భారతీయ సంస్కృతిలో ఆశీర్వచనానికి చాలా విలువ వుంది. అనేక సందర్భాలలో చిన్నవారిని పెద్దవారు ఆశీర్వదిస్తారు. విద్యార్థులను విద్యాప్రాప్తిరస్తు అని, పెళ్ళయిన ఆడవారిని దీర్ఘ సుమంగళీభవ అని, పురుషులని దీర్ఘాయుష్మాన్ భవ అనీ... ఇలా సమయానికి తగ్గట్లు వుంటాయి ఆ దీవెనలు. యజ్ఞయాగాదులు చేసేటప్పుడు, వేదోక్తంగా జరిగే కార్యక్రమాలలో పండితులు దేశంలో రాజు న్యాయంగా, ధర్మంగా పరిపాలించాలనీ, దేశం సుభిక్షంగా వుండాలనీ, గోవులు, బ్రాహ్మణులు, ప్రజలందరూ సుఖంగా వుండాలనీ, దేశంలో సకాలంలో వర్షాలు కురిసి దేశం సుభిక్షంగా వుండాలనీ, పిల్లలు లేనివారికి పిల్లలు కలగాలనీ, వున్నవారికి వంశాభివృద్ధి చేసే మనవలు కలగాలనీ, ధనం లేని వారికి సంపదలు కలగాలనీ... ఇలా సమాజంలో అందరి శ్రేయస్సు కోరుతూ ఆశీర్వచనం చేస్తారు. అయితే ఈ ఆశీర్వచనాలకి ప్రభావం వుందా? అవి ఫలిస్తాయా? అంటే ఫలిస్తాయనే చెప్పొచ్చు. సత్పథంలో నడిచే వారికి సత్పురుషులు చేసిన ఆశీర్వచనాలు తప్పక ఫలిస్తాయి. ఈ ఆశీర్వచనాల వల్ల జాతకంలో వుండే దోషాలు, అకాల మృత్యు దోషాలు తొలుగుతాయి.
అంతేకాదు, పూర్వజన్మ పాపాలు కూడా నాశనమవుతాయంటారు. గురువులు, సిద్ధులు, యోగులు, వేద పండితులు, పీఠాధిపతులు మనకన్నా చిన్నవారైనా వారి కాళ్ళకి నమస్కరించి వారి ఆశీర్వచనం తీసుకోవచ్చు. అక్కడ మనం నమస్కరించేది వారి వయసుకి కాదు – వారి విద్వత్తుకు, వారిలోని సరస్వతికి. అందుకే పెద్దలకు నమస్కరించి, వారి ఆశీస్సులు అందుకోవాలి. వీలయితే వారికి ఏమైనా సాయం చేసి, వారి మనసును సంతోషంతో నింపాలి కానీ, అపచారాలూ, అపకారాలూ చేసి, వారి మనస్సు నొప్పించడం సరికాదు. ఆలయానికి వెళ్లినప్పుడు వయసులో మనకన్నా పెద్దవారు కనిపించినప్పుడు, వరసలో వారిని ముందుపోనివ్వడం, వారికి ఏదైనా సేవ చేయడం వల్ల భగవంతుని ఆశీస్సులతోపాటు పెద్దల దీవెనలు కూడా పొందవచ్చు. మార్కండేయుడు, ధృవుడు వంటివారు కూడా పెద్దల ఆశీస్సుల వల్లే ఆయుష్షు, యశస్సు పొందారని తెలుస్తోంది.