‘ఈ జవాను 58 ఏళ్ల కింద నన్ను రక్షించాడు’
న్యూఢిల్లీ: టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా భావోద్వేగానికి లోనయ్యారు. 58 ఏళ్ల కిందట తనకు అంగరక్షకుడిగా పనిచేసిన ఓ సైనికుడిని కలిసిన క్షణంలో సంతోషంలో మునిగిపోయారు. ప్రస్తుతం అసోం పర్యటనలో ఉన్న ఆయన నమామి బ్రహ్మపుత్ర నది ఉత్సవంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఎంతో ఆప్తులుగా భావించిన నాటి అంగరక్షకుల్లో ఒకరిని కలిసి తన్మయత్వం చెందారు.
చైనా సైనికుల దురాక్రమణ చర్యలను నిరసిస్తున్న దలైలామాను బందించాలని చైనా సేనలు ప్రయత్నించిన సమయంలో 1959 మార్చి నెలలో టిబెట్ నుంచి తప్పించుకుని ఇండియాకు దలైలామా వచ్చారు. ఆ సమయంలో ఆయనకు అంగరక్షకులుగా అస్సాం రైఫిల్స్ గార్డ్స్ ఐదుగురు పనిచేశారు. వారిలో ఒకరైన జవాను నరేన్ చంద్ర దాస్‌ను దలైలామా ఆదివారం కలుసుకున్నారు. ‘మీకు చాలా ధన్యవాదాలు. 58 ఏళ్ల కిందట నాకు అంగరక్షకులుగా ఉండి నన్ను కాపాడిన అస్సాం రైఫిల్స్ గార్డ్స్‌లలో ఒకరైన మిమ్మల్ని కలిసినందుకు నాకు మహదానందంగా ఉంది’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.