వృద్ధాప్య దంత సమస్యలు (జీరియోడాంటిక్స్)
బోసినోటికి బైబై... పంటిజబ్బులకు గుడ్‌బై..!
ఒకనాడు యౌవనగర్వంతో విర్రవీగినవారు ఇప్పుడు వృద్ధాప్యంలో ఉంటారు. ఈ దశ ఎవరికైనా తప్పదు.
ఆ యౌవన దశలో, పైలాపచ్చీసీలో తమ సమస్యలను తరిమినవారు పళ్ల మధ్య క్రిములను తరమలేరు. కష్టాలతో యుక్తితో పోరాడిన వారు కూడా ఇప్పుడు చిన్న చిన్న దంతవ్యాధులతో పోరాడలేక అలసిపోతుంటారు. ఒకనాడు చురుగ్గా ఆదాయాలను సంపాదించినవారూ ఇప్పుడు తమ పళ్లకూ, చిగుళ్లకూ ఆరోగ్యాన్ని
సంపాదించిపెట్టలేక ఇక్కట్లు పడుతుంటారు. ఎందుకీ పరిస్థితి? ఇందుకు కారణం వృద్ధాప్యం. ఒకరి సహాయం లేకుండా ఏమీ చేయలేరు కాబట్టే వృద్ధులూ, పిల్లలూ ఒకటే అంటారు మనవాళ్లు. ఇద్దరికీ ఉండేది బోసినోరే కాబట్టి. పిల్లల కంటే పోనుపోనూ పళ్లు వచ్చేస్తాయి. కానీ వృద్ధుల మాటో? వారు పళ్లు పోగొట్టుకోకుండా, కేవలం వాటికి వచ్చే సమస్యలను మాత్రమే పోగొట్టుకోవడం ఎలాగో చెప్పేందుకే ఈ కథనం.
వృద్ధుల పళ్లకు సంబంధించిన వైద్యశాస్త్రాన్ని ‘జీరియాట్రిక్ డెంటిస్ట్రీ’ లేదా ‘జీరియోడాంటిక్స్’ అంటారు. ఇందులో వృద్ధుల పళ్లకు వచ్చే వైద్య, ఆరోగ్యసమస్యలు, వాటి నిర్ధారణ, చికిత్స వంటి అంశాలుంటాయి.
వృద్ధాప్యంలో కనిపించే సాధారణ పంటి సమస్యలు/కారణాలు
వయసు పెరుగుతున్నకొద్దీ సాధారణంగా పళ్లు కూడా వదులైపోతాయని చాలామంది అపోహపడుతుంటారు. ఇక ఆ వయసులో బీపీ, షుగర్ లాంటి సమస్యలుంటే వాటంతట అవే పళ్లూడిపోతాయని ఆ పరిస్థితి కోసం మానసికంగా సిద్ధపడుతుంటారు. కానీ ఇది వాస్తవం కాదు. పళ్లకు సంబంధించిన లేదా చిగుర్లకు సంబంధించిన జబ్బులు వస్తేనే పళ్లు ఊడిపోవడమో లేదా వదులైపోవడమో లేదా తీసేయాల్సిన పరిస్థితి రావడమో జరుగుతుంది. నోటిజబ్బులు రానంతవరకు పళ్లు జీవితకాలం దృఢంగానే ఉంటాయి. సాధారణంగా వృద్ధాప్యంలో వచ్చే కొన్ని దంతసమస్యలు పంటిమూలంలో వచ్చే పిప్పిపళ్లు (రూట్‌కేరిస్), పళ్లు ఊడిపోవడం (అట్రిషన్), చిగుర్లవ్యాధులు (పెరియోడాంటల్ డిసీజ్), పళ్ల మధ్య అక్కడో పన్ను, ఇక్కడో పన్ను కోల్పోవడంతో వచ్చే సందులు (ఎడెంట్యులిజమ్), కట్టుడుపళ్లు సరిగా అమర్చకపోవడం, దవడల పక్కన ఉండే మృదువైన మ్యూకోజాలో పుండ్లు, నోటిలో పుండ్లు, నోటిలో తడి తక్కువ కావడం (జీరోస్టోమియా), నోటి క్యాన్సర్లు వంటివి.
కొన్ని సమస్యలు యౌవనదశలో మనం చేజేతులా తెచ్చిపెట్టుకున్నవే. ఉదాహరణకు మనం వయసులో ఉన్నప్పుడు పొగతాగడం, పొగాకు నమలడం, పాన్‌పరాగ్, గుట్కా, వక్కపొడి నమలడం వంటి అలవాట్లు. వీటిని మానకుండా ఆ సమయంలో నిర్లక్ష్యం చేయడం వల్ల వృద్ధాప్యంలో పళ్లు ప్రభావితమవుతాయి.
