అత్రి మహర్షికి నిత్యం సేవలు చేస్తూ ఎంతో గొప్ప పతివ్రతగా పేరుతెచ్చుకుంది. ఒకరోజు త్రిమూర్తులు ముగ్గురు ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షించటానికి అత్రి మహర్షి ఆశ్రమానికి వచ్చి ఆతి«థ్యం స్వీకరించటానికి వచ్చామని చెప్తారు. అత్రి మహర్షి ఎంతో ఆనందంతో వారికి మర్యాదలు చేసి భోజనానికి కూర్చోమని ప్రార్థిస్తాడు. అప్పుడు త్రిమూర్తులు తాము అన్నం తినాలంటే వడ్డించే స్త్రీ వివస్త్ర అయ్యి ఉండాలని అంటారు.
అనసూయ దేవి అంగీకారంతో అత్రి మహర్షి సరేనంటాడు. వాళ్ళు భోజనానికి కూర్చోగానే అనసూయ వారి మీద మంత్రజలం చల్లి చంటిపిల్లలుగా మార్చి వారి ఆకలిని తీర్చి ఉయ్యాలలో పడుకోబెడుతుంది. ఇది తెలుసుకున్న వారి భార్యలు అత్రి ఆశ్రమానికి వచ్చి అతనినీ, అనసూయాదేవిని వేడుకుని ఆ పసిపిల్లల్ని మళ్లీ త్రిమూర్తులుగా పొందుతారు. అపుడు ఆ త్రిమూర్తులు మా ముగ్గురి అంశతో మీకు మేము సంతానంగా పుడతామని చెప్పి వెళ్ళిపోతారు.
చాలా కాలం పిల్లలు కలగకపోవటంతో అత్రి మహర్షి భార్యతో కలిసి తపస్సు చేస్తాడు. దాని వల్ల కొన్నాళ్ళకు అత్రి మహర్షి కంటిలోంచి చంద్రుడు, అనసూయా దేవి గర్భంలోంచి దత్తాత్రేయుడు, దూర్వాసుడు పుడతారు. జీవనం సాగించటానికి ధనం అవసరం అవ్వటంతో అత్రి మహర్షి పృథు చక్రవర్తి దగ్గరకు వెళతాడు. పృథుడు ఇచ్చిన ధనాన్ని తీసుకెళ్ళి తన పిల్లలకిచ్చి అత్రి మహర్షి అనసూయదేవితో కలిసి తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోతాడు. అలాగే ఒకసారి దేవతలకి, రాక్షసులకి యుద్ధం జరిగి అందులో రాహువు వేసిన అస్త్రాలకి సూర్యచంద్రుల వెలుగు తగ్గి లోకమంతా చీకటిమయం అవుతుంది. అప్పుడు అత్రి మహర్షి తన చూపులతోనే రాక్షసులందరినీ చంపేస్తాడు. అత్రి మహర్షి రచించిన ఆత్రేయ ధర్మశాస్త్రంలో దాన ధర్మాలు, జపతపాలు, పూజ విధానం, దేవతా ప్రతిష్ఠ మొదలైన వాటి గురించి చెప్పబడింది. దత్తపుత్రుడిని స్వీకరించటం అనే దాని గురించి మొట్టమొదట చెప్పింది అత్రి మహర్షే. మన మహర్షుల గురించి తెలుసుకోవడం మనకెంతో మంచిది.
Comments
Please login to add a commentAdd a comment