ఆమె చుట్టూ బాలల వికసిత వదనాలు. అప్పుడే విచ్చుకున్న పువ్వుల్లాంటì ఆ ముఖాలను చూస్తుంటే ఆమెకి మరో ప్రపంచమే తెలియదు. ఎందుకంటే అది ఆమె సృష్టించుకున్న ప్రపంచం! ‘బాల్యానికి కష్టాలు ఉండకూడదు. బాల్యం ఒత్తిడులకు లోను కాకూడదు. బాల్యం చిదిమిన మొగ్గ అవకూడదు...’ అనుకున్నారు ఆమె. ఆమె పేరు.. జెట్‌సన్ పెమా. అందరూ పిలుచుకునే పేరు.. ‘అమా’. అమా అంటే అమ్మ. దలైలామాకు సొంత చెల్లి!
జన్మభూమి అని చెప్పుకోడానికి ఓ దేశం అంటూ లేకుండా కాందిశీకుల్లా వచ్చి, ఆశ్రయం ఇచ్చిన పొరుగు దేశంలో తలదాచుకుని బతుకు వెళ్లబారుస్తున్నామనే ఆవేదన ఓ వైపు.. దేశాల మధ్య ఆధిపత్య పోరులో పిల్లలు నలిగిపోకూడదనే బాధ్యత మరోవైపు... ఈ రెండే జెట్‌సన్ పెమా జీవితాన్ని నడిపిస్తున్నాయి.
52 వేల మంది పిల్లలు, వారి భవిష్యత్తు కోసం స్థాపించిన విద్యాసంస్థలతో కాందిశీకులకు అండగా నిలుస్తున్నారు ‘అమా లా’. అమా లా అంటే టిబెట్ భాషలో ‘టిబెట్ దేశమాత’ అని. 77 ఏళ్ల జెట్‌సన్ పెమాను మనదేశం ఈ ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా సత్కరించింది. మహిళలకు ఇచ్చే అత్యున్నత పురస్కారం ‘నారీశక్తి’ని ప్రదానం చేసి గౌరవించింది.
చైనా ఆక్రమణతో చెల్లాచెదురు
జెట్‌సన్ పెమా 1940, జూలై ఏడవ తేదీన టిబెట్‌లోని లాసాలో పుట్టారు. నలుగురు పిల్లల్లో చిన్నది. అమె పెద్దన్న టెన్‌జిన్ గ్యాస్తో. అతడే ప్రస్తుత 14వ దలైలామా. టిబెట్‌ను చైనా ఆక్రమించుకున్నప్పుడు సంభవించిన అభద్రతల కారణంగా టిబెట్ వాసులు భారీ సంఖ్యలో దేశం వదిలి పారిపోయారు.
వేలాది టిబెటన్‌లు ఇండియాకి వచ్చేశారు. అలా వచ్చిన వారిలో పెమా కుటుంబం కూడా ఉంది. మొదట కాలింపాంగ్ లోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్, ఆ తర్వాత డార్జిలింగ్‌లోని లోరెటో కాన్వెంట్‌లో చదువుకున్నారు పెమా. ఉన్నత చదువుల కోసం 1960లో కేంబ్రిడ్జికి వెళ్లారు. ఇంగ్లండ్, స్విట్జర్లాండ్‌లలో చదువు పూర్తయిన తర్వాత 1964లో తిరిగి ఇండియాకి వచ్చేశారు.
అమ్మలా అక్కున చేర్చుకున్నారు
అప్పటికి ఆమె పెద్దక్క త్సెర్లింగ్ దోల్మా టాక్లా జబ్బు పడ్డారు. దోల్మాను చూసుకోవడంతోపాటు దోల్మా సంరక్షణలో ఉన్న టిబెట్ అనాథ పిల్లల బాధ్యత కూడా పెమా తీసుకున్నారు. తమ ఆశ్రయంలో ఉన్న పిల్లలతోపాటు, దారీతెన్నూ లేకుండా పుట్టకొకరు చెట్టుకొకరుగా మిగిలిపోయిన వేలాది చిన్నారులను చేరదీశారామె.
కాందిశీకులుగా వచ్చి అనాథలుగా మారిన పిల్లలను అమ్మలా అక్కున చేర్చుకున్నారు. హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ధర్మశాల వేదికగా వారికి ఒక నీడనిచ్చి, అన్నం పెట్టారామె. కానీ అది మాత్రమే సరిపోదని ఆమె అనుకున్నారు.
పిల్లల కోసం ప్రత్యేక గ్రామాలు!
కాందిశీకులుగా మారిన చిన్నారుల కోసం బడి పెట్టించారు పెమా. మొదట్లో ఇది తాత్కాలిక అవసరమనే అనుకున్నారు. ఆశ్రయం కల్పించి, ఆరేడేళ్లు వచ్చిన పిల్లల్ని సమీపంలోని పాఠశాలల్లో చదివించేవారు. అయితే టిబెట్ నుంచి వలసల ప్రవాహం తగ్గలేదు కదా ఇంకా పెరుగుతూనే ఉంది. అప్పుడు భారత ప్రభుత్వాన్ని సంప్రదించి హిమాలయ పర్వత శ్రేణులలో ఆమె ‘టిబెటన్ చిల్డ్రన్స్ విలేజెస్’ పేరుతో స్కూళ్లను స్థాపించారు.
ఆ స్కూళ్లలో టిబెట్ పిల్లలు, హిందూ, క్రైస్తవ క్యాథలిక్, ప్రొటెస్టెంట్ పిల్లలు కూడా చదువుకుంటున్నారిప్పుడు. జెట్‌సన్ పెమా చదువు పూర్తి చేసుకుని ఇండియాకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 52 వేల మంది ఏ దారీతెన్నూ లేని పిల్లలను గ్రాడ్యుయేట్లను చేశారు. మొత్తం పది రెసిడెన్షియల్ స్కూళ్లు, 17 డే స్కూళ్లు, మూడు వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్‌లు, నాలుగు కాలేజీలు, మూడు హాస్టళ్లను స్థాపించారు.
మహిళల్నీ, వృద్ధుల్నీ చేరదీశారు
పిల్లల సంరక్షణకు ఒక చక్కటి దారి పడింది. చదువుకుని బయటకు వచ్చిన పిల్లలు ఉద్యోగాలలో స్థిరపడే వరకు ఒక ఆశ్రయం కావాలి. అందుకోసం యూత్ హాస్టల్స్ ఏర్పాటు చేశారు జెట్‌సన్ పెమా. ఇక భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరాలలో తలదాచుకున్న మహిళలు, వృద్ధులకు ఒక దారి చూపించాలి. అందుకోసం ఆశ్రమాలు నెలకొల్పారు. టిబెట్ నుంచి భారత్‌కు వచ్చిన మహిళలు, వృద్ధులు ఆ ఆశ్రమాలలో తలదాచుకుంటున్నారు. అందుకే వీరంతా జెట్‌సన్ పెమాను ‘మదర్ ఆఫ్ టిబెట్’ గా అంతా అభిమానిస్తున్నారు.
యునెస్కో పురస్కారం
అమా జెట్‌సన్ ప్రతిపాదించిన ‘టిబెటన్ చిల్డ్రన్స్ విలేజ్’ ఆలోచన వినూత్నమైంది. ఆ ప్రతిపాదనకు భారత ప్రభుత్వం నుంచి అనుమతి పొందడంలోనూ ఆమె విజయం సాధించారు. ఆ తర్వాత వాటి స్థాపనలో నిమగ్నమయ్యారు. భారత ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఆమె టిబెట్ పిల్లల పునరావాసాన్ని ఒక యజ్ఞంలా చేశారు. ఆ సేవలను గుర్తించిన యునెస్కో 1999లో ఆమెను అవార్డుతో గౌరవించింది.
టిబెట్‌ను వదిలేయడమేనా?!
పిల్లలు, మహిళలు, వృద్ధులు... ఒక్కమాటలో చెప్పాలంటే నిరాశ్రయులందరికీ ఆశ్రయం కల్పించారు జెట్‌సన్ పెమా. భారతదేశం తల్లిలా ఆదుకుంటే, ఆ దేశంలో తమ వాళ్ల కోసం తన ఒడిని విశాలం చేసింది పెమా. మరి తాము కోల్పోయిన టిబెట్‌ను అలా వదిలేసుకోవడమేనా? ఆమెలో ఆవేదన రగులుతూనే ఉండేది.
దలైలామా ఆదేశంతో వాస్తవాల అన్వేషణ కోసం విస్తృతంగా ఆమె పర్యటించారు. ప్రవాసంలో ఉన్న టిబెట్ వాసుల కోసం ఏర్పాటైన మంత్రివర్గంలో కూడా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. టిబెట్ పరిపాలనలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ కూడా పెమానే.
– మంజీర
Comments
Please login to add a commentAdd a comment