వృద్ధాప్యంలో... యౌవనంలో కంటే వ్యాధినిరోధకశక్తి ఎంతోకొంత తగ్గుతుంది. కాబట్టి అప్పటివరకూ నిద్రాణంగా ఉన్న కొన్ని సమస్యలు పళ్లపై ప్రభావం చూపుతాయి.
వృద్ధాప్యంలో కొందరికి ఆదాయవనరులు తగ్గిపోతాయి. పైగా కుటుంబ సభ్యులనుంచి అందవలసినంత ప్రోత్సాహం ఉండదు. ఇదీ దంత సమస్యలకు ఒక కారణమే.
పై సమస్యలతో పళ్లు వదులైపోయి వృద్ధాప్యంలో ఆహారం తీసుకోవడం లో ఇబ్బందులు ఎదురవుతాయి. అంతేకాదు.. పళ్లు మన ఉచ్చారణకూ తోడ్పడతాయి కాబట్టి భాషలో స్పష్టత లోపించి కమ్యూనికేషన్‌కు ఇబ్బంది కలుగుతుంది.
వృద్ధాప్య రుగ్మతలు... పళ్లపై వాటి ప్రభావం...
డయాబెటిస్... పళ్లసమస్యలు: డయాబెటిస్... పళ్ల సమస్యలు... ఈ రెండూ పరస్పరాధారితాలు. అంటే డయాబెటిస్ ఉన్నవారిలో పళ్ల, చిగుళ్ల సమస్యలు ఎక్కువ. అలాగే ఇక పళ్లు, చిగుళ్ల సమస్యలు ఉన్నవారిలో అవి రక్తంలోని గ్లూకోజ్ పెరిగేలా చేసి, డయాబెటిస్‌కు కారణమవుతాయి. అందుకే డయాబెటిస్ ఉన్నవారు పంటి జబ్బుల విషయంలో జాగ్రత్తపడాలి. లేనివారు పళ్లను శుభ్రంగా ఉంచుకుని డయాబెటిస్ రాకుండా నివారించుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారికి సీరియస్ చిగుర్ల సమస్యలు, దంతక్షయం, లాలాజల గ్రంథులు సరిగా పనిచేయకపోవడం, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, లెకైన్‌ప్లానస్, లెకైనాయిడ్ రియాక్షన్, నోటి ఇన్ఫెక్షన్లు అంత తేలిగ్గా తగ్గకపోవడం వంటి సమస్యలు వస్తుంటాయి.
జాగ్రత్తలు: పళ్లను శుభ్రంగా ఉంచుకోవాలి. ఆరునెలలకు ఒకసారి దంతవైద్యుడితో క్లీనింగ్ చేయించుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారు రక్తంలో గ్లూకోజ్ పాళ్లను సమర్థంగా నియంత్రించుకుంటూ ఉండేలా మందులు తీసుకోవాలి. ఒత్తిడి లేకుండా ఉండి, డయాబెటిస్ ఉన్నవారు తీసుకోవలసిన ఆహారాన్ని తీసుకోవాలి.
హైబీపీ - పంటి సమస్యలు : బీపీ ఉన్నవారికి అది గుండెజబ్బులకు, గుండెపోటుకు దారితీయకుండా మందులు ఇస్తుంటారన్న విషయం తెలిసిందే. పంటి సమస్యలు ఉన్నవారికి ఇచ్చే నాన్‌స్టెరాయిడల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్ (ఎన్‌ఎన్‌ఏఐడి) వల్ల... బీపీ ఉన్నవారికి ఇచ్చే మందుల ప్రభావం తగ్గుతుంది. బీపీ ఉన్నవారికి ఇచ్చే మందుల వల్ల నోటిలో తడి తగ్గి అది జీరోస్టోమియా అన్న కండిషన్‌కు దారితీస్తుంది. ఇది కూడా పంటి సమస్యలను పెంచడమే కాదు... పంటిలో కృత్రిమంగా అమర్చిన దంతాలకు, స్క్రూల వంటి అనుబంధ అంశాలకు, నోటిలోని మృదుకండరాలకు మధ్య ఘర్షణను పెంచి మరిన్ని పంటిసమస్యలకు దారితీసేలా చేస్తుంది. ఇక క్యాల్షియమ్ బీటా బ్లాకర్స్ అనే మందులు వాడే పది శాతం మందిలో దాని సైడ్‌ఎఫెక్ట్‌గా జింజివల్ హైపర్‌ప్లేసియా అనే చిగుర్లవ్యాధి కనిపిస్తుంది. ఈ వ్యాధి... మందులు మొదలుపెట్టిన కొన్ని నెలల్లోనే కనిపించడం విశేషం.
జాగ్రత్తలు: హైబీపీకి మందులు వాడేవారు తమకు ఎదురైన అనుభవాన్ని తమ ఫిజీషియన్‌కు వివరించి, దంతవైద్యులను కూడా కలిసి తమ మందులను వారిచేత కూడా సమీక్షింపజేసుకుంటూ ఉండాలి. సరైన నోటి శుభ్రత పాటిస్తూ డయాబెటిస్‌ను నివారించుకుంటూ ఉండటం మేలు.
పక్షవాతం - పంటిజబ్బులు: పక్షవాతానికి, పంటిజబ్బులకు నేరుగా సంబంధం లేకపోయినా... గుండెజబ్బులకున్న సంబంధమే ఇక్కడా పనిచేస్తుంటుంది. ఉదాహరణకు పంటికి పట్టే గార/పాచి వంటివి, పంటిజబ్బుల వల్ల రక్తప్రవాహంలో పేరుకుపోయే సూక్ష్మక్రిముల వల్ల రక్తనాళాలు సన్నబడటం, రక్తనాళాల్లో పాచిపేరుకుని రక్తం సాఫీగా ప్రవహించడానికి అడ్డుపడటం జరుగుతుందని తెలిసిందే. ఇదే గుండెకు సంబంధించిన ధమనుల విషయంలో జరిగితే గుండెపోటుకు దారితీసినట్లే, మెదడుకు సంబంధించిన ధమనుల విషయంలో జరిగితే పక్షవాతానికి దారితీయవచ్చు.
జాగ్రత్తలు: పంటి జబ్బులను నిరోధించుకోవడం, పంటిసమస్యలను దూరం చేసుకోవడం, పంటి శుభ్రతను పాటించడం... ఇవన్నీ గుండెజబ్బులతో పాటు, పక్షవాతాన్ని కూడా నివారించుకోవడం అని గుర్తుంచుకోవాలి.
ఆర్థరైటిస్... పంటి సమస్యలు: దాదాపుగా 65 ఏళ్లుదాటిన 50 శాతం మందిలో ఎముకలకు సంబంధించిన జబ్బు అయిన ఆర్థరైటిస్ కనపడుతుంది. దీనివల్ల ఎముకల మధ్య రాపిడి, ఎముకల సాంద్రత తగ్గి, పెళుసుగా మారి తేలిగ్గా విరిగిపోవడం వంటి పరిణామాలు సంభవిస్తాయి. ఈ జబ్బు విషయంలోనూ ఎముకలు, కీళ్ల మధ్య నొప్పిని నివారించడానికి నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్ (ఎన్‌ఎస్‌ఏఐడీ) వాడటం సాధారణం. ఈ జబ్బు ఉన్నవారికి మెథోట్రెక్సేట్ అనే మందులను ఉపయోగిస్తారు. ఇవన్నీ నోటి ఆరోగ్యాన్ని ప్రభావితం చేసేవే. ఉదాహరణకు మెథోట్రెక్సేట్ మందుల వల్ల నోటిలో పుండ్లు (అల్సర్స్) వస్తాయి. అలాగే రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు వాడే గోల్డ్ సోడియమ్ థయోమెలనేట్ అనే మందు వల్ల జింజివైటిస్ అనే చిగుర్లకు వచ్చే ఇన్ఫెక్షన్, గ్లాసైటిస్ అనే నాలుక ఇన్ఫెక్షన్, స్టొమటైటిస్ అనే నోటి ఇన్ఫెక్షన్ వస్తాయి. ఇకపై మందుల వాడకం వల్ల రక్తంలోని తెల్లరక్తకణాలు తగ్గడం, ప్లేట్‌లెట్స్‌కౌంట్ తగ్గడం వంటి దుష్పరిణామాలు ఉంటాయి. వాటి ఫలితంగా పూర్తిగా రోగనిరోధకశక్తి తగ్గడం, పంటి చిగుర్ల నుంచి రక్తస్రావం వంటి పరిణామాలూ ఎదురుకావచ్చు.
లాలాజల గ్రంథులు... నోటి సమస్యలు: నోటిలో ఉరుతూ ఉండే లాలాజలం (సలైవా) వల్ల నోరు తడిగా ఉంటుంది. ఇది నిత్యం నోటిలో ఉండే ఆహారపదార్థాలను కడిగేస్తూ ఉంటుంది. నోరు పొడిబారిపోవడం అనే లక్షణం డయాబెటిస్ రోగులతో బాటు, కొన్ని వ్యాధుల్లో మందులు తీసుకునేవారికి, తల, గొంతు క్యాన్సర్ కారణంగా రేడియేషన్ చికిత్స తీసుకున్నవారికి లాలాజలం తగ్గుతుంది. నోటిలో తగినంత లాలాజలం లేకపోవడం వల్ల బ్యాక్టీరియా పెరిగిపోతుంది. నోరు పొడిబారిపోవడం దీర్ఘకాలంపాటు సాగితే నోటిలోని మృదుకణజాలం దెబ్బతిని, నొప్పి వస్తుంది. దాంతో దంతక్షయం (టూత్ డికే), చిగుళ్ల వ్యాధులకు అవకాశాలు పెరుగుతాయి.
జాగ్రత్తలు: లాలాజలం తగ్గి నోరు పొడిబారుతుంటే తక్షణం దంతవైద్యులను కలవాలి. వారు కొన్ని పుక్కిలించే ద్రావణాలు, పైపూత (టాపికల్) గా వాడదగ్గ ఫ్లోరైడ్ ద్రావణాలను సూచిస్తారు. ఇక కొన్ని చక్కెర లేని గమ్స్, మింట్స్ వంటివి నోటిలో తగినంత లాలాజలం ఊరేలా చేస్తాయి. దాంతోపాటు తరచూ కొద్దికొద్దిగా నీళ్లు తీసుకుని గుటక వేస్తుండటం, కరిగే ఐస్‌ను చప్పరించడం కూడా నోరు పొడిబారడాన్ని తగ్గిస్తాయి. ఇలా నోరు పొడిబారేవాళ్లు కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీలాంటి డ్రింక్స్‌ను తక్కువగా తీసుకోవడం, ఆల్కహాల్‌ను పూర్తిగా మానివేయడం మేలు.
పైవన్నీ నివారణ చర్యలు. ఒకవేళ నివారణ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోకపోయినవారు, పళ్లు కోల్పోయినా, ఇప్పుడు దవడ ఎముక ఎంత సన్నగా ఉన్నా, కృత్రిమ దంతాలు అమర్చడానికి ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా, మనకు అందుబాటులో ఉన్న పరిజ్ఞానంతో వాటిని అమర్చడం పూర్తిగా సాధ్యం.
- నిర్వహణ: యాసీన్
వృద్ధాప్యం మొదటిదశలో ఉన్న అత్యధికుల్లో ఉండే సమస్య పంటి పైపొర అరుగుదల. అప్పుడు కాస్తంత చల్లగా, వేడిగా ఉండే పదార్థాలు పంటిని అవి తాకితే జివ్వుమంటాయి. దీనికి చికిత్స చాలా సులభం. పన్ను అరుగుదలకు గురైన క్యాప్ వేయించడం లాంటి చికిత్సతో ఈ సాధారణ సమస్యను చాలా తేలిగ్గా అధిగమించవచ్చు.
గుండెజబ్బులు... చిగుర్ల వ్యాధులు: ఇటీవలి పరిశోధనల వల్ల నోటి ఆరోగ్యానికి, గుండెజబ్బులకు సంబంధం ఉందని తేలింది. సాధారణంగా చిగుర్ల వ్యాధి ఉన్నవారికి నొప్పి తెలియకుండా పంటి కింద ఉండే గులాబిరంగు చిగురుభాగం నెమ్మదిగా తగ్గుతూ పోతుంటుంది. కానీ పంటి కింది ఎముక భాగం నాశనమయ్యే దశకు చేరినప్పుడు, అక్కడ చేరిన బ్యాక్టీరియా రక్తప్రవాహంలో కలిసి గుండెకండరాన్నిసైతం దెబ్బతీసి, గుండెజబ్బులకు దారితీసే ప్రమాదం ఉందన్నది ఇటీవల పరిశోధనల సారాంశం. ఇక పంటిమీద ఉండే పాచి/గారలో ఉండే సూక్ష్మక్రిములు రక్తనాళాల్లోకి చేరడం వల్ల రక్తనాళాలు సన్నబడి, రక్తప్రవాహ సంబంధమైన (వాస్క్యులార్ డిసీజెస్) వ్యాధులు రావచ్చు. మరో అంశం ఏమిటంటే దీర్ఘకాలంగా ఉండే చిగుర్ల వ్యాధుల వల్ల అకస్మాత్తుగా గుండెపోటు కూడా రావచ్చు.
జాగ్రత్తలు: సరైన రీతిలో బ్రషింగ్, ఆహారాన్ని బాగా నమిలి మింగడం